కరోనావైరస్: హైదరాబాద్‌లో కోవిడ్-19 రోగులకు ఎన్ని బెడ్‌లు అందుబాటులో ఉన్నాయి.. వైరస్ సోకితే మొదట ఎక్కడకు వెళ్లాలి

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, దీప్తి బత్తిని
- హోదా, బీబీసీ ప్రతినిధి
హైదరాబాద్‌లోని జీహెచ్ఎంసీ పరిధిలో కరోనావైరస్ వ్యాప్తి రోజురోజుకీ తీవ్రమవుతుండడంతో ఆసుపత్రుల్లోని పడకల కోసం డిమాండ్ పెరుగుతోంది.
కరోనా అనుమానిత లక్షణాలున్నవారు అనేక ప్రైవేట్, ప్రభుత్వ ఆసుపత్రులు తిరిగినా సమయానికి వైద్యం అందక ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు జరిగాయి.
కొందరు బాధితులు వైద్య ఆరోగ్య శాఖ మంత్రికే ఫోన్ చేసి తమ గోడు వెళ్లబోసుకొని సాయం చెయ్యమని కోరుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
“నా పేరు ఎం.డి. రఫీ. నాకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో నగరంలోని వివిధ ఆస్పత్రులను సంప్రదించాను. వాళ్లు చేర్చుకునేందుకు నిరాకరించారు. చివరకు ఇంటర్నెట్‌లో ఆరోగ్య శాఖ మంత్రి నంబర్ చూసి ఫోన్ చేశాను. రాత్రి 12 గంటల సమయంలో ఫోన్ చేసినప్పటికీ ఆయన ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడి వాళ్ల పీఏకి చెప్పారు. ఆయన ఫోన్ చేసి నన్ను ఆసుపత్రిలో చేర్పించారు” అని బీబీసీకి తెలిపారు రఫీ.
ఇందుకు భిన్నంగా గత నెలలో రోహిత్, రవి అనే ఇద్దరిని ఏ ఆసుపత్రిలోనూ చేర్చుకోకపోవడంతో సమయానికి వైద్యం అందక ప్రాణాలు కోల్పోయారు.
రఫీలా ఎంత మంది మంత్రికి సమయానికి ఫోన్ చేయగలరు? ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని సహాయం కోసం అర్థిస్తూ అర్ధరాత్రి మంత్రికి ఫోన్ చేయాల్సిన పరిస్థితులు రావటం ఏంటి?
ఆయన ప్రమేయం లేకుండా పనులు జరగడం లేదంటే వ్యవస్థ ఎంత దారుణంగా ఉందో తెలుస్తోందని అంటున్నారు.. తమ పేర్లు వెల్లడించడానికి ఇష్టపడని కొందరు వైద్య నిపుణులు.

ఫొటో సోర్స్, Getty Images
తెలంగాణ ప్రభుత్వం జూన్ 19 నుంచి కరోనావైరస్ నిర్ధరణ పరీక్షల సంఖ్య పెంచింది.
పరీక్షలు చేసేందుకు ప్రైవేట్ ల్యాబులకు ఐసీఎంఆర్ మార్చి నెలలో అనుమతులు ఇచ్చినా.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం అందుకు అనుమతించలేదు. దీనిపై హైకోర్టు ప్రశ్నించటంతో ప్రైవేటు ల్యాబ్‌లలో కరోనావైరస్ నిర్ధరణ పరీక్షలకు జూన్ 15 నుంచి అనుమతించింది తెలంగాణ ప్రభుత్వం.
అప్పటి వరకు రోజుకి 300 నుంచి 400 వరకు పరీక్షలను నిర్వహించినప్పటికీ.. ఆ తర్వాత క్రమంగా వాటి సంఖ్యను పెంచుతూ వచ్చారు. ప్రస్తుతం.. రోజుకు 5000 పరీక్షలు నిర్వహిస్తున్నారు. జులై 6న రాష్ట్రంలో 1831 కేసులు నమోదు కాగా 11 మంది మరణించారు. అందులో 1419 కేసులు జి.హెచ్.ఎం.సి. పరిధిలోనే ఉన్నాయి.
కరోనావైరస్ నిర్ధరణ పరీక్షలతో పాటు కొన్ని ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో కరోనావైరస్ రోగులకు చికిత్స కోసం అనుమతులు కూడా ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. నిర్దేశిత ధరలకే వైద్యం అందించాలని ఉత్తర్వులు కూడా జారీ చేసింది.
