వరల్డ్ డయాబెటిస్ డే: ఇన్సులిన్‌ కనుగొని వందేళ్లయినా అందరికీ ఎందుకు అందుబాటులో లేదు?

డయాబెటిస్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, శారద.వి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

సుమతి(పేరు మార్చాం) యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో టీచర్‌గా పనిచేసేవారు.

ఆమె ఇద్దరు కూతుర్లకు మధుమేహం బయటపడటంతో, సుమతి అక్కడ ఉద్యోగం వదిలేసి, భారత్‌కు వచ్చేశారు.

ఆమె పిల్లలిద్దరికీ టైప్ 1 డయాబెటిస్ నిర్ధరణ అయింది. ఈ డయాబెటిస్‌కు ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకోవాలి.

కేవలం ఇన్సులిన్ ఇంజెక్షన్ల కోసమే ప్రతినెలా రూ.20 వేల వరకు ఖర్చు చేయాల్సి వచ్చేది. మిగతా ఖర్చులు అదనం.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొంత సాయం చేస్తున్నప్పటికీ, ఇన్సులిన్ అవసరమయ్యే చాలా భారతీయ కుటుంబాలు ఇలాగే ఇబ్బంది పడుతున్నాయి.

డయాబెటిస్‌నే షుగర్ వ్యాధి, మధుమేహం అని కూడా అంటారు.

రక్తంలోని చక్కెరల (గ్లూకోజ్)ను శరీరం ప్రాసెస్ చేయలేనప్పుడు డయాబెటిస్ వస్తుంది.

దీనివల్ల గుండెపోటు, పక్షవాతం, చూపు కోల్పోవడం, మూత్రపిండాల వైఫల్యం వంటివి ఏర్పడే ప్రమాదం ఉంటుంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

సుమతి వయసు 54 ఏళ్లు. ఆమె కూతుళ్లు ఇద్దరూ చదువుకుంటున్నారు. భర్త యూఏఈలో ఫోటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.

‘‘పని ఉన్నప్పుడు, ఆదాయం ఉండేది. కరోనా సమయంలో మేం చాలా ఇబ్బందులు పడ్డాం. తిండి ఖర్చులను కూడా తగ్గించేసుకుని, ఇన్సులిన్‌ను కొన్నాం’’ అని సుమతి చెప్పారు.

సుమతి పెద్ద కూతురికి 21 ఏళ్లు. ఎనిమిదేళ్ల కిందటే ఆమెకు టైప్ 1 డయాబెటిస్ నిర్ధరణ అయింది. మరో కూతురికి కూడా డయాబెటిస్ బయటపడి ఆరేళ్లు అవుతుంది.

ఈ ఇద్దరు రోజులో నాలుగుసార్లు షార్ట్ యాక్టింగ్ ఇన్సులిన్‌ను, రాత్రిపూట ఒకసారి లాంగ్ యాక్టింగ్ ఇన్సులిన్‌ను తీసుకోవాలి.

‘‘షుగర్ లెవెల్స్‌ను చెక్ చేసే స్ట్రిప్ ధర 10 రూపాయలు. రోజులో నాలుగుసార్లు దీన్ని వాడాల్సిన అవసరం ఉంటుంది. దానికోసం 100 చిన్న సూదులను వెయ్యి రూపాయలకు కొనాలి. జీఎస్టీతో కలుపుకుని, 100 ఇంజెక్షన్ల ఇన్సులిన్ ధర రూ.1,700. ఒక సూదిని నాలుగు సార్లు వాడుకోవచ్చు. ఇన్సులిన్‌ను ఎక్కించే పెన్ లాంటి డివైజ్ ధర రూ.1500. ఇది ఎక్కువ కాలమే పనిచేస్తుంది. ఇలా ఇద్దరి కోసం రోజుకు రూ.450 నుంచి రూ.500 వరకు ఖర్చవుతుంది’’ అని సుమతి వివరించారు.

