అమ్రీశ్ పురీ: స్క్రీన్‌పై తన విలనిజంతో భయపెట్టిన ఈ నటుడు నిజ జీవితంలో ఎలా ఉండేవారు?

అమ్రీశ్ పురీ

ఫొటో సోర్స్, MADHAV AGASTI

    • రచయిత, రెహాన్ ఫజల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

‘అద్భుతం..మహాద్భుతం.. ఆ బాలిక మానవ కన్య కాదు.. దేవ కన్య’.. అంటూ జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో అమ్రీశ్ పురీ గంభీరమైన స్వరంలో పలికిన ఈ డైలాగ్ తెలుగు ప్రేక్షకులకు ఇటీవల ఆ సినిమా రీరిలీజ్‌తో మరోసారి గుర్తుకొచ్చింది.

1987లో శేఖర్ కపూర్ దర్శకత్వం వహించిన 'మిస్టర్ ఇండియా' విడుదలైనప్పుడు, హీరో కంటే ఎక్కువగా ఆ సినిమాలో విలన్ పాత్ర పోషించిన అమ్రీశ్ పురీనే ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

బాలీవుడ్ చరిత్రలో 'మొగాంబో' పాత్ర ఒక మైలురాయిగా నిలిచిపోయింది.

బాలాజీ విటల్ రాసిన పుస్తకం 'ప్యూర్ ఈవిల్: ది బ్యాడ్‌మెన్ ఆఫ్ బాలీవుడ్'లో.. ఆయన వ్యక్తిత్వంలో అన్ని విలన్ పాత్రలను 'మొగాంబో'లో చూపించారని, కానీ మహిళలపై హింసను మాత్రం ఆయన అసలు సహించే వారు కాదని పేర్కొన్నారు.

ప్రేక్షకులను అమ్రీశ్ పురీ తనవైపుకు ఆకర్షించే విధానం చిన్న పిల్లల మాదిరిగా ఉండేది.

హిట్లర్ శైలిలో 'హెల్ మొగాంబో' అని ఆయన అనుచరులతో చెప్పించడం, దారుణమైన నేరం తర్వాత 'మొగాంబో ఖుష్ హువా' అనే పంచ్‌లైన్‌ను చెప్పడం వంటివి అమ్రీశ్ పురీ నటనలో ఆకట్టుకునేవి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

అమ్రీశ్ పురీ పంజాబ్‌లోని నౌశహర్‌‌లో జన్మించారు. శిమ్లాలోని బీఎం కాలేజీలో ఆయన చదువుకున్నారు.

ఆ తర్వాత 1950లలో బొంబాయి వెళ్లారు. అక్కడే తన ఇద్దరు సోదరులు మదన్ పురీ, చమన్ పురీలు సినిమాల్లో పనిచేసేవారు.

టోపీ, విశాలమైన భుజాలు, ఎత్తయిన రూపం, గంభీరమైన స్వరంతో ప్రాచుర్యం పొందిన అమ్రీశ్ పురీకి భారతీయ నాటక రంగంలో పేరుప్రఖ్యాతులున్న అల్కాజీ ద్వారా తొలి అవకాశం లభించింది.

తన స్నేహితుల్లో ఒకరైన ఎస్‌పీ మేఘ్నాని ఆయన్ను అల్కాజీ దగ్గరకు తీసుకెళ్లారు.

అమ్రీశ్ పురీ తన ఆత్మకథ 'ది యాక్ట్ ఆఫ్ లైఫ్'ను రాశారు. అందులో.. అల్కాజీతో తన పరిచయం, ఇతర సంగతులను అమ్రీశ్ పురీ వివరించారు.

''కేవలం ఐదు నిమిషాల్లో నా చేతికి స్క్రిప్ట్ ఇచ్చి నాలో చెప్పలేని ఆత్మవిశ్వాసాన్ని నింపారు అల్కాజీ. ఆయన నన్ను చాలా నిశితంగా పరిశీలిస్తున్నారని తెలుసు.

