రష్యా సంపన్నులు తనను వ్యతిరేకించకుండా పుతిన్ ఏం చేశారు?

ఫొటో సోర్స్, ALEXEY NIKOLSKY/SPUTNIK/AFP
- రచయిత, విటాలీ షెవ్‌చెంకో
- హోదా, బీబీసీ రష్యా ఎడిటర్
యుక్రెయిన్‌తో యుద్ధం జరుగుతున్న సమయంలో, రష్యాలోని బిలియనీర్ల సంఖ్య రికార్డు స్థాయికి చేరుకుంది.
అయితే, వ్లాదిమిర్ పుతిన్ అధికారంలో ఉన్న ఈ 25 సంవత్సరాల్లో రష్యాలోని అత్యంత ధనవంతులు, శక్తిమంతులుగా పేరొందిన 'ఒలిగార్క్స్' తమ రాజకీయ ప్రాభవాన్ని దాదాపు పూర్తిగా కోల్పోయారు.
ఇదంతా పుతిన్‌కు శుభపరిణామమే.
పాశ్చాత్య దేశాలు విధించిన ఆంక్షలు రష్యాలోని సంపన్నవర్గాలను పుతిన్‌కు వ్యతిరేకులుగా మార్చడంలో విఫలమయ్యాయి. మరోవైపు, ఆయన అనుసరిస్తున్న విధానాలు వారిని మౌనంగా ఉండే మద్దతుదారులుగా మార్చేశాయి.
పుతిన్ పద్ధతులు ఎలా పనిచేస్తాయో మాజీ బ్యాంకింగ్ బిలియనీర్ ఒలెగ్ టింకోవ్‌కు బాగా తెలుసు.
యుక్రెయిన్‌తో యుద్ధాన్ని 'పిచ్చి పని' అని విమర్శిస్తూ ఆయన తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన మరుసటి రోజే, రష్యాలో రెండో అతిపెద్ద బ్యాంక్‌గా ఉన్న ఆయన కంపెనీ 'టింకాఫ్ బ్యాంక్' ఎగ్జిక్యూటివ్‌లను క్రెమ్లిన్ అధికారులు సంప్రదించారు. బ్యాంకు వ్యవస్థాపకుడి (టింకోవ్)తో సంబంధాలన్నీ తెంచుకోకపోతే, బ్యాంక్‌ను జాతీయం చేస్తామని వారికి తేల్చిచెప్పారు.
''నేను ధర గురించి చర్చించే పరిస్థితిలో లేను. అదొక బందీ లాంటి పరిస్థితి. వారు ఎంత ఇస్తే అంత తీసుకోవాలి. బేరమాడే అవకాశం ఏమాత్రం లేదు'' అని టింకోవ్ 'న్యూయార్క్ టైమ్స్'తో చెప్పారు.
వారంలోపే, రష్యాలో ఐదవ అత్యంత ధనవంతుడు, యుద్ధ విమానాల ఇంజన్లకు అవసరమైన నికెల్‌ను సరఫరా చేసే వ్యాపారవేత్త వ్లాదిమిర్ పొటానిన్‌కు చెందిన ఒక సంస్థ ఆ బ్యాంక్‌ను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది.
తన బ్యాంక్‌ను దాని అసలు విలువలో కేవలం 3 శాతానికే విక్రయించాల్సి వచ్చిందని టింకోవ్ చెబుతున్నారు.
చివరికి, టింకోవ్ తన సంపదలో దాదాపు 9 బిలియన్ డాలర్లు (సుమారు 80,824 కోట్ల రూపాయలు) కోల్పోవడమే గాక, రష్యాను విడిచిపెట్టి వెళ్లిపోయారు.


ఫొటో సోర్స్, Chris Graythen/Getty Images
'ఒలిగార్కీ' వ్యవస్థపై ఉక్కుపాదం...
పుతిన్ రష్యా అధ్యక్షుడు కావడానికి ముందున్న పరిస్థితులకు, ఇప్పటికీ చాలా తేడా ఉంది. సోవియట్ యూనియన్ పతనం తర్వాత, కొందరు రష్యన్లు అప్పటివరకూ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భారీ పరిశ్రమలను తమ సొంతం చేసుకోవడం, దేశంలో అప్పుడప్పుడే వేళ్లూనుకుంటున్న పెట్టుబడిదారీ వ్యవస్థ కల్పించిన అవకాశాలను అందిపుచ్చుకోవడం ద్వారా అపారమైన సంపద గడించారు.
