భారత్‌కు కరోనావైరస్ వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? క్లినికల్ ట్రయల్స్ ఎంత వరకు వచ్చాయి?

కరోనావైరస్ వ్యాక్సీన్

ఫొటో సోర్స్, Sefa Karacan/Anadolu Agency via Getty Images

    • రచయిత, మానసీ దాశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

వచ్చే ఏడాది ప్రారంభంనాటికి కరోనావైరస్ వ్యాక్సీన్ అందుబాటులోకి వచ్చే అవకాశముందని భారత ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ గురువారం ఆశాభావం వ్యక్తంచేశారు.

ఈ విషయంపై రాజ్యసభలో ఆయన మాట్లాడారు. ''వ్యాక్సీన్ తయారు చేయడమంటే మాయాజాలం ఏమీ కాదు. భారీ స్థాయిలో టీకాలను ఉత్పత్తి చేయాలంటే కొంచెం సమయం పడుతుంది. ప్రస్తుతం కోవిడ్-19ను అడ్డుకోవడంలో మాస్క్‌లే కీలకం''

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

మరోవైపు ఈ ఏడాది చివరినాటికి భారత్‌లో వ్యాక్సీన్ అందుబాటులోకి వచ్చే అవకాశముందని భారత ఫార్మా సంస్థ డా.రెడ్డీస్ ల్యాబ్స్ కూడా తెలిపింది. రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్-5 వ్యాక్సీన్‌ను పది కోట్ల డోసుల్ని కొనుగోలు చేసేందుకు సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది.

ఆక్స్‌ఫర్డ్‌ భాగస్వామి అస్ట్రాజెనెకాతో కలిసి పనిచేస్తున్న భారత సంస్థ సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు క్లినికల్ ట్రయల్స్ మళ్లీ మొదలుపెట్టేందుకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) నుంచి అనుమతి లభించింది.

క్లినికల్ ట్రయల్స్ సమయంలో ఒక వ్యక్తిలో దుష్ప్రభావాలు కనిపించడంతో వీటిని మధ్యలో ఆపేశారు. అయితే, కొన్ని షరతులపై వీటిని కొనసాగించేందుకు మళ్లీ అనుమతులు లభించాయి.

ప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్ సోకినవారి సంఖ్య మూడు కోట్లకు మించిపోయింది. మరణాల సంఖ్య 9,40,000కు చేరుకుంది.

అత్యంత ప్రభావిత దేశం అమెరికాలో కేసులు 68 లక్షలను దాటిపోయాయి. ఇక్కడ మరణాలు రెండు లక్షలకుపైనే సంభవించాయి.

భారత్ కూడా అమెరికాకు చేరువలోనే ఉంది. అమెరికా తర్వాత అత్యంత ప్రభావితమైన దేశం భారతే. ఇక్కడ కేసుల సంఖ్య 52 లక్షలను దాటింది. మరణాలు 84,000 ఉన్నాయి.

కరోనావైరస్ వ్యాక్సీన్

ఫొటో సోర్స్, @COVIDNewsByMIB

క్లినికల్ ట్రయల్స్ మూడో దశలో 9 వ్యాక్సీన్లు

ప్రపంచ ఆరోగ్య సంస్థ సమాచారం ప్రకారం.. 33 సంస్థలు కరోనావైరస్‌ వ్యాక్సీన్లపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నాయి. వీటిలో తొమ్మిది సంస్థల క్లినికల్ ట్రయల్స్ మూడో దశకు చేరుకున్నాయి.

ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ-ఆస్ట్రాజెనెకా, క్యాన్‌సీనో-బీజింగ్ ఇన్‌స్టిట్యూట్, జెన్‌సెన్ ఫార్మా,సైనోవాక్, సైనోఫార్మ్-వూహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయోలాజికల్ ప్రాడక్ట్స్, మోడెర్నా, బయోనెట్-ఫైజర్ తదితర వ్యాక్సీన్లు మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌కు చేరుకున్నాయి.

రష్యాకు చెందిన స్పుత్నిక్-5 వ్యాక్సీన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ఇంకా పూర్తికాలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఈ ట్రయల్స్ ప్రస్తుతం 40,000 మందిపై కొనసాగుతున్నాయి.

