కరోనావైరస్: ఇండియా గ్లోబల్ హాట్‌స్పాట్‌గా మారిపోతుందా?

ముంబయిలో కరోనావైరస్ ఫేస్ మాస్కు ధరించి ఒక పెయింటింగ్ ముందు నుంచి వెళ్తున్న వృద్ధురాలు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, అపర్ణ అల్లూరి, షాదాబ్ నజ్మి
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

కరోనావైరస్ భారతదేశంలో నెమ్మదిగానే మొదలైంది. అయితే మొదటి కేసు నమోదైన ఆరు నెలలకు అత్యధిక కేసుల సంఖ్యలో రష్యాను దాటేసి ప్రపంచంలో మూడో స్థానానికి చేరుకుంది.

ప్రపంచంలో రెండో అత్యధిక జనాభా ఉన్న భారతదేశం.. గ్లోబల్ హాట్‌స్పాట్ అవుతుందనేది మొదటి నుంచీ ఖాయమేనేమో.

కానీ దేశంలో కేసుల సంఖ్య సమాచారం ప్రశ్నార్థకం. ఎందుకంటే నిర్ధరణ పరీక్షలు తగినంతగా నిర్వహించటం లేదు. పైగా మరణాల రేటు కూడా అసాధారణ రీతిలో తక్కువగా ఉండటం శాస్త్రవేత్తలనూ ఆశ్చర్యపరుస్తోంది.

ఇండియాలో కరోనావైరస్ వ్యాప్తి గురించి మనకు తెలిసిన ఐదు ముఖ్యమైన విషయాలు ఇవీ...

ఇండియాలో కరోనావైరస్ కేసులు వేగంగా పెరిగిపోతున్నాయి
ఫొటో క్యాప్షన్, భారతదేశం అత్యధిక కేసుల సంఖ్యలో ప్రపంచంలో మూడో స్థానానికి చేరుకుంది

1. ఇండియాలో కేసులు వేగంగా పెరిగిపోతున్నాయి

దేశంలో ఇటీవల కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. ప్రతి రోజూ పది వేల నుంచి ఇరవై వేల వరకూ కొత్త కేసులు నమోదవుతున్నాయి. దేశంలో కఠినమైన లాక్‌డౌన్‌ను సడలించిన కొన్ని వారాలకు జూన్‌లోనే అత్యధిక కేసులు నమోదయ్యాయి.

జూలై 7వ తేదీ నాటికి దేశంలో 7,18,664 కేసులు ఉన్నాయి.

అయితే జనాభాలో కేసుల తీవ్రత ఏ స్థాయిలో ఉందనేది అస్పష్టంగానే ఉందని వైరాలజిస్ట్ షాహిద్ జమీల్ పేర్కొన్నారు.

ప్రభుత్వం మే నెలలో రాండమ్‌గా 26,000 మంది నుంచి నమూనాలు సేకరించి పరీక్షించింది. వారిలో 0.73 శాతం మందికి వైరస్ సోకినట్లు ఆ సర్వే చూపింది. అయితే ఈ శాంపిల్ పరిమాణం పట్ల కొందరు నిపుణులు అభ్యంతరం వ్యక్తంచేశారు.

కానీ.. ''ఈ సూచికను దేశవ్యాప్తంగా ఉన్న జనాభాకు వర్తింపచేస్తే మే నెల మధ్య నాటికే కరోనావైరస్ సోకిన వారు కోటి మంది ఉండి ఉండాలి'' అని డాక్టర్ జమీల్ విశ్లేషించారు.

అలాచూసినపుడు.. దేశంలో నిర్ధారిత కేసుల సంఖ్య ప్రతి 20 రోజులకు రెట్టింపు అవుతుండటాన్ని బట్టి.. ప్రస్తుతం మొత్తం మూడు కోట్ల నుంచి నాలుగు కోట్ల మందికి కరోనావైరస్ సోకి ఉండాలి.

