జో బైడెన్: అమెరికా కొత్త అధ్యక్షుడు

వీడియో క్యాప్షన్, జో బైడెన్: అమెరికా కొత్త అధ్యక్షుడు

అమెరికా తర్వాత అధ్యక్షుడి కోసం జరిగిన రేసులో జో బైడెన్ గెలిచారు.

పెన్సిల్వేనియా ఫలితాలతో బైడెన్ విజయం ఖరారైపోయింది. ఎన్నికల్లో ఆయన ప్రస్తుత అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌ను ఓడించారు.

బైడెన్ బాటిల్ గ్రౌండ్ సేట్స్ లో కీలకమైన పెన్సిల్వేనియాలో విజయం సాధించినట్లు బీబీసీ ఓట్ల లెక్కింపు సరళిని బట్టి లెక్కవేసింది. ఈ రాష్ట్రంలో విజయంతో ఆయనకు వైట్ హౌస్ పీఠం అందుకోడానికి కావల్సిన 270 ఎలక్టోరల్ కాలేజీ ఓట్ల కంటే ఎక్కువ వచ్చాయి.

దీనిని తమ అభ్యర్థి అంగీకరించే ఆలోచన లేదని ట్రంప్ లాయర్లు అంటున్నారు. ఈ ఫలితం డోనల్డ్ ట్రంప్‌ను1990ల తర్వాత అమెరికాను ఒకే విడత పాలించిన అధ్యక్షుడిగా మార్చింది.

ఓట్ల ఎన్నికలు ముగిసిన రాష్ట్రాల నుంచి అందిన అనధికారిక సమాచారం ఆధారంగా బీబీసీ బైడెన్ విజయం సాధించినట్లు చెబుతోంది. ఇంకా ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న విస్కాన్సిన్ లాంటి రాష్ట్రాల నుంచి ఫలితాలు రావల్సి ఉంది.

1900 తర్వాత ఈ ఎన్నికలో అత్యధిక పోలింగ్ శాతం నమోదైంది. బైడెన్ ఇప్పటివరకూ 73 మిలియన్లకు పైగా ఓట్లు గెలుచుకున్నారు. ఇది ఒక అమెరికా అధ్యక్ష అభ్యర్థి సాధించిన అత్యధిక ఓట్లు. ట్రంప్‌కు దాదాపు 70 మిలియన్ ఓట్లు వచ్చాయి. చరిత్రలో ఇది రెండో అత్యధిక ఓట్లు.

ట్రంప్

ఫొటో సోర్స్, Reuters

ఓట్ల కౌంటింగ్ పూర్తి కాకుండానే అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తనను తాను విజేతగా ప్రకటించుకున్నారు.

ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించినప్పటికీ, ఎన్నికల్లో మోసాలు జరిగాయని ఆయన ఎలాంటి ఆధారాలు చూపించలేకపోయారు.

బైడెన్ విజయం అంచుల్లోకి చేరడంతో శుక్రవారం ఆయన తరపు లాయర్లు వివిధ రాష్ట్రాల్లో కేసులు వేశారు. ఎన్నికలు అప్పుడే ముగిసిపోలేదని అన్నారు.

అమెరికా అంతటా కరోనా కేసులు, మరణాల సంఖ్య పెరుగుతున్న సమయంలో ఈ ఎన్నికల జరిగాయి. బైడెన్ అధ్యక్షుడుగా ఎన్నికైతే లాక్‌డౌన్లు, ఆర్థిక చీకట్ల కమ్ముకుంటాయని ట్రంప్ వాదించారు.

ఇటు అధ్యక్షుడు ట్రంప్ కరోనా వ్యాపించకుండా అడ్డుకునేందుకు తగిన చర్యలు చేపట్టలేదని బైడెన్ ఆరోపించారు.బరాక్ ఒబామా దగ్గర 8 ఏళ్లు ఉపాధ్యక్షుడుగా పనిచేసిన వైట్ హౌస్‌లో బైడెన్ ఇప్పుడు అధ్యక్ష పీఠం అధిష్టించడానికి సిద్ధమయ్యారు.

78 ఏళ్ల వయసులో అమెరికాలో చరిత్రలోనే పెద్ద వయసులో అధ్యక్షుడైన నేతగా కొత్త రికార్డు సృష్టించబోతున్నారు. ఇంతకు ముందు ఈ రికార్డ్ 74 ఏళ్ల డోనల్డ్ ట్రంప్ పేరునే ఉంది.

