ఇకపై యుద్ధాలు అంతరిక్షంలో జరుగుతాయా? అమెరికా, రష్యా, చైనా, భారత్‌లలో ఎవరు శక్తిమంతులు?

ఫొటో సోర్స్, Getty Images
అంతర్జాతీయ అంతరిక్ష రంగానికి సంబంధించిన ఒక ప్రధాన సమావేశం ఏప్రిల్ 2025లో అమెరికాలోని కొలరాడో స్ప్రింగ్స్‌లో జరిగింది.
ఈ రంగంలో అమెరికా ఒక ప్రధాన శక్తి. ఇప్పుడు చైనా కూడా ప్రధాన శక్తిగా ఎదుగుతోంది. ఆ దేశం దగ్గర అత్యాధునిక ఉపగ్రహాలు ఉన్నాయి.
చైనా ఇప్పుడు అంతరిక్షంలో ఉపగ్రహాలను నాశనం చేయగల ఆయుధాలను కూడా పరీక్షిస్తోంది. రష్యా ఇప్పటికే ఆ పని చేసింది.
ఈ సమావేశంలో ప్రసంగించిన ముఖ్య వక్తలలో అమెరికా స్పేస్ కమాండ్ కమాండర్ జనరల్ స్టీఫెన్ వైట్నింగ్ ఉన్నారు. ఇప్పుడు అంతరిక్షం కూడా వార్ జోన్‌లోకి వచ్చిందనడంలో ఎలాంటి సందేహం లేదని జనరల్ వైట్నింగ్ అన్నారు.
ఇప్పటివరకు ఏ యుద్ధం కూడా అంతరిక్షరంగంలోకి వ్యాపించలేదని, అమెరికా దీనిని కోరుకోవడం లేదని ఆయన అన్నారు.


ఫొటో సోర్స్, Getty Images
ఆర్మీకి కళ్లు, చెవుల్లా..
ప్రస్తుతం భూకక్ష్యలో 11,700 యాక్టివ్ శాటిలైట్లు ఉన్నాయని ఆస్ట్రేలియన్ స్ట్రాటజిక్ ఇన్‌స్టిట్యూట్‌లో సీనియర్ పరిశోధకురాలు, అంతరిక్ష భద్రతా విషయాల నిపుణురాలు డాక్టర్ రాజి రాజగోపాలన్ చెప్పారు.
ఉపగ్రహాల నుంచి అందుకునే సంకేతాలతో వందలకోట్ల మంది ప్రజల రోజువారీ కమ్యూనికేషన్, సమాచార మార్పిడి జరుగుతోంది. 630 శాటిలైట్లను భద్రతా బలగాలు సెక్యూరిటీ కార్యకలాపాల్లో వినియోగిస్తున్నాయి.
మొత్తం ఉపగ్రహాలలో సగం మిలటరీ శాటిలైట్లేనని రాజి రాజగోపాలన్ అన్నారు. వీటిలో దాదాపు 300 ఉపగ్రహాలు అమెరికాకు చెందినవి. రష్యా, చైనాకు కూడా చాలా మిలటరీ శాటిలైట్లున్నాయి.
మిలటరీ ఆపరేషన్లలో ఈ శాటిలైట్లు ఆర్మీకి కళ్లు, చెవుల్లా ఉంటాయి. ఈ శాటిలైట్ల వల్ల ఆర్మీ సామర్థ్యం బాగా పెరుగుతుంది.

1990లో జరిగిన గల్ఫ్ యుద్ధంలో ఇరాక్‌పై మిత్రరాజ్యాల బలగాల చర్యలలో ఉపగ్రహాలు ముఖ్యమైన పాత్ర పోషించాయి.
ఎడారిలో సైనికులు, ట్యాంకులు, సాయుధ వాహనాలను సరైన మార్గంలో ఉంచడానికి ఉపగ్రహంతో పనిచేసే జీపీఎస్ ఉపయోగించారు. దీనిని ప్రపంచంలోనే మొట్టమొదటి అంతరిక్ష యుద్ధం అని కూడా పిలుస్తారు.
