డోనల్డ్ ట్రంప్: అధ్యక్ష పదవి నుంచి దిగిపోయాక ఏం చేస్తారు? రాజకీయాల్లో కొనసాగుతారా? మళ్లీ వ్యాపారం చేస్తారా?

ఫొటో సోర్స్, Film Magic via Getty Images
- రచయిత, జెస్సికా మర్ఫీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ పదవీకాలం వచ్చే జనవరి 20తో తీరిపోనుంది. అప్పుడు తనకు ఇష్టం ఉన్నా, లేకపోయినా దేశ పాలన పగ్గాలను తాజాగా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన డెమొక్రటిక్ పార్టీ నేత జో బైడన్‌కు అందించాల్సిందే.
అమెరికా 39వ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ పదవి నుంచి దిగిపోయాక స్వచ్ఛంద కార్యక్రమాల్లో మునిగిపోయారు. 43వ అధ్యక్షుడు జార్జ్ బుష్ కుంచె పట్టి, బొమ్మలు గీయడం మొదలుపెట్టారు.
అయితే, ట్రంప్ సంప్రదాయ రాజకీయ నేత కాదన్న విషయాన్ని మనం గమనించాలి.
అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ట్రంప్ సంప్రదాయాలకు విరుద్ధంగా ఎన్నో పనులు చేశారని నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీ ప్రొఫెసర్ టిమ్ కాల్కిన్స్ గుర్తు చేశారు. పదవి నుంచి దిగిపోయిన తర్వాత మునుపటి అధ్యక్షుల్లా ఆయన ప్రవర్తిస్తారని ఆశించలేమని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, The White House
మళ్లీ పోటీ చేయొచ్చు
ట్రంప్ రాజకీయ జీవితం ఇక్కడితో ముగిసందని భావించలేం. ఆయన మరోసారి అధ్యక్ష పదవి కోసం ఎన్నికల్లో పోటీ చేయొచ్చు.
అమెరికాలో అధ్యక్ష పదవి నుంచి దిగిపోయిన నేత, నాలుగేళ్ల తర్వాత మళ్లీ ఆ పదవిని అధిష్ఠించడం ఒకేసారి జరిగింది. గ్రోవర్ క్లీవ్‌ల్యాండ్ ఈ ఘనత సాధించారు. 1885లో మొదటిసారి, 1893లో రెండోసారి ఆయన అధ్యక్ష ఎన్నికల్లో గెలిచారు.
ట్రంప్ కూడా ఈ ఫీట్ సాధించాలని కోరుకోవచ్చు.
2024 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ పోటీపడే అవకాశాలున్నాయని తాను భావిస్తున్నానని మాజీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మిక్ మల్వనీ ఇటీవలే అన్నారు.
ఎన్నికల ప్రచార సభలు అంటే ట్రంప్‌కు చాలా ఇష్టం. తాజా ఎన్నికల్లో ట్రంప్‌కు 7.15 కోట్ల ఓట్లు పడ్డాయి. ఓడిపోయిన అభ్యర్థికి వచ్చిన ఓట్లలో ఇదే రికార్డు. అమెరికన్ ఓటర్లలో ఆయనకు ఇంకా చాలా మద్దతు ఉందన్నదానికి ఇది నిదర్శనం.
ట్రంప్ పెద్ద కొడుకు డోనల్డ్ ట్రంప్ జూనియర్ కూడా అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు ఆసక్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఫొటో సోర్స్, AFP via Getty
వ్యాపార సామ్రాజ్యంపై దృష్టి పెడతారా?
అధ్యక్ష పదవి చేపట్టకముందు ట్రంప్ పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారి, రియాల్టీ టీవీ స్టార్ కూడా.
అధ్యక్ష పదవి నుంచి దిగిపోయాక ఆయన మళ్లీ తన వ్యాపారాల విస్తరణపై దృష్టి పెట్టొచ్చు.