33 వ్యాక్సీన్లతోపాటు మరో 145 వ్యాక్సీన్లు కూడా అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

కరోనావైరస్ వ్యాక్సీన్

ఫొటో సోర్స్, YEGOR ALEYEV

రష్యా వ్యాక్సీన్‌పై వివాదం

ప్రపంచంలో తొలి కరోనావైరస్ వ్యాక్సీన్ స్పుత్నిక్-5ను తయారుచేశామని ఆగస్టు 11న రష్యా ప్రకటించింది.

అయితే, స్పల్పకాలంలోనే వ్యాక్సీన్ తయారుచేయడంపై పశ్చిమ దేశాల శాస్త్రవేత్తలు ఆందోళనలు వ్యక్తంచేస్తున్నారు. శాస్త్రీయ విధానాలకు అనుగుణంగా దీన్ని తయారుచేయలేదని అంటున్నారు.

అయితే, అన్ని నిబంధనలకు అనుగుణంగానే ఈ వ్యాక్సీన్ తయారుచేశామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. తన కుమార్తెల్లో ఒకరికి కూడా వ్యాక్సీన్ ఇచ్చినట్లు ఆయన వివరించారు.

సెప్టెంబరు ప్రారంభంలో ఈ వ్యాక్సీన్‌పై లాన్సెట్ మెడికల్ జర్నల్‌లో ఓ వార్త ప్రచురితమైంది. ఈ వ్యాక్సీన్ తీసుకున్నవారిలో ఎలాంటి హానికర దుష్ప్రభావాలూలేవని దీనిలో పేర్కొన్నారు.

18 నుంచి 60ఏళ్ల వయసున్న వారిపై ఈ వ్యాక్సీన్‌ను ప్రయోగించినట్లు బీబీసీ ఆరోగ్య వ్యవహారాల ప్రతినిధి ఫిలిప్ రాక్స్‌బీ తెలిపారు. 42 రోజుల నుంచి వీరిని పరిశీలనలో పెట్టినట్లు వివరించారు.

దీంతో 18 నుంచి 62ఏళ్ల వయసున్న వారికి 42 రోజుల వరకూ ఇది రక్షణ కల్పిస్తున్నట్లు చెప్పొచ్చు. అయితే 60ఏళ్లకు పైవయసున్న వారిపై ఇది పనిచేస్తుందా? ఎన్ని రోజుల వరకూ ఈ వ్యాక్సీన్ రక్షణ కల్పించగలదు? తదితర ప్రశ్నలకు సమాధానాలు ఇప్పటివరకూ తెలియడం లేదు.

40,000 మందిపై ప్రయోగం జరుగుతోందని, దీనికి సంబంధించిన ఫలితాలు నవంబరు కంటే ముందే వస్తాయని డా. రెడ్డీస్ పేర్కొంది.

''స్పుత్నిక్-5 మొదటి, రెండో దశ ట్రయల్స్ ఆశాజనకంగా ఉన్నాయి. భారత ప్రాధికార సంస్థల అనుమతి అనంతరం భారత్‌లో మూడో దశ ట్రయల్స్‌ను మొదలుపెడతాం. కోవిడ్-19పై ఇది సమర్థంగా పనిచేయగలదని మేం భావిస్తున్నాం''అని సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది.

ఈ ఏడాది చివరినాటికి స్పుత్నిక్-5 వ్యాక్సీన్ తమ చేతికి వస్తుందని, ఈలోగా అనుమతులు, పరీక్షలు అన్నీ పూర్తవుతాయని సంస్థ పేర్కొంది.

కరోనావైరస్ వ్యాక్సీన్

ఫొటో సోర్స్, OXFORD UNIVERSITY

ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సీన్ ఎంతవరకు వచ్చింది?

ఆక్స్‌ఫర్డ్ తయారుచేస్తున్న వ్యాక్సీన్‌ను బ్రిటిష్ సంస్థ ఆస్ట్రాజెనెకా భారీగా ఉత్పత్తి చేస్తోంది. మరోవైపు దీనిపై క్లినికల్ ట్రయల్స్ కూడా కొనసాగుతున్నాయి.

ప్రపంచంలో అందరికీ ఈ వ్యాక్సీన్లు అందేలా చూసేందుకు భారత్‌కు చెందిన సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది.

అయితే, వ్యాక్సీన్‌ను తీసుకున్న ఓ వ్యక్తిలో దుష్ప్రభావాలు కనిపించడంతో పరీక్షలను మధ్యలోనే ఆపేశారు. భారత్‌లోనూ ఈ పరీక్షలను నిలిపివేశారు.