దేశంలోని రాజకీయ సంక్షోభ సమయంలో చేకూరిన ఈ కొత్త సంపద వారికి అధికారాన్ని, పలుకుబడిని తెచ్చిపెట్టింది. వారే 'ఒలిగార్క్స్'గా గుర్తింపు పొందారు. అత్యంత శక్తిమంతమైన ధనవంతుడు బోరిస్ బెరెజోవ్‌స్కీ, 2000 సంవత్సరంలో పుతిన్ అధ్యక్ష పదవిని చేపట్టడానికి తానే వ్యూహకర్తగా ఉన్నానని చెప్పుకున్నారు. అయితే, కొన్నేళ్ల తర్వాత తాను అలా చేసినందుకు క్షమించాలని వేడుకున్నారు.
''భవిష్యత్తులో ఆయన ఒక దురాశాపరుడైన నిరంకుశుడిగా, అధికారాన్ని అక్రమంగా చేజిక్కించుకునే వ్యక్తిగా, స్వేచ్ఛను అణచివేస్తూ రష్యా అభివృద్ధిని అడ్డుకునే వ్యక్తిగా మారతారని అప్పుడు గుర్తించలేకపోయాను'' అని బెరెజోవ్‌స్కీ 2012లో రాశారు.
బెరెజోవ్‌స్కీ తన పాత్ర గురించి కాస్త అతిశయోక్తిగా చెప్పుకుని ఉండవచ్చు, కానీ రష్యాలోని ఒలిగార్క్స్ అప్పట్లో అత్యున్నత అధికార కేంద్రాలను నియంత్రించగలిగారన్నది వాస్తవం.
ఇలా క్షమాపణ కోరి ఏడాది పూర్తయిన కొంత కాలానికే, యూకేలో ప్రవాస జీవితం గడుపుతున్న బెరెజోవ్‌స్కీ అనుమానాస్పద స్థితిలో మరణించారు.
అదే సమయానికి, రష్యాలోని 'ఒలిగార్కీ' వ్యవస్థ కూడా పూర్తిగా అంతరించిపోయింది.

ఫొటో సోర్స్, Hulton Archive/Getty Images
నాడు బిలియనీర్ల సంపద ఆవిరి...
యుక్రెయిన్‌పై పూర్తిస్థాయి దండయాత్రకు 2022, ఫిబ్రవరి 24వ తేదీన పుతిన్ ఆదేశించిన కొన్ని గంటల వ్యవధిలోనే రష్యాలోని అత్యంత ధనవంతులను తన అధికార నివాసం 'క్రెమ్లిన్'కు పిలిపించారు.
వారు పుతిన్ నిర్ణయాన్ని ఏమాత్రం వ్యతిరేకించలేకపోయారు. యుద్ధం వల్ల తమ సంపద భారీగా ఆవిరి అయిపోతుందని తెలిసినప్పటికీ వారు మౌనంగా ఉండక తప్పలేదు.
''ఈ కొత్త పరిస్థితుల్లో కూడా మనం సమష్టిగా, అంతే సమర్థవంతంగా పనిచేస్తామని ఆశిస్తున్నాను'' అని పుతిన్ వారికి చెప్పారు.
ఆ సమయంలో బిలియనీర్ల ముఖాలు నిద్రలేమితో ఉన్నట్లుగా, పాలిపోయి ఉన్నాయని అదే సమావేశానికి హాజరైన రిపోర్టర్ ఒకరు అభివర్ణించారు.
యుక్రెయిన్ యుద్ధానికి ముందున్న కాలం, దండయాత్ర జరిగిన వెంటనే ఉన్న పరిస్థితులు రష్యా బిలియనీర్లకు చాలా చేదు అనుభవాలను మిగిల్చాయి.