బైడెన్

ఫొటో సోర్స్, Reuters

ఇప్పుడేం జరుగుతుంది... ట్రంప్ ఏమంటున్నారు?

సాధారణంగా ఓడిపోయిన అభ్యర్థి దీనిని అంగీకరించాలి. కానీ ట్రంప్ ఎన్నికల ఫలితాలను సవాలు చేస్తానని చెబుతున్నారు.

పెన్సిల్వేనియా ఫలితాలకు స్పందనగా ఆయన లాయర్లు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ఎన్నికలు అప్పుడే ముగియలేదు. నాలుగు రాష్ట్రాల్లో జో బైడెన్ గెలిచారనే తప్పుడు వాదనలు ముగింపుకు చాల దూరంగా ఉన్నాయి అన్నారు.

జార్జియాలో రీకౌంటింగ్ జరుగుతోంది. అక్కడ మార్జిన్ చాలా టైట్‌గా ఉంది. ట్రంప్ విస్కాన్సిన్‌లో కూడా అదే కోరుకుంటున్నారు. ఆయన సుప్రీంకోర్టులో న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని కూడా చెప్పారు. ఆధారాలు లేకుండానే ఓటింగ్‌లో మోసాలు జరిగాయంటున్నారు.

ఎన్నికల ఫలితాలను సవాలు చేస్తే, రాష్ట్రాల కోర్టుల్లో దానిని సవాలు చేయడానికి న్యాయ బృందాలు అవసరం అవుతాయి. అప్పుడు, రాష్ట్ర జడ్జిలు సవాలును సమర్థించి ఓట్లు తిరిగి లెక్కించాలని ఆదేశించాల్సి ఉంటుంది. అప్పుడు తీర్పును రద్దు చేయమని సుప్రీంకోర్టు న్యాయమూర్తులను అడగవచ్చు.

వీడియో క్యాప్షన్, అమెరికా ఎన్నికల్లో కమలా హారిస్ గెలవాలంటూతులసెంథిరపురం వాసుల పూజలు

ఇటు, కొన్ని రాష్ట్రాల్లో ఓట్లు లెక్కించడం కొనసాగుతుంది. చివరగా ధ్రువీకరించేవరకూ ఫలితాలను వెల్లడించరు. ఎన్నికల తర్వాత ప్రతి రాష్ట్రంలో కొన్ని వారాల పాటు అదే జరుగుతుంది.

దీనిని కచ్చితంగా ఎలక్టోరల్ కాలేజీ నుంచి ఎన్నుకున్న 538 మంది అధికారులు(ఎలక్టోరల్స్) సమక్షంలో చేయాల్సి ఉంటుంది. అది ఎన్నికల్లో ఎవరు గెలిచారనేది అధికారికంగా నిర్ణయిస్తుంది. వారు డిసెంబర్ 14న ఓటు వేసేందుకు తమ రాష్ట్ర రాజధానుల్లో సమావేశం అవుతారు.

ఎలక్టర్స్ ఓట్లు సాధారణంగా రాష్ట్రంలోని మెజారిటీ ఓట్లను ఓట్లను ప్రతిబింబిస్తాయి. అయితే కొన్ని రాష్ట్రాల్లో ఇది అధికారికంగా అవసరం కాదు.

క్యాబినెట్ మంత్రులను నిమియంచడానికి, ప్రణాళికలు రూపొందించడానికి తగిన సమయం ఇచ్చిన తర్వాత కొత్త అధ్యక్షుడు జనవరి 20న అధికారికంగా ప్రమాణ స్వీకారం చేస్తారు.

అధికారం అందుకునేందుకు నిర్వహించే వేడుకను ఇనాగ్యురేషన్ అంటారు. ఆ వేడుకను వాషింగ్టన్ డీసీలోని కాపిటల్ బిల్డింగ్ ప్రాంగణంలో నిర్వహిస్తారు. ఈ వేడుక తర్వాత కొత్త అధ్యక్షుడు వైట్ హౌస్‌లోకి ప్రవేశిస్తారు. నాలుగేళ్ల కోసం పదవీబాధ్యతలను స్వీకరిస్తారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)