భారత జనాభా ఈ శతాబ్దం చివరికి ఎందుకు తగ్గుతుంది... తగ్గితే ఏమవుతుంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, తారేంద్ర కిశోర్
- హోదా, బీబీసీ హిందీ కోసం
ఈ శతాబ్దం చివరినాటికి భారత్ జనాభా 100 కోట్లకు పడిపోతుంది. అంటే, ఇప్పటితో పోలిస్తే 30 నుంచి 35 కోట్ల మంది వరకు జనాభా తగ్గిపోతుంది.
అయినప్పటికీ, ప్రంపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ నిలుస్తుంది. ఇదివరకు అంచనా వేసిన దానికంటే ప్రపంచ జనాభా 200 కోట్లు తక్కువగా ఉంటుంది.
ప్రముఖ వైద్య జర్నల్ లాన్సెట్‌లో ప్రచురితమైన ఓ నివేదికలో ఇలా అంచనా వేశారు.
ప్రస్తుతం ప్రపంచ జనాభా 780 కోట్లు ఉండగా.. ఇది 2100 నాటికి 880 కోట్లకు పెరుగుతుందని నివేదిక పేర్కొంది. అయితే ఇదివరకు 2100 నాటికి ప్రపంచ జనాభా 1090 కోట్లకు పెరుగుతుందని ఐక్యరాజ్యసమితి నివేదిక అంచనా వేసింది.
తాజా నివేదిక ప్రకారం, శతాబ్దం చివరికి అత్యధిక జనాభా గల దేశాలుగా భారత్, నైజీరియా, చైనా, అమెరికా, పాకిస్తాన్ నిలుస్తాయి.
నైజీరియాలో జనాభా వృద్ధి రేటు తగ్గక పోవటంతో ప్రపంచ దేశాల్లో ఇది రెండో స్థానాన్ని ఆక్రమించబోతోంది.

ఫొటో సోర్స్, Getty Images
2047 తర్వాత భారత్ జనాభా తగ్గబోతోందా?
2047లో గరిష్ఠంగా భారత్ జనాభా 161 కోట్లకు చేరనుంది. ఆ తర్వాత జనాభా వృద్ధి రేటు తగ్గుముఖం పట్టనున్నట్లు నివేదిక వివరించింది.
2010 నుంచి 2019 మధ్య భారత్ జనాభా వృద్ధి రేటు సగటున ఏడాదికి 1.2 శాతంగా ఉంది. ఇదే రేటుతో పెరిగితే, చైనాను 2027 కల్లా భారత్ దాటేస్తుంది. జనాభా పరంగా ప్రపంచంలోనే అతి పెద్ద దేశంగా అవతరిస్తుంది.
అదే సమయంలో ప్రపంచ జనాభా 2064లో గరిష్ఠంగా 973 కోట్లకు చేరనుంది.
జనాభా ఎందుకు తగ్గిపోతుంది?
ఐక్యరాజ్యసమితి నివేదిక అంచనాల కంటే 36 సంవత్సరాలకు ముందే ప్రపంచ జనాభా గరిష్ఠ స్థాయికి చేరుకోనుందని లాన్సెట్ నివేదిక పేర్కొంది.
తగ్గుతున్న గర్భధారణ రేటు, వృద్ధుల సంఖ్య లాంటి అంశాలను ఐక్యరాజ్యసమితి నివేదిక అంచనాలు దృష్టిలో పెట్టుకున్నప్పటికీ, కొన్ని అంశాలను పక్కన పెట్టేశారని లాన్సెట్ నివేదిక పేర్కొంది.
తగ్గుతున్న గర్భధారణ రేటును రెండు నివేదికలు భిన్నంగా అంచనా వేశాయని పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పూనం ముత్రేజా వివరించారు. గత 10 సంవత్సరాల జనాభా లెక్కలను ఆధారం చేసుకొని గర్భధారణ రేటును 2.1 శాతంగా ఐక్యరాజ్యసమితి నివేదిక అంచనా వేసింది. ఈ ఏడాది జనాభా లెక్కల ప్రకారం గర్భధారణ రేటు 1.8 శాతం మాత్రమే. లాన్సెట్ నివేదిక దీన్ని పరిగణలోకి తీసుకుందని ఆమె అన్నారు.
