మయసభ వెబ్‌ సిరీస్ రివ్యూ: ఈ పొలిటికల్, ఎమోషనల్ డ్రామా ఎలా ఉంది, ఇది చంద్రబాబు - వైఎస్సార్ కథేనా? కల్పితమా?

మయసభ వెబ్ సిరీస్, ఆంధ్రప్రదేశ్, రాజకీయాలు

ఫొటో సోర్స్, X/SonyLIV

    • రచయిత, జీఆర్ మ‌హ‌ర్షి
    • హోదా, బీబీసీ కోసం

చ‌రిత్ర‌ని తెర‌మీద చెప్ప‌డం క‌ష్టం. క‌ల్ప‌న జోడించాలి లేదా వక్రీక‌రించాలి.

తెలుగు వారికి బాగా ప‌రిచ‌య‌మైన ఇద్ద‌రు రాజ‌కీయ నాయ‌కుల క‌థ చెప్పాలంటే చాలా అవ‌గాహ‌న‌, ప‌రిశోధ‌న కావాలి.

దేవ్ క‌ట్టా ద‌ర్శ‌క‌త్వంలో 'మ‌య‌స‌భ' వెబ్ సిరీస్ వ‌చ్చింది.

సోనీలైవ్‌లో స్ట్రీమ్ అవుతున్న 9 ఎపిసోడ్స్ ఎలా ఉన్నాయంటే?

ఇది చంద్ర‌బాబు నాయుడు, వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి క‌థ‌. పేర్లు మారొచ్చు కానీ వ్య‌క్తులు వాళ్లే.

ఆరున్న‌ర గంట‌ల ఈ డ్రామాలో నిజ జీవిత సంఘ‌ట‌న‌ల‌తో పాటు, క‌ల్ప‌న కూడా అంతే స్థాయిలో ఉంది.

బాబు, వైఎస్ ప్రారంభ రాజ‌కీయాన్ని చూసిన వాళ్ల‌కి ఇది తెలుసు. కానీ, కొత్త జ‌న‌రేష‌న్స్ ఈ క‌థ మొత్తం నిజం అనుకునే ప్ర‌మాదం ఉంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

వైశ్రాయ్ హోట‌ల్లో ఎమ్మెల్యేల స‌మీక‌ర‌ణ‌ల‌తో ఫ‌స్ట్‌ ఎపిసోడ్ ప్రారంభ‌మ‌వుతుంది.

కృష్ణ‌మ‌ నాయుడు (చంద్ర‌బాబు), ఎమ్మెస్సార్ (వైఎస్సార్‌)కి ఫోన్ చేస్తాడు.

'యుద్ధం నీ ధ‌ర్మం' అని రెడ్డి అంటాడు. అక్క‌డ నుంచి ఫ్లాష్‌బ్యాక్‌.

చంద్ర‌బాబు యూనివ‌ర్సిటీ జీవితం, క‌ర్ణాటకలో వైఎస్ మెడికో లైఫ్ ఒకే సమయంలో ప్రారంభ‌మ‌వుతాయి.

హౌస్ స‌ర్జ‌న్‌గా తిరుప‌తి వ‌చ్చిన త‌ర్వాత ఇద్ద‌రి మ‌ధ్య స్నేహం.. ఇద్ద‌రూ రాజ‌కీయాల్లోకి వెళ్ల‌డం.. మంత్రులు కావ‌డం.. త‌ర్వాత బాబు పెళ్లి, ఎన్టీఆర్ పార్టీ ఇలా.. రాజ‌కీయ ప‌రిణామాల‌తో పాటు ఫ్యామిలీ ఎమోష‌న్ డ్రామా మిళిత‌మై ఉంటుంది.

ఉప‌క‌థ‌లుగా ప‌రిటాల ర‌వి, వంగ‌వీటి రంగాల‌ని కూడా ట‌చ్ చేశారు.

బ‌హుశా సెకెండ్ సీజ‌న్‌లో ఆ లేయ‌ర్స్ ఉండొచ్చు.