డయాబెటిస్ పేషెంట్

భారత్‌లో మధుమేహం

శరీరంలో తక్కువ ఇన్సులిన్ ఉన్నప్పుడు, బయట నుంచి శరీరంలోకి కృత్రిమంగా దీన్ని ఎక్కించాలి. సర్ ఫ్రెడరిక్ బాంటింగ్ కనుగొన్న ఈ ఇన్సులిన్ మందుతో కోట్లమందికి చికిత్స జరుగుతోంది. అందుకే, ఆయన పుట్టినరోజు సందర్భంగా నవంబర్ 14న వరల్డ్ డయాబెటిస్ డే( ప్రపంచ మధుమేహ దినం)గా పాటిస్తున్నారు.

అయితే, ఇన్సులిన్‌ను ఆయన కనుగొని 100 ఏళ్లకు పైగా అవుతున్నప్పటికీ, ఇంకా అది అందరికీ అందుబాటులో ఉండటం లేదని ఒక అధ్యయనంలో తేలింది.

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ 2023లో నిర్వహించిన అధ్యయనం ప్రకారం, భారత్‌లో డయాబెటిస్‌తో 10.1 కోట్ల మంది బాధపడుతున్నారు. వారిలో టైప్-1, టైప్-2 డయాబెటిస్ ఉన్న వారున్నారు.

టైప్ 1 డయాబెటిస్ ఉన్న రోగులు జీవితాంతం ఇన్సులిన్ తీసుకోవాల్సిందే.

భారత్‌లో డయాబెటిస్ చికిత్స వల్ల రోగులపై ఎంత ఆర్థిక భారం పడుతుందనే విషయంపై దిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీకి చెందిన మెహక్ నందా, హరియాణాలోని కురుక్షేత్ర ఎన్ఐటీకి చెందిన రాజేశ్ శర్మలు 2018లో ఒక అధ్యయనం చేపట్టారు.

భారత్‌లో డయాబెటిస్‌తో బాధపడుతున్న 38 శాతం కుటుంబాలు విపరీతమైన ఖర్చులను భరిస్తున్నాయని వారి రిపోర్ట్ పేర్కొంది.

10 శాతం కుటుంబాలు ఆ కారణంగా దారిద్య్రరేఖ దిగువకు కూరుకుపోయాయని రిపోర్టులో పేర్కొన్నారు.

ఔషధాలపై గణనీయమైన మొత్తాలను ఖర్చు చేస్తున్నట్లు ఆ అధ్యయనంలో ప్రస్తావించారు.

గ్రామాల్లో, వెనుకబడిన వర్గాల ప్రజలకు మధుమేహం వల్ల ఆర్థిక భారం విపరీతంగా పెరుగుతోందని వారి అధ్యయనం పేర్కొంది.

మానవ శరీరం

ఫొటో సోర్స్, Getty Images

ఇన్సులిన్ అందరికి అందుబాటులో ఉంటుందా?

డయాబెటిస్ కేర్ గురించి బీబీసీతో మాట్లాడిన చాలా మంది ఇన్సులిన్ అందుబాటులో సమస్యలున్నట్లు చెప్పారు.

కార్తిక్, ఆయన భార్య లీలావతి తమిళనాడులోని నీలగిరి జిల్లా కున్నూర్‌‌లో ఉంటారు. వారి కూతురికి ఐదేళ్ల వయసున్నప్పుడు టైప్ 1 డయాబెటిస్ వచ్చింది.

ఇన్సులిన్ కోసం అప్పులు చేయాల్సి వచ్చిందని లీలావతి చెప్పారు.

‘‘ మేం తినకపోయినా కూతురు కోసం ఇన్సులిన్ కొనాలి. దాని ధర నెలకు రూ.10 వేల నుంచి రూ.15 వేల మధ్యలో ఉంటుంది. మాకు అది చాలా పెద్ద మొత్తం. డబ్బులు లేకపోవడంతో, మేం మా పాపకు రేషన్ బియ్యమే పెట్టాల్సి వచ్చేది. కూరగాయలు, పండ్లు కొనేందుకు కూడా మా దగ్గర డబ్బులు ఉండటం లేదు’’ అని లీలావతి చెప్పారు.

