చైనాలో మహిళలకు మాత్రమే పరిమితమైన రహస్య భాష... నుషు

ఫొటో సోర్స్, Xin Hu
- రచయిత, ఆండ్రూ లాఫ్‌థౌస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
చైనాకు ఆగ్నేయంలో ఉండే హునాన్ ప్రావిన్స్ అద్భుతమైన ప్రకృతి సంపదలతో మనోహరంగా ఉంటుంది. అలాంటి ప్రదేశంలోని ఒక మారుమూల గ్రామాలలో పుట్టింది చైనా మహిళల రహస్య భాష ‘నుషు’. ప్రపంచంలో మహిళలు లిపితో సహా తమ కోసమే సృష్టించుకున్న ఏకైక భాష ఇది.
చైనాలోని హునాన్ ప్రావిన్స్‌లో ఉన్న జియాంగ్‌యాంగ్ గ్రామీణ ప్రాంతంలో మాట్లాడే నుషు అనే భాషకు చైనీస్ అర్ధం ‘మహిళల భాష’ అని. ఇది 19వ శతాబ్దిలో బాగా ప్రాచుర్యం పొందింది. మాట్లాడే స్వేచ్ఛ తక్కువగా ఉండే ఈ ప్రాంతంలో హన్, యావ్, మియావో వర్గాలకు చెందిన మహిళలు ఈ నుషు భాషను రూపొందించారు.
ఇటీవలి కాలంలో ప్రాచుర్యం పొందినప్పటికీ సంగ్ వంశ పాలనా కాలమైన 960-1279 సంవత్సరాల మధ్య కూడా ఈ భాష వాడుకలో ఉందని కొందరు భాషా నిపుణులు చెబుతున్నారు.
కొందరైతే 3,000 కిందటి షాంగ్ వంశ పాలనా కాలంలో కూడా ఈ భాష మాట్లాడేవారని వాదిస్తున్నారు. మహిళలకు చదుకునే స్వేచ్ఛలేని చైనా భూస్వామిక పాలనలో ఈ భాష,లిపి తల్లుల నుంచి పిల్లలకు, పిల్లల నుంచి వారి పిల్లలకు తరతరాలుగా వారసత్వంగా అందుతూ వచ్చింది.

ఫొటో సోర్స్, lingqi xie/Getty Images
సాధారణ చదువు అంటే ఏంటో తెలియని చాలామంది మహిళలు ఈ నుషు భాషను నేర్చుకున్నారు. లిపిని చూసి అభ్యాసం చేసేవారు.అలా అలా నుషు భాష ఆ ప్రాంతపు మహిళల జీవితంలో భాగంగా మారింది.
చైనాకు అవతల దీనిని నేర్చుకోవడం 1980 తర్వాతనే మొదలైంది. కొన్నివందలు, వేల సంవత్సరాలపాటు ఈ భాష ఎవరికీ తెలియకుండానే మిగిలిపోయింది.
సరిగ్గా 16 సంవత్సరాల కిందట ఈ భాషను స్పష్టంగా మాట్లాడే ఏకైక చివరి వ్యక్తి మరణించిన తర్వాత ఆ భాష ఇప్పుడు మళ్లీ పునర్జన్మ పొందడానికి ప్రయత్నిస్తోంది. హునాన్ ప్రావిన్స్‌లోని ఒక చిన్న గ్రామం పువేయీ ఆ భాషను పునరుజ్జీవనానికి కేంద్రంగా మారింది.
ఒకప్పుడు పువేయీ గ్రామానికి చుట్టుపక్కల ఉన్న 18 గ్రామాలలో ఈ నుషు భాషను మాట్లాడే వారుండేవారు. 1980లో 200మంది జనాభా ఉన్న పువేయీ గ్రామంలో నుషు భాషను రాయగలిగిన వ్యక్తులు ముగ్గురంటే ముగ్గురు ఉండేవారు. దీంతో ఈ భాషపై పరిశోధనలకు పువేయీ గ్రామం కేంద్రంగా మారింది.