తమ వ్యాక్సీన్ సురక్షిమైనదేనని తదనంతర పరీక్షల్లో తేలినట్లు శనివారం ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ తెలిపింది. దీంతో బ్రిటన్, దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌లో మళ్లీ ట్రయల్స్ మొదలయ్యాయి.

అయితే, అమెరికాలో ఈ ట్రయల్స్ ఇంకా మొదలుకాలేదు. ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ అనుమతి అనంతరం ఈ ప్రయోగాలు మొదలవుతాయి.

దుష్ప్రభావాలు తమ వ్యాక్సీన్‌ వల్ల కాదని బుధవారం ఆస్ట్రాజెనెకా చెప్పినట్లు ఇండిపెండెంట్ రివ్యూ ఓ కథనం ప్రచురించింది.

భారత్‌లో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు దీన్ని ఇస్తున్న వ్యక్తుల పూర్తి వివరాలు ఇవ్వాలనే షరతులపై సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌కు డీసీజీఐ అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం రెండు, మూడో దశ పరీక్షలు కొనసాగుతున్నాయి.

ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేస్తున్న ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సీన్ ప్రస్తుతం మిగతా వ్యాక్సీన్ల కంటే ముందు రేసులో ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ తెలిపారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

మరో కోవిడ్-19 వ్యాక్సీన్ తయారుచేస్తున్న అమెరికా సంస్థ నోవావ్యాక్స్‌తోనూ సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఒప్పందం కుదుర్చుకుంది. దీనిలో భాగంగా బిలియన్ డోసులను సంస్థ ఉత్పత్తి చేయబోతోంది.

వంద మిలియన్ల డోసుల తయారీపై ఆగస్టులోనే రెండు సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. ప్రస్తుతం ఈ డోసులను బిలియన్‌కు పెంచారు.

ఈ వ్యాక్సీన్‌కు సంబంధించి రెండో దశ క్లినికల్ ట్రయల్స్ కొనసాగుతున్నాయి. మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కొన్ని వారాల్లోనే మొదలుకాబోతున్నాయి.

రాబర్ట్, ట్రంప్

అమెరికా ఎన్నికలపై ప్రభావం

కరోనావైరస్‌తో తీవ్రంగా ప్రభావితమైన దేశం అమెరికా. ప్రస్తుతం ఆ దేశ అధ్యక్ష ఎన్నికల్లోనూ వ్యాక్సీన్ తయారీ కీలక పాత్ర పోషించబోతోంది.

దేశంలో అందరికీ కోవిడ్-19 వ్యాక్సీన్ చేరవేసేందుకు ఆరు నుంచి తొమ్మిది నెలలు పడుతుందని అమెరికా సెనేట్ ముందు డైరెక్టర్ ఆఫ్ ద సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ డా. రాబర్ట్ రెడ్‌ఫీల్డ్ తెలిపారు.

వైరస్‌ను కట్టడి చేయడంలో వ్యాక్సీన్ కంటే మాస్క్‌లే ప్రధాన పాత్ర పోషిస్తాయని ఆయన వివరించారు.

అతి త్వరలోనే వ్యాక్సీన్ అందుబాటులోకి వస్తుందని చెబుతున్న అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్.. రాబర్ట్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాబర్ట్ మాట్లాడిన అనంతరం విలేకరుల సమావేశంలో ట్రంప్ మాట్లాడారు. ''ఇది తప్పుదోవ పట్టించే సమాచారం. వ్యాక్సీన్ చేతికి వచ్చిన వెంటనే నేరుగా ప్రజలకు ఇస్తాం. రాబర్ట్ చెప్పినంత ఆలస్యం అయితే ఉండదు''అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

వ్యాక్సీన్ కంటే మాస్క్ మేలని చేసిన వ్యాఖ్యలనూ ట్రంప్ తప్పుపట్టారు. మాస్క్ కంటే వ్యాక్సీనే సమర్థంగా పనిచేస్తుందని అన్నారు.

వ్యాక్సీన్ తయారీలో ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ విమర్శించారు.

''వ్యాక్సీన్ విషయంలో ట్రంప్ చెప్పే మాటలు నమ్మను. నేను శాస్త్రవేత్తలపై నమ్మకం ఉంచుతాను''అని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ విషయంలో ఎలాంటి రాజకీయాలు చేయకూడదని ఆయన అన్నారు. అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు నవంబరు మూడున జరగనున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)