ఐన్‌స్టీన్ దృష్టిలో అద్భుతమైన గణిత మేధావి ఎవరో తెలుసా?

ఫొటో సోర్స్, Getty Images, SPL
అల్బర్ట్ ఐన్‌స్టీన్ ప్రశంసలు పొందిన గణితవేత్త ఎమీ నోటర్. ఆధునిక ఆల్‌జీబ్రాకు ఆమే మూలమని భావిస్తుంటారు.
''మహిళలు ఉన్నత విద్య అభ్యసించడం మొదలైనప్పటి నుంచి వచ్చిన గణిత మేధావుల్లో అందరి కన్నా గొప్పవారు నోటరే'' అని ఐన్‌స్టీన్ ఆమెను ప్రశంసించారు.
ఐన్‌స్టీన్ అలా అనడానికి ఓ కారణం ఉంది.
నోటర్‌ను చేర్చుకునేందుకు మొదట్లో కళాశాలలు నిరాకరించాయి. అప్పట్లో జర్మనీలో మహిళలను యూనివర్సిటీల్లోకి అనుమతించేవారు కాదు.
నోటర్ 1882లో జర్మనీలో పుట్టారు. ఆమె తండ్రి మాక్స్ నోటర్ ఓ గణితవేత్త. బవేరియోలోని ఎర్లాంజన్ విశ్వవిద్యాలయంలో ఆయన ప్రొఫెసర్.
నోటర్ అడ్మిషన్ కోసం చేసుకున్న దరఖాస్తును ఎర్లాంజన్ విశ్వవిద్యాలయం తిరస్కరించింది.
ఎవరైనా ప్రొఫెసర్లు అనుమతిస్తే, వారి క్లాస్‌ల్లో మాత్రం కూర్చోవచ్చని చెప్పింది. మిగతా విద్యార్థుల్లా ఆమెకు ఏ హక్కులూ ఉండేవి కావు.

ఫొటో సోర్స్, Getty Images
నోటర్ ఆ పరిస్థితుల్లోనే చదువుకున్నారు. ఉన్నత స్థాయి పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించారు.
ఆ తర్వాత విశ్వవిద్యాలయంలో పాఠాలు చెప్పే స్థాయికి చేరుకున్నా నోటర్‌కు వివక్ష తప్పలేదు. వేతనమేమీ లేకుండానే ఆమె పని చేయాల్సి వచ్చింది.
ఆధునిక ఆల్జీబ్రాకు బీజాలు వేసిన గణితవేత్తగా నోటర్ గురించి విశ్లేషకులు చెబుతుంటారు. క్వాంటమ్ సిద్ధాంతానికి ఆమె పునాదులు వేశారు.
ఆమె సిద్ధాంతాలను అర్థం చేసుకోకుండా ఐన్‌స్టీన్ సాపేక్ష సిద్ధాంతాన్ని అర్థం చేసుకోలేం.
సంక్షిష్టంగా ఉంటుందని భావించే సాపేక్ష సిద్ధాంతాన్ని అందరికీ అర్థమయ్యేలే చేసిన ఘనత ఎమీ నోటర్‌దేనని స్వయంగా ఐన్‌స్టీనే ఒప్పుకున్నారు.
అయితే, ఎమీ నోటర్ అడుగడుగునా వివక్ష ఎదుర్కోవాల్సి వచ్చిందని ఆమె జీవిత చరిత్రపై పుస్తకం రాసిన మైకేల్ ల్యూబెలా అభిప్రాయపడ్డారు.
నోటర్‌కు గోటింజెన్ విశ్వవిద్యాలయం ఉద్యోగం ఇచ్చేందుకు నిరాకరించింది. ఆ తర్వాత పాఠాలు చెప్పేందుకు అనుమతిచ్చింది. కానీ, అందుకు వేతనం ఉండదని తేల్చిచెప్పింది.

