మనిషి మాట్లాడడం ఎప్పుడు మొదలుపెట్టాడు... భాష వయసెంత?

పోస్టర్లు చేతబట్టుకుని నిల్చున్న వ్యక్తులు

ఫొటో సోర్స్, Getty Images

మనిషి మాట్లాడటం ఎప్పుడు నేర్చుకున్నాడు? ప్రస్తుతమున్న వేల భాషలు ఎలా పుట్టాయి, ఆ భాషలు మాట్లాడిన మొదటి మనిషి ఎవరు అన్నది కనిపెట్టడం సాధ్యమా? మైకేల్ రోజెన్ అనే ఒక భాషా ప్రేమికుడు ఈ దిశగా తన అధ్యయనాన్ని ప్రారంభించారు.

''ప్రపంచంలోని సకల జీవులకు భిన్నంగా భాషా సంపద కలిగిన ఏకైక జీవి మనిషి. అన్ని జీవులకంటే మనిషిని ప్రత్యేకంగా నిలిపేది భాష'' అని న్యూ క్యాసిల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మ్యాగీ టెల్లర్‌మ్యాన్ అంటారు. మానవ పరిణామక్రమంలో సంభాషణ ఒక గొప్ప మలుపు.

భాష వయసు 5 లక్షల ఏళ్ళు?

ప్రపంచవ్యాప్తంగా 6,500కుపైగా భాషలున్నాయి. వీటిలో ఏ భాష పురాతనమైనది అని కనుగొనడం ఎలా? ఏదో ఒక ప్రాచీన భాష చెప్పమంటే సంస్కృతం, బాబిలోనియా, లేక ప్రాచీన ఈజిప్ట్ భాషల పేర్లు చెప్పొచ్చు.

కానీ ఇవేవీ ‘ఆది భాషలు’ కావని ప్రొ.టెల్లర్‌మ్యాన్ అంటున్నారు. ఇప్పుడు మనం చెబుతున్న ఈ ప్రాచీన భాషలన్నిటికీ 6వేల ఏళ్లకు మించి వయసు ఉండదని ఆయన అంటున్నారు. అయితే, 50 వేల ఏళ్ల క్రితమే భాష ఉన్నట్లు తెలుస్తోంది కానీ, కొందరు భాషా శాస్త్రవేత్తలు మాత్రం, అంతకుముందే భాష ఉన్నదని చెబుతున్నారు.

''దాదాపు 5లక్షల ఏళ్ల క్రితమే భాష ఉందని మనలో చాలామంది విశ్వసిస్తున్నారు'' అని టెల్లర్‌మ్యాన్ బీబీసీతో అన్నారు.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో భాషలు ఉన్నా, వాటికి విలువైన భాషా సంపదలున్నా, అన్ని భాషలకు మూలం ఒకటే ఉంటుందని ప్రొ.ఫొలే అన్నారు.

మానవ పరిణామ సిద్ధాంతాన్ని, జన్యుశాస్త్రాన్ని ఓసారి పరిశీలిస్తే, మనమందరం ఆఫ్రికాలోని ఓ సమూహానికి చెందినవారిమని అర్థమవుతుంది. అలాగే భాషలన్నిటికీ దాదాపు మూలం ఒకటే అయ్యుంటుంది.

శిలాజ అవశేషాలు

ఫొటో సోర్స్, Getty Images

శిలాజ సాక్ష్యాలు

మనిషి మాట్లాడటం ఎప్పుడు మొదలైందన్న విషయంలో, ప్రాచీన మానవ శిలాజాలు కొన్ని వివరాలను అందిస్తున్నాయి.

''మాట్లాడటం అంటే శ్వాస తీసుకోవడమే. శ్వాసను తీసుకుంటూ, నియంత్రిస్తూ కొన్ని శబ్దాలను చేస్తున్నాం. అవే మాటలు'' అని ఫొలే అన్నారు.