నిర్ధారిత కేసుల సంఖ్యకు, వాస్తవంగా వైరస్ సోకిన వారి సంఖ్యకు మధ్య తేడా ప్రతి దేశంలోనూ ఉంటుంది కానీ అది వేర్వేరు స్థాయిలో ఉంటుంది. ఆ తేడాను భర్తీ చేయటానికి ఏకైక మార్గం నిర్ధారణ పరీక్షలు నిర్వహించటం మాత్రమే. ''ఎక్కువ పరీక్షలు చేస్తే ఎక్కువ కేసులు బయటపడతాయి'' అంటారు డాక్టర్ జమీల్.

ఇటీవలి వారాల్లో భారతదేశంలో జరిగింది ఇదే. ప్రభుత్వం పరీక్షలను పెంచటంతో కేసుల సంఖ్య అకస్మాత్తుగా పెరిగింది.

మార్చి 13వ తేదీ నుంచి ఇప్పటి వరకూ కోటికి పైగా పరీక్షలు నిర్వహించింది. అయితే అందులో సాగానికి పైగా పరీక్షలు జూన్ 1వ తేదీ తర్వాతే నిర్వహించారు.

దేశంలో జూన్‌లో పరీక్షల సంఖ్య పెరగటంతో కేసుల సంఖ్య కూడా పెరిగింది
ఫొటో క్యాప్షన్, దేశంలో జూన్‌లో పరీక్షల సంఖ్య పెరగటంతో కేసుల సంఖ్య కూడా పెరిగింది

2. దేశంలో తగిన స్థాయి పరీక్షలు చేయటం లేదు

దేశంలో కేసులకు సంబంధించి అధికారిక సంఖ్య అధికంగానే ఉంది. కానీ తలసరిగా చూస్తే అది చాలా తక్కువగా ఉంది. కేసుల సంఖ్యలో భారతదేశంలో తలసరి సగటు కన్నా ప్రపంచ సగటు మూడు రెట్లు అధికంగా ఉందని ప్రభుత్వమే ఇటీవల ఉటంకించింది.

కానీ.. దేశంలో తలసరి కేసుల సంఖ్య తక్కువగా ఉండటానికి కారణం.. పరీక్షలు అతి తక్కువగా నిర్వహించటం మాత్రమేనని డాక్టర్ జమీల్ అంటున్నారు.

తలసరి కేసుల రేటు అధికంగా ఉన్న దేశాలతో భారతదేశాన్ని పోల్చిచూస్తే.. ఆ దేశాలు మరింత విస్తారంగా పరీక్షలు చేస్తున్నట్లు తేలుతుంది. ఈ కొలతలో చూసినపుడు భారతదేశంలో కేసుల సంఖ్య దాదాపు కనిపించదు. ఎందుకంటే పరీక్షల రేటు అంత తక్కువగా ఉంది మరి.

భారతదేశంలో తలసరి కేసుల సంఖ్య తక్కువగా ఉంది.. తలసరి పరీక్షల సంఖ్య కూడా తక్కువగానే ఉంది
ఫొటో క్యాప్షన్, భారతదేశంలో తలసరి కేసుల సంఖ్య తక్కువగా ఉంది.. తలసరి పరీక్షల సంఖ్య కూడా తక్కువగానే ఉంది

అయితే.. ఎన్ని టెస్టులు చేస్తున్నారన్నదే కాదు.. ఎవరికి పరీక్షలు నిర్వహిస్తున్నారన్నది కూడా ముఖ్యమే.

దేశంలో టెస్ట్ - ట్రేస్ విధానాన్ని మొదట.. హైరిస్క్ కేసులు, వారి కాంటాక్టులకే పరిమితం చేశారు. ఆ తర్వాత కూడా అలాగే కొనసాగిస్తున్నారు కానీ విస్తృత ప్రజానీకానికి దానిని విస్తరించలేదు.

వైరస్ వేగంగా వ్యాప్తి చెందటం మొదలైన తర్వాత టెస్ట్ - ట్రేస్ విధానం సరిపోదని.. కోవిడ్-19 పరీక్షల వ్యూహాలను అధ్యయనం చేసిన గణితనిపుణులు హిమాంశు త్యాగి, ఆదిత్య గోపాలన్‌లు పేర్కొన్నారు. ''టెస్ట్ - ట్రేస్ విధానం నియంత్రణకు ఉపయోగపడుతుంది కానీ.. సమాజంలో తెలియకుండా వ్యాపించిన కేసులను గుర్తించదు'' అని వారు చెప్పారు.