పొడవైన కారిడార్‌లో మరో కొన వద్ద కూర్చున్న ఆయన డెస్క్ వద్దకు నేను వెళ్లాను. థియేటర్ అంటే ఇష్టమేనా? అని ఆయన అడిగారు. నేను యెస్ చెప్పిన వెంటనే, కిందకి వంగి, స్క్రిప్ట్ తీసి ఇచ్చారు. ఆర్థర్ మిల్లర్ నాటకం 'ఎ వ్యూ ఫ్రమ్ ది బ్రిడ్జ్'లో నేను ప్రధాన పాత్ర పోషిస్తానని ఆ క్షణంలోనే ఆయన నాకు చెప్పారు'' అని అమ్రీశ్ పురీ తన ఆత్మకథలో రాశారు.

అప్పటి నుంచి అమ్రీశ్ పురీ వెనక్కి తిరిగి చూసుకోలేదు.

అమ్రీశ్ పురి కుటుంబం

ఫొటో సోర్స్, RAJEEV PURI

ఫొటో క్యాప్షన్, అమ్రీశ్ పురి కుటుంబం

సఖారాం బైండర్ నుంచి ఫేమ్

విజయ్ టెండూల్కర్ నాటకం 'సఖారాం బైండర్' నుంచి ఆయనకు మంచి పేరు వచ్చింది.

పెళ్లి కానీ ఒక బుక్‌బైండర్ చుట్టూ ఈ కథ నడుస్తుంది. ఆయన నిరాశ్రయురాలైన మహిళను తన ఇంటికి తీసుకొచ్చి, ఆమెతో సంబంధం పెట్టుకుంటాడు.

ఈ నాటకంలో పురీ చాలా అసభ్యకరమైన పదాలు వాడారు.

స్త్రీని దోపిడీ చేస్తున్న ఓ వ్యక్తి ప్రవర్తనను ఎలా సమర్థించుతారంటూ ఈ నాటకంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది.

అమ్రీష్ పురీ

ఫొటో సోర్స్, MADHAV AGASTI

అమ్రీశ్ పురీకి మరో మార్గదర్శకుడు, థియేటర్ గురువు సత్యదేవ్ దుబే.

'' ఉద్యోగాన్ని, నాటకాలను ఒకేసారి చేయడం అమ్రీశ్‌కు అంత తేలిక కాలేదు. అయితే, సమయాన్ని ఎలా వాడుకోవాలో తనకి తెలుసు. ఆయనకు కుటుంబ బాధ్యతలు కూడా ఉండేవి. పెరుగుతున్న తన కుటుంబ అవసరాలను తీర్చడానికి అదనంగా డబ్బులు అవసరం పడేవి. నాటకాల్లో ఆయనకు జీతం వచ్చేది కాదు. క్రమంగా సినిమాలకు ఒప్పుకోవడంతో నాటకాలను తగ్గించుకున్నారు. అయినప్పటికీ ఆయన ఇతర నటుల కంటే కూడా ఎక్కువగా అప్పటికే హిందీ నాటక రంగానికి తన సహకారం అందించారు'' అని అమ్రీశ్ పురీ గురించి సత్యదేవ్ దుబే అన్నారు.

వినయంగా ఉండటం అమ్రీశ్ పురీలోని ప్రత్యేక లక్షణం అని సత్యదేవ్ దుబే చెప్పారు.

షబానా అజ్మీ, స్మితా పాటిల్‌తో శ్యామ్ బెనగల్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, షబానా అజ్మీ, స్మితా పాటిల్‌తో శ్యామ్ బెనగల్

సినిమాల్లో బ్రేక్ ఇచ్చింది శ్యామ్ బెనగల్‌

అమ్రీశ్ పురీలోని ప్రతిభను గుర్తించిన శ్యామ్ బెనగల్ తన చిత్రాలు నిషాంత్, మంథన్, భూమికల్లో అమ్రీశ్ పురీకి అవకాశం ఇచ్చారు.

అమ్రీశ్ పురీ తన తొలి చిత్రాన్ని నలభై ఏళ్ల వయసులో చేశారు.

