అబద్ధాలు చెప్పే వారిని ఎలా గుర్తించాలి?

అబద్ధాలు గుర్తించడం ఎలా

ఫొటో సోర్స్, Getty Images

మీరు నిజాయితీపరులా?

సామాజిక జీవనంలో మానవుల అబద్ధాలు చెప్పడం మామూలైపోయింది. కానీ, ఎవరైనా అబద్ధాలు చెబుతున్నారని ఎలా గుర్తించాలి. నిజానికి, అబద్ధం చెప్పే వారిని గుర్తించడానికి చాలా నైపుణ్యం కావాలి.

అయితే, అబద్ధాలను గుర్తించడానికి కొన్ని చిన్న చిన్న చిట్కాలున్నాయి.

జంతు శాస్త్రవేత్త, రచయిత లూసీ కుక్ జంతువులు, మానవులలో సందిగ్ధ ప్రవర్తన ఎందుకు ఉంటుందో వివరించారు.

అబద్ధాలు గుర్తించడం ఎలా..

ఫొటో సోర్స్, Getty Images

శాంతి కోసం సత్యాన్ని మార్చేస్తారు

'అబద్ధం' అంటే.. ఎవరో ఒకరు మనల్ని మాటలతో లేదా చర్యలతో మోసం చేయడం. వాస్తవానికి సాధారణ సంభాషణ మాత్రమే వాస్తవాల మధ్య నడుస్తుంది.

మీరు చేసిన ప్రతి సంభాషణలో మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ గురించి, మీ జీవిత నిర్ణయాల గురించి నిజంగా ఏమనుకుంటున్నారో చెప్పమనండి. అవి వింటే మీరు భరించలేరు.

మనకు తెలిసిన వ్యక్తి కొత్త హేయిర్ స్టైల్‌ నచ్చలేదనుకోండి మనలో చాలా మంది ఆ విషయం ఆయనకు చెప్పడానికి సాహసించరు.

100 శాతం నిజాయితీగా ఉండటం వల్ల మంచి కంటే చెడే ఎక్కువ కలుగుతుందని మనకు తెలుసు. సామాజిక జీవనంలో ఇలాంటి చర్యలు కనిపిస్తుంటాయి.

మనం అబద్ధాలు ఆడుతున్నామా అంటే... అవుననే చెప్పాలి. ఇలా చెప్పడం వల్లే సామాజిక బంధాలు కొనసాగుతున్నాయి. ప్రపంచం శాంతియుతంగా ఉంది.

అబద్ధాలు గుర్తించడం ఎలా..

ఫొటో సోర్స్, Getty Images

మూడో వంతు ప్రజలు రోజూ అబద్ధాలాడుతున్నారు

''మన చుట్టూ ఉన్న ప్రపంచంలో మూడో వంతు మంది రోజూ అబద్ధాలు చెబుతున్నారు'' అని సైకాలజిస్టు రిచర్డ్ వైస్‌మెన్ అంటారు.

ఇటీవల ఒక సర్వే చేయగా అయిదు శాతం మంది తాము ఎప్పుడూ అబద్ధం చెప్పలేదని అన్నారు.

అంటే సర్వే విషయంలో కూడా కొందరు నిజాలు చెప్పడలేదని అనిపిస్తుంది.

అబద్ధాలు గుర్తించడం ఎలా..

ఫొటో సోర్స్, Getty Images

న్యాయమూర్తుల కంటే ఖైదీలే అబద్ధాలను మెరుగ్గా గుర్తించగలరు

''అబద్ధం చెప్పడం మనకు బాగానే ఉంటుంది. కానీ, మనం అబద్ధాన్ని సరిగ్గా గుర్తించలేం'' అని రిచర్డ్ చెబుతుంటారు.