దేశంలో అటువంటి కేసులను గుర్తించాలంటే జనంలో ఎక్కువ మందికి పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. కానీ.. దేశంలో ఎవరికి పరీక్షలు నిర్వహిస్తున్నారనేది మనకు ఎలా తెలుస్తుంది? వివిధ దేశాలు నిర్వహిస్తున్న పరీక్షల సంఖ్యలను పోల్చిచూడటం ఒక్కటే సరిపోదు. ఎందుకంటే కొన్ని దేశాలు తాము ఎంత మందికి పరీక్షలు నిర్వహిస్తున్నామనేది లెక్కిస్తాయి. మరికొన్ని దేశాలు తాము ఎన్ని పరీక్షలు నిర్వహిస్తున్నామనేది లెక్కిస్తాయి.

భారతదేశం ఈ రెండో రకం లెక్కవేస్తుంది. ఆ సంఖ్య కాస్త ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కువ మంది జనం ఒకటి కన్నా ఎక్కువ సార్లు పరీక్షలు చేయించుకుంటారు.

కాబట్టి.. ఒక నిర్ధారిత కేసును కనుగొనటానికి ఎన్ని పరీక్షలు నిర్వహిస్తున్నారు అనే దానిని లెక్కించటానికి శాస్త్రవేత్తలు ప్రాధాన్యం ఇస్తారు. ఎంత ఎక్కువగా పరీక్షలు నిర్వహిస్తే పరీక్షల పరిధి అంత ఎక్కువగా పెరుగుతుంది. ఈ విషయంలో.. వైరస్ వ్యాప్తిని నియంత్రించగలిగిన దేశాలతో పోలిస్తే భారతదేశం పనితీరు పేలవంగా ఉంది.

ఒక కేసు నిర్ధారణకు ఎన్ని ఎక్కువ పరీక్షలు చేస్తే.. పరిధి అంత విస్తృతమవుతుంది
ఫొటో క్యాప్షన్, ఒక కేసు నిర్ధారణకు ఎన్ని ఎక్కువ పరీక్షలు చేస్తే.. పరిధి అంత విస్తృతమవుతుంది

ఎంత విస్తృతంగా పరీక్షలు నిర్వహిస్తే.. పాజిటివ్ కేసులు వచ్చే రేటు అంత తక్కువగా ఉంటుంది. న్యూజిలాండ్, తైవాన్‌లలో పాజిటివ్ కేసుల రేటు 1 శాతం కన్నా తక్కువ ఉండటానికి కారణం ఇదే.

భారదేశంలో పరీక్షల్లో పాజిటివ్ రేటు ఏప్రిల్‌లో 3.8 శాతంగా ఉంటే జూలైలో 6.4 శాతానికి పెరిగింది. ఇది ఇలా పెరుగుతూ పోతోందంటే.. నిర్ధారణ పరీక్షలు అతి చిన్న బృందమైన హైరిస్క్ ప్రజలు, వారి కాంటాక్టులకే ఇంకా పరిమితమై ఉండటం వల్లే.

3. దేశంలో కోలుకుంటున్న వారి సంఖ్య ఆశాజనకంగా ఉంది

దేశంలో కరోనావైరస్ గణాంకాలు.. ఇది సోకుతున్న వారి కన్నా, చనిపోతున్న వారి కన్నా ఎక్కువ మంది కోలుకుంటున్నట్లు సూచిస్తున్నాయి.

వైరస్ గమనాన్ని అంచనా వేయటానికి.. నిర్ధారిత కేసులు, కోలుకుంటున్న వారు, మరణాల సంఖ్య రెట్టింపు కావటానికి ఎన్ని రోజులు పడుతుందనేది గమనించటం శాస్త్రవేత్తలకు ఉపయోగకరంగా ఉంది. ఇలా రెట్టింపు కావటానికి ఎంత ఎక్కువ కాలం పడితే అంత మంచిది.