ఫొటో సోర్స్, CPA Mediat Pte Ltd/Alamy
2006లో నుషు భాషను చైనా స్టేట్ కౌన్సిల్ అంతరించిపోతున్న చైనా వారసత్వ సంపదగా గుర్తించింది. ఆ తర్వాతి ఏడాది అక్కడ ఒక మ్యూజియంను కూడా ఏర్పాటు చేసింది.
నుషు భాషను రాయగల, చదవగల, మాట్లాడగల ఏడుగురు వ్యక్తులు, ఆ భాషకు వారసులను ఇక్కడ ఉద్యోగులుగా నియమించారు. వారిలో జిన్ అనే మహిళ ఒకరు.
జియాంగ్‌యాంగ్ ప్రాంతంలో నాలుగు మాండలికాలలో ఈ భాషా వినియోగం ఉంది. లిపి కుడి నుంచి ఎడమకు ఉంటుంది. చైనా అక్షరాల ప్రభావం దీనిపై కనిపిస్తుంది.
అక్కడక్కడా సాగదీసినట్లుగా, వంగినట్లుగా కనిపించే ఈ లిపిని స్థానికులు ‘దోమల రాత’ అని కూడా పిలుస్తుంటారు. చూడటానికి ఆ లిపి అలాగే ఉంటుంది.
సామాజికంగా తమకున్న ఇబ్బందులను, సమస్యలను ఒకరికొకరు చెప్పుకోడానికి స్థానిక మహిళలు నుషు భాషను వాడుకునే వారు. ఈ భాష లిపిని ముద్రించి తయారు చేసిన రుమాళ్లు, స్కార్ఫ్‌లు, బెల్టులు ఒకరికొకరు బహుమతులుగా ఇచ్చుకునేవారు.

ఫొటో సోర్స్, Xin Hu
వివాహాలు, శుభకార్యాల సమయంలో ఈ భాషలో పాటలు పాడటం, ఆ లిపితో రాసిన సందేశాలను పంపుకోవడం ఇక్కడి మహిళలకు అలవాటుగా ఉండేది.
వృద్దులైన మహిళలు జీవితంలో ఎలా నెగ్గుకు రావాలో, ఎలా ప్రవర్తించాలో, మంచి భార్యలుగా ఎలా మెలగాలో బోధించే అనేక కథలు, జీవితానుభవాలను ఈ భాషలో పాడుతుండేవారు.
చైనీస్ భాషను చదవడానికి, రాయడానికి హక్కులు లేని మహిళలకు సమాచార సాధానంగా నుషు ఉపయోగపడినప్పటికీ ఒకప్పుడు ఇది పితృస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడే ఉద్యమకారుల భాషగా ఉండేది.
చైనా మహిళలు వ్యక్తిగత విషయాలను, బాధలను బహిరంగంగా చెప్పుకోవడం ఒకప్పుడు ఆమోదయోగ్యం కాదు. అలాంటి సమయంలో నుషు భాష వారికి బాగా ఉపయోగపడింది. పురుషాధిక్య సమాజంలో స్త్రీల మధ్య సామాజిక బంధం ఏర్పరుచుకోడానికి నుషు సాధనమైంది.
2000 సంవత్సరంలో పువేయీలో ఒక నుషు స్కూలును ప్రారంభించారు. ప్రస్తుతం పువేయీ మ్యూజియంలో పని చేస్తున్న ఏడుగురు భాషానువాదకుల (ఇంటర్‌ప్రిటేటర్)లో ఒకరుగా పని చేస్తున్న జిన్, తన తల్లిని, సోదరిని అక్కడ చదివించాలని నిర్ణయించారు.
జిన్ ఇప్పుడు ఆ కేంద్రంలో విద్యార్థులకు నుషు భాషలో అక్షరాలు నేర్పుతున్నారు. మ్యూజియంను చూడటానికి వచ్చే సందర్శకులకు ఆమె అక్కడి విశేషాలను వివరిస్తారు.
జిన్ ఇప్పుడు నుషు భాషకు ప్రధాన వనరుగా మారారు. ఆసియా, ఐరోపా అంతటా ఆమె ప్రచార యాత్రలు నిర్వహిస్తున్నారు.
నుషు భాష గురించి తెలిసిన ఒకే ఒక పురుష పరిశోధకుడు కూడా ఉన్నారు. ఆయన పేరు జౌ షుయి. 1950లో తన అత్త నుషు భాష మాట్లాడే గ్రామానికి చెందిన ఒక్క వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో ఆయన ఈ భాష గురించి విన్నారు. 1954లో జియాంగ్‌యాంగ్ కల్చరల్ బ్యూరో కోసం ఈ భాషపై పరిశోధన చేయడం ప్రారంభించారు.