అలా నోటి ద్వారా కొన్ని శబ్దాలు చేయడానికి కండరాలను నియంత్రించే వ్యవస్థ అవసరం. మానవ శరీరంలోని ఛాతి భాగంలో, ఎన్నో నరాలు, కండరాలతో కూడిన అలాంటి వ్యవస్థ ఒకటి ఉంటుంది. కానీ మానవ జాతితో దగ్గరి సంబంధం ఉన్న కోతుల్లో ఇలాంటి వ్యవస్థ ఉండదు. మనుషుల వెన్నెముక కోతులతో పోలిస్తే కాస్త దృఢంగా, రొమ్ము భాగం కాస్త విశాలంగా ఉంటుంది.

6లక్షల ఏళ్లపాటు జీవించి, అంతరించిపోయిన నియాండర్తాల్ అనే మనిషిని పోలిన జాతిలో మాట్లాడటానికి అనువైన వ్యవస్థ ఉండేది. కానీ పది లక్షల ఏళ్ల క్రితం ఉన్న ఆదిమ మనిషి శరీరంలో ఈ వ్యవస్థ కనిపించదు. ఈ విషయాన్ని గమనిస్తే, మనిషి మాట్లాడటం ఎప్పుడు ప్రారంభమైందన్ని అంశంలో కాస్త స్పష్టత వస్తుంది.

ఒరాంగుటాన్

ఫొటో సోర్స్, Getty Images

జన్యువులది కీలక పాత్ర

మనిషి మాట్లాడింది ఎప్పుడు అన్న అంశంలో ఈ శిలాజాలు కాకుండా, జన్యుశాస్త్రం కూడా మంచి ఫలితాలను ఇస్తోంది.

''ఎఫ్ఓఎక్స్‌పీ2 అని ఒక జన్యువు మాటలు రావడానికి తోడ్పడుతుంది. వానరాలలో కూడా ఈ జన్యువు ఉంటుంది. కానీ మనుషుల్లో కొన్ని మార్పులతో కూడి, ఈ జన్యువు ఉంటుంది. ఈ జన్యువులోని మార్పులు, చింపాంజీలు ఎందుకు మాట్లాడలేవు, మనిషి ఎలా మాట్లాడగలుగుతున్నారని వివరిస్తాయి. ఈ జన్యువు నియాండర్తాల్‌లో కూడా ఉండేది. దీన్నిబట్టి వారుకూడా ఒక విధమైన భాష ద్వారా సంభాషించుకునేవారని అర్థం చేసుకోవచ్చు. కానీ వారి భాష పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందిందా లేదా అన్నది అస్పష్టం.

''ఎందుకంటే, జన్యువుల ద్వారా మాట్లాడగలిగారా లేదా అనేది తెలుసుకోవచ్చు కానీ, భాషాసంపద గురించి తెలుసుకోలేం'' అని టెల్లర్‌మ్యాన్ అన్నారు.

ఆదిమ మానవుల పుర్రెలు

ఫొటో సోర్స్, Getty Images

మెదడు పరిమాణం

ఆదిమ మానవుల పుర్రె పరిమాణం చూసి భాష గురించిన సమాచారం లభిస్తుందని భావించలేం. పరిమాణం అన్నది ప్రధానం కాదు. మనుషుల కంటే పెద్ద సైజులో బుర్రలు కలిగిన నియాండర్తాల్స్ అంతరించిపోయారు

''భాషను తనలో నిక్షిప్తం చేసుకోవడానికి ఎంత పరిమాణంలో మెదడు ఉండాలన్న విషయం మనకు తెలీదు కాబట్టి, ఆదిమ మానవుల పుర్రె పరిమాణం బట్టి వారికి భాష ఉందో లేదో తెలుసుకోలేం'' అని టెల్లర్‌మ్యాన్ అన్నారు.

మొదటి పదం ఇదే అయ్యుండొచ్చు

ఆదిమ మానవుల మొదటి పదం ఏది అన్న ప్రశ్న వచ్చినపుడు, మనం ఏ భాష గురించి మాట్లాడుతున్నామన్నది ముఖ్యం. కొన్ని జీవులకు భాష లేకపోయినా, శబ్దాలు చేస్తాయి. ఆ శబ్దాల ద్వారా సమాచారాన్ని తోటి జీవులకు చేరవేస్తాయి.