ఫొటో సోర్స్, MANUEL LOZANO LEYVA
నోటర్ థీరమ్ అంటే..
సెవిల్ వర్సిటీలో న్యూక్లియర్ ఫిజిక్స్‌లో బోధించే ప్రొఫెసర్ మాన్యువెల్ లోజానో మాటల్లో చెప్పాలంటే, ఫిజిక్స్‌లో చాలా నిగూఢమైన అంశాలను సులువుగా అర్థం చేసుకునేందుకు మార్గమే నోటర్ థీరమ్.
''సైద్ధాంతికంగా చెప్పాలంటే ఈ థీరమ్ బాగా సరళంగా ఉంటుంది. దానివెనుకున్న గణితం మాత్రం చాలా సంక్లిష్టం. సిమెట్రీ (సమరూపత), క్వాంటిటీ (పరిమాణం)ల మధ్య బంధాన్ని ఇది వివరిస్తుంది'' అని లోజానో అన్నారు.
''నా చేతిలో ఓ గ్లాసు ఉన్నట్లు ఊహించుకోండి. మిమ్మల్ని కళ్లు మూసుకోమని, దాన్ని నేను తలకిందులుగా తిప్పితే.. కళ్లు తెరిచాక అది కదిలిన విషయం మీరు గుర్తించగలరు. అదే, అది ఉన్న స్థితిలో దాని అక్షం మీదే గుండ్రంగా తిప్పిపెడితే, అది కదిపిన విషయం మీరు కనిపెట్టలేరు. అంటే, ఆ అక్షంపై భ్రమణాల వరకూ ఆ గ్లాసుకు సిమెట్రీ వర్తిస్తోంది. దానికి లంభకోణంలో మాత్రం అసిమెట్రీ ఉంది'' అని వివరించారు.
''శక్తిని నాశనం చేయలేం. దాని రూపం మాత్రమే మారుతుంది. ఇలాంటి వాటిని 'కన్సర్వ్డ్ క్వాంటటీ' అంటారు. ఈ కన్సర్వ్డ్ క్వాంటిటీలను, సిమెట్రీతో జోడించి భౌతికశాస్త్రంలో చాలా నిగూఢమైన విషయాలను అర్థం చేసుకునేలా నోటర్ చేశారు. కంటిన్యూయస్ సిమెట్రీ వర్తించే ప్రతి సిస్టమ్‌కు ఇలాంటి కన్సర్డ్స్ క్వాంటిటీలు ఉంటాయని ఆమె ప్రతిపాదించారు'' అని లోజానో అన్నారు.
మాథమెటికల్ ఫిజిక్స్‌లో నోటర్స్ థీరమ్‌ను అత్యంత సుందరమైన సిద్ధాంతంగా నిపుణులు వర్ణిస్తారు.
''ప్రపంచంలోనే అందమైన సిద్ధాంతం ఇది. మొదటి సారి చూసినప్పుడే దానితో ప్రేమలో పడ్డా. తరగతిలో ఆ థీరమ్‌ను బోధించే ప్రతిసారీ నాకు ఉద్వేగంగా అనిపిస్తుంది'' అని అమెరికాలోని ఐయోవా స్టేట్ వర్సిటీ ప్రొఫెసర్ మైలీ సాంచెజ్ అన్నారు.

ఫొటో సోర్స్, BBC / LAURENCE REES / US NATIONAL ARCH
స్వదేశం వదిలి అమెరికాకు..
జర్మనీ నాజీ శక్తుల చేతుల్లోకి వెళ్లాక, అక్కడి ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో యూదులపై నిషేధం విధించారు. యూదు మతానికి చెందినవారు కావడంతో నోటర్ కూడా గోటింజెన్ నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చింది.
ఆ తర్వాత పరిణామాల కారణంగా నోటర్ దేశమే వదిలి వెళ్లాల్సి వచ్చింది. అనంతరం ఆమె అమెరికా వెళ్లి అక్కడి ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయంలో పనిచేశారు.
1935లో నోటర్ తుంటిలో ఓ కణితి ఏర్పడింది. అందుకు ఆమె శస్త్రచికిత్స చేయించుకున్నారు.
చికిత్స విజయవంతమైనా, క్రమంగా ఆమె ఆరోగ్యం క్షీణిస్తూ పోయింది. ఆ తర్వాత నాలుగు రోజులకు ఆమె ప్రాణాలు విడిచారు.
ఇవి కూడా చదవండి:
- ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన నగరం కారకస్‌లో రాత్రి జీవితం ఎలా ఉంటుంది?
- బ్యాంకు ఖాతాలో 90 లక్షలు వచ్చాయి... డ్రా చేశారు, ఖర్చుపెట్టేశారు... ఆ తర్వాత ఏం జరిగింది?
- ‘శృంగారంలో ఎప్పుడు పాల్గొంటున్నారో కూడా ఫేస్‌బుక్‌కు తెలిసిపోతోంది’
- ఇస్రో చైర్మన్ కె శివన్ కథ: ఒకేసారి 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపిన నిరుపేద రైతు కొడుకు
- 'నన్ను రేప్ చేశారు... ఇప్పుడు నా కూతుళ్లనూ అలా చేస్తారేమోనని భయపడుతున్నా'
- మానవ నివాసయోగ్యమైన ఆ గ్రహం మీద తొలిసారిగా గుర్తించిన నీటి జాడలు
- 6174: ఒక భారతీయ ఉపాధ్యాయుడు కనిపెట్టాడు.. డెబ్బై ఏళ్లుగా గణిత శాస్త్రజ్ఞులు ఆశ్చర్యపోతున్నారు
- కశ్మీర్: మహమ్మద్ గజనీకి ముచ్చెమటలు పట్టించిన హిందూ రాజుల కథ
- చెన్నైలో 20 ఏళ్ల కిందట కిడ్నాపైన బాలుడు.. అమెరికా నుంచి తిరిగొచ్చాడు. ఎలాగంటే..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








