డయాబెటిస్ బర్నవుట్ అంటే ఏంటి? దీనివల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి?

నవోమీ
ఫొటో క్యాప్షన్, టైప్ 1 డయాబెటిస్ వచ్చిందని తెలియగానే నవోమి ఆందోళనకు గురయ్యారు.
    • రచయిత, క్లైర్ కెండల్, జెరెమీ కూక్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

"ఇదొక ఫుల్ టైమ్ జాబ్‌లాంటిది..వదిలించుకోలేం. ఊహించని రీతిలో మన మీద పడిన పెద్ద భారం."

నవోమికి 19 ఏళ్ల వయసున్నప్పుడు టైప్ 1 డయాబెటిస్ ఉందని నిర్థరణ అయ్యింది.

"డయాబెటిస్ కారణంగా మానసికంగా, శారీరకంగా ఎదురవుతున్న సవాళ్లను ఇంక ఎంత మాత్రం ఎదుర్కోలేని పరిస్థితికి వచ్చేశానని" 33 ఏళ్ల నవోమి అంటున్నారు. ఈ పరిస్థితినే ‘డయాబెటిస్ బర్నవుట్’ అంటారు.

టైప్ 1 డయాబెటిస్‌లో శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తి ఆగిపోతుంది.

దీని వలన శరీరంలోని అవయవాలకు హాని కలగొచ్చు. కంటి చూపు సమస్యలు రావొచ్చు. తీవ్రమైన పరిస్థితుల్లో శరీరంలోని అంగాలు కుళ్ళిపోవచ్చు.

అయితే, చాలామందికి శారీరకమైన బాధలే కాకుండా, మానసికమైన సమస్యలు కూడా తలెత్తుతాయి. డయాబెటిస్ వచ్చిన తరువాత ఆహార పద్ధతులు, జీవన శైలి మార్చుకోవల్సి ఉంటుంది. క్రమం తప్పకుండా మందులు వేసుకుంటూ, పదే పదే రక్తంలోని చక్కెర స్థాయిలను పరీక్షించుకుంటూ ఉండాలి. దీనివలన మానసికమైన ఒత్తిడి ఎదుర్కొంటారు.

డయాబెటిస్ కలిగించే మానసిక ఒత్తిడిని తక్కువ అంచనా వెయ్యకూడదని డా. హెలెన్ పార్ట్రిడ్జ్ అంటున్నారు
ఫొటో క్యాప్షన్, డయాబెటిస్ కలిగించే మానసిక ఒత్తిడిని తక్కువ అంచనా వెయ్యకూడదని డా. హెలెన్ పార్ట్రిడ్జ్ అంటున్నారు

ఎంత మోతాదులో ఇన్సులిన్ ఇంజక్షన్ తీసుకోవాలో తెలుసుకోవడానికి రోజులో పలుమార్లు రక్తంలోని చక్కెర స్థాయిలను పరీక్షించుకోవాలి. ఈ ప్రక్రియతో విసుగెత్తిపోయానని నవోమి అంటున్నారు.

“ఇన్సులిన్ తీసుకోవడం ఆపేస్తే దీర్ఘకాలంలో తీవ్ర ఆరోగ్య సమస్యలొస్తాయని, ‘డయాబెటిక్ కీటోసిడిస్’ (డీకేఏ) వచ్చే అవకాశముందని, కోమాలోకి వెళ్లిపోయే పరిస్థితి రావొచ్చని తనకు తెలుసని, అయినా సరే రోజూ పదే పదే రక్త పరీక్షలు చేసుకుంటూ ఇన్సులిన్ తీసుకోవడం తనవల్ల కావట్లేదని” నవోమీ అంటున్నారు.

ఇన్సులిన్ ఆపేయగానే నవోమీ తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. ఆమెను ఆస్పత్రిలో చేర్చవలసి వచ్చింది.

"వీళ్లు తీవ్ర అనారోగ్యంతో ఉన్నారు. ఇన్సులిన్ తీసుకోకుండా జీవితాలను పణంగా పెడుతున్నారు. ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంది" అని నవోమికి చికిత్స చేస్తున్న డాక్టర్ కార్లా ఫిగెయిర్దో తనదగ్గరకొచ్చే డయాబెటిస్ పేషెంట్ల గురించి చెప్పారు.

"డయాబెటిస్ వలన కలిగే మానసిక ఒత్తిడిని తక్కువ అంచనా వెయ్యకూడదని" అని రాయల్ బౌర్న్‌మౌత్ హాస్పిటల్‌లో పనిచేస్తూ నవోమికి మానసిక చికిత్స అందిస్తున్న డా. హెలెన్ పార్ట్రిడ్జ్ తెలిపారు.

"దానితోనే మనం కలిసి జీవించాలి. దురదృష్టవశాత్తు అది మనల్ని వదిలి పోదు. దీనివలన మానసికంగా కలిగే ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది" అని డా. హెలెన్ అంటున్నారు.

ఇన్సులిన్

ఫొటో సోర్స్, Getty Images

మెరుగైన ఫలితాల కోసం ప్రయత్నం

టైప్ 1 డయాబెటిస్‌తో బాధపడుతున్నవారు ఎదుర్కొంటున్న మానసిక సమస్యలకు ఎలాంటి చికిత్స అందించాలనే అంశంలో..ఇంగ్లండ్‌లో నేషనల్ హెల్త్ సర్వే (ఎన్‌హెచ్ఎస్) నిర్వహిస్తున్న రెండు పైలట్ ప్రోజెక్టులలో ఒకదానిని ఈ ఆస్పత్రిలో నిర్వహిస్తున్నారు.

"డయాబెటిస్ రోగులకు శారీరక ఆరోగ్యం మాత్రమే కాకుండా మానసిక ఆరోగ్యం కూడా చేకూర్చే దిశలో ఎన్‌హెచ్ఎస్ గట్టి కృషి చేస్తోంది. అందుకోసం అవసరమైన దీర్ఘకాలిక ప్రణాళికలని సిద్ధం చేస్తోందని" ఎన్‌హెచ్ఎస్ ఇంగ్లండ్ డయాబెటిస్ హెడ్ పార్థా కర్ తెలిపారు.

"ఈ రెండు అంశాలనూ పరిష్కరించగలిగితే ఫలితాలు మెరుగ్గా ఉంటాయని" ఆయన అన్నారు.

"ఈ ఆస్పత్రికి రావడం నా అదృష్టం. వీరు నా ప్రాణాలను కాపాడారు. నాకు చికిత్సను అందించిన బృందానికి నేను ఎంతో ఋణపడి ఉంటాను" అని నవోమి తెలిపారు.

‘బ్రతుకును ఎన్నుకోవాలి’

పైలట్ స్కీం 70 మందికి పైగా నవోమిలాంటి రోగులకు చికిత్స అందించింది. ఇక్కడకు రాకపోతే వారి వ్యాధి నిర్థారణే అయ్యేది కాదని ఆ బృందం తెలిపింది.

నయోవోమి ఇప్పుడు మానసికంగా కూడా నిలదొక్కుకున్నారు. ఆమెకు భవిష్యత్తు ఆశావహంగా ఉంది.

"దీనికి పూర్తి చికిత్స లేకపోయినా, భవిష్యత్తు ఆశాజనకంగా ఉంది. చావు కన్నా బ్రతుకే మేలు అనుకోవాలి. బ్రతుకును ఎన్నుకోవడానికి ఇదొక అవకాశంగా భావించాలి" అని నవోమి అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)