కరోనా వైరస్: పీతల రక్తం పీల్చేస్తున్నారు.. కోవిడ్ కట్టడిలో అదే కీలకమా

ఫొటో సోర్స్, Getty Images
ముప్ఫయి కోట్ల సంవత్సరాలుగా మనుగడ సాగిస్తున్నాయి.. మనం ప్రాణాలతో, ఆరోగ్యంగా ఉండడం కోసం వాటి లేత నీలం రంగు రక్తాన్ని పీల్చేస్తున్నాం.
ఇదంతా సైన్స్ ఫిక్షనేమీ కాదు. సైన్స్‌లో ఒక పాత పద్ధతిని ఇప్పుడు ఫాలో అవుతుండడం గురించి మాట్లాడుతున్నాం.. అవును ప్రపంచవ్యాప్తంగా మందుల తయారీలో 'గుర్రపు నాడా పీతలు'(హార్స్ షూ క్రాబ్స్) రక్తాన్ని వాడడం గురించి మాట్లాడుతున్నాం.
కొన్ని దశాబ్దాలుగా మందుల తయారీలో వీటి రక్తాన్ని వాడుతున్నారు.. ఇప్పుడు కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టడంలోనూ ఈ పీతల రక్తం తప్పనిసరి.
అయితే.. ఇప్పుడు ఈ రకం పీతల సంఖ్య ఎంత? ఈ ప్రక్రియ వాటి మనుగడను ఎలా ప్రభావితం చేస్తోంది అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అంతేకాదు.. వైద్య ప్రయోగాలలో వీటి రక్తం వాడడాన్ని ఆపాలంటూ కొందరు ఉద్యమిస్తున్నారు కూడా.

ఫొటో సోర్స్, Getty Images
ఇవెలా పనికొస్తాయి?
కొత్తగా కనుగొనే మందుల్లో ప్రాణాంతక బ్యాక్టీరియాలు లేకుండా ఈ పీతల రక్తాన్ని వాడుతారు.
వీటి రక్త కణాలలోని కొన్ని రసాయనాలు హానికారక పదార్థాలకు వ్యతిరేకంగా స్పందిస్తాయి. ఆ కారణంగానే శాస్త్రవేత్తలు తాము కనిపెట్టిన కొత్త మందుల్లో హానికారకాలున్నాయో లేవో తెలుసుకునేందుకు దీన్ని వాడుతారు.
ఇలాంటి సామర్థ్యం ఉన్న రసాయనాన్ని ఇప్పటివరకు ఈ 'హార్స్ షూ' పీతల్లో మాత్రమే కనుగొన్నారు.
దీంతో ఏటా వేల సంఖ్యలో ఈ పీతలను అమెరికాలోని ప్రయోగశాలలకు తరలిస్తారు. అక్కడ వీటి గుండె సమీపలోని నరం నుంచి రక్తాన్ని తీస్తారు.
ఆ తరువాత వాటిని తిరిగి సముద్రంలో విడిచిపెడతారు.

