అంగారక గ్రహం నుంచి సహారా ఎడారిలో పడిన రాయి అమెరికాకు ఎలా చేరింది? ఎవరు కొన్నారు, ఎవరు విక్రయించారు?

గ్రహశకలం, అంగారకుడు, నైజర్, సహారా ఎడారి

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, 22.5 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి అంగారక శిల భూమిపై పడింది.
    • రచయిత, డామిన్ జేన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

''ఎంత ధైర్యం, ఎంత ధైర్యం''

షికాగో నుంచి ఫోన్‌లో మాట్లాడుతున్న ప్రొఫెసర్ పాల్ సెరెనో పెద్దగా అరుస్తున్నారు.

ఆయన తన కోపాన్ని దాచుకోవడానికి ఎంతమాత్రం ప్రయత్నించడం లేదు.

పశ్చిమాఫ్రికా దేశం నైజర్‌లో రెండేళ్ల క్రితం గుర్తించిన అంగారక శిల (ఉల్కాపాతం తరువాత దొరికింది) గత నెలలో న్యూయార్క్‌లో వేలం వేశారు.

గుర్తు తెలియని వ్యక్తి దాన్ని కొన్నారు. ఈ వేలం ప్రొఫెసర్ సెరెనోకు అసలు నచ్చలేదు.

శిలాజ శాస్త్రవేత్త అయిన ప్రొఫెసర్‌కు నైజర్‌తో సన్నిహిత సంబంధాలున్నాయి. ఆ శిల నైజర్‌కు తిరిగి చేర్చాలన్నది ఆయన అభిప్రాయం.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
గ్రహశకలం, అంగారకుడు, నైజర్, సహారా ఎడారి

ఫొటో సోర్స్, EPA

గ్రహాంతర పదార్థాల శకలాలకు భారీ డిమాండ్

అంగారక గ్రహానికి చెందిన లక్షల సంవత్సరాల నాటి ఆ శిల సుమారు రూ. 37 కోట్లకు (43 లక్షల డాలర్లు) పైగా ధరకు అమ్ముడుపోయిందని వేలం వేసిన సంస్థ సదబీస్ తెలిపింది. ఎవరు కొన్నారన్న విషయాన్ని బయటకు చెప్పనట్టే, ఎవరు అమ్మారనే విషయాన్ని కూడా వెల్లడించలేదు ఆ సంస్థ.

కాగా భూమ్మీద కనుగొన్న అతిపురాతనమైన గ్రహ శకలం ఇదే.

దీన్ని విక్రయించగా వచ్చిన డబ్బులో కొంతయినా నైజర్‌కు వెళ్తుందా లేదా అన్నదానిపై స్పష్టత లేదు.

సాధారణంగా గ్రహాంతర పదార్థాలంటే చాలామందికి ఆసక్తి. ఆ క్రమంలోనే భూమిపై పడిన కొన్ని ఉల్కలు మతపరమైన వస్తువులుగా, మరికొన్ని మ్యూజియంలకు, పరిశోధనశాలలకు చేరాయి.

గ్రహాంతర శిలలు, శకలాల వ్యాపారాన్ని కళా వ్యాపారంతో పోలుస్తారు.

అవి కనిపించే తీరు, ఎంత అరుదైనవి అనే విషయాలు వాటి ధరను ప్రభావితం చేస్తాయి.

సదబీస్ తీసిన ఫోటోల్లో 24.7 కేజీల ఈ అంగారక శిల ఎరుపు రంగులో మెరుస్తూ కనిపించింది.

అది వేలంలోకి ఎలా వచ్చిందనేది ఇప్పుడు తలెత్తున్న ప్రశ్న.

గ్రహశకలం, అంగారకుడు, నైజర్, సహారా ఎడారి

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, అంగారక శిల దేశం నుంచి ఎలా బయటికెళ్లిందనేదానిపై నైజర్‌లో దర్యాప్తు జరుగుతోంది.

అసలెక్కడ దొరికింది?

నైజర్ ప్రభుత్వం ఆ అంగారక శిల తమ దేశం నుంచి ఎలా అమెరికా చేరిందనే విషయంలో సందేహాలు వ్యక్తంచేస్తూ ప్రకటన విడుదల చేసింది.

అక్రమంగా తరలించి ఉంటారని ఆందోళన వ్యక్తంచేసింది.

