ఈ బామ్మ 80 ఏళ్ల వయసులో ఫ్యాషన్ ఐకాన్‌గా ఎలా మారారంటే..

ఫ్యాషన్ ఐకాన్‌, బామ్మ, జాంబియా

ఫొటో సోర్స్, Luxury Media Zambia

    • రచయిత, పెన్నీ డేల్
    • హోదా, జర్నలిస్ట్

జాంబియా దేశంలోని గ్రామీణ ప్రాంతానికి చెందిన ఈ బామ్మ ఫ్యాషన్ ఐకాన్‌గా మారారు. తన మనవరాలి లేటెస్ట్ ఫ్యాషన్ దుస్తులు ధరిస్తూ ఒక స్టైలిష్‌ స్టార్‌గా మారిపోయారు. ఇంటర్న్‌నెట్‌లో సంచలనం సృష్టిస్తున్నారు.

80 ఏళ్లకు పైగా వయసున్న ఈ బామ్మ పేరు మార్గరెట్ చోళా.

ఈమెను చాలామంది "లెజెండరీ గ్లామా" అని పిలుస్తున్నారు. ఈమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 2,25,000 మంది ఫాలోవర్లు ఉన్నారు.

"ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ఈ దుస్తులలో కొత్తగా, ప్రపంచాన్ని జయించగలను అనిపిస్తోంది" అని చోళా బీబీసీతో చెప్పారు.

చోళా మనవరాలు డియానా కౌంబా న్యూయార్క్‌‌లో స్టైలిస్ట్‌గా పనిచేస్తున్నారు. ఆమె 2023లో “ద ఫోర్ట్‌నైట్లీ గ్రానీ సిరీస్‌”ని ప్రారంభించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
జాంబియా, లెజెండరీ గ్లామా, రంగులు, దుస్తులు

ఫొటో సోర్స్, Luxury Media Zambia

ఫొటో క్యాప్షన్, జాంబియా జాతీయ రంగులలో "లెజెండరీ గ్లామా"

డియానా తన తండ్రి రెండవ వర్థంతి కోసం జాంబియాకు వెళ్లినప్పుడు ఆమెకు ఈ ఆలోచన వచ్చింది. ఆమె తండ్రి ఎప్పుడూ చక్కటి దుస్తులు ధరించేవారని, అదే తనకు ఫ్యాషన్‌పై మక్కువ కలిగేలా చేసిందని ఆమె చెప్పారు.

జాంబియా వెళ్లిన సమయంలో డియానా తన దగ్గర ఉన్న ఫ్యాషన్ దుస్తులన్నీ ధరించలేదు. అప్పుడు.. ‘‘ఓసారి నా బట్టలు వేసుకుని చూడు నానమ్మా? నీ బట్టలు నేను వేసుకుంటాను. కొత్తగా ఒక ప్రయత్నం చేద్దాం’’ అని బెంబా భాషలో డియానా చెప్పారు.

ఆ సమయంలో “నాకేపనీ లేదు. మీరు ఏం చేయాలనుకుంటే అది చేద్దాం. నేను చనిపోయాక అందరికీ ఇలా అయినా గుర్తుండిపోతాను” అని చోళా బదులిచ్చారు.

అలా ఒకరి దుస్తులను మరొకరు వేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

నానమ్మ, మనవరాలు, ఫోటో

ఫొటో సోర్స్, Luxury Media Zambia

ఫొటో క్యాప్షన్, నానమ్మ దుస్తులను మనవరాలు, మనవరాలి దుస్తులను నానమ్మ ధరించి...

“మా నానమ్మకు నా ఫ్యాషన్ దుస్తులు వేసి, ఆ డ్రెస్‌లో ఆమె ఇంటి దగ్గరే ఫోటోలు తీస్తే బాగుంటుందని అనుకున్నాను” అని డియానా బీబీసీకి చెప్పారు.

జాంబియా రాజధాని లుసాకాకు ఉత్తరాన 16 కిలోమీటర్ల దురంలో గల గ్రామంలోని వ్యవసాయ క్షేత్రం దగ్గర చోళ నివాసం ఉంది.