'' అమ్రీశ్ పురీ నాటకాలను నేను చూసేవాణ్ని. నిషాంత్‌లో చేయకముందే నాకు ఆయన తెలుసు. నిషాంత్ కోసం నాకు చాలా ఆకట్టుకునే వ్యక్తి కావాలి. ఆయన తన బాధ్యతలను చాలా బాగా నిర్వర్తించారు. ఆయనకు మరింత మెరుగులు దిద్దాల్సిన అవసరం లేదనిపించింది'' అని శ్యామ్ బెనగల్ ఒకసారి తన ఇంటర్వ్యూలో చెప్పారు.

'' మండీలో అమ్రీశ్ ఒక ఫకీర్ పాత్రను పోషించారు. ఇది మరో అద్భుతమైన నటన. యువ నటులతో ఆయనకు మంచి అనుబంధం ఉండేది. సర్దారి బేగంలో యువ నటి స్మృతి మిశ్రా చాలా భయపడ్డారు. సరిగ్గా నటించలేకపోయారు. కోపంతో నేను ఆమెను తిట్టేశాను. కానీ, అమ్రీశ్ ఆమెను ఎంతో ప్రోత్సహించారు. ఆమె ఆత్మవిశ్వాసాన్ని పెంచారు'' అని బెనగల్ చెప్పారు.

శ్యామ్ బెనగల్‌తో పనిచేయడం వల్ల తన కెరీర్‌ మరింత ఊపందుకుందని అమ్రీశ్ చెప్పారు.

''సీన్‌ విషయంలో శ్యామ్ చాలా స్పష్టంగా ఉండేవారు. తన ప్లాన్లలో ఎలాంటి జోక్యాన్ని ఆయన సహించేవారు కాదు. అయితే, సలహాలను, సూచనలను, ఏదైనా మెరుగుదలను ఆయన పాటించరని కాదు. తన సూచనలలో ఏవైనా మార్పులు ఉంటే ముందే చెప్పాలని ఆయన అనేవారు'' అని అమ్రీశ్ తన ఆత్మకథలో రాశారు.

''శ్యామ్‌కు, గోవింద్ నిహలానీకి నా నుంచి ఏం కావాలో బాగా తెలుసు. నాకు బలమైన, అర్థవంతమైన పాత్రలను మాత్రమే ఇచ్చేవారు'' అని అమ్రీశ్ పురీ చెప్పారు.

విజయ్ టెండూల్కర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, విజయ్ టెండూల్కర్ తీసిన ఎన్నో నాటకాలు, చిత్రాల్లో అమ్రీశ్ పురీ నటించారు.

విజయ్ తెండూల్కర్ రాసిన ఎన్నో నాటకాల్లో, చిత్రాల్లో అమ్రీశ్ పురీ నటించారు.

'' తొలిసారి అమ్రీశ్ పురీని వేదికపై చూసినప్పుడు, పనిలో ఆయన వేగం నన్ను ఆకట్టుకుంది. వేదికపై ఆయన స్వరం కూడా బాగా నప్పింది. సఖారాం బైండర్‌లో నటించేటప్పుడు మనసంతా పెట్టి నటించారు. నాటకాలు ఆయన్ను తీర్చిదిద్దాయి. అమ్రీశ్ నటక యాంత్రికంగా ఉండేది కాదు.'' అని అమ్రీశ్ పురీని పొగుడుతూ విజయ్ రాశారు.

అమ్రీశ్ పురీ తన దర్శకులలో ఒకరైన గిరీష్ కర్నాడ్‌ను 'తాత్విక నాటక రచయిత' అని ముద్దుగా పిలిచేవారు.

అమ్రీశ్ పురీతో తన తొలి పరిచయాన్ని గిరీష్ కర్నాడ్ తన ఆత్మకథ 'ది లైఫ్ అట్ ప్లే'లో రాశారు.