రాబోయే కొన్నేళ్లలో ట్రంప్ దాదాపు మూడు వేల కోట్ల రూపాయల మేర రుణాలు చెల్లించాల్సి ఉంటుందని న్యూయార్క్ టైమ్స్ పత్రిక కథనం ప్రచురించింది. అయితే, తన ఆస్తులతో పోల్చితే, ఇది చిన్న మొత్తమని ట్రంప్ అన్నారు.
ట్రంప్ కుటుంబ వ్యాపార సంస్థ ట్రంప్ ఆర్గనైజేషన్‌కు చాలా హోటళ్లు, గోల్ఫ్ కోర్సులు ఉన్నాయి.
ముంబయి, ఇస్తాంబుల్, ఫిలిప్పీన్స్‌ల్లోనూ ట్రంప్ బ్రాండ్‌తో కొన్ని వ్యాపారాలు నడుతుస్తున్నాయి. బ్రిటన్, దుబాయి, ఇండోనేసియాల్లోనూ గోల్ఫ్ కోర్సులు ఉన్నాయి.
తిరిగి వ్యాపారంపై దృష్టి సారిస్తే ట్రంప్‌కు చేతి నిండా పని ఉన్నట్లే.
ట్రంప్ వ్యాపారాలు ప్రధానంగా పర్యాటక, ఆతిథ్య రంగాల్లోనే ఉన్నాయి. కరోనావైరస్ సంక్షోభం ఈ రంగాలపై తీవ్ర ప్రభావం చూపింది.
కోవిడ్ కారణంగా ట్రంప్ సంపద 7,400 కోట్ల రూపాయల మేర తరిగిపోయి ఉండొచ్చని ఫోర్బ్స్ పత్రిక అంచనా వేసింది.
గత 15 ఏళ్లలో పదేళ్లు ట్రంప్ ఆదాయ పన్నులే కట్టలేదని, ఆదాయం కన్నా తనకు నష్టాలే ఎక్కువ వస్తున్నట్లు ఆయన చూపిస్తూ వచ్చారని న్యూయార్క్ టైమ్స్ పత్రిక రాసింది.

ఫొటో సోర్స్, Getty Images
అయితే, ట్రంప్, ఆయన సంస్థ ఈ వార్తలను తోసిపుచ్చారు.
''ట్రంప్ బ్రాండ్ గురించి ఎప్పుడూ చర్చ జరిగేలా ట్రంప్ చూసుకుంటూ వస్తున్నారు. ట్రంప్ బ్రాండ్ ఇప్పటికీ చాలా బలంగా ఉంది. కానీ, ఆయన పాలన ప్రభావం దానిపై ఉంది. ఆ బ్రాండ్ విషయంలో జనాల్లో తీవ్ర స్థాయిలో విభజన వచ్చింది. వ్యాపార బ్రాండ్లకు ఇది మంచిది కాదు. ఇప్పుడు మీరు మీ వివాహ వేదికగా ట్రంప్ హోటల్‌ను ఎంచుకున్నారంటే, ఓ రకంగా మీరొక రాజకీయ అభిప్రాయాన్ని చెబుతున్నట్లే. ట్రంప్ అధ్యక్షుడు కాకముందు పరిస్థితి అలా ఉండేది కాదు'' అని ప్రొఫెసర్ టిమ్ కాల్కిన్స్ అన్నారు.
ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ వైట్ హౌజ్‌లో సీనియర్ సలహాదారు పదవిని స్వీకరించాక ఆమె తన పేరుతోనే నడిపిస్తున్న బ్రాండ్ బాగా దెబ్బతింది. ఆ బ్రాండ్ ఉత్పత్తులను బహిష్కరించాలన్న పిలుపులు వచ్చాయి. చాలా రిటైల్ సంస్థలు ఆ ఉత్పత్తులను అమ్మకానికి పెట్టడం ఆపేశాయి.