"ఐక్యరాజ్యసమితి, లాన్సెట్ నివేదికలు ఇప్పటి గర్భధారణ రేటు గణాంకాలను ఆధారం చేసుకొని అంచనాలు వేస్తున్నాయి. భారత్‌లో చాలా చోట్ల గర్భధారణ రేట్లు శరవేగంగా పడిపోతున్నాయి. యూపీ, బిహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఒడిశాలలో తప్పా అన్నిచోట్లా గర్భధారణ రేట్లు త్వరలోనే నెగెటివ్ కాబోతున్నాయి. ఇప్పుడు ఎమవుతోందంటే.. అనుకున్న దానికన్నా వేగంగా గర్భధారణ రేట్లు పడిపోతున్నాయి"అని పూనం బీబీసీతో చెప్పారు.
ఇలా పడిపోవడానికి చాలా కారణాలున్నాయని ఆమె వివరించారు.
''కొంతకాలంగా వివాహ వయసు పెరుగుతూ వస్తోంది. అలాగే రెండు గర్భాల మధ్య వ్యవధీ పెరుగుతోంది. ఇప్పుడు ప్రజలకు కుటుంబ నియంత్రణపై మాత్రమే కాదు, ఎక్కువ మందిని కనటంతో వచ్చే ఆర్థిక ఇబ్బందులపై కూడా అవగాహన వచ్చింది. ఈ అవగాహన ముఖ్యంగా పేద ప్రజల్లో బాగా వచ్చింది. పిల్లలను చదివించాలనుకుంటున్నారు. ఇది చాలా ఖర్చుతో కూడుకుంది. ఈ కారణాల వల్ల గర్భధారణ రేట్లు వేగంగా పడిపోతున్నాయి"అని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
జనాభా పెరుగుదలతో వచ్చే సమస్యలేంటి?
నివేదిక ప్రకారం.. 2047 నాటికి భారత్ జనాభా 161 కోట్లకు చేరబోతోంది. అప్పుడు భారత్ అత్యధిక జనాభా కలిగిన దేశం అవుతుంది. అలాంటి పరిస్థితుల్లో భారత్ ఎలాంటి సమస్యలను ఎదురుకోబోతోంది?
ఈ సమస్యలు అవకాశాలుగా కూడా మారొచ్చని మాజీ ప్రణాళికా సంఘం సభ్యుడు, ఆర్థికవేత్త సంతోష్ మెహ్రోత్రా చెబుతున్నారు.
"గత 45 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా నిరుద్యోగ రేటును కరోనావైరస్ రాకముందే మనం చూశాం. ఆరేళ్లుగా ఆచరణలో ఉన్న విధానాలే అవలంబిస్తే చాలా నష్టపోతాం. ఈ విధానాల వల్ల పారిశ్రామిక, వ్యవసాయేతర ఉద్యోగాలు తగ్గిపోతూ వచ్చాయి. సానుకూల విధానాలను అవలంబిస్తే... ఉద్యోగాలు పెరుగుతాయి. 2010 నుంచి 2012 వరకు ఏటా 75 లక్షల ఉద్యోగాలు పెరుగుతూ వచ్చాయి. సానుకూల విధానాలు వెంటనే అమలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అసలు ఆలస్యం చేయకూడదు. కరోనావైరస్‌తో మన ఆర్థిక వ్యవస్థ కుదేలైంది."
"2040 తర్వాత భారత్‌లో చాలా మంది వృద్ధులుగా మారతారు. అలాగే వచ్చే పదేళ్లలో ఉద్యోగాలు చేసే వయసులో ఉండే వారి సంఖ్యా గణనీయంగా పెరుగుతుంది. చాలా మంది యువకులు ఉద్యోగాల కోసం సిద్ధంగా ఉంటారు."
"2010 నుంచి 2012 వరకు ఏటా వ్యవసాయేతర ఉద్యోగాలను 75 లక్షల వరకూ పెంచగలిగాం. ఇప్పుడు అదే వేగంతోనైనా ఉద్యోగాలను పెంచాలి. అయితే నిజానికి ఇంతకంటే చాలా వేగంతో కొత్త ఉద్యోగ అవకాశాలను కల్పించాల్సి ఉంటుంది" అని మెహ్రోత్రా అన్నారు.
జనాభాతో ఎదురయ్యే ఆర్థిక సమస్యలపై పూనం మాట్లాడారు.
"సమీప భవిష్యత్‌లో సగటు జీవిత కాలం పెరగడంతో జనాభా కూడా పెరుగుతుంది. దీంతో పనిచేసే వారి సంఖ్య కూడా ఎక్కువవుతుంది. అదే విధంగా వారికి ఉద్యోగాలు అందుబాటులో ఉంటే.. ఆర్థిక వ్యవస్థకు చాలా మేలు జరుగుతుంది. అందుకే మనం కొత్త ఉద్యోగాల కల్పనపై దృష్టి సారించాలి. అప్పుడు పెరిగే జనాభా మనకు ఒక వనరులా అవుతుంది. ఇది జీడీపీ, ఆర్థిక కార్యకలాపాలకూ ఊతం ఇస్తుంది. మొత్తంగా దేశానికి మేలు జరుగుతుంది. అదే సమయంలో వృద్ధుల సంఖ్య పెరుగుతున్న సంగతి మనం గుర్తుంచుకోవాలి. వారికి అవసరమైన సామాజిక భద్రతనూ కల్పించాలి."