దేశంలో మరణాల రేటు కన్నా రికవరీ రేటు వేగంగా ఉంది
ఫొటో క్యాప్షన్, దేశంలో మరణాల రేటు కన్నా రికవరీ రేటు వేగంగా ఉంది

అయితే.. దేశంలో రెట్టింపు రేటు పట్ల శాస్త్రవేత్తల్లో సందేహాలున్నాయి. పరీక్షల రేటు తక్కువగా ఉండటం అంటే.. నమోదయ్యే కొత్త కేసుల సంఖ్య తక్కువగా ఉండటమే. అంటే కేసుల సంఖ్య పెరగటం నెమ్మదిగా జరుగుతున్నట్లు కనిపిస్తుంది. దానివల్ల.. నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్యతో పోల్చినపుడు కోలుకుంటున్న రేటు వేగంగా ఉన్నట్లు కనిపిస్తుంది.

ఇలాంటి పరిస్థితుల్లో మరణాల రేటు రెట్టింపు అవటాన్ని పరిశీలించాలని డాక్టర్ జమీల్ పేర్కొన్నారు. దేశంలో కరోనా మరణాల రేటు రెట్టింపు అవటానికి ప్రస్తుతం 26 రోజులు పడుతోంది. ఒకవేళ ఈ రోజుల సంఖ్య తగ్గితే ఆస్పత్రుల మీద ఒత్తిడి పెరుగుతుంది. దానివల్ల మరణాలు పెరిగే అవకాశమూ ఉంది.

ప్రపంచవ్యాప్తంగా చూస్తే.. కరోనావైరస్ ప్రభావం అత్యంత తీవ్రంగా ఉన్న దేశాలతో పోల్చినపుడు భారతదేశంలో.. కోలుకుంటున్న రేటు వంపు (కర్వ్) నిటారుగా ఉన్నట్లు కనిపిస్తుంది. అంటే అమెరికా, బ్రెజిల్ దేశాల్లో రోగుల కన్నా భారతదేశంలో కోవిడ్ రోగులు వేగంగా కోలుకుంటున్నారని అర్థం.

దేశంలో కోలుకుంటున్న వాటా - అంటే మొత్తం కేసుల్లో కోలుకుంటున్న వారి శాతం - కూడా ఎక్కువగా ఉంది. ఈ వాటా అమెరికాలో 27 శాతంగా ఉంటే.. భారతదేశంలో దానికన్నా చాలా అధికంగా 60 శాతంగా ఉంది.

దేశంలో రికవరీలు వేగంగా పెరుగుతున్నట్లు కనిపిస్తోంది
ఫొటో క్యాప్షన్, దేశంలో రికవరీలు వేగంగా పెరుగుతున్నట్లు కనిపిస్తోంది

అయితే.. రికవరీల విషయంలో గణాంకాలు గందరగోళంగా ఉన్నాయి. నిర్వచనం కూడా భిన్నంగా ఉంది.

ఎవరైనా సరే కోవిడ్ పాజిటివ్‌గా వైద్య పరీక్షలో నిర్ధారణ అయ్యి.. కొన్ని వారాల తర్వాత నిర్వహించే పరీక్షలో నెగిటివ్‌గా నిర్ధారణ అయితే.. వారు కోలుకున్నట్లు భారతదేశం నిర్వచనం చెప్తోంది. కొన్ని దేశాల్లో ఆస్పత్రుల్లో చేరిన కేసుల్లో పూర్తిగా కోలుకున్న వారిని మాత్రమే రికవరీలుగా లెక్కిస్తున్నారు. బ్రిటన్‌లో రికవరీలు తక్కువగా ఉండటానికి ఇదే కారణం కావచ్చు.

అయితే.. ఆయా దేశాల్లో ఎంతమంది కోలుకుంటున్నారు అనేదానితో నిమిత్తం లేకుండా.. భారతదేశంలో కోలుకుంటున్న వారి వాటా అధికంగా ఉంది.