2029 నాటికి 52 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రయోగించాలనే తన ప్రణాళికను వేగవంతం చేస్తున్నట్టు జూన్‌లో భారత్ ప్రకటించింది.

ఫొటో సోర్స్, Getty Images
ఒక దేశం ఉపగ్రహాన్ని ప్రయోగించే ముందు సమాచారం ఇవ్వడం అవసరమా?
ఏ దేశమైనా ఉపగ్రహాన్ని ప్రయోగించే ముందు అంతరిక్ష ప్రయోగ వ్యవహారాలకు సంబంధించిన కార్యకలాపాలను పర్యవేక్షించే సంస్థ(యూఎన్ఓఓఎస్ఏ)కు తెలియజేయాలని డాక్టర్ రాజి రాజగోపాలన్ అంటున్నారు.
''అంతరిక్షంలోకి ఏ రకమైన ఉపగ్రహాన్ని పంపుతున్నారు, దాని ఉపయోగం ఏమిటి, అది ఎంతకాలం పనిచేస్తుంది, దానిని ఎలా తిరిగి తీసుకువస్తారు'' అనేది తెలియజేయాలని చెప్పారు.
దీంతో పాటు, ఉపగ్రహాలు ఢీకొనకుండా నిరోధించడానికి అంతరిక్షంలో దాన్ని ఎక్కడ విడిచిపెడతారో కూడా చెప్పాలి.
కానీ ఇప్పుడు చాలా దేశాలు తమ ఉపగ్రహాల గురించి పూర్తి సమాచారం ఇవ్వడం లేదు.
1962లో, అమెరికా అంతరిక్షంలో ఒక అణు బాంబును పరీక్షించింది. దాని రేడియేషన్ అనేక కమ్యూనికేషన్ ఉపగ్రహాలను దెబ్బతీసింది.
ఐదేళ్ల తర్వాత దేశాల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం అంతరిక్షంలో అణ్వాయుధాలు, రసాయన ఆయుధాల మోహరింపుపై నిషేధం అమల్లోకొచ్చింది.
ఐక్యరాజ్యసమితి అంతరిక్ష సంస్థ ఇప్పుడు దీనిని పర్యవేక్షిస్తోంది.
స్పేస్‌ను సురక్షితంగా ఉంచడంలో ఈ సంస్థ కృషి చాలా ఉందని డాక్టర్ రాజి రాజగోపాలన్ చెప్పారు.
అయితే అంతరిక్షంలో సంప్రదాయ ఆయుధాల మోహరింపును నిరోధించే ఎటువంటి నిబంధన ఈ ఒప్పందంలో లేదు. సంప్రదాయ ఆయుధాలు కూడా భారీ నష్టాన్ని కలిగిస్తాయి. ఇది పెద్ద ప్రమాదం.
కొన్ని సంవత్సరాలుగా, అంతరిక్షంలో వాణిజ్య ఉపగ్రహాల సంఖ్య గణనీయంగా పెరిగింది.
ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్ కంపెనీకి చెందిన 8వేలకు పైగా శాటిలైట్లు అంతరిక్షంలో ఉన్నాయి. బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్, ఇతర సౌకర్యాల కోసం ప్రైవేట్ కంపెనీలకు చెందిన ఉపగ్రహాలు అంతరిక్షంలో ఉన్నాయి.
అంతరిక్షంలో ఉపగ్రహాల సంఖ్య పెరుగుతున్న కొద్దీ, దేశాల మధ్య ఉద్రిక్తతలు కూడా పెరుగుతున్నాయి.

ఫొటో సోర్స్, Chip Somodevilla/Getty Images
అంతరిక్షంలో ఏం జరుగుతోంది?
ఒకదేశం ఉద్దేశపూర్వకంగా మరొక దేశ ఉపగ్రహాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తే ఏం జరుగుతుంది?
"ఇది లక్ష్మణ రేఖ, ఇంకా ఎవరూ దీనిని దాటలేదు. అయితే ఉపగ్రహాలు సిగ్నల్స్‌కు అంతరాయం కలిగించి తప్పుడు సిగ్నల్స్‌ను సృష్టించిన ఘటనలు ఉన్నాయి" అని జర్మన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ అండ్ సెక్యూరిటీ అఫైర్స్ పరిశోధకురాలు జూలియన్ సూజ్ అన్నారు.