ఫొటో సోర్స్, Getty Images
రక్తం తీశాక బతుకుతాయా.. చనిపోతాయా?
ఇలా రక్తం తీశాక ఆ పీతలన్నీ బతుకుతున్నాయని మొదట్లో భావించేవారు. కానీ, ఇటీవల కాలంలో జరిగిన కొన్ని అధ్యయనాల ప్రకారం వాటిలో 30 శాతం చనిపోతున్నాయని గుర్తించారు.
అంతేకాదు.. ఇలా రక్తం తీసిన ఆడ పీతలు ఆ తరువాత సంతానోత్పత్తి చేయడం లేదని కొన్ని అధ్యయనాలు తేల్చాయి.
ఇప్పటివరకు ఇలా 5 లక్షలకు పైగా పీతల రక్తం తీసుంటారని న్యూజెర్సీలో ఈ పీతల సంరక్షణకు పనిచేస్తున్న డాక్టర్ బార్బరా బ్రమ్మర్ అన్నారు.
ఇలా రక్తం తీయడం వల్ల వాటి ప్రాణాలకు కలిగే హాని గురించి ఎవరికీ కచ్చితంగా తెలియదని 'బీబీసీ రేడియో 4'తో ఆమె చెప్పారు.
అమెరికన్ హార్స్ షూ క్రాబ్స్ ప్రస్తుతం దాదాపు అంతరించిపోతున్న దశలో ఉన్నాయి.
అయితే, వ్యాక్సిన్లు తయారు చేసే సంస్థలు మాత్రం కొన్నాళ్లుగా ఈ పీతల సంఖ్య స్థిరంగానే ఉందని, తగ్గలేదని వాదిస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
ప్రత్యామ్నాయం లేదా?
ఈ పీతల రక్తానికి బదులు వాడదగ్గ రసాయనాన్ని కృత్రిమంగా తయారుచేయడానికి సంబంధించి అనేక పరిశోధనలు జరిగాయి. 2016లో కొందరు శాస్త్రవేత్తలు తయారుచేసిన ప్రత్యామ్నాయాన్ని వాడడానికి యూరప్ ఆమోదం పలికింది. అమెరికాలోని కొన్ని కంపెనీలూ ఆమోదించాయి.
అయినా, ఎందుకు వీటిని హింసిస్తున్నాం?
ఈ పీతల రక్తానికి ప్రత్యామ్నాయంగా తయారుచేసిన రసాయనం వంద శాతం పనిచేస్తుందనడానికి ఆధారాలు లేవని అమెరికాకు చెందిన ఔషధ సురక్షా సంస్థ గత నెలలో చెప్పింది.
మందుల పరీక్షల్లో ఈ రక్తం వాడితేనే అమెరికాలోని పలు రాష్ట్రాల్లో ఆ మందులు విక్రయించడానికి అనుమతి ఉంటుంది.
ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్ల తయారీలోనూ వీటిని వాడితేనే ఆమోదం దొరికే పరిస్థితి.
అమెరికా కాకుండా ఇతర కొన్ని దేశాల్లో దీనికి ప్రత్యామ్నాయం వాడుతున్నందున మరోసారి పరిశీలించాలని బార్బరా కోరుతున్నారు.
ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ కోసం సుమారు 30 కంపెనీలు ప్రయత్నిస్తున్నాయని.. వారంతా ఈ పీతల రక్తాన్ని సేకరిస్తే వాటికి పెను ముప్పు తప్పదని బార్బరా ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007


ఇవి కూడా చదవండి:
- టిండర్, డంబుల్ వంటి డేటింగ్ యాప్‌లు పాతపడిపోయాయా?
- #WhereIsMyName: అక్కడ అమ్మాయి పేరు ఎవరికీ చెప్పకూడదు.. పెళ్లి పాత్రాల్లో రాయరు, మరణ ధృవీకరణల్లో ఉండదు, సమాధీ పైనా కనిపించదు
- బీటిల్ మోసుకెళ్లే బుల్లి కెమెరా.. కీటకాల సాహసాలు లైవ్ స్ట్రీమింగ్
- భారత జనాభా ఈ శతాబ్దం చివరికి ఎందుకు తగ్గుతుంది... తగ్గితే ఏమవుతుంది?
- కరోనావైరస్ కోరల్లో చైనా ఆర్థిక వ్యవస్థ.. దశాబ్దాల కాలంలో తొలిసారి కుదేలు
- 996 విధానం అంటే ఏంటి? ‘ఆలీబాబా’ జాక్ మా దీన్ని ఎందుకు సమర్థిస్తున్నారు?
- అమెరికా ఆధిపత్యం పోతుందా? చైనా సూపర్ పవర్ అవుతుందా? కరోనావైరస్తో తెర వెనుక జరుగుతున్న యుద్ధాలేమిటి?
- భారీగా పతనమవుతున్న చైనా కరెన్సీ యువాన్.. కారణాలివే
- అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం: ఆర్థిక వ్యవస్థలోకి మరింత నగదును చొప్పిస్తున్న చైనా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