ట్రంప్ కొడుకులు ఎరిక్, డొనాల్డ్ జూనియర్ ఇప్పటిరకూ ట్రంప్ ఆర్గనైజేషన్ నిర్వహణను చూస్తు ఉన్నారు. ఇటు తండ్రి రాజకీయ కెరీర్ విషయంలోనూ వారు కీలక పాత్ర పోషిస్తున్నారు.
ట్రంప్ ఇప్పుడు ఎలా మందుకు వెళ్తే తమ కుటుంబానికి మంచిదని వాళ్లు ఇప్పుడు ఆలోచిస్తూ ఉండవచ్చని ప్రొఫెసర్ కాల్కిన్స్ అన్నారు.
వార్తా చానల్ మొదలుపెడతారా?
ట్రంప్‌కు టీవీ రంగం కొత్త కాదు. గతంలో 'ద అప్రెంటిస్' అనే రియాల్టీ షోకు ఆయన వ్యాఖ్యాతగా ఉన్నారు.
వార్తా ఛానెళ్ల రంగంపై ట్రంప్ ఆసక్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. సొంతంగా గానీ, ఇప్పటికే ఉన్న టీవీ నెట్‌వర్క్‌తో చేతులు కలిపి గానీ ఆయన టీవీ ఛానెల్‌ను ప్రారంభిస్తారన్న చర్చలు జరుగుతున్నాయి.
''ట్రంప్ టీవీకి కచ్చితంగా వీక్షకులు ఉంటారు. కార్డాషియన్స్ తరహాలోనే ట్రంప్ కూడా 'తిట్టుకుంటూనే జనం చూసే' ఇమేజ్ సంపాదించుకున్నారు. వివాదాలను ఆయన అవకాశాలుగా మలుచుకుంటారు. అదే ట్రంప్ పద్ధతి'' అని క్యూ స్కోర్స్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ హెన్నీ షాఫర్ అభిప్రాయపడ్డారు.
వన్ అమెరికన్ న్యూస్ నెట్‌వర్క్ (ఓఏఎన్ఎన్), న్యూస్ మ్యాక్స్ కేబుల్ నెట్‌వర్క్‌లతో ట్రంప్ చేతులు కలిపే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ రెండు సంస్థలతో ట్రంప్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు కొన్ని పత్రికల్లో కథనాలు వచ్చాయి.
టీవీ ఛానెళ్లు కాకుండా మీడియా, వినోద రంగాల్లోనే ఇతర కార్యక్రమాలపైనా ట్రంప్ దృష్టి పెట్టవచ్చు.
అమెరికాలో మాజీ అధ్యక్షులు రాసిన పుస్తకాలకూ మంచి డిమాండ్ ఉంటుంది.
మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన భార్య మిషెల్ ఒబామా కలిసి పుస్తకాలు రాసేందుకు సుమారు 483 కోట్ల రూపాయలకు ఓ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. పుస్తక ఒప్పందాలకు ఇంత మొత్తం రావడం అరుదే. జార్జ్ బుష్ ఆత్మకథ పుస్తక హక్కుల కోసం 74 కోట్ల రూపాయల అడ్వాన్సు అందుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి.
నెట్‌ఫ్లిక్స్‌తోనూ ఒబామా దంపతులు ఓ భారీ ఒప్పదం చేసుకున్నారు. క్లింటన్ దంపతులు కూడా పాడ్‌కాస్ట్ సేవల ఒప్పందాలు చేసుకున్నారు.

ఫొటో సోర్స్, Los Angeles Times via Getty Images
విశ్రాంతి తీసుకుంటారా?
అధ్యక్ష పదవి దిగిపోయాక కూడా ట్రంప్‌కు కొన్ని సదుపాయాలు ఉంటాయి.
ఆయనకు ఏటా 1.5 కోట్ల రూపాయల పెన్షన్ అందుతుంది. జీవిత కాలం సీక్రెట్ సర్వీస్ భద్రత కల్పిస్తుంది. వైద్య సదుపాయాలు, ప్రయాణ ఖర్చులు, సిబ్బందికి అయ్యే వ్యయం కూడా ప్రభుత్వమే భరిస్తుంది.