అందుకే.. దేశంలో నమోదైన మరణాల రేటు కూడా తక్కువగా ఉంది.

4. భారతదేశంలో మరణాల రేటు చాలా తక్కువగా ఉంది

దేశంలో ఇప్పటివరకూ కోవిడ్ కారణంగా 20,160 మంది చనిపోయినట్లు లెక్కలు చెప్తున్నాయి. సంఖ్యా పరంగా చూస్తే ప్రపంచంలో ఇది ఎనిమిదో అత్యధిక సంఖ్య. కానీ పది లక్షల మందికి తలసరి రేటు ప్రకారం చిసినపుడు ఇది తక్కువగా ఉంది.

''అలా చూసినపుడు భారతదేశంలో మరణాల రేటు పశ్చిమ యూరప్‌లో మరణాల రేటులో ఓ చిన్న తునక మాత్రమే'' అంటారు బ్రూకింగ్స్ ఇన్‌స్టిట్యూట్‌ ఆర్థికవేత్త షమిక రవి.

మరణాల రేటులో ఇండియాకు, యూరప్‌కు మధ్య ఉన్న తేడాకు కారణాన్ని.. దేశంలో మరణాల సంఖ్య తక్కువగా నమోదవుతుందనే అంశం విశదీకరించటం లేదని ఆమె అభిప్రాయపడ్డారు.

చాలా పశ్చిమ దేశాల కన్నా భారతదేశం చాలా తక్కువ మరణాలు నమోదు చేస్తోంది
ఫొటో క్యాప్షన్, చాలా పశ్చిమ దేశాల కన్నా భారతదేశం చాలా తక్కువ మరణాలు నమోదు చేస్తోంది

''దేశంలో నిజంగానే మరణాల రేటు అధికంగా ఉన్నట్లయితే.. ఏ గణాంకాలూ దానిని దాచి ఉండగలిగేవి కాదు. ఎందుకంటే ఇప్పుడున్న దానికన్నా 20 - 40 రెట్లు అధిక మరణాలు ఉండాలి'' అని షమిక విశ్లేషించారు.

భారతదేశంలో మరణాల రేటు తక్కువగా ఉన్నట్లుగానే.. ఈ ప్రాంతంలోని పాకిస్తాన్, ఇండొనేసియా వంటి ఇతర దేశాల్లో కూడా తక్కువగా ఉన్నాయి.

ఇందుకు కారణం.. వైరస్‌ ప్రభావం అత్యంత తీవ్రంగా ఉన్న పశ్చిమ దేశాలతో పోలిస్తే.. ఈ ప్రాంతంలో ఇతర వైరస్‌ల వ్యాప్తి అధికంగా ఉండటం, ఈ దేశాల్లో వ్యాపిస్తున్న రకం వైరస్ తీవ్రత తక్కువగా ఉండటం, ఈ దేశాల్లో సగటు యువ జనాభా ఎక్కువగా ఉండటం వంటి అనేక వాదనలు వినిపిస్తున్నాయి.

''ప్రతి దేశమూ తన గణాంకాలను తారుమారు చేస్తూ ఉండజాలదు. బహుశా ఈ ప్రాంత జనాభాలో ఇతర ఇన్ఫెక్షన్ల తీవ్రత అధికంగా ఉండటం వల్ల వీరిలో స్వతహాగా రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండి ఉండొచ్చేమో. కానీ ఇక్కడ మరణాల రేటు తక్కువగా ఉండటానికి కారణం ఏమిటనేది మనకు ఇంకా తెలియదు'' అని డాక్టర్ జమీల్ చెప్పారు.

5. ఒక్క రోష్ట్రంలో ఒక్కో భిన్నమైన కథ

అమెరికా లేదా యూరోపియన్ యూనియన్ తరహాలోనే.. భారదేశంలోని రాష్ట్రాల మధ్య కూడా కరోనావైరస్ గణాంకాల విషయంలో చాలా తేడాలున్నాయి.

ప్రస్తుతం దేశంలోని మొత్తం కేసుల సంఖ్యలో మూడు రాష్ట్రాలు - దిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల వాటా దాదాపు 60 శాతంగా ఉంది.