‘‘ఇన్సులిన్ వాడేందుకు పెద్ద సూదులు కావాలి. తొలి మూడేళ్లు మేం వాటిని వాడాం. కానీ, పాపకు బాగా నొప్పి వచ్చి, ఏడ్చేది. ప్రస్తుతం, ఆమె కోసం ఇన్సులిన్ పెన్‌ను కొనాలి. సూది సైజు చాలా చిన్నగా ఉంటుంది. కానీ, దాని ధర సుమారు రూ.3 వేల వరకు ఉంది. ఇలాంటివి ప్రభుత్వ ఆస్పత్రిలో దొరికితే బాగుంటుంది.’’ అని లీలావతి అన్నారు.

శ్రీధర్ రాజ్‌మోహన్

ఫొటో సోర్స్, Sridhar Rajmohan

ఫొటో క్యాప్షన్, శ్రీధర్ రాజ్‌మోహన్

తమిళనాడు టైప్ 1 డయాబెటిస్ ఫౌండేషన్ అనే చారిటీ సాయంతో గత ఆరు నెలలుగా తమ కూతురికి ఇన్సులిన్ అందుతున్నట్లు లీలావతి చెప్పారు.

‘‘ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుబాటులో ఉండే హ్యూమన్ ఇన్సులిన్‌‌, శరీరంలోకి ఎక్కించిన 45 నిమిషాల తర్వాత పనిచేయడం ప్రారంభిస్తుంది. కానీ, మార్కెట్లో దొరికే అనలాగ్స్‌ అనే ఇన్సులిన్లు, శరీరంలోకి ఎక్కించిన ఐదు నిమిషాల్లోనే పని మొదలుపెడతాయి. మా చారిటీ ద్వారా నెలకు 60 నుంచి 100 మంది పిల్లలకు ఉచితంగా ఇన్సులిన్ అందిస్తున్నాం.’’ అని తమిళనాడు టైప్ 1 డయాబెటిస్ ఫౌండేషన్‌ సభ్యుడు శ్రీధర్ రాజ్‌మోహన్ చెప్పారు.

‘‘ఆరోగ్యం రాష్ట్ర జాబితాలో ఉండటంతో, ఇన్సులిన్ అందుబాటు అనేది తక్కువ ఖర్చుకు ఇవ్వాలా లేక ఉచితంగా ఇవ్వాలా అనేది రాష్ట్రాలను బట్టి మారుతూ ఉంటుంది.’’ అని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆర్‌వీ అశోకన్ తెలిపారు.

ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆర్‌వీ అశోకన్

ఫొటో సోర్స్, Dr RV Asokan

ఫొటో క్యాప్షన్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆర్‌వీ అశోకన్

ఉత్తర, తూర్పు భారతంతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లోనే డయాబెటిస్ కేసులు ఎక్కువ. పశ్చిమంలో మహారాష్ట్రలో కూడా ఈ కేసులు పెరుగుతున్నాయి.

డయాబెటిస్ కేసులు ఎక్కువగా ఉన్న కేరళ, తమిళనాడు ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వాలే ఇన్సులిన్‌ను అందిస్తున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో వైద్య బృందాలు రోగుల ఇళ్లకు వెళ్లి, ఇన్సులిన్‌ను ఇస్తున్నాయి.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా ఇన్సులిన్‌ను అందిస్తున్నట్లు చెన్నైలోని రాజీవ్ గాంధీ గవర్నమెంట్ హాస్పిటల్‌లో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డయాబెటిస్ సంస్థ డైరెక్టర్‌గా పని చేస్తున్న డాక్టర్ ధర్మరాజన్ చెప్పారు.

‘‘రోగులకు పరీక్షలు చేసి, అవసరమైన మొత్తంలో ఇన్సులిన్ ఇస్తున్నాం. ఇన్సులిన్ బాటిల్స్‌తోపాటు, పెన్‌లను కూడా కొందరు రోగులకు అందిస్తున్నాం. గత ఏడాది టైప్ 1 డయాబెటిస్‌ ఉన్న నలుగురు పేద పిల్లలకు ఉచిత ఇన్సులిన్ పంప్‌లు అందించాం’’ అని ధర్మరాజన్ తెలిపారు.