మయసభ పోస్టర్

ఫొటో సోర్స్, X/SonyLIV

క‌థ క‌ల్పితం అంటున్న‌ప్ప‌టికీ, ఈ సిరీస్ చూసిన వాళ్ల‌కి బాబు, వైఎస్ గాఢ స్నేహితులేమో అనే భావ‌న క‌లుగుతుంది.

నిజానికి వాళ్ల స్నేహం ఎమ్మెల్యేలుగా మారిన త‌ర్వాతే.

అంత‌కుముందు వైఎస్ తిరుప‌తిలో హౌస్ స‌ర్జ‌న్ చేసినా, ఆయ‌న‌కి అక్క‌డ పెద్ద‌గా రాజ‌కీయ ప‌రిచ‌యాలు లేవు.

అసెంబ్లీలో అడుగు పెట్టిన త‌ర్వాత స్నేహం ఏర్ప‌డి బ‌ల‌ప‌డింది. ఇద్ద‌రూ క‌లిసి త‌ర‌చూ దిల్లీ వెళ్లేవారు. మంత్రులుగా కూడా స‌హ‌కారం ఉంది.

83 త‌ర్వాత దారులు వేర‌య్యాయి. మిగిలిన క‌థ అంద‌రికీ తెలిసిందే.

రాజ‌కీయ విమ‌ర్శ‌లు ఎన్ని ఉన్నా.. క‌లుసుకున్న‌ప్పుడు స్నేహితుల్లా న‌వ్వుకునేవారు.

బాబు యూనివ‌ర్సిటీ ఎన్నిక‌లు, న‌లుగురి కోసం నాయ‌కుడిగా నిల‌బ‌డే ల‌క్ష‌ణం వంటివి చూపించారు.

అయితే, ఆయ‌న ప్రేమ‌క‌థ సినిమాటిక్‌.

మయసభ టీజర్ ఫోటో

ఫొటో సోర్స్, X/SonyLIV

వైఎస్‌ని రాజ‌కీయ నాయ‌కుడిగా చూడ‌డం రాజారెడ్డి ఆశ‌యం.

తొలిరోజుల్లో త‌ట‌ప‌టాయించినా, తండ్రి ఆకాంక్ష మేర‌కు రాజ‌కీయ ప్ర‌వేశం చేశారు.

ఇక వైఎస్ వివాహంలో ఎలాంటి కాంప్లికేష‌న్స్ లేవు. అది పెద్ద‌లు కుదిర్చిన పెళ్లి.

ఇక ఎన్టీఆర్ (సాయికుమార్‌) విష‌యానికి వ‌స్తే అన్నీ య‌దార్థ సంఘ‌ట‌న‌లే ఉన్నాయి.

అయితే, చంద్ర‌బాబు పెళ్లి అలా కుద‌ర‌లేదు. చిత్తూరు జిల్లాలోని అప్ప‌టి ప్ర‌ముఖులు కుదిర్చారు.

సెన్సార్ స‌మ‌స్య లేదు కాబ‌ట్టి ద‌ర్శ‌కుడు దేవ్ క‌ట్టా రాజ‌కీయాల్లో కులం పాత్ర గురించి బ‌లంగా చ‌ర్చించారు.

రెండు కులాలు పాలిటిక్స్‌లో ఎంత ముఖ్య‌పాత్ర వ‌హించాయో బోల్డ్‌గా చెప్పారు.

ముఖ్యంగా చెప్పాల్సింది నాయుడుగా వేసిన ఆది పినిశెట్టి, రామిరెడ్డిగా వేసిన చైత‌న్య‌రావుల గురించి.

ఇది క‌ష్ట‌మైన ఫీట్‌. ఇద్ద‌రూ ఒరిజిన‌ల్ క్యారెక్ట‌ర్స్‌లా ఉండ‌కూడ‌దు కానీ, బాడీ లాంగ్వేజ్‌లో ఇద్ద‌రినీ గుర్తు చేయాలి.

ఆది గొప్ప‌గా న‌టించాడు. అంత‌కు మించి చైత‌న్య చేశాడు.

వైఎస్ ఎక్స్‌ప్రెష‌న్స్‌, బాడీ లాంగ్వేజీ న‌ట‌న‌లో ప్ర‌తిబింబించేలా చేశాడు. మంచి క‌థ ప‌డితే చైత‌న్య నెక్స్ట్ లెవెల్ యాక్ట‌ర్‌.