అలానే ఆదిమ మానవులు కూడా, కొన్ని శబ్దాలను ఉపయోగించి ఉండొచ్చున్నది ఒక వాదన. ఈ అంశంలో మరో వాదన కూడా ఉంది. తోటి వ్యక్తిని పిలవడానికి, హెచ్చరించడానికి ష్.., ప్చ్.., హేయ్.. లాంటి పదాలు వాడిండొచ్చు. అంటే పదాలు ఉన్నాయి కానీ, వాక్య నిర్మాణం లేదు. ప్రపంచంలో ఈ పదాలు దాదాపు అన్ని భాషల్లో కూడా కాస్తంత తేడాతో ఉంటాయి.

ఆదిమ మానవుడిని పోలిన ఫొటో

ఫొటో సోర్స్, Getty Images

ఆహారం కోసం చేసే ప్రయత్నం కూడా భాష అభివృద్ధిలో భాగం

ఆదిమ మానవులు పరస్పరం సహకరించుకుంటూ, తమ భాషను అభివృద్ధి చేసుకుని ఉంటారని టెల్లర్‌మ్యాన్ చెబుతున్నారు.

''ఒకరితో ఒకరు మాట్లాడుతూ, పెద్ద జంతువులు వేటాడి తిన్నాక మిగిలిన ఆ జంతు కళేబరాలను తీసుకుని ఆహార సేకరణ చేసేవారు. కానీ అలాంటి జంతు కళేబరాల కోసం మనుషులకు హైనాలకు మధ్య పోటీ ఉంటుంది. అలాంటి హైనాల గుంపును చెదరకొట్టడం ఒక మనిషికి సాధ్యం కాదు. అందుకోసం ఒక సమూహం అవసరం'' అని టెల్లర్‌మ్యాన్ చెబుతున్నారు.

అలా ఎక్కడైనా ఓ జంతు కళేబరాన్ని చూసినపుడు, ఆ సమాచారాన్ని తోటి మనిషికి చెప్పాలన్నా భాష అవసరమే కదా అని ఆయన అన్నారు.

తాము చూసిన ఆహారం, లేదా గతంలో తిన్న ఆహారం గురించి తోటి వ్యక్తికి వివరించి చెప్పడానికి సైతం భాష అవసరం. ఆహారం పట్ల తీవ్రమైన కాంక్ష, ప్రాణాలు నిలుపుకోవడానికి చేసే ప్రయత్నం వారిని మాట్లాడటానికి పురిగొల్పివుంటుందని ఆయన అభిప్రాయం.

కలిసి పనిచేయడం అన్నది భాష అభివృద్ధిలో కీలకమైన అంశం. పొచ్చాపాటి మాట్లాడుకోవడాన్ని కూడా తక్కువగా అంచనా వేయలేం. భాష అభివృద్ధిలో పిచ్చాపాటి కబుర్లు అత్యంత కీలకం అని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన లారా రైట్ అన్నారు.

భాష అన్నది, కలిసి పనిచేయడం కంటే, సమాచారం తెలుసుకునే ప్రయత్నంలో అభివృద్ధి అయ్యే అవకాశం ఎక్కువ.

పురాతన ఈజిప్ట్ చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

కథలు చెప్పడం ఎప్పుడు ప్రారంభమైంది?

కథ చెప్పడానికి ఒక నిర్మాణం అవసరం. భాషా సంపద అవసరం అని టెల్లర్‌మ్యాన్ అంటారు. కాబట్టి కథలు అల్లడానికి, చెప్పడానికి చాలా కాలం పట్టివుంటుంది. మాట్లాడటం ప్రారంభమైన కొన్ని వేల ఏళ్ల తర్వాత, కథలు చెప్పడం ప్రారంభమై ఉంటుంది.

('బీబీసీ రేడియో-4'లో ప్రసారమైన కార్యక్రమం ఆధారంగా)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)