ప్రస్తుతం అంతరిక్ష నిబంధనలను నాటో వాషింగ్టన్ ఒప్పందంలోని ఆర్టికల్ 5లో చేర్చారని, అంటే ఎవరైనా నాటో సభ్యదేశ ఉపగ్రహంపై దాడి చేస్తే, నాటో ఒప్పందంలోని ఆర్టికల్ 5 ప్రకారం దానిపై దాడి చేసే దేశంపై చర్య తీసుకోవచ్చని ఆమె వివరించారు.
ఉపగ్రహం దెబ్బతినడానికి గల కారణం వెంటనే తెలియకపోవడం కూడా అపార్థాలకు దారితీస్తుంది. ఒక ఉపగ్రహం మరొక ఉపగ్రహానికి దగ్గరగా రావడానికి అనేక కారణాలుండొచ్చని జూలియన్ సూజ్ అంటున్నారు.
ఇది ఉపగ్రహ చిత్రాన్ని తీయడానికి లేదా దాని నిఘా సమాచారాన్ని పొందే ప్రయత్నం కూడా కావచ్చు.

ముఖ్యంగా ఆ ఉపగ్రహ కార్యకలాపాల సమాచారాన్ని ముందుగానే పంచుకోకపోతే.
ప్రపంచంలో అమెరికా, రష్యా, చైనా, భారత్‌కు పెద్ద సైన్యాలున్నాయి. ఈ సైన్యాలన్నీ అంతరిక్షంలో ఇతర ఉపగ్రహాలను నాశనం చేయగల ఆయుధాలను అభివృద్ధి చేశాయి.
ఇవి సామూహిక విధ్వంసక ఆయుధాలు కావు, కాబట్టి అంతరిక్షంలో వాటిని పరీక్షించడంపై ఎలాంటి నిషేధం లేదు.
అంతరిక్షంలో అమెరికా అతిపెద్ద శక్తి అని జూలియన్ సూజ్ అంటున్నారు. 2008లో, అది తన ఉపగ్రహాలలో ఒకదాన్ని నాశనం చేసింది. దీంతో పాటు, అమెరికా ఇతర ప్రణాళికలలో కూడా పెట్టుబడి పెడుతోంది.
ఉదాహరణకు, ఇతర ఉపగ్రహాల మాదిరిగానే రాకెట్‌ని ఉపయోగించి అంతరిక్షంలోకి ప్రయోగించగల ఎక్స్-37 అంతరిక్ష విమానాన్ని అభివృద్ధి చేస్తోంది. ఈ విమానం రెండు సంవత్సరాలు అంతరిక్షంలో ఉండి, ఆపై దానంతట అదే భూమికి తిరిగి రాగలదు.
కమ్యూనికేషన్ల కోసం జీపీఎస్‌కు ప్రత్యామ్నాయంగా లేజర్ టెక్నాలజీని అభివృద్ధి చేయడానికి కూడా అమెరికా ప్రయత్నిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
ఉపగ్రహాల ముక్కలతోనూ పెను ప్రమాదమే
1957లో భూకక్ష్యలో మొదటి ఉపగ్రహాన్ని ప్రయోగించడం ద్వారా అంతరిక్షరంగం పోటీలో అమెరికాను రష్యా ఓడించింది. కానీ ఆ తర్వాత అంతరిక్షరంగంలో రష్యా వెనకబడింది.
యుక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యాపై విధించిన ఆంక్షలు కూడా దాని అంతరిక్ష ప్రణాళికలను ప్రభావితం చేశాయి.
మరోవైపు నిఘా, కమ్యూనికేషన్ కోసం అమెరికా ఉపగ్రహాలపై ఎక్కువగా ఆధారపడి ఉంది.