''రిహార్సల్స్ లేనప్పడు, అమ్రీశ్ బయట తిరిగేవారు. సత్యదేవ్ దుబే ఆయనకు శిక్షణ ఇవ్వడం, డైరెక్ట్ చేయడం చేసేవారు. 'కాడు' సినిమా తీసే అవకాశం వచ్చినప్పుడు నేను అమ్రీశ్‌ను ఎంచుకున్నాను. ఆయనకు కన్నడ రాకపోవడం పెద్ద అడ్డంకిగా మారింది. డైలాగ్‌లు గుర్తుంచుకునేందుకు గంటల పాటు ప్రయత్నించేవారు. కెమెరా ఆన్ చేసినప్పుడు, డైలాగులు గుర్తుకురాక కోపంలో తలను పట్టుకునేవారు. దీంతో, సినిమా అంతా ఆయన డైలాగ్‌లను కేవలం ఆరు లైన్లకే కుదించాను. దీంతో, ఈ సినిమాలో ఆయన నిశ్శబ్ద పాత్రగా మారిపోయారు. అతి తక్కువ డైలాగులు ఉన్నప్పటికీ నటనతో తనదైన ముద్రవేశారు అమ్రీశ్' అని గిరీష్ కర్నాడ్ తన ఆత్మకథలో రాశారు.

కాడు సినిమా బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించింది.

గాంధీ చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

గాంధీ సినిమాలో పాత్ర

గాంధీ సినిమాలో అమ్రీశ్ పురీ నటించారు. భారత్‌ కోసం గాంధీ కోరుకున్నది సాధించేందుకు సాయపడే సంపన్న దక్షిణాఫ్రికా వ్యాపారవేత్త ఖాన్ పాత్రను ఆయనకు ఇచ్చారు.

అమ్రీశ్ పురీపై సర్ రిచర్డ్ అటెన్‌బరో బలమైన ముద్ర వేశారు.

ఈ విషయాన్ని అమ్రీశ్ పురీ తన ఆత్మకథలో రాశారు. '' అటెన్‌బరో 16 ఏళ్ల పాటు గాంధీ స్క్రిప్ట్‌పైనే పనిచేశారు. ఆ స్క్రిప్ట్‌లోని ప్రతి పదానికి ఆయన న్యాయం చేశారు. షూటింగ్ ప్రారంభానికి ముందు, స్క్రిప్ట్ కాపీని అందరికీ అందించారు. సెట్‌కు వచ్చేటప్పుడు ప్రతి డైలాగును నటులందరూ కంఠస్థం చేయాలని చెప్పారు. అటెన్‌బరో చాలా ఓపిక ఉన్న దర్శకులు. కెమెరా ముందు కూర్చుని, సౌండ్, యాక్షన్ అని మృదువుగా చెప్పేవారు. కొన్నిసార్లు ఆయన పదాలు కూడా మాకు వినిపించేవి కావు. ఇతర నటీనటుల ఏకాగ్రత దెబ్బతినకుండా ఆయన స్వరాన్ని చాలా తక్కువ చేసి మాట్లాడేవారు'' అని అమ్రీశ్ పురీ తన ఆత్మకథలో రాశారు.

అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్ కూడా అమ్రీశ్ పురీని పిలిచి, ఆయన సినిమా 'ఇండియానా జోన్స్'లో విలన్ పాత్రను ఇచ్చారు.

తొలుత ఇండియానా జోన్స్ స్క్రిప్ట్‌ పురీకి నచ్చలేదు. అప్పుడు అటెన్‌బరోకు కాల్ చేసి సలహా ఇవ్వమని కోరారు.

'' ప్రస్తుతం ప్రపంచంలోని గొప్ప దర్శకుల్లో స్టీవెన్ ఒకరని నేను నమ్ముతాను. స్టీవెన్ మిమ్మల్ని పిలిస్తే, మీకోసం ఏదో ఒకటి తన మనసులో అనుకునే ఉంటారు. సాధారణ కథకు కూడా ఆయన జీవం పోస్తారు'' అని అమ్రీశ్ పురీకి అటెన్‌బరో చెప్పారు.

అటెన్‌బరో చెప్పిన విషయాన్ని అమ్రీశ్ కూడా అంగీకరించారు.

