'జో బైడెన్ నాకు అయిదు సార్లు ప్రపోజ్ చేశారు' - అమెరికా ప్రథమ మహిళ కాబోతున్న జిల్

జిల్ బైడెన్

ఫొటో సోర్స్, EPA

1990ల్లో దాదాపు ఖాళీగా ఉండే తరగతుల్లో ఇంగ్లిష్ పాఠాలు బోధించే జిల్ బైడెన్.. తన భర్త అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత జరిగిన తొలి డెమొక్రటిక్ పార్టీ సమావేశంలో అందరికీ గుర్తుండిపోయే ప్రసంగం చేశారు.

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌కు మొదట్నుంచీ ఆమె వెన్నంటే నిలబడ్డారు. ఆమెకు ప్రథమ మహిళకు కావాల్సిన అన్ని అర్హతలూ ఉన్నాయని బైడెన్ ప్రశంసలు కూడా కురిపించారు.

‘‘మీపై మీకు నమ్మకం కలిగేలా ఆత్మవిశ్వాసం నూరిపోసే టీచర్ గురించి ఒకసారి ఆలోచించండి. ప్రథమ మహిళ అంటే అలానే ఉండాలి. అందరిలోనూ ఆత్మవిశ్వాసాన్ని నింపాలి. ఆమే.. జిల్ బైడెన్’’అంటూ బైడెన్ ప్రశంసించారు.

శ్వేత సౌధంలో జో బైడెన్‌తో కలిసి జీవించబోయే ఆమె గురించి మనకు ఇంకా ఏం తెలుసు?

జిల్ బైడెన్

ఫొటో సోర్స్, Getty Images

జిల్ అసలు పేరు జిల్ జాకబ్స్. ఆమె న్యూజెర్సీలో 1951లో జన్మించారు. ఆమెకు నలుగురు చెల్లెల్లు ఉన్నారు. వీరంతా ఫిలడెల్ఫియా శివార్లలోని విల్లో గ్రోవ్‌లో పెరిగారు.

బైడెన్ కంటే ముందు కాలేజీ ఫుట్‌బాల్ ప్లేయర్ బిల్ స్టీవెన్‌సన్‌ను జిల్ పెళ్లి చేసుకున్నారు.

1972లో చోటుచేసుకున్న కారు ప్రమాదంలో తన ఏడాది కుమార్తె, భార్యను జో బైడెన్ పోగొట్టుకున్నారు. ఆయన కుమారులు బ్యూ, హంటర్ మాత్రం ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆ తర్వాత మూడేళ్లకు తన సోదరుడి సాయంతో బైడెన్‌కు జిల్ పరిచయం అయ్యారు.

అప్పటికే ఆయన సెనేటర్. జిల్ మాత్రం ఇంకా కాలేజీలో చదువుకుంటున్నారు.

‘‘జీన్స్, టీ షర్ట్స్ వేసుకునే అబ్బాయిలతో నేను డేట్లకు వెళ్లేదాన్ని. ఒకసారి బైడెన్ మా ఇంటికి వచ్చారు. ఆయన స్పోర్ట్స్ కోట్, లోఫర్స్ వేసుకున్నారు. వెంటనే ఆయన నాకు సరిపడరని అనుకున్నాను. లక్ష ఏళ్లు అయినా... ఆయనతో నాకు పొసగదని అనుకున్నాను’’అని జిల్ వివరించారు.

‘‘ఆయన నా కంటే తొమ్మిదేళ్లు పెద్ద. అయితే, ఫిలడెల్ఫియాలోని ఓ జంటను చూడటానికి మేం కలిసి వెళ్లాం. అప్పుడు చాలా సరదాగా అనిపించింది’’అని వోగ్ మ్యాగజైన్‌కు తన మొదటి డేట్ గురించి జిల్ వివరించారు.

తన ప్రేమను అంగీకరించే ముందు, తనకు ఐదు సార్లు బైడెన్ ప్రపోజ్ చేశారని జిల్ చెప్పారు.

‘‘వారికి (బైడెన్ పిల్లలకు) మరో తల్లిని దూరం చేయాలని అనుకోలేదు. అందుకే ఒకటికి పది సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకున్నా’’అంటూ ఆమె వివరించారు.