తనకు ఉన్న సంపదతోపాటు ఇవన్నీ చాలు అనుకుని ట్రంప్ విశ్రాంతి కూడా తీసుకోవచ్చు.
ఏవైనా సేవా కార్యక్రమాలు చేపట్టొచ్చు.
ఫ్లోరిడాలోని తన పామ్ బీచ్ రిసార్టులో గోల్ఫ్ ఆడుతూ సేద తీరొచ్చు.
''ట్రంప్‌కు లైమ్ లైట్‌తో బతకడం ఇష్టం. ఆయన ఇలా ప్రశాంత జీవితం గడుపుతారని నేనైతే అనుకోను. ట్రంప్ బ్రాండ్‌ను మనం ఇంకా చూస్తాం అనుకుంటా'' అని ప్రొఫెసర్ కాల్కిన్స్ అన్నారు.
ఇక గత అక్టోబర్‌లో ఎన్నికల ప్రచారం సందర్భంగా ట్రంప్ చెప్పిన ఓ మాట కూడా మనం గుర్తుచేసుకోవాలి.
''అమెరికా అధ్యక్ష ఎన్నికల చరిత్రలోనే పరమచెత్త అభ్యర్థి బైడెన్. ఆయనతో పోటీ పడుతున్నందుకు నాపై ఎంత ఒత్తిడి ఉంటుందో మీకు తెలుసా? ఒకవేళ ఓడిపోతే, జీవితమంతా నేను ఏం చేయాలి? చరిత్రలోనే చెత్త అభ్యర్థిపై ఓడిపోయానన్న అవమానంతో దేశాన్ని విడిచివెళ్లాలేమో?'' అని ట్రంప్ అప్పుడు అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ‘పోర్న్ చూసి నాపై నాకే అసహ్యం వేసింది.. యోగా, ధ్యానంతో బయటపడ్డా’
- నంద్యాల ఆటో డ్రైవర్ అబ్దుల్ సలాం కుటుంబం అంతా ఎందుకు ఆత్మహత్య చేసుకుంది?
- వ్యాపారం కోసం వచ్చి ఇండియాలో మారణహోమం సాగించిన కంపెనీ కథ
- తలలోకి పేలు ఎలా వస్తాయి? ఎందుకు వస్తాయి?
- ప్రపంచంలో విదేశాలపై ఆధారపడని ఏకైక ‘దేశం’ ఇదేనా?
- కరోనావైరస్ నుంచి 90 శాతం రక్షణ కల్పించే తొలి వ్యాక్సీన్ ఇదే
- ‘దూదేకుల’ వివాదం ఏపీ హైకోర్టుకు ఎందుకు చేరింది
- ‘నేను బెంగాలీ.. నా బాయ్ ఫ్రెండ్ నల్ల జాతీయుడు - మా అమ్మ ఏం చేసిందంటే..’
- భారత్-చైనా ఉద్రిక్తతలు: భారత్ ఎందుకు వరుసగా క్షిపణి పరీక్షలు చేపడుతోంది?
- మహిళల శరీరాలు ఎప్పుడంటే అప్పుడు సెక్స్‌కు సిద్ధంగా ఉంటాయా?
- ఇల్లు, ఫర్నీచర్ అమ్మేసి ఓ వ్యాన్ కొనుక్కున్నారు... ఇప్పుడు ఆ వ్యానే వారి ఇల్లు
- కఠినమైన సవాళ్ల నడుమ ‘కమలం’ ఎలా వికసించింది
- రాయల్ ఎన్ఫీల్డ్: ఆసియాలో విస్తరిస్తున్న భారత మోటార్ సైకిల్ బుల్లెట్ అమ్మకాలు
- టైటానిక్ ప్రమాదంలో 700 మంది ప్రాణాలను ఆ రేడియో ఎలా కాపాడిందంటే...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