జీహెచ్ఎంసీ పరిధిలో సుమారు 25 కార్పొరేట్ ఆసుపత్రులు కరోనావైరస్ రోగులకు చికిత్స అందిస్తున్నాయి.
ప్రభుత్వ ఆసుపత్రులైన గాంధీ, ఉస్మానియా, కింగ్ కోఠీ, కోరంటి, చెస్ట్ ఆసుపత్రులు ఉన్నప్పటికీ అక్కడ అందిస్తున్న వైద్యంపై నమ్మకం లేక కార్పొరేట్ ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు రోగులు.
కానీ అందరికి కార్పొరేట్ ఆసుపత్రులలో పడకలు దొరకడం లేదు. బీమా ఉన్నవారిని రెండో ప్రాధాన్యంగా పరిగణిస్తున్నాయని పడకలు లేవని చెబుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
కార్పొరేట్ ఆసుపత్రుల ప్రతినిధి ఒకరు బీబీసీ తెలుగుతో మాట్లాడుతూ, “ప్రభుత్వం నిర్దేశించిన ధర ఆరోగ్య బీమా కూడా లేని బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం. వివిధ ఆరోగ్య బీమా సంస్థలు తమ పాలసీదారులకు కూడా అదే ధరకు చికిత్స అందించాలని కోరుతున్నాయి. అంత తక్కువ ధర సాధ్యం కాదు” అని తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
కార్పొరేట్ ఆసుపత్రులలో పడకలు లేవా?
కార్పొరేట్ ఆసుపత్రులలో కరోనావైరస్ రోగులకు చికిత్స కోసం చేసిన ఏర్పాట్ల గురించి ఆయన వివరిస్తూ ఒక్కో ఆసుపత్రులలో దాదాపు 300 నుంచి 800 వరకూ పడకలుంటాయని తెలిపారు.
“వాటిలో 30 శాతం కోవిడ్ కోసం కేటాయించాం. వేర్వేరు విభాగాలుగా పడకలను ఏర్పాటుచేశాం. ఉదాహరణకు 500 పడకలు ఉన్న ఆసుపత్రిలో 50 ఐసోలేషన్‌కు, 80 ఐసీయూల్లో, వెంటిలేటర్‌తో కూడిన ఐసీయూల్లో 20, ఇలా మొత్తం 150 దాకా కోవిడ్ రోగుల కోసం కేటాయించాం. మొత్తంగా జిహెచ్ఎంసి పరిధిలోని కార్పొరేట్ ఆస్పత్రులలో కోవిడ్ రోగుల కోసం దాదాపు 2500 బెడ్లు కేటాయించగా... అందులో 800 వరకు వెంటిలేటర్‌తో కూడిన ఐసీయూ పడకలు” అని వివరించారు. అయితే ప్రస్తుతం దాదాపుగా ఏ ఆస్పత్రిలోనూ బెడ్స్ ఖాళీ లేవని ఆయన చెప్పుకొచ్చారు.
కరోనావైరస్ పాజిటివ్ వచ్చి లక్షణాలు లేని వారు, అనుమానిత లక్షణాలు ఉన్నవారే ఎక్కువ శాతం ఆసుపత్రులలో చేరినట్టు పేరు వెల్లడించడానికి ఇష్టపడని మరో ఆస్పత్రి ప్రతినిధి చెప్పారు.
“మేం ఆసుపత్రి పెట్టింది ప్రజాసేవ కోసమే. అయితే, మా మనుగడా మేం చూసుకోవాలి కదా. ఆసుపత్రి సిబ్బంది జీతాలు, వివిధ రకాల టెస్టులకయ్యే ఖర్చులు, ఔషధాలు, వ్యక్తిగత పరిరక్షణ కిట్లు, ఆక్సిజన్ ధరలు అన్నీ పెరిగిపోయాయి. అయినా, పడకలు ఖాళీగా ఉంటే లేవని ఎందుకు చెబుతాం?” అని కార్పొరేట్ ఆసుపత్రులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు.