ఇన్సులిన్ పంప్ అనేది చేతికి కట్టుకునే, లేదా నడుముకు అమర్చుకునే ఒక డివైజ్. అది ఎప్పటికప్పుడు శరీరంలోని ఇన్సులిన్‌ పరిమాణాన్ని అంచనావేస్తూ ఆటోమేటిక్‌గా ఇన్సులిన్‌ను శరీరంలోకి పంప్ చేస్తుంటుంది.

డాక్టర్ ధర్మరాజన్

ఫొటో సోర్స్, Dr Dharmarajan

ఫొటో క్యాప్షన్, డాక్టర్ ధర్మరాజన్

ఇన్సులిన్ మార్కెట్ సంగతేంటి?

లాన్సెట్ డయాబెటిస్ అండ్ ఎండోక్రినాలజీ జర్నల్‌లో 2016లో ప్రచురితమైన సమాచారం ప్రకారం, గ్లోబల్ ఇన్సులిన్ మార్కెట్ ఎక్కువగా మూడు మల్టి నేషనల్ కంపెనీల చేతిలోనే ఉంది.

మొత్తం మార్కెట్ విలువలో 99 శాతం వాటా ఎలి లిల్లీ, నోవో నార్డిస్క్, సనోఫి కంపెనీలదే.

ప్రస్తుతం భారత్‌లో పరిస్థితులు మారుతున్నాయని ఇండియన్ ఫార్మాస్యూటికల్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ విరంచీ షా చెప్పారు.

‘‘బయోకాన్, లుపిన్, మ్యాన్‌కైండ్ వంటి భారతీయ కంపెనీలు కూడా ఇన్సులిన్ ప్రొడక్షన్ మార్కెట్లో ఉన్నాయి. భారత కంపెనీల ఇన్సులిన్‌ను ప్రైమ్ మినిస్టర్ పీపుల్స్ ఫార్మసీలు అందిస్తున్నాయి’’ అని విరంచీ షా అన్నారు.

భారత్‌ డయాబెటిస్ డ్రగ్స్ మార్కెట్ విలువ రూ.22 వేల కోట్లు. దానిలో ఇన్సులిన్ డ్రగ్స్ వాల్యూ 20 శాతం అంటే దాదాపు రూ.4,400 కోట్లు.

‘ప్రపంచంలో ఇన్సులిన్ తక్కువకు దొరికే దేశాలలో భారత్ ఒకటి. పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్ వంటి ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోలిస్తే భారత్‌లో దీని ధర చాలా తక్కువ. దీన్ని ఎసెన్షియల్ మెడిసిన్ల జాబితాలో చేర్చి, ప్రభుత్వం ఈ మందు ధరను నియంత్రిస్తుంది.’’ అని విరంచీ షా చెప్పారు.

నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్ ద్వారా డయాబెటిస్‌ మందును కేంద్ర ప్రభుత్వమే అందిస్తోంది. దీని నుంచి రాష్ట్రాలు కూడా సాయం పొందుతున్నాయి.

మెడికల్ ఇన్సూరెన్స్ ప్లాన్లలో ఇన్సులిన్‌ను చేర్చాలని సుమతి అంటున్నారు.

‘‘నేను యూఏఈలో ఉన్నప్పుడు, ఇన్సూరెన్స్ స్కీమ్‌లో ఇన్సులిన్ కవర్ కావడం నాకు చాలా సాయం చేసింది. యూఎస్ఏ, కెనడా, యూకేలలో ఇన్సులిన్ పంప్‌లను పిల్లలకు ఉచితంగా ఇస్తున్నారు. ఇద్దరు పిల్లలకి ఈ పంప్ కొనేందుకు రూ.10 లక్షలు అవుతుంది. దీంతో పాటు, ప్రతి బిడ్డకు నెలకు రూ.30 వేలు అవుతుంది.’’ అని ఆమె చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)