1977లో న్యూయార్క్‌లో వీరు పెళ్లి చేసుకున్నారు. వీరి కుమార్తె ఆష్లీ 1981లో జన్మించారు.

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యే సమయంలో తను, తన కుటుంబం ఎదుర్కొన్న సవాళ్లపైనా జిల్ బైడన్ మాట్లాడారు.

2015లో బైడెన్ కుమారుడు బ్యూ బైడన్(46) క్యాన్సర్‌తో మరణించారు.

‘‘బైడెన్‌.. ఈ దేశానికి ఆయన ఎంతో సేవ చేస్తారు. మా కుటుంబానికి ఆయన ఎంత మేలు చేశారో.. మీ కుటుంబాలకు ఆయన అంతే మేలు చేస్తారు. అందరినీ కలుపుకుంటూ ముందుకు పోతారు. అమెరికా అందరిదీ అనే కల నెరవేరుస్తారు’’అని ఆమె చెప్పారు.

జిల్ బైడెన్

ఫొటో సోర్స్, Getty Images

టీచర్‌గా...

69ఏళ్ల జిల్‌కు దశాబ్దాల తరబడి టీచర్‌గా పనిచేసిన అనుభవముంది.

ఆమెకు ఒక బ్యాచిలర్ డిగ్రీతోపాటు రెండు మాస్టర్ డిగ్రీలు ఉన్నాయి. మరోవైపు 2007లో డెలావేర్ యూనివర్సిటీ నుంచి ఆమె డాక్టరేట్‌ కూడా పొందారు.

వాషింగ్టన్ డీసీకి వచ్చే ముందు ఒక కమ్యూనిటీ కాలేజీ, పబ్లిక్ స్కూల్‌లో పనిచేశారు. 1991 నుంచి 1993 వరకు ఇంగ్లీష్ పాఠాలు చెప్పిన డెలావేర్‌లోని బ్రాండ్‌వైన్ హైస్కూల్ తరగతి నుంచే.. ఆమె డెమొక్రటిక్ పార్టీ సమావేశాలను ఉద్దేశించి ప్రసంగించారు.

జో బైడెన్ అమెరికా ఉపాధ్యక్షుడిగా పనిచేసిన సమయంలో.. నార్తెర్న్ వర్జీనియా కమ్యూనిటీ కాలేజీలో ఇంగ్లిష్ ప్రొఫెసర్‌గా జిల్ పనిచేశారు.

‘‘పాఠాలు చెప్పడం నా వృత్తి కాదు. నేను దాన్ని నాలో భాగం చేసుకున్నాను’’అంటూ గత ఆగస్టులో ఆమె ట్వీట్ చేశారు.

జిల్ బైడెన్

ఫొటో సోర్స్, Getty Images

రాజకీయాల్లోనూ...

2009 నుంచి 2017 మధ్య జో బైడెన్.. అమెరికా ఉపాధ్యక్షుడిగా పనిచేసిన సమయంలో అమెరికా ద్వితీయ మహిళగా జిల్ బైడెన్ కొనసాగారు.

ఆ సమయంలో కమ్యూనిటీ కాలేజీల్లో పనిచేయడంతోపాటు క్యాన్సర్‌పై ప్రజల్లో అవగాహన కల్పించడం, సైనిక కుటుంబాలకు సాయం అందించడం లాంటి పనులను ఆమె కొనసాగించారు.

అప్పటి ప్రథమ మహిళ మిషెల్ ఒబామాతో కలిసి ‘‘జాయినింగ్ ఫోర్సిస్’’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మాజీ సైనికులకు సాయం చేయడం, వారి కుటుంబాలకు విద్యా, ఉపాధిని కల్పించడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం.

2012లో పిల్లల కోసం ‘‘డోంట్ ఫర్‌గెట్, గాడ్ బ్లెస్ అవర్ ట్రూప్స్’’అనే పుస్తకాన్ని ఆమె ప్రచురించారు. సైనిక కుటుంబంతో తన మనవరాలి అనుభవాలను దీనిలో పంచుకున్నారు.

2020 ఎన్నికల ప్రచారంలో జో బైడెన్‌కు మొదట్నుంచీ గట్టి మద్దతును జిల్ అదించారు. నిధుల సమీకరణ కార్యక్రమాలతోపాటు ప్రచారంలో బైడెన్ పక్కన ఆమె కనిపించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)