రాష్ట్రాల వారీగా కరోనావైరస్ కేసులు

కొన్ని ప్రాంతాల్లో కేసుల సంఖ్య తరిగిపోతే.. కొన్ని ప్రాంతాల్లో పెరిగిపోయాయి. ఇప్పుడు దక్షిణాదిన కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. మరో దక్షిణాది రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో కూడా కేసుల సంఖ్య స్థిరంగా పెరుగుతోంది.

కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో కేసులు వేగంగా పెరుగుతున్నాయి
ఫొటో క్యాప్షన్, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో కేసులు వేగంగా పెరుగుతున్నాయి

కరోనావైరస్ విషయంలో భారతదేశం ప్రతిస్పందన ఇప్పటివరకూ కేంద్రీకృతంగా ఉంది. మారాల్సిన అంశాల్లో ఇది ఒకటని నిపుణులు అంటున్నారు.

''కరోనావైరస్‌కు వ్యతిరేకంగా విజయవంతమైన వ్యూహాన్ని అమలు చేయటానికి దేశాన్ని జిల్లాలుగా విభజించాల్సి ఉంటుంది. ఎందుకంటే మరోసారి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధిస్తే.. దాని సమర్థత గత లాక్‌డౌన్ కన్నా కూడా తక్కువగా ఉండొచ్చు'' అని డాక్టర్ జమీల్ అభిప్రాయపడ్డారు.

అలాగే.. రాష్ట్ర స్థాయి క్రోడీకరణలకు బదులు.. క్షేత్రస్థాయిలో స్థానిక సమాచారం సేకరించి విశ్లేషించటం అవసరమని డాక్టర్ షమిక పేర్కొన్నారు. ''ప్రతి మండలంలో ఎవరికైనా లక్షణాలు ఉన్నాయా అనేది తెలుసుకుని తీరాలి'' అంటారామె.

BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు

కరోనావైరస్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి?

BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

భారత్‌లో కరోనావైరస్ కేసులు

ఈ సమాచారం ఎప్పటికప్పుడు అప్‌‌డేట్ అవుతుంది. కానీ, ప్రతి రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించిన తాజా సమాచారం వెంటనే కనిపించకపోవచ్చు

రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతం మొత్తం కేసులు కోలుకున్నవారు మరణాలు
మహారాష్ట్ర 1351153 1049947 35751
ఆంధ్రప్రదేశ్ 681161 612300 5745
తమిళనాడు 586397 530708 9383
కర్నాటక 582458 469750 8641
ఉత్తరాఖండ్ 390875 331270 5652
గోవా 273098 240703 5272
పశ్చిమ బెంగాల్ 250580 219844 4837
ఒడిశా 212609 177585 866
తెలంగాణ 189283 158690 1116
బిహార్ 180032 166188 892
కేరళ 179923 121264 698
అస్సాం 173629 142297 667
హరియాణా 134623 114576 3431
రాజస్థాన్ 130971 109472 1456
హిమాచల్‌ ప్రదేశ్ 125412 108411 1331
మధ్యప్రదేశ్ 124166 100012 2242
పంజాబ్ 111375 90345 3284
ఛత్తీస్‌గఢ్ 108458 74537 877
జార్ఖండ్ 81417 68603 688
ఉత్తర్‌ప్రదేశ్ 47502 36646 580
గుజరాత్ 32396 27072 407
పుదుచ్చేరి 26685 21156 515
జమ్మూ కశ్మీర్ 14457 10607 175
చండీగఢ్ 11678 9325 153
మణిపుర్ 10477 7982 64
లద్దాఖ్ 4152 3064 58
అండమాన్ - నికోబార్ దీవులు 3803 3582 53
దిల్లీ 3015 2836 2
మిజోరమ్ 1958 1459 0

ఆధారం: ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ

‌అప్‌డేట్ అయిన సమయం 11: 30 IST

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

కరోనావైరస్ హెల్ప్ లైన్
కరోనావైరస్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)