ఫొటో సోర్స్, Getty Images
ఆర్థిక వ్యవస్థపై ప్రభావం
2035నాటికి చైనా ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అవుతుందని లాన్సెట్ పేర్కొంది. అమెరికా రెండు, భారత్ మూడో స్థానాల్లో ఉంటాయని వివరించింది.
"వృద్ధి రేటు, ఉద్యోగ రేటు ఇప్పటిలానే ఉంటే.. మనం మూడో స్థానంలోకి కూడా వెళ్లలేం. ఒకవేళ సగటు వార్షికాదాయం పెరిగకపోతే.. కడు పేదరికంతో పోరాడాల్సి వస్తుంది" అని సంతోష్ మెహ్రోత్రా అన్నారు.
లాన్సెట్ నివేదికలో సగానికి జనాభా పడిపోయిన దేశాలు 23 ఉన్నాయి. వీటిలో జపాన్, స్పెయిన్, ఇటలీ, థాయ్‌లాండ్, దక్షిణ కొరియా, పోలండ్, పోర్చుగల్ ఉన్నాయి.
సగానికిపైగా జనాభా పడిపోతున్న ఈ దేశాలు భారతీయులకు ఆహ్వానం పలకాల్సి వస్తుందని పూనం అన్నారు.
"అయితే, దీని కోసం భారత్ వ్యూహం సిద్ధం చేయాలి. ఒకవేళ ఎలాంటి వ్యూహాలు రచించకపోతే.. ఇంత జనాభా ఉన్నా.. మనం ఏం చేయగలం? అనే పరిస్థితి వస్తుంది. జనాభా పెరుగుదలను అవకాశంగా మలచుకోకపోతే అదే ఒక విపత్తుగా మారే ప్రమాదముంది."
ఇవి కూడా చదవండి:
- ‘పెట్టుబడుల వేటగాడు ముఖేశ్ అంబానీ’ 5జీ నిర్ణయం.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు
- చైనా - భారత్ మధ్య 45 ఏళ్లుగా లేనంత గొడవలు ఇప్పుడెందుకు?
- ఆల్ఫ్స్ పర్వతాలపై భారతీయ పత్రికలు, 1966 విమాన ప్రమాదం నాటివేనా
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
- కరోనావైరస్: ఇండియా గ్లోబల్ హాట్‌స్పాట్‌గా మారిపోతుందా?
- భారత్ - చైనా 1962 యుద్ధం: పిరికిపందల చర్యా లేక నమ్మకద్రోహమా?
- Reality Check: హైస్పీడ్ రైలును నిజంగా చైనానే కనిపెట్టిందా?
- డెక్సామెథాసోన్: కరోనా 'లైఫ్ సేవింగ్' మెడిసిన్‌కు, భారత్‌కు ఉన్న బంధం ఏంటి?
- అమెరికా ఆధిపత్యం పోతుందా? చైనా సూపర్ పవర్ అవుతుందా? కరోనావైరస్‌తో తెర వెనుక జరుగుతున్న యుద్ధాలేమిటి?
- హైదరాబాద్ నుంచి ఇప్పటివరకు ఎంతమంది వెళ్లిపోయారు
- చైనా, ఇరాన్‌ల సీక్రెట్ డీల్: భారత్‌కు ఎంత నష్టం
- భారత్‌పై గూగుల్‌కు అంత ప్రేమ ఎందుకు
- భారతీయ భార్య - చైనా భర్త.. వారిద్దరికీ ఓ కూతురు... వారి జీవితం ఇప్పుడెలా మారింది?
- విటమిన్-డి తీసుకుంటే వైరస్ రాకుండా కాపాడుతుందా
- 2 వేల సంవత్సరాల పురాతన అస్థిపంజరం.. మర్డర్ మిస్టరీలా ఉందంటున్న శాస్త్రవేత్తలు
- లాక్డౌన్లో పెరిగిన గృహ హింస: ‘‘నా భర్త నన్ను భార్యగా చూడలేదు.. శారీరక అవసరాలు తీర్చుకునే ఒక యంత్రంలాగే చూసేవారు’’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