ఫొటో సోర్స్, Frederic J Brown/Alamy
1960లలో మావో జెడాంగ్ సాంస్కృతిక విప్లవం వచ్చినప్పుడు ప్రభుత్వానికి ఆయన టార్గెట్ అయ్యారు. “ఈ భాష కోసం నేను పరిశోధన చేస్తున్నందుకు నాకు రైటిస్టు అనే ముద్రవేశారు” అని జౌ షుయి 2004లో చైనాడైలీ పత్రికతో చెప్పారు. “వాళ్లు నా పరిశోధనా పత్రాలను కాల్చేశారు. నన్ను లేబర్ క్యాంప్‌కు తరలించి 21 సంవత్సరాలపాటు అక్కడే బంధించారు. 1979లో విడుదలయ్యాను’’ అని జౌ షుయి వెల్లడించారు.
చైనా విప్లవం సందర్భంగా భూస్వామ్య వ్యవస్థకు చెందిన ఆనవాళ్లన్నింటినీ చెరిపేయాలని అప్పటి ప్రభుత్వం భావించింది. స్త్రీలకు సాధారణ విద్యను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురావడంతో నుషు భాష వెనకబడింది.
జౌ షుయి మాత్రం తన పరిశోధనలు కొనసాగించారు. నుషు భాషను అనర్ఘళంగా మాట్లాడే ఏకైక మహిళ యాంగ్ హున్యీ 2003లో మరణించారు. ఆమె మరణానికి ఏడాది ముందు ఆమెతో కలిసి నుషు భాషకు ఒక నిఘంటువును తయారు చేశారు జౌ షుయి.
ప్రతి వేసవిలో మ్యూజియంలో ఉచిత నుషు శిక్షణా తరగతులు ఏర్పాటు చేస్తున్నారు. ఆ భాషా చరిత్ర, వారసత్వాలను ఈ క్లాసుల్లో జిన్ వివరిస్తారు. “ నుషు భాషను నేర్చుకోవడంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అన్నింటిలో మొదటిది దాన్ని రాసే విధానం. చైనీస్ అక్షరాలకు కాస్త భిన్నంగా ఉంటుంది. ఉచ్చారణ కూడా సమస్యే. స్థానిక మాండలికం తెలియకపోతే నుషు అర్ధం కాదు’’ అన్నారు జిన్.
ప్రస్తుతం నుషు భాషకు సంబంధించిన పరిశోధనలు, చిత్రాలు దొరకడం కష్టంగా మారింది. చైనా విప్లవ సమయంలో చాలా వరకు నాశనమయ్యాయి. ఇటీవలి కాలంలో సినిమాలు, సాహిత్యంలో నుషుకు ప్రాతినిధ్యం పెరిగింది.
జియాంగ్‌యాంగ్‌లోని యువతులు మ్యూజియంలో ఆ భాష లిపిని నేర్చుకుంటున్నారు. జిన్ వంటి ఆ భాషా వారసులు ప్రముఖ చైనీస్ యాప్ వీచాట్ ద్వారా ఆన్‌లైన్ తరగతుల్లో కూడా బోధిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్ గురించి ఇంకా మనకెవరికీ తెలియని 9 విషయాలు..
- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- భారత్‌కు కరోనావైరస్ వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? ట్రయల్స్ ఎంత వరకు వచ్చాయి?
- కరోనావైరస్: ఇన్హేల్డ్ వ్యాక్సీన్ పరీక్షలను ప్రారంభించనున్న బ్రిటన్
- జిన్‌పింగ్‌ను మరో మావో అని ఎందుకంటారు?
- తియానన్మెన్ స్క్వేర్ నరమేధాన్ని సమర్థించిన చైనా మంత్రి, అసలు ఆరోజు ఏం జరిగింది?
- కశ్మీర్లో ఒక్కసారే పర్యటించిన గాంధీ.. అప్పుడు ఆయన ఏమన్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్,ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