దీనిని అమెరికా బలహీనతగా భావిస్తోన్న రష్యా, ఉపగ్రహాలను లక్ష్యంగా చేసుకునే ఆయుధాలను అభివృద్ధి చేస్తోంది. చైనా కూడా ఈ రంగంలో వెనుకబడి లేదు.
"2024లో 100 ఉపగ్రహాలను ప్రయోగించడం చైనా లక్ష్యం. కానీ అది 30 మాత్రమే పంపగలిగింది. ఉపగ్రహాలను లక్ష్యంగా చేసుకునే ఆయుధాలను చైనా వేగంగా అభివృద్ధి చేస్తోంది. అదే సమయంలో, దాని ఉపగ్రహాలు ఇతర ఉపగ్రహాల చుట్టూ వేగంగా కదిలే సామర్థ్యాన్ని సంపాదించాయి. ప్రమాదకరంగా కొన్ని ఉపగ్రహాలు ఇతర దేశాల ఉపగ్రహాలకు దగ్గరగా కూడా చేరుకున్నాయి" అని జూలియన్ సూజ్ అన్నారు.
ఉపగ్రహాలు అంతరిక్షంలో అధిక వేగంతో తిరుగుతాయి. అవి ఒకదానికొకటి ఢీకొంటే, వాటి ముక్కలు అంతరిక్షంలో చెల్లాచెదురుగా పడతాయి.
ఒక సెంటీమీటర్ ముక్క కూడా, అధిక వేగంతో కదులుతుంటే, హ్యాండ్ గ్రెనేడ్ కలిగించేంత నష్టాన్ని కలిగిస్తుంది. అంతరిక్ష వాతావరణం ప్రమాదకరంగా మారుతుంది.
ఆ పరిస్థితుల్లో యాంటీ శాటిలైట్ ఉపయోగిస్తే భయంకరమైన విధ్వంసానికి దారితీస్తుందని జూలియన్ సూజ్ హెచ్చరిస్తున్నారు.
ఉదాహరణకు, రష్యా అంతరిక్షంలో అలాంటి ఆయుధాన్ని ఉపయోగిస్తే, ఉపగ్రహం విచ్ఛిన్నం కావడం వల్ల ఉత్పత్తి అయ్యే ముక్కలు దాని సొంత ఉపగ్రహాలను కూడా దెబ్బతీస్తాయి.
ఇటీవల, చైనా, రష్యా చంద్రునిపై అణు రియాక్టర్‌ను ఏర్పాటు చేయడానికి అంగీకరించాయి. భవిష్యత్తులో అక్కడ పరిశోధనల కోసం విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి దీనిని ఉపయోగిస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
అంతరిక్ష సాంకేతికత
అంతరిక్ష సాంకేతికత అంటే కేవలం రాకెట్లు, స్పేస్‌క్రాఫ్ట్‌లు మాత్రమే కాదని సియాటెల్‌లోని వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో స్పేస్ లా అండ్ డేటా ప్రోగ్రామ్ డైరెక్టర్ సాదియా పైకెరనెన్ అంటున్నారు.
ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈడీటీ అని పిలిచే అటానమస్ రోబోటిక్స్ వంటి అనేక కొత్త టెక్నాలజీలు ఉన్నాయని ఆమె అన్నారు. అటానమస్ రోబోటిక్స్ ద్వారా, యంత్రాలు అంతరిక్షంలో వాటంతటవే పనిచేయగలవు.
"ఇది భవిష్యత్తులో అంతరిక్ష రక్షణ విధానాన్ని మార్చగలదు. ఇది అమెరికాను వైమానిక దాడులు లేదా హైపర్‌సోనిక్ క్షిపణి దాడుల నుంచి రక్షించగల గోల్డెన్ డోమ్‌ను కూడా ఉంది" అని సాదియా చెప్పారు.
స్టార్‌షీల్డ్ అనేది అనేక ఉపగ్రహాలు ఉపయోగించే అలాంటి భద్రతా వ్యవస్థ. దీనిని అమెరికా ప్రభుత్వం, సైన్యం ఉపయోగిస్తాయి. ఇది స్పేస్ ఎక్స్ స్టార్ లింక్ మిలటరీ మోడల్. స్పేస్ ఎక్స్‌లో ఒక భాగం.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జనవరిలో గోల్డెన్ డోమ్‌ను ప్రతిపాదించారు.