ఫోర్బ్స్ మ్యాగజైన్ వివరాల ప్రకారం, యుక్రెయిన్ యుద్ధం, అంతర్జాతీయ ఆంక్షలు, రష్యా కరెన్సీ రూబుల్ బలహీనపడటం వల్ల 2022 ఏప్రిల్ నాటికి 117గా ఉన్న బిలియనీర్ల సంఖ్య 83కి పడిపోయింది. వీరంతా కలిపి మొత్తంగా 263 బిలియన్ డాలర్లు (సుమారు 23,61,879 కోట్ల రూపాయలు) కోల్పోయారు. అంటే సగటున ప్రతి బిలియనీర్ తన సంపదలో 27 శాతం వరకూ నష్టపోయారు.

ఫొటో సోర్స్, Reuters
‘యుద్ధం’తో మళ్లీ సంపద...
యుద్ధం ప్రారంభమైన తర్వాత సంవత్సరాల్లో, పుతిన్ యుద్ధ ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములు కావడం వల్ల వ్యాపారవేత్తలు అపారమైన ప్రయోజనాలు పొందారు.
యుద్ధం కోసం ప్రభుత్వం చేసిన విపరీతమైన ఖర్చు కారణంగా 2023, 2024 సంవత్సరాల్లో రష్యా ఆర్థిక వ్యవస్థ ఏడాదికి 4 శాతం కంటే ఎక్కువ వృద్ధిని సాధించింది.
అప్పటివరకూ రక్షణ ఒప్పందాలతో సంబంధం లేకుండానే సంపాదించిన బిలియనీర్లకు ఈ యుద్ధం కలిసివచ్చింది.
2024 నాటికి, రష్యాలోని సగం కంటే ఎక్కువ మంది బిలియనీర్లు సైన్యానికి వస్తువులను సరఫరా చేయడంలో ఏదో ఒక పాత్ర పోషించినవారు లేదా ఈ దండయాత్ర ద్వారా ప్రయోజనం పొందినవారేనని ఫోర్బ్స్ వెల్త్ టీమ్‌కు చెందిన గియాకోమో తోగ్నిని చెప్పారు.
''క్రెమ్లిన్‌తో నేరుగా సంబంధంలేని వ్యాపారవేత్తలను కూడా మనం మినహాయించలేం, ఎందుకంటే వారికి కూడా ప్రభుత్వంతో ఏదో ఒక రకమైన సంబంధం అవసరం. రష్యాలో వ్యాపారం చేయాలనుకునే ఎవరైనా సరే ప్రభుత్వంతో సత్సంబంధాలు కలిగి ఉండాల్సిందేనని చెప్పడం సబబు'' అని ఆయన బీబీసీతో అన్నారు.
ఈ సంవత్సరం ఫోర్బ్స్ జాబితా ప్రకారం, రష్యాలో బిలియనీర్ల సంఖ్య రికార్డు స్థాయిలో 140కి చేరుకుంది. వీరి మొత్తం సంపద (580 బిలియన్ డాలర్లు), యుద్ధానికి ముందున్న గరిష్ట స్థాయి కంటే కేవలం 3 బిలియన్ డాలర్లు మాత్రమే తక్కువగా ఉంది. పుతిన్ తనకు విధేయులుగా ఉన్నవారు లాభపడేలా చేస్తూనే, తన దారికి రానివారిని తరచుగా శిక్షిస్తూనే ఉన్నారు.

ఫొటో సోర్స్, AFP
పాశ్చాత్య ఆంక్షలను అనుకూలంగా మార్చుకుని...
చమురు రంగ దిగ్గజం మిఖాయిల్ ఖోడార్కోవ్‌స్కీకి ఏం జరిగిందో రష్యన్లు ఇప్పటికీ బాగా గుర్తుంచుకుంటారు.
ఒకప్పుడు రష్యాలో అత్యంత సంపన్నుడైన మిఖాయిల్ ఖోడార్కోవ్‌స్కీ, 2001లో ఒక ప్రజాస్వామ్య అనుకూల సంస్థను స్థాపించినందుకు పదేళ్ల పాటు జైలుశిక్ష అనుభవించాల్సి వచ్చింది.
యుక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి, రష్యాలోని అత్యంత సంపన్నవర్గం దాదాపు మౌనంగా ఉండిపోయింది. ఈ యుద్ధాన్ని బహిరంగంగా వ్యతిరేకించిన అతికొద్ది మాత్రం తమ దేశాన్ని, అపారమైన సంపదను వదులుకుని వెళ్లిపోవాల్సి వచ్చింది.