మోసాన్ని గుర్తించడంలో మనకు చక్కటి నైపుణ్యం ఉందని భావిస్తాం. కానీ, ఇద్దరు వ్యక్తులను ప్రయోగశాలకి పంపి, ఒక వ్యక్తి అబద్ధం ఎక్కడ చెబుతున్నాడో, నిజం ఎక్కడ చెబుతున్నాడో వారిద్దరికి వీడియోలో వేర్వేరుగా చూపెట్టి అడిగితే 50 శాతం మంది మాత్రమే సరైన సమాధానం ఇచ్చారు.

పోలీసులు, న్యాయవాదులు, న్యాయమూర్తుల విషయంలో కూడా ఇలానే జరిగింది.

ఒక్క ఖైదీలు మాత్రమే ఈ విషయంలో మెరుగ్గా కనిపించారు.

అబద్ధాలు గుర్తించడం ఎలా..

ఫొటో సోర్స్, Getty Images

కళ్లను కాదు చెవులను నమ్మండి

మనం అబద్ధాలను గుర్తించడంలో వెనబడి ఉండటానికి కారణం మనం దృశ్య జీవులం కావడమే కారణం. అంటే, మనమంతా కళ్లతో చూసిందే నిజమని భ్రమిస్తుంటాం.

మన మెదడులోని ప్రధాన భాగం కంటి నుంచి వచ్చిన దృశ్యాలను విశ్లేషిస్తుంది. ఈ సమాచారం పైనే మనం ఆధారపడుతుంటాం.

కూర్చున్న సీటులో కదలాడటం, సంజ్ఞలు, ముఖ కవళికల సహాయంతో ఒక వ్యక్తి నిజం చెబుతున్నాడా, అబద్ధం చెబుతున్నాడా? అనేది కొంతవరకు తెలుసుకోవచ్చు. అబద్ధాలు చెప్పడంలో ఆరితేరిన వారికి ఈ విషయం బాగా తెలుసు. అందుకే వారు ఇలాంటి వాటిని అదుపులో ఉంచుకుంటారు.

ఇలాంటి వారు అబద్ధం చెబుతున్నది కనిపెట్టడం చాలా కష్టం.

కానీ, అబద్ధాలు చెప్పేవారు సాధారణంగా చాలా తక్కువగా మాట్లాడుతుంటారు. మన ప్రశ్నకు చాలా సమయం తీసుకున్నతర్వాత నోరు తెరుస్తారు. అబద్ధం చెబుతున్నప్పుడు మానసికంగా వారి నుంచి వారు దూరం అవుతారు. అందువల్ల నేను, నాది, నాకు అనే పదాలను అబద్ధం చెబుతున్నప్పుడు వదిలేస్తుంటారు.

అబద్ధాలు గుర్తించడం ఎలా..

ఫొటో సోర్స్, Getty Images

Q పరీక్షలో తెలుసుకోవచ్చు

అబద్ధాలు చెప్పేవారిని గుర్తించేందుకు రిచర్డ్ వైస్‌మెన్ ఒక ప్రయోగం చేశారు. ఈ ప్రయోగంలో పాల్గొనేవారిని రెండు వర్గాలుగా విభజించారు. వారికి Q పరీక్ష పెట్టారు.

ఇంతకీ ఈ పరీక్ష ఏమిటంటే, ముఖం మీద Q అక్షరం పెట్టాలి. ఒకవేళ Qకు ఉన్న తోక మీ కుడి కంటివైపు వచ్చేలా పెట్టుకుంటే ఇతరులు మిమ్మల్ని ఎలా అర్థం చేసుకుంటున్నారనేదాని గురించి మీరు ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఉంటారని అర్థం.

మీరు చక్కగా అబద్ధాలాడుతారని దీనివల్ల తెలుస్తుంది.

అదే మీరు Qకు ఉన్న తోక ఎడమ కంటి వైపు వచ్చేలా పెట్టుకుంటే మీరు ప్రపంచాన్ని మీ కోణం నుంచి చూస్తున్నారని, మీరు కొంచెం నిజాయితీగా ఉంటారని అర్థం.