క్షిపణులను గుర్తించడానికి వేల ఉపగ్రహాలు అవసరం. ఉపగ్రహాల నుంచి అందుకున్న డేటాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో త్వరగా విశ్లేషించి, చర్య తీసుకునే సామర్థ్యం సైన్యానికి ఉంటుందని సాదియా పైకెరనెన్ చెప్పారు.
ఇది రక్షణ రంగానికి కొత్త సామర్థ్యాన్ని జోడించగలదు. ఉద్రిక్తతలకు కూడా కారణం కావచ్చు.
ఈ టెక్నాలజీని డెవలప్ చేయడంలో అమెరికా, చైనా ఇతర దేశాల కంటే చాలా ముందున్నాయని సాదియా పైకెరనెన్ అన్నారు.
దీన్ని పరిగణనలోకి తీసుకుని ఇతర దేశాలు కూడా అంతరిక్షంలో వాటిపై నిఘా ఉంచడానికి టెక్నాలజీని డెవలప్ చేయడం ప్రారంభించాయి.
"అంతరిక్షాన్ని సురక్షితంగా ఉంచడం చాలా ముఖ్యం కాబట్టి వారు ఇందులో విజయం సాధిస్తారని నేను ఆశిస్తున్నాను" అని సాదియా అన్నారు.
మిలటరీ శాటిలైట్ల ఆపరేషన్ల జీవిత కాలంపై సాంకేతిక పురోగతి ఎంత ప్రభావం చూపుతుంది?
ఏ టెక్నాలజీ కూడా శాశ్వతంగా ఉండదని, అంతరిక్షంలో ఈ పరికరాల జీవితకాలం ముగిసే సమయానికి దగ్గర వస్తే వాటికి మరమ్మత్తులు అవసరమవుతాయని సాదియా చెప్పారు.
కొత్త సాంకేతికత వాటిని అంతరిక్షం నుంచి సురక్షితంగా తొలగించడంలో కూడా సహాయపడుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఉపగ్రహ యుద్దంతో కలిగే నష్టం ఎంతంటే...
డాక్టర్ బ్లెవిన్ బోవెన్ యూకేలోని డర్హామ్ విశ్వవిద్యాలయంలోని అంతరిక్ష పరిశోధన కేంద్రంలో ఆస్ట్రో పాలిటిక్స్ అసోసియేట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. శాటిలైట్ యుద్ధరంగానికి సంబంధించిన విషయాలపై అంతర్జాతీయ సంస్థలకు ఆయన సలహాలు కూడా ఇస్తారు.
ప్రజలకు వివిధ రకాల సేవలను అందించే వేలాది ఉపగ్రహాలు అంతరిక్షంలో ఉన్నందున, అంతరిక్షంలో ఉపగ్రహ యుద్ధం జరిగితే కలిగే నష్టాన్ని, ఆ ప్రభావాన్ని కచ్చితంగా అంచనా వేయడం కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు.
ఏ ఉపగ్రహాలు నాశనం అవుతాయనేదాన్నిబట్టి ఇది ఆధారపడి ఉంటుందని ఆయన అంటున్నారు.
ఉదాహరణకు, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు లేదా ఆహారాన్ని ఆర్డర్ చేయడానికి మనం ఉపయోగించే జీపీఎస్ సంకేతాలను విడుదల చేసే ఉపగ్రహాలు అలా ఎఫెక్ట్ అయ్యేవాటిలో ఉంటాయి.
కానీ ఆర్థిక సేవలపై మరింత తీవ్రమైన ప్రభావం ఉంటుంది. ఎందుకంటే శాటిలైట్లలో అణు గడియారాలు ఉంటాయి. వాటి సమయాన్ని ఆధారంగా చేసుకునే బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు లావాదేవీల సమయం ఏదో నిర్ణయిస్తాయి. ఈ సేవలు నిలిచిపోయే అవకాశముంది.