సోఫా, ఫోటో,చోళా

ఫొటో సోర్స్, Luxury Media Zambia

ఫొటో క్యాప్షన్, సోఫాలో కూర్చుని పోజిస్తున్న చోళా

లేటెస్ట్ ఫ్యాషన్ దుస్తులు ధరించిన బామ్మ.. తన ఇంటి దగ్గర, దున్నిన పొలంలో, మామిడి తోటలో, మొక్కజొన్న చేనులో హాయిగా రిలాక్స్ అవుతున్న ఫోటోలను తీసి మనవరాలు ఇంటర్‌నెట్‌లో పోస్ట్ చేస్తారు.

"నేను మొదటి ఫోటోను పోస్ట్ చేసినప్పుడు చాలా భయపడ్డాను. నా ఫోన్‌ని 10 నిమిషాలు పక్కనపెట్టేశాను. ఆ 10 నిమిషాల్లో 1,000 లైక్‌లు వచ్చాయి" అని డియానా కౌంబా చెప్పారు.

"చాలామంది కామెంట్లు చేస్తూనే ఉన్నారు. బామ్మ ఫోటోలు ఇంకా పోస్ట్ చేయండి అంటున్నారు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది” అని ఆమె వివరించారు.

ఎరుపు రంగు అడిడాస్ దుస్తులు, చంకీ, గోల్డెన్ నెక్లెస్‌లు, మెరిసే ఆభరణాల కిరీటం వంటివి ధరించిన నానమ్మ ఫోటోలను వరుసగా పోస్ట్ చేసిన డియానా.. తర్వాత, 2024 ఏప్రిల్‌లో ‘గ్రానీ సిరీస్’ ప్రారంభించారు.

‘‘ప్రపంచవ్యాప్తంగా ఇంతమంది నన్ను అభిమానించడం చూసి నేను ఆశ్చర్యపోయను" అని చోళా అన్నారు.

తన వయసెంతో కచ్చితంగా చోళాకు తెలియదు. ఆమెకు జనన ధృవీకరణ పత్రం లేదు.

వయసు, ఫంకీ స్టైల్, సంతోషం,మార్గరెట్ చోళా

ఫొటో సోర్స్, Luxury Media Zambia

ఫొటో క్యాప్షన్, తన వయసెంతో తనకు కచ్చితంగా తెలియదని మార్గరెట్ చోళా చెప్పారు

"ఈ వయసులో నేను ఇంత ప్రభావం చూపగలనని నేను ఊహించలేదు" అని చోళా అన్నారు.

60 సంవత్సరాల స్వాతంత్ర్యం సందర్భంగా జాంబియన్ జెండా రంగులలో తయారు చేసిన ఆకుపచ్చ అమెరికన్ ఫుట్‌బాల్ జెర్సీ, లేయర్డ్ ఫ్రిల్లీ రెడ్ డ్రెస్‌, స్కర్ట్‌తో స్టైల్‌గా తయారయ్యారు చోళా.

తనకు ఇష్టమైన జీన్స్, టీషర్ట్ వేసుకుని అందమైన విగ్ పెట్టుకుని ఉల్లాసంగా ఫొటోలకు పోజులిచ్చారు.

"నేను ఇంతకు ముందు జీన్స్, విగ్ ధరించలేదు కాబట్టి నేను ఇప్పుడు సంతోషంగా ఉన్నాను. డ్యాన్స్ కూడా చేస్తున్నాను" అన్నారు చోళా.

“మా నానమ్మకు ధైర్యం చాలా ఎక్కువ. ఏ లుక్‌లో అయినా అద్భుతంగా కనిపిస్తారు” అని 2012 నుంచి స్టైలిస్ట్‌గా ఉన్న డియానా అన్నారు.

ఒక సినిమాలో చోళా ఒక మేకతో కనిపిస్తారు. అందులో ఆమెకు ఎంతో ఇష్టమైన ముత్యాలతో మేకను అలంకరించారు.

మేక, ముత్యాలు

ఫొటో సోర్స్, Luxury Media Zambia

అనేక రకాల ఆభరణాలతో చోళా ఫొటోలు దిగారు.