అబద్ధాలు గుర్తించడం ఎలా..

ఫొటో సోర్స్, Getty Images

ప్రపంచం ఎక్కువగా మోసగాళ్లతో నిండి ఉంది

మోసం ప్రతిచోటా ఉంది. వాస్తవ ప్రపంచంలో జంతువులు కూడా నిరంతరం ఒకదానికొకటి మభ్యపెట్టేందుకు తమ ప్రవర్తనతో మోసం చేస్తుంటాయి.

స్క్విడ్ (ఆక్టోపస్‌లా ఉండే జలచరం) మగచేపను ఆకర్షించేందుకు ఆడ చేపమాదిరిగా ప్రవర్తిస్తుంది. అదునుచూసి ఆ చేపను వేటాడుతుంది.

అలాగే, కోడిని కూడా ఎప్పుడూ నమ్మవద్దు. ఎందకంటే కోడిపుంజులు, కోళ్లను ఆకర్షించేందుకు ఒక రకమైన కూత కూస్తాయి. తిండి కోసం కోడిపిల్లలను పిలుస్తున్నట్లు పిలుస్తాయి. అప్పుడు కోళ్లు పరిగెత్తుకుంటూ బయటకు వస్తాయి. కోడిపుంజులు అప్పుడు వాటితో సంగమిస్తాయి.

సముద్ర పక్షులు చాలా వరకు జంటగానే కనిపిస్తుండటం మనం చూస్తుంటాం. ఒకదానిమీదఒకటి విధేయతతో అవి అలా ఉంటాయని మనం అనుకుంటుంటాం.

కానీ, సముద్ర పక్షులు అలా అక్రమ సంబంధం పెట్టుకుంటాయని శాస్త్రవేత్తలు తేల్చారు.

అబద్ధాలు చెప్పడం ఎప్పుడు మొదలుపెడతారు?

పిల్లలు ఏ వయసు నుంచి అబద్ధాలు చెప్పడం మొదలుపెడుతారనేదానిపై కొన్ని ఆసక్తికరమైన అధ్యయనాలు ఉన్నాయని రిచర్డ్ తెలిపారు.

మీరు ఓ చిన్నారిని గదిలోకి తీసుకెళ్లి అతని వెనక ఒక బొమ్మ ఉందని, కానీ, దాన్ని చూడొద్దని చెప్పండి. మళ్లీ మీరు గది నుంచి బయటకు వెళ్లేటప్పుడు కూడా అలానే చెప్పండి. గదికి గడియపెట్టి చిన్నారికి తెలియకుండా పరిశీలించండి. 5 నిమిషాలలోపు ఆ పిల్లవాడు తన వెనకున్న బొమ్మను చూస్తాడు. తర్వాత మీరు గదిలోకి వెళ్లి అడిగితే ఏం చెబుతాడో తెలుసా?

మీరు ఈ పరీక్షను మూడేళ్ల లోపు చిన్నారి మీద పరీక్షిస్తే దాదాపు 50 శాతం మంది అబద్ధం చెబుతారు. అదే ఐదేళ్ల లోపు పిల్లల మీద చేస్తే ఒక్కరు కూడా నిజం చెప్పరు.

అబద్దాలు గుర్తించేదెలా

ఫొటో సోర్స్, Getty Images

అబద్ధాలకు పెద్ద చరిత్రే ఉంది. సంక్లిష్టమైన, సామాజిక ప్రపంచంలో అబద్ధం ఒక ముఖ్యమైన భాగం.

అబద్ధాలు చెప్పడం ఎప్పుడూ అంత చెడ్డ విషయం కాకపోవచ్చు.

అబద్ధం లేకుండే ఈరోజు మనం ఇక్కడ ఉండకపోవచ్చు. ఇది మన మనుగడకు సంబంధించిన చాలా ముఖ్యమైన విషయం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)