వ్యవసాయానికి ప్రకృతి వైపరీత్యాల నుంచి ఉండే ముప్పును అంచనా వేయడానికి రైతులు, వాతావరణ శాఖలు కూడా ఉపగ్రహాల సమాచారాన్ని ఉపయోగిస్తాయి.
ఇది ప్రజల జీవితాలపై, ఆర్థిక వ్యవస్థపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ఉదాహరణకు, తుపానులు లేదా ఇతర విపత్తుల గురించి ప్రజలకు సకాలంలో కచ్చితమైన సమాచారం అందకపోతే చాలామంది చనిపోవచ్చు.
ఒకదేశం ఉపగ్రహ నష్టాన్ని ఎలా ఎదుర్కొంటుంది అనేది అది ఎలా నాశనమయిందనే దానిపై ఆధారపడి ఉంటుంది.
ఉపగ్రహం సిగ్నల్ జామ్ అయితే లేదా ఉపగ్రహాలను నియంత్రించే కంప్యూటర్లు హ్యాక్ అయితే, అప్పుడు ఒక పరిష్కారం ఉంటుందని డాక్టర్ బ్లెవిన్ బోవెన్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రపంచానికి పొంచి ఉన్న ప్రమాదమేంటి?
అంతరిక్షంలో ప్రత్యక్ష దాడికి అవకాశాలు చాలా తక్కువ. అలాంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి దేశాలకు మంచి మౌలిక సదుపాయాలు అవసరమని డాక్టర్ బ్లెవిన్ అభిప్రాయపడ్డారు.
అంతరిక్షంలో ప్రత్యామ్నాయ ఉపగ్రహాలను మోహరించాల్సి ఉంటుంది లేదా ఉపగ్రహాలు లేకుండా పనిచేయగల పరికరాల నెట్‌వర్క్‌ను భూమిపై నిర్మించాల్సి ఉంటుంది - అవి ఉపగ్రహాల్లా ప్రభావవంతంగా ఉండకపోవచ్చు గానీ అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగకరంగా ఉండొచ్చు.
కానీ ఉపగ్రహాలపై ఎప్పుడు, ఎలా దాడి జరుగుతుందో అంచనా వేయడం చాలా కష్టం.
అంతరిక్షంలో బలమైన ట్రాకింగ్ వ్యవస్థలు ఉన్నాయని బ్లెవిన్ అన్నారు. "భూమిపై దేశాల మధ్య వివాదం అదుపు తప్పినప్పుడే అంతరిక్షానికి యుద్ధం వ్యాపిస్తుంది. ఇందులో చాలామంది చనిపోతారు. ఇది అత్యంత తీవ్రమైన విషయం’’ అన్నారు బ్లెవిన్.
మరి ఉపగ్రహ యుద్ధం వల్ల ప్రపంచం ఎంత ప్రమాదాన్ని ఎదుర్కొంటుంది?
అంతరిక్షంలో అతి చిన్న సహజ లేదా మానవ నిర్మిత వస్తువు కూడా ప్రమాదకరం కావచ్చు. అంతరిక్షంలో 12 వేలకు పైగా ఉపగ్రహాలు ఉన్నాయి.
ఉపగ్రహాలను ఆయుధంగా ఉపయోగించకూడదు. కానీ సాంకేతికత ఇప్పుడు వాణిజ్య, సైనిక ఉపగ్రహాల మధ్య తేడాను చెరిపివేస్తోంది.
అనేక దేశాలు తమ సొంత ఉపగ్రహాలను నాశనం చేయడం ద్వారా ఈ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని నిరూపించుకున్నాయి.
కానీ ఒక దేశం మరొక దేశ ఉపగ్రహాన్ని నాశనం చేస్తే, ఆ ఉపగ్రహం ముక్కల వల్ల ఆ దేశం, దాని మిత్రదేశాల ఉపగ్రహాలు దెబ్బతినే ప్రమాదం ఉంది.
దీనితో పాటు, అంతరిక్షంలో జరిగే దాడికి భూమిపై కూడా సమాధానం లభించే ప్రమాదం కూడా ఉంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