తమ సమస్యలను ఆరోగ్యశాఖ మంత్రి, ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లారు కార్పొరేట్ ఆసుపత్రుల ప్రతినిధులు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో 92 శాతం పడకలు ఖాళీ
తెలంగాణ లోని ప్రభుత్వ ఆసుపత్రులలో 92 శాతం పడకలు ఖాళీ ఉన్నాయని అధికారులు తెలిపారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో మొత్తం 17081 బెడ్‌లు ఉంటే అందులో 11928 ఐసొలేషన్ కోసం ఏర్పాటు చేయగా వాటిలో 11268 ఖాళీ ఉన్నాయి .
ఆక్సిజన్ అందించే సదుపాయంతో ఉన్న బెడ్‌లు 3,537 కాగా అందులో 3,041 ఖాళీ ఉన్నాయి, 1,616 ఐసీయు బెడ్‌లు అయితే అందులో 1,437 ఖాళీ ఉన్నాయి. వెంటిలేటర్‌తో ఉన్న బెడ్‌లు 471 ఉన్నాయి..
మొత్తం 17081 బెడ్‌లలో 15746 ఖాళీగా ఉన్నాయని ప్రజారోగ్య అధికారులు తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎవరికైనా కరోనావైరస్ లక్షణాలుంటే ఏం చేయాలి?
“కరోనావైరస్ అనుమానిత లక్షణాలు, శ్వాసకోశ సమస్యలు వస్తే ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లదల్చుకుంటే ముందుగా కరోనావైరస్ నిర్ధరణ పరీక్షల కోసం కింగ్ కోఠీ ఆసుపత్రికి వెళ్లాలి.
అక్కడ పరీక్షలు చేసి అవసరాన్ని బట్టి అక్కడే చేర్చుకొని వైద్యం అందిస్తారు.
కరోనావైరస్ నిర్ధరణ అయ్యే వరకు అక్కడే ఉంచుతారు. పాజిటివ్ వస్తే ఉన్న లక్షణాల తీవ్రత బట్టి గాంధీ ఆసుపత్రికి తరలిస్తారు. ముందుగానే కరోనావైరస్ నిర్ధరణ పరీక్ష చేయించుకొని పాజిటివ్ వచ్చి, ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం కావాలనుకుంటే కరోనావైరస్ నిర్ధరణ రిపోర్ట్ తీసుకొని గాంధీ ఆసుపత్రికి కూడా వెళ్లవచ్చు.
కేవలం ఊపిరితిత్తుల సమస్య అయితే ఉస్మానియా ఆసుపత్రికి వెళ్లమని” సూచిస్తున్నామని చెప్పారు ఆరోగ్య వైద్య విద్యా డైరెక్టర్ డా.రమేష్ రెడ్డి.
కరోనావైరస్ కోసం కేటాయించిన ప్రభుత్వ ఆసుపత్రులలో గాంధీ, కింగ్ కోఠీ, కోరంటి, చెస్ట్ ఆసుపత్రులలో పడకలు ఖాళీ ఉన్నాయి, ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని ఆరోగ్య శాఖ అధికారులు అంటున్నారు.
త్వరలోనే గచ్చిబౌలీ స్టేడియంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక ఆస్పత్రిని కూడా అందుబాటులోకి తెచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
కార్పొరేట్ ఆసుపత్రుల్లోని పడకలు ప్రభుత్వ పర్యవేక్షణలోకి?
అయితే మున్ముందు కేసుల సంఖ్య మరింత తీవ్రమయ్యే అవకాశాలుండడంతో కార్పొరేట్ ఆసుపత్రుల్లోని పడకలు రాష్ట్ర ప్రభుత్వం తమ పర్యవేక్షణలోకి తీసుకోనుంది. పూర్తి పారదర్శకతతో ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే కార్పోరేట్ ఆసుపత్రులలో చికిత్స అందిస్తామంటున్నారు ఆరోగ్య శాఖ అధికారులు. అంతేకాదు ప్రైవేట్ వైద్య కళాశాలల్లోని పడకలను కూడా తమ పర్యవేక్షణలోకి తీసుకునే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.
కరోనావైరస్ అనుమానిత లక్షణాలతో లేదా ఊపిరితిత్తుల సమస్యతో కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్తే వెంటనే వారిని చేర్చుకొని కరోనావైరస్ నిర్ధరణ పరీక్షలు చేసి వైద్యం మొదలు పెట్టాలి. కాని ప్రతీ సారి అలా జరగడం లేదన్నది ప్రధాన ఆరోపణ.