పుతిన్ యుద్ధ ప్రయత్నాలకు రష్యాలోని అత్యంత సంపన్నవర్గం కీలకమని అర్థమవుతోంది. అందుకే, 2022 ఫిబ్రవరి 24న క్రెమ్లిన్‌లో పుతిన్‌తో సమావేశానికి హాజరైన ఆ 37 మంది వ్యాపారవేత్తల సహా చాలామందిని పాశ్చాత్య దేశాలు తమ ఆంక్షల జాబితాలో చేర్చాయి.
వారిని ఆర్థికంగా నష్టపరిచి, క్రెమ్లిన్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేలా చేయాలన్న పాశ్చాత్య దేశాల ప్రయత్నం విఫలమైంది. ఎందుకంటే, రష్యా బిలియనీర్ల సంపద ఇంకా పెరుగుతూనే ఉంది. వారిలో ఎలాంటి అసమ్మతి కనిపించట్లేదు. ఇక వారిలో ఎవరైనా బిలియన్ల కొద్దీ తమ సంపదతో పాశ్చాత్య దేశాలకు పారిపోవాలని ఆలోచించినా, వాటి ఆంక్షలే దాన్ని అసాధ్యం చేశాయి.
''రష్యా బిలియనీర్లు అందరూ పుతిన్ జెండా కిందకు చేరేలా చేయడంలో పాశ్చాత్య దేశాలు తమ వంతు కృషిని తామే చేశాయి'' అని సెంటర్ ఫర్ యూరోపియన్ పాలసీ అనాలసిస్ (సీఈఎఫ్ఏ)కి చెందిన అలెగ్జాండర్ కోలియాండర్ అన్నారు.
''వారిలో ఎవరైనా బయటపడటానికి ఎటువంటి ప్రణాళిక గానీ, స్పష్టమైన మార్గం గానీ లేదు. ఆంక్షల వల్ల వారి ఆస్తులు జప్తు అయ్యాయి, బ్యాంకు ఖాతాలు స్తంభించిపోయాయి. ఇవన్నీ బిలియనీర్లను, వారి ఆస్తులను, వారి సంపదను సమీకరించడానికి పుతిన్‌కు బాగా ఉపయోగపడ్డాయి. వాటన్నింటినీ రష్యా యుద్ధ ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా వాడుకోగలిగారు'' అని ఆయన బీబీసీతో చెప్పారు.
యుక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో విదేశీ కంపెనీలు సామూహికంగా రష్యాను విడిచిపెట్టేయడం వల్ల ఏర్పడిన ఖాళీని క్రెమ్లిన్ అనుకూల వ్యాపారవేత్తలు త్వరగానే పూరించేశారు. అత్యంత లాభదాయకమైన ఆయా కంపెనీల విదేశీ ఆస్తులను చౌకగా కొనుగోలు చేయడానికి వారికి అనుమతి లభించింది.
''ఇదొక నూతన ప్రభావవంతమైన, క్రియాశీలక విధేయుల సైన్యాన్ని సృష్టించింది'' అని కర్నెగీ రష్యా యురేసియా సెంటర్‌కు చెందిన అలెగ్జాండ్రా ప్రోకోపెంకో వాదిస్తున్నారు.
''రష్యా, పాశ్యాత్య దేశాల మధ్య ఘర్షణ ఇలాగే కొనసాగడంపైనే వారి భవిష్యత్తు, శ్రేయస్సు ఆధారపడి ఉంది. ఒకవేళ ఆ ఆస్తులకు సంబంధించిన పాత యజమానులు తిరిగివస్తారేమోనన్నదే వారికున్న అతిపెద్ద భయం'' అని ఆమె అన్నారు.
ఈవిధంగా, కేవలం 2024లోనే కొత్తగా 11 మంది బిలియనీర్లు రష్యాలో ఉద్భవించారని గియాకోమో తోగ్నిని వెల్లడించారు.
యుక్రెయిన్‌తో యుద్ధం, పాశ్చాత్య దేశాల ఆంక్షలు కొనసాగుతున్నప్పటికీ, కొన్ని సందర్భాల్లో ఆ ఆంక్షల వల్లే, పుతిన్ తన స్వదేశంలోని కీలక వ్యక్తులపై తన పట్టును పటిష్టంగా ఉంచుకోగలిగారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