ఈ ప్రకటనను సదబీస్ తీవ్రంగా ఖండించింది. నిబంధనలు, సరైన విధానాల ప్రకారమే అంగారక శిల వేలానికి వచ్చిందని చెబుతోంది.

గ్రహాంతర పదార్థాలు, శకలాలను గుర్తించడం, విక్రయించడం వంటి వ్యవహారాలపై నైజర్ దర్యాప్తు ప్రారంభించింది.

నైజర్‌లో దొరికిన ఈ అంగారక శిలకు ఎన్‌డబ్ల్యూఏ 16788 అని పేరు పెట్టారు. ఎన్‌డబ్ల్యూఏ అంటే వాయువ్య ఆఫ్రికా(నార్త్ వెస్ట్ ఆఫ్రికా) .

అయితే, ఇది అమెరికాలోని ప్రపంచ ప్రఖ్యాత వేలం సంస్థకు ఎలా చేరిందనేదానిపై ఎక్కువ సమాచారం అందుబాటులో లేదు.

2023 నవంబరు 16న నైజర్‌లోని అగాడెజ్ ప్రాంతంలోని సహారా ఎడారిలో చిర్‌ఫా ఒయాసిస్‌కు 90 కిలోమీటర్ల దూరంలో ఒకరు దీన్ని గుర్తించినట్టు ఇటాలియన్ అకడమిక్ ఆర్టికల్‌లో రాసి ఉంది. ఆ వ్యక్తి గురించి ఎలాంటి సమాచారం లేదు.

ఉల్కలు భూమిపై చాలా చోట్ల పడుతుంటాయి కానీ సహారా ఎడారిలో వాతావరణ పరిస్థితులు, మనుషుల సంచారం తక్కువగా ఉండడం వల్ల ఇలాంటివాటి కోసం ఆసక్తి ఉన్నవారు అక్కడ వెతుకుతుంటారు.

గ్రహశకలం, అంగారకుడు, నైజర్, సహారా ఎడారి

ఫొటో సోర్స్, Getty Images

నిబంధనల ప్రకారమే జరిగిందా?

ఓ అంతర్జాతీయ వ్యాపారికి స్థానిక కమ్యూనిటీ ఎన్‌డబ్ల్యూఏ 16788ను అమ్మిందని ఇటాలియన్ ఆర్టికల్‌లో ఉంది. తర్వాత దాన్ని ఇటలీలోని ఓ ప్రైవేట్ గ్యాలరీకి తరలించారు.

ఆ అంగారక శిలను కొనుగోలు చేసిన వ్యక్తి ప్రముఖ ఇటలీ గ్యాలరీ యజమాని అని ఫ్లోరెన్స్ యూనివర్శిటీ మ్యాగజీన్ తెలిపింది.

గత ఏడాది ఇటలీలోని ప్రదర్శనశాలలో ఈ శిల కనిపించింది. రోమ్‌లోని ఇటాలియన్ స్పేస్ ఏజెన్సీలోనూ కనిపించింది. తర్వాత గత నెలలో న్యూయార్క్‌లో కనిపించింది.

అయితే ఈ శిలకు చెందిన రెండు ముక్కలు ఇటలీలోనే ఉన్నాయి. పరిశోధనల కోసం వాటిని అక్కడ ఉంచారు.

అన్ని అంతర్జాతీయ విధానాలు పాటిస్తూ, సరైన పత్రాలతో ఎన్‌డబ్లూఏ 16788 రవాణా జరిగిందని సదబీస్ చెప్పింది.

అయితే ఈ శిల తరలింపులో నైజీరియా చట్టాల ఉల్లంఘన జరిగిందని నైజర్ హెరిటేజ్ సంస్థకు చెందిన ప్రొఫెసర్ సరెనో భావిస్తున్నారు.

షికాగో విశ్వవిద్యాలయంలో చదువుకున్న సరెనో సహారా ఎడారిలో నైజర్‌కు చెందిన భూభాగంలో డైనోసార్ ఎముకల భారీ నిక్షిప్తాలను వెలికితీసే పనిలో ఏళ్ల తరబడి గడిపారు. ప్రస్తుతం నైజర్ సాంస్కృతిక, సహజ వారసత్వాన్ని పరిరక్షించే ప్రయత్నం చేస్తున్నారు.

రాజధాని నియామేలోంచి ప్రవహించే నైజర్ నదిలోని ఒక దీవిలో, ఈ కళాఖండాలను నిల్వచేయడానికి అద్భుతమైన మ్యూజియంను నిర్మించేందుకు ప్రణాళికలు వేస్తున్నారు.