గత నెలల్లో మరణించిన రోహిత, రవి సంఘటనలే అందుకు ఉదాహరణలు. అయితే తీవ్రంగా జబ్బుపడిన వారికి చికిత్స అందించేందుకు కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు సుముఖంగా లేవని కార్పొరేట్ ఆసుపత్రుల ప్రతినిధి ఒకరు బీబీసీకి చెప్పారు.
ఊపిరితిత్తుల సమస్యలు, హైపర్ టెన్షన్, మధుమేహం, కిడ్నీ వ్యాధులు ఉన్న వారిలో కరోనావైరస్ తీవ్రంగా ఉంటే వారు మరణించే అవకాశం ఎక్కువగా ఉంటోంది.
“అలా మరణించిన వారి కుటుంబ సభ్యులు ఆగ్రహంతో ఇష్టాను సారం వ్యవహరించి మా ఆసుపత్రుల ప్రతిష్ఠ దెబ్బ తీసేవిధంగా వ్యవహరించిన సంఘటనలు చాలా జరిగాయి. అందుకే కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులు పరిస్థితి విషమించిన వారికి చికిత్స అందించే విషయంలో కొన్ని సార్లు వెనకడుగు వేస్తున్నాయి” అంటున్నారు తమ పేర్లు వెల్లడించడానికి ఇష్టబడని కొందరు ప్రజారోగ్య నిపుణులు.
"ప్రభుత్వం ముందునుంచీ కూడా పారదర్శకతతో సరైన సమాచారాన్ని ప్రజల ముందు పెట్టి ఉండి ఉంటే ఇవాళ ఆస్పత్రులలో బెడ్లు ఉన్నాయో లేవో తెలియక, కార్పొరేట్ ఆసుపత్రులకు ఎంతైనా చెల్లించడానికైనా సిద్ధపడుతూ ప్రజలు భయాందోళన చెందే పరిస్థితి వచ్చి ఉండేది కాదు. ఇప్పటికైనా అవసరమైన మేరకు కార్పొరేట్ ఆసుపత్రుల్లోని పడకలను ప్రభుత్వం తమ పర్యవేక్షణలోకి తీసుకుని చిత్తశుద్ధితో ఎప్పటికప్పుడు ఖాళీ పడకల సమాచారం అందరికి అందుబాటులో ఉంచాలి."
ఇవి కూడా చదవండి:
- జపాన్‌లో ఐదు నెలల్లో 1,000 లోపే కోవిడ్ మరణాలు... జపనీయుల అజేయ శక్తి వెనుక మిస్టరీ ఏమిటి?
- హైదరాబాద్: నిజాం పాలకుల క్వారంటైన్ హాస్పిటల్... ఇప్పుడు కోరంటి దవాఖానా
- కరోనావైరస్: ప్రపంచ చరిత్రను మార్చేసిన అయిదు మహమ్మారులు
- అబద్ధాలు చెప్పే వారిని ఎలా గుర్తించాలి?
- ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన నగరం కారకస్‌లో రాత్రి జీవితం ఎలా ఉంటుంది?
- టైఫాయిడ్ వ్యాప్తికి కారణమైనందుకు 26 ఏళ్లపాటు ఓ దీవిలో మహిళ బందీ
- హెరాక్లియాన్: సముద్రగర్భంలో కలిసిన ఈజిఫ్టు ప్రాచీన నగరం కథ
- నమ్మకాలు-నిజాలు: పత్యం అంటే ఏమిటి? పాటించకపోతే ఏమవుతుంది?
- 'రాక్షసుడి బంగారం' బయటకు తీసే కార్మికుల కథ
- పెద్ద భోషాణం.. దాని నిండా బంగారం, వజ్ర వైఢూర్యాలు.. పద్యం ఆధారంగా గుప్త నిధిని కనిపెట్టిన వ్యక్తి
- బంగారం ధరలకు, అంతర్జాతీయ సంక్షోభాలకు ఏమిటి సంబంధం...
- ‘సెక్స్ గురువు' ఓషో రజనీష్ 'రహస్యాల'పై నోరు విప్పిన బాడీగార్డ్
- నా గర్ల్‌ఫ్రెండ్ నన్ను ఎలా చిత్రహింసలు పెట్టిందంటే..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