“కొన్ని ఫోటోలలో, నానమ్మ రోజంతా తనతో ఉండే రేడియోను పట్టుకుని కనిపిస్తుంది. లేదా రోకలి పట్టుకుని దంచుతూ ఉంటుంది” అని చోళా మనవరాలు అన్నారు.

రోలు, రోకలి, టోపి, కుర్చీ

ఫొటో సోర్స్, Kooma Jnr

గ్రానీ సిరీస్ మరింత మంది వృద్ధులకు అవకాశాలు తెచ్చిపెడుతుందని డియానా ఆశిస్తున్నారు. జ్ఞాపకాలను మూటకట్టుకోవడం కూడా భవిష్యత్ తరాలకు దారిచూపిస్తుందని అన్నారు.

" చివరి వరకు వారిని అలాగే ప్రేమించండి ఎందుకంటే మనం కూడా ఏదో ఒక రోజు వారిలాగే ఉంటామని గుర్తుంచుకోండి." అని ఆమె చెప్పారు.

మా నానమ్మ ఫోటో షూట్‌లు చూసి, నలుగురు మనవరాళ్లు తమ నానమ్మలను స్టైల్‌గా మార్చమని నన్ను అడిగారు. వారి వయసు 70-96 మధ్య ఉంటుంది అని ఆమె చెప్పారు.

ముత్యాలు, కళ్లద్దాలు

ఫొటో సోర్స్, Luxury Media Zambia

సమాజం ఏమంటుందో అని ఆలోచిస్తూ కూర్చోకుండా బతకడానికి, సంతోషంగా ఉండడానికి గ్రానీ సిరీస్ ఉపయోగపడుతుందని చోళా ఆశిస్తున్నారు.

"మీరు చేసిన తప్పులకు మిమ్మల్ని మీరు క్షమించుకోండి. ఎందుకంటే గతాన్ని ఎప్పటికీ మార్చలేరు - కానీ మీ భవిష్యత్తును మార్చగలరు" అని ఆమె చెప్పారు.

ఫోటో షూట్‌లు మనవరాలు, నానమ్మ మధ్య మరింత దృఢమైన బంధం ఏర్పడేలా చేశాయి. కష్టతరమైన పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో తన నానమ్మ నుంచి నేర్చుకున్నారు డియానా.

సమాజం, సంతోషం, క్షమాపణ

ఫొటో సోర్స్, Luxury Media Zambia

ఫొటో క్యాప్షన్, మార్గరెట్ చోళ 12 ఏళ్ల వయసులో చదువు ఆపేశారు

చోళా తన తాతయ్యల వద్ద పెరిగారు. ఆమె 12 ఏళ్ల వరకూ పాఠశాలకు వెళ్లారు. తరువాత ఆర్థిక కారణాల వల్ల చదువు ఆపేశారు. అప్పుడు చోళాను 30 సంవత్సరాల వయసున్న వ్యక్తికిచ్చి పెళ్లి చేశారు.

బొగ్గుల కుంపటి

ఫొటో సోర్స్, Luxury Media Zambia

ఫొటో క్యాప్షన్, బొగ్గుల కుంపటితో బామ్మ

ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత భర్త ఆమెను వదిలేశారు.

ఆ గాయం ఇప్పటికీ ఆమెను వెంటాడుతూనే ఉంది. కానీ ఊహించని ప్రపంచ ఖ్యాతి ఆమెకు కొత్త జీవితాన్ని ఇచ్చింది.

"ప్రపంచంలోని ప్రజలు నన్ను చూడటానికి ఇష్టపడతారని తెలుసుకోవడం వల్ల నేను ఇప్పుడు ఒక కర్తవ్యంతో మేల్కొనగలుగుతున్నాను" అని చోళ చెప్పారు.

లెజెండరీ గ్లామా

ఫొటో సోర్స్, Kooma Jnr

ఫొటో క్యాప్షన్, "లెజెండరీ గ్లామా" స్టైల్‌కి, ఇన్‌స్టాగ్రామ్ లైక్‌లు సంపాదించడానికి వయసు అడ్డంకి కాదని నిరూపించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)