మయసభ

ఫొటో సోర్స్, X/SonyLIV

ఇందిరాగాంధీగా వేసిన దివ్యాద‌త్త స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతం. ఎన్టీఆర్‌గా సాయికుమార్ ఒక రేంజ్‌లో చేశాడు. ఆయ‌న‌కి క‌రెక్ట్ రోల్‌. ప్ర‌ముఖ ప‌త్రికాధిప‌తిగా నాజ‌ర్ చేశాడు.

క‌థ‌ని 5 ద‌శాబ్దాల వెన‌క్కి తీసుకెళ్ల‌డం ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌కు, మేక‌ప్‌కు అతిపెద్ద టాస్క్‌. రెండూ సునాయాసంగా చేశారు.

ఖ‌ర్చుకి త‌గ్గిన‌ట్టు లేదు. బీజీఎం, ఫొటోగ్ర‌ఫీ కూడా క‌రెక్ట్‌గా కుదిరాయి.

ప్రొద్దుటూరులో రైల్వేస్టేష‌న్ లేదు. 1977కి ఆంధ్ర‌ప్ర‌దేశ్ గ్రామాల్లో టీవీ లేదు. క‌థ క‌ల్పితం కాబ‌ట్టి ఇది ప‌ట్టించుకోకూడ‌దు.

మయసభలో నాజర్

ఫొటో సోర్స్, X/SonyLIV

డైలాగులు తూక‌మేసిన‌ట్టున్న ఎపిసోడ్స్ అక్క‌డ‌క్క‌డ న‌త్త‌న‌డ‌క న‌డుస్తాయి. రాజ‌కీయ ఆస‌క్తి ఉన్న‌వాళ్ల‌కి, అప్ప‌టి చ‌రిత్ర తెలిసిన వాళ్ల‌కి ఈ సీరీస్ విప‌రీతంగా న‌చ్చుతుంది.

పాలిటిక్స్ తెలియ‌ని వాళ్ల‌కి కూడా నచ్చే అవ‌కాశం ఉంది.

దేవ్ క‌ట్టా సాధించిన విజ‌యం ఏమంటే స‌మ‌తుల్య‌త‌.

ఇద్ద‌రు నాయ‌కుల వ్య‌క్తిత్వాల‌ని ఎక్క‌డా ఎక్కువాత‌క్కువ చేయ‌లేదు. కించ‌ప‌ర‌చ‌లేదు.

వాళ్ల నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాల మీదే ఎక్కువ ఫోక‌స్ చేశారు.

కృష్ణ‌మ‌ నాయుడు తెలుగు పార్టీలో చేర‌డంతోనే క‌థ ఆగింది కాబ‌ట్టి సెకండ్ సీజ‌న్‌లో ఎన్టీఆర్ పాల‌న ద‌గ్గ‌ర నుంచి ఇంకా చాలా విష‌యాలు ఉంటాయి.

అసెంబ్లీని మ‌య‌స‌భ‌తో పోలుస్తూ టైటిల్ పెట్టారు కానీ, దీనికి క‌రెక్ట్ పేరు "ఇద్ద‌రు".

పొలిటిక‌ల్ జాన‌ర్‌తో మ‌న‌కి సినిమాలు, సిరీస్ తక్కువ‌. ధైర్యంగా నిజాయితీగా తీసేవాళ్లు ఇంకా త‌క్కువ‌. ద‌ర్శ‌కుడు దేవ్ క‌ట్టా ఆ ప‌ని చేశారు.

రాజ‌కీయాల్లో స్నేహితులు శ‌త్రువుల‌వుతారు. శ‌త్రువులు స్నేహితుల‌వుతారు.

కానీ, స్నేహితులే శత్రువులై, ఇద్ద‌రూ ముఖ్య‌మంత్రులు కావ‌డం త‌మిళ‌నాడులో క‌రుణానిధి, ఎంజీఆర్‌కి జ‌రిగింది. తెలుగులో బాబు, వైఎస్‌ల‌కి కుదిరింది.

(అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)