ఆగస్ట్ 15న పుతిన్, ట్రంప్ భేటీ.. ఏం జరగబోతోంది?

రష్యా, యుక్రెయిన్, అమెరికా, కాల్పుల విరమణ ఒప్పందం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, కోట్నీ సుబ్రమణియన్, అలీ అబ్బాస్ అహ్మదీ
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

యుక్రెయిన్‌లో యుద్ధం భవిష్యత్తుపై చర్చించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వచ్చే శుక్రవారం అలస్కాలో సమావేశం కానున్నారు.

ఆగస్టు 15న జరగబోయే ఈ సమావేశం గురించి ట్రంప్ సోషల్ మీడియాలో ప్రకటించారు. తర్వాత క్రెమ్లిన్ ప్రతినిధి ఈ విషయాన్ని ధ్రువీకరించారు.

రెండో సమావేశానికి ట్రంప్‌ను రష్యాకు ఆహ్వానించినట్టు ఆ ప్రతినిధి చెప్పారు.

దీనిపై యుక్రెయిన్ స్పందించింది. ''యుక్రెయిన్ తమ భూభాగాన్ని ఆక్రమణదారులకు ఇవ్వదు'' అని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్ స్కీ అన్నారు.

మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్‌లో విడుదల చేసిన ఒక ప్రకటనలో, యుక్రెయిన్ ప్రమేయం లేని పరిష్కారమార్గాలు ''శాంతియుత పరిష్కారాలు కాకపోవచ్చు'' అని జెలియెన్ స్కీ పేర్కొన్నారు.

2022 ఫిబ్రవరి నుంచి జరుగుతున్న యుద్ధాన్ని ముగించడానికి యుక్రెయిన్ కొంత భూభాగాన్ని వదులుకోవాల్సిఉంటుందేమోనని ట్రంప్ సంకేతాలిచ్చిన కొన్ని గంటలకే ఈ ప్రకటన వచ్చింది.

''మూడున్నరేళ్లగా జరుగుతున్న యుద్ధంలో చాలా మంది రష్యన్లు, యుక్రేనియన్లు మరణించారు'' అని ట్రంప్ శుక్రవారం(ఆగస్టు 8) వైట్ హౌస్ దగ్గర ప్రకటించారు.

''ఇది చాలా క్లిష్టమైనది. కొంత మేం తిరిగి పొందబోతున్నాం. కొంత మారబోతోంది. రెండు వైపులా ప్రయోజనం చేకూరేలా భూభాగంలో కొంత మార్పులు జరగబోతున్నాయి'' అని ట్రంప్ చెప్పారు.

ప్రతిపాదిత ఒప్పందం ఎలా ఉంటుందనేదానిపై అమెరికా అధ్యక్షుడు ఇతర ఎలాంటి సమాచారం అందించలేదు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
రష్యా, యుక్రెయిన్, అమెరికా, కాల్పుల విరమణ ఒప్పందం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రష్యా షరతులకు యుక్రెయిన్ అంగీకరిస్తుందా లేదా అన్నదానిపై స్పష్టత లేదు.

‘ప్రతిపాదిత ఒప్పందంలో ఏమేం ఉన్నాయంటే...’

క్రిమియాను అట్టిపెట్టుకోవడంతో పాటు తూర్పు యుక్రెయిన్‌లోని మొత్తం డాన్‌బాస్ ప్రాంతాన్ని రష్యా స్వాధీనం చేసుకోవడం సహా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి యూరోపియన్ నేతలు అంగీకరించేలా చేసేందుకు వైట్ హౌస్ ప్రయత్నిస్తోందని, ఈ చర్చలపై సమాచారం ఉన్న వర్గాలను ఉటంకిస్తూ బీబీసీ అమెరికా భాగస్వామి సీబీఎస్ న్యూస్ తెలిపింది.

పాక్షికంగా ఆక్రమించుకున్న ఖేర్చన్, జపోరిజియా ప్రాంతాలను ప్రతిపాదిత ఒప్పందం ప్రకారం రష్యా తిరిగి ఇవ్వాల్సిఉంటుందని సీబీఎస్ చెప్పింది.

ట్రంప్ ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్‌తో ఇటీవల మాస్కోలో జరిగిన సమావేశంలో పుతిన్ ఇలాంటి ఒప్పందాన్నే ప్రతిపాదించారని వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది.

రష్యా, యుక్రెయిన్, అమెరికా, కాల్పుల విరమణ ఒప్పందం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జెలియెన్‌స్కీ

యుక్రెయిన్ అధ్యక్షుడు ఏమంటున్నారు?

శాంతి ఒప్పందానికి సంబంధించిన షరతుల విషయంలో జెలియెన్‌స్కీ, పుతిన్ పూర్తి భిన్నాభిప్రాయాలతో ఉండడంతో యుక్రెయిన్, యూరోపియన్ మిత్రదేశాలు అలాంటి ఒప్పందాన్ని అంగీకరిస్తాయా లేదా అన్నదానిపై ఇంకా స్పష్టత లేదు.

భూభాగాన్ని వదులుకోవడంపై ఎలాంటి ముందస్తు షరతులనయినా జెలియెన్‌స్కీ ఖండిస్తూ వస్తున్నారు.