గ్రహశకలం, అంగారకుడు, నైజర్, సహారా ఎడారి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గ్రహశకలం శాస్త్రీయ నామం ఎన్‌డబ్ల్యూఏ 16788

సహారా గోల్డ్ రష్

"అంతర్జాతీయ చట్టాల ప్రకారం, నైజర్ వారసత్వానికి చెందిన వస్తువులు అంత తేలిగ్గా దేశం నుంచి తీసుకెళ్లలేరు. ఏదైనా చెల్లిపోతుందనే వలసవాద కాలం నుంచి మనం బయటికి వచ్చాం'' అని ప్రొఫెసర్ సెరెనో చెప్పారు.

నైజర్ 1997లో వారసత్వాన్ని కాపాడే చట్టాన్ని ఆమోదించింది.

ఆ చట్టంలోని సవివరంగా ఉన్న ఓ సెక్షన్‌ను ప్రొఫెసర్ సెరెనో ప్రస్తావించారు. ఆ జాబితాలో కళాఖండాలు, నిర్మాణాలు, పురాతన వస్తువులు, ఖనిజ నమూనాల గురించి ప్రస్తావించారు కానీ ఇలాంటి గ్రహాంతర పదార్థాల ప్రస్తావన ఏమీ లేదు.

గ్రహాంతర పదార్థాల అమ్మకంపై ప్రత్యేక చట్టం లేదని నైజర్ అంగీకరించింది. అయితే ఇంత భారీ కళాఖండంలాంటిదాన్ని అధికారుల కంటపడకుండా ఎలా తరలించగలిగారనేదానిపై ఇంకా స్పష్టత లేదు.

కొన్ని పొరుగుదేశాలతో పోలిస్తే స్థిరమైన రాజకీయ వాతావరణం, సడలించిన నిబంధనలు వంటి పరిస్థితులతో రెండు దశాబ్దాల క్రితం నైజర్‌ను రచయిత హెలెన్ గోర్డాన్ అభివర్ణించినట్టుగా సహారా గోల్డ్ రష్‌గా భావించేవారు.

తన తాజా పుస్తకం ది మెటియరైట్స్‌లో అంతరిక్ష శిaలు ఎక్కువగా ఎగుమతి చేసే దేశాల్లో మొరాకో ఒకటని హెలెన్ గోర్డాన్ రాశారు.

''అది మనలో భాగం, మన సంస్కృతిలో భాగం, మన గుర్తింపులో భాగం, మనదేశ సుసంపన్నతలో భాగం'' అని జియాలజిస్ట్ ప్రొఫెసర్ హస్‌నా చెన్నావి అవౌజెహానె అన్నారు.

గ్రహశకలం, అంగారకుడు, నైజర్, సహారా ఎడారి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గ్రహశకలాన్ని నైజర్‌కు తిరిగి తీసుకురావాలని అక్కడి నిపుణులు కోరుతున్నారు.

‘నైజర్‌కు తిరిగి తీసుకురావాలి’

అంగారక గ్రహం నుంచి గ్రహ శకలం పడడాన్ని 2011లో గమనించిన తర్వాత ప్రొఫెసర్ హస్‌నా సహారా ఎడారిలో దొరికిన పదార్థాలను సేకరిస్తున్నారు.

ఈ అంగారక శిల వేలం గురించి తెలిసిన తర్వాత ఆమె ఆశ్చర్యపోలేదు. "25ఏళ్లగా ఇలాగే జరుగుతోంది. ఇది విచారకరం, కానీ ఇది మన దేశాలన్నింటిలోనూ ఉన్న పరిస్థితే" అని అన్నారు.

నైజర్ అధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఎవరైనా దీన్ని ప్రదర్శనకు పెడితే నైజర్ ఆగ్రహాన్ని ఆ మ్యూజియం ఎదుర్కోవాల్సి ఉంటుందన్న విషయాన్ని గ్రహించాలని ప్రొఫెసర్ సెరెనో ఆకాంక్షిస్తున్నారు. అ

న్నిటికన్నా ముఖ్యంగా అరుణ గ్రహానికి చెందిన ఈ అరుదైన గ్రహశకలం నైజర్‌కు తిరిగి చేరాలన్నది ఆయన డిమాండ్.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)