''స్పీల్‌బర్గ్ సాధారణ అంశాన్ని కూడా అద్భుతంగా చూపిస్తారు. ఆయన ఎంత పనిమంతుడు అంటే, ఒక మూవీ షూట్ చేస్తూ కనీసం రెండు చిత్రాల స్క్రిప్ట్‌లపై ఆయన పనిచేస్తారు. రెండేళ్ల పాటు స్క్రిప్ట్‌పై విస్తృతమైన అధ్యయనం చేసేంత వరకు షూటింగ్‌ను మొదలుపెట్టరు'' అని తన ఆత్మకథలో రాశారు.

అమ్రీష్ పురీ

ఫొటో సోర్స్, Getty Images

వాచ్, షూలను సేకరించేవారు

అమ్రీశ్ పురీ గుండును భారత్‌లో ఫ్యాషన్‌గా మార్చేశారు.

ఒకప్పుడు ఆయన తలపై జట్టు ఉండేది. 'దిల్ తుజ్‌కో దియా' సినిమాలో తన పాత్ర 'దాదా' కోసం జుట్టును తీసేయాలని దర్శకులు రాకేష్ కుమార్ ఆయన్ను ఒప్పించారు.

నెలన్నరలో సినిమా పూర్తవుతుందని అమ్రీశ్‌కు దర్శకుడు చెప్పారు. కానీ, ఆ సినిమా పూర్తవడానికి ఏడాదిన్నర సమయం పట్టింది.

ఆ సమయంలో అమ్రీశ్ పురీ గుండుతోనే ఉండేవారు. ఆ తర్వాత కూడా, ఇక జుట్టును పెంచుకోలేదు. ఎండాకాలం వేడితో ఇబ్బందిపడేటప్పుడు, ఆయన టోపీని పెట్టుకునేవారు.

మెల్లగా ఆ టోపీనే ఆయన ట్రేడ్‌మార్క్‌గా, గుర్తింపుగా మారింది. వివిధ రకాల టోపీలను ఆయన సేకరించేవారు.

టోపీలతో పాటు వివిధ రకాల షూస్, వాచ్‌లను ధరించడం, వాటిని సేకరించడం అమ్రీశ్ పురీకి ఇష్టం.

'' నా సైజు షూ దొరకడం చాలా కష్టంగా ఉండేది. ఆగ్రా వెళ్లినప్పుడు, ఒకేసారి 65 జతలు తెచ్చుకునేవాడిని. కానీ, ఆ స్టాక్ కూడా త్వరగా అయిపోయేది. షూటింగ్ సమయంలో నాకు ఏదైనా షూ నచ్చితే, దానిని నాకు బహుమతిగా ఇవ్వడానికి నిర్మాతను ఒప్పిస్తాను" అని తన ఆత్మకథలో అమ్రీశ్ పురీ రాశారు.

''కారులో ప్రయాణించేటప్పుడు కూడా పోలీసు కానిస్టేబుల్ వేసుకున్న షర్ట్ ఆయనకెంత సరిపోతుంది. ఆయన షూ ఎంత కాలం నాటివో గమనించేవారు'' అని అమ్రీశ్ పురీ కొడుకు రాజీవ్ పురీ ఫిల్మ్‌ఫేర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

'గార్డిష్‌' చిత్రంలో ఆయన చాలా అద్భుతంగా నటించారు.

అమ్రీశ్ పురీ మొత్తం 316 చిత్రాల్లో నటించారు. శ్యామ్ బెనగల్ "నేతాజీ సుభాష్ చంద్రబోస్: ది ఫర్గాటెన్ హీరో" ఆయన చివరి చిత్రం.

చివరి రోజుల్లో అమ్రీశ్ పురీ బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడ్డారు. 73 ఏళ్ల వయసులో 2005 జనవరి 12న ఆయన ఈ లోకానికి వీడ్కోలు పలికారు.

సంగీత నాటక అకాడమీ అవార్డును అందుకున్న సినీ ప్రముఖులు చాలా తక్కువ మంది ఉన్నారు. నాటకాలకు ఆయన చేసిన సేవలకు గాను 1979లో ఆయనకు ఈ అవార్డు లభించింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)