వచ్చే శుక్రవారం జరగబోయే సమావేశం ప్రణాళిక ఇంకా పూర్తిస్థాయిలో జరగలేదని, జెలియెన్‌స్కీ కూడా ఇందులో పాల్గొనేందుకు అవకాశం ఉందని సీనియర్ వైట్ హౌస్ అధికారి సీబీఎస్‌తో చెప్పారు.

పూర్తిస్థాయి ఆక్రమణలో నిర్ణయాత్మక విజయం సాధించడంలో మాస్కో విఫలమైంది గానీ యుక్రెయిన్ భూభాగంలో దాదాపు 20శాతాన్ని ఆక్రమించుకుంది. యుక్రెయిన్ ప్రతిదాడులు చేస్తున్నప్పటికీ రష్యా బలగాలను తిప్పికొట్టలేకపోయాయి.

రష్యా, యుక్రెయిన్, అమెరికా, కాల్పుల విరమణ ఒప్పందం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మూడున్నరేళ్లగా రష్యా యుక్రెయిన్ యుద్ధం జరుగుతోంది.

మాస్కో షరతులను కీయెవ్ అంగీకరిస్తుందా?

యుద్ధాన్ని ముగించడానికి యుక్రెయిన్, రష్యా మధ్య ఇస్తాంబుల్‌లో జరిగిన మూడు రౌండ్ల చర్చలు విఫలమయ్యాయి. శాంతి కోసం మాస్కో చెబుతున్న మిలటరీ, రాజకీయ షరతులను యుక్రెయిన్, దాని మిత్రదేశాలు.. యుక్రెయిన్ లొంగిపోవడంలా ఉన్నాయని భావిస్తున్నాయి.

యుక్రెయిన్ తటస్థ దేశంగా మారడంతో పాటు, సైన్యాన్ని తగ్గించడం, నాటోలో చేరాలనే లక్ష్యాన్ని వదిలిపెట్టడం, పాశ్చాత్యదేశాలు రష్యాపై విధించిన ఆంక్షలను ఎత్తివేయడం వంటి డిమాండ్లను మాస్కో చేస్తోంది.

ఆగ్నేయ యుక్రెయిన్‌లో రష్యా ఆక్రమించుకున్న నాలుగు ప్రాంతాలనుంచి కీయెవ్ సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని కూడా మాస్కో కోరుకుంటోంది.

రెండు దేశాల మధ్య అమెరికా త్రైపాక్షిక ఒప్పందం కుదిర్చే అవకాశం ఉందని ట్రంప్ చెప్పారు.

''యూరోపియన్ నేతలు శాంతిని కోరుకుంటున్నారు. పుతిన్, జెలియెన్‌స్కీ శాంతిని కోరుకుంటున్నారని నేను నమ్ముతున్నా'' అని ట్రంప్ అన్నారు.

''అధ్యక్షుడు జెలియెన్‌స్కీ ఇదంతా సిద్ధం చేసుకోవాలి. ఓ ఒప్పందంపై సంతకం చేయడానికి ఆయన సిద్ధంగా ఉండాలి. దానికోసం ఆయన తీవ్రంగా శ్రమిస్తున్నారని భావిస్తున్నా'' అని ట్రంప్ చెప్పారు.

రష్యా, యుక్రెయిన్, అమెరికా, కాల్పుల విరమణ ఒప్పందం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ట్రంప్ ప్రతినిధి విట్కాప్ నాలుగుసార్లు రష్యా వెళ్లారు.

సమావేశం అనుకున్న ఫలితాన్నిస్తుందా?

చర్చలు మొదట్లో ఆశాజనకంగా సాగినప్పటికీ విట్‌కాఫ్ నాలుగుసార్లు మాస్కోలో పర్యటించిన తర్వాత పుతిన్ తనను నిరుత్సాహానికి గురిచేశారని ట్రంప్ గత నెలలో బీబీసీ దగ్గర అన్నారు.

ఇటీవలి వారాల్లో క్రెమ్లిన్‌కు వ్యతిరేకంగా ఆయన స్వరం పెంచారు. యుక్రెయిన్‌లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని రష్యా అంగీకరించడానికి శుక్రవారాన్ని డెడ్‌లైన్‌గా విధించారు. లేదంటే మరిన్ని ఆంక్షలు ఎదుర్కోవాల్సిఉంటుందన్నారు.

శాంతి ఒప్పందంపై చర్చించేందుకు ట్రంప్, పుతిన్ నేరుగా సమావేశం కావాలన్న ప్రణాళికలు ఊపందుకోవడంతో డెడ్‌లైన్ సమీపించేకొద్దీ ఆర్థిక పరమైన అంశాలు వెనక్కివెళ్లాయి.

రష్యాపై తదుపరి ఆంక్షలకు సంబంధించి వైట్ హౌస్ నుంచి ఎలాంటి ప్రకటనా లేదు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో ట్రంప్, పుతిన్ ఫోన్‌లో మాట్లాడుకున్నారు. రష్యా పూర్తిస్థాయి ఆక్రమణ ప్రారంభించిన తర్వాత అమెరికా, రష్యా అధినేతల మధ్య జరిగిన తొలి చర్చలు ఇవి.

పుతిన్‌ను ఓ అమెరికా అధ్యక్షుడు చివరిగా కలిసింది 2021లో స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో జరిగిన సదస్సులో జో బైడన్, పుతిన్‌తో సమావేశమయ్యారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)