కబీర్ సింగ్ సినిమాకు ఈలలు, చప్పట్లు దేనికి? :అభిప్రాయం

ఫొటో సోర్స్, FACEBOOK/KABIRSINGHMOVIE
- రచయిత, దివ్య ఆర్య
- హోదా, బీబీసీ ప్రతినిధి
కబీర్ సింగ్ సినిమా ఓ ప్రేమ కథ కాదు. ఓ వ్యక్తి పిచ్చితనం కథ.
కబీర్ సింగ్ పిచ్చితనం రోత పుట్టిస్తుంది. రోతైన ఆ వ్యక్తిని ఈ సినిమా హీరోగా చూపిస్తుంది.
ప్రేమలో విఫలమయ్యాక, దారినపోయే ముక్కూ ముఖం తెలియని అమ్మాయి నుంచి కూడా కబీర్ సింగ్ శారీరక సంబంధం కోరుకుంటుంటాడు.
అమ్మాయి ఒప్పుకోకపోతే, కత్తితో బెదిరించి మరీ దుస్తులు తీయమంటాడు.
దీనికి ముందు ప్రియురాలితో 450 సార్లు సెక్స్ చేశాడు. ఇప్పుడామె లేదు కాబట్టి తన వేడిని చల్లార్చుకోవడానికి ప్యాంట్‌లో ఐస్ గడ్డలు వేసుకుంటుంటాడు.
'మగతనం' చూపించే ఈ సీన్లకు సినిమా హాళ్లో వెకిలినవ్వులు వినిపిస్తాయి.
తెలుగు సినిమా 'అర్జున్ రెడ్డి'కి రీమేక్ ఈ కబీర్ సింగ్.

ఫొటో సోర్స్, FACEBOOK/KABIRSINGHMOVIE
కథ విషయానికి వస్తే కబీర్ ప్రియురాలికి ఆమె కుటుంబ సభ్యులు బలవంతంగా వేరొకరితో పెళ్లి జరిపిస్తారు. ఆ తర్వాత, కబీర్ పడే బాధ ఓ ఆటవిక రూపాన్ని తీసుకుంటుంది.
ముందు నుంచీ, కబీర్ అమ్మాయిని తన సొత్తుగా భావిస్తుంటుంటాడు. 'ఆమె నా సొంతం కాకపోతే, ఇంకెవరి సొంతమూ కాదు' అనే మెంటాలిటీ అతడిది.
కబీర్ ప్రియురాలు ఎప్పుడూ సల్వార్ కమీజ్, దుపట్టా వేసుకునే ఉంటుంది. అయినా, దాన్ని సరిచేసుకోమని అతడు చెబుతూ ఉంటాడు.
ఆమె తనదని చెప్పేందుకు మొత్తం కాలేజీనే బెదిరిస్తాడు. హోలీ పండుగ రోజు తానే ముందు ఆమెకు రంగు పూయాలని భారీ ఏర్పాట్లు కూడా చేసుకుంటాడు.
ఆమెకు ఏ విలువ లేదనీ, కాలేజీలోని జనాలందరికీ కేవలం 'కబీర్ సింగ్ పిల్ల'గానే ఆమె తెలుసని కూడా అంటాడు.
ఆధునిక ఆలోచనలు ఉండే దిల్లీ లాంటి నగరంలో బహిరంగంగా మందు, సిగరెట్ తాగడం, పెళ్లికి ముందు సెక్స్ చేయడం లాంటివి పెద్ద విచిత్రాలేం కాదు.

ఫొటో సోర్స్, FACEBOOK/KABIRSINGHMOVIE
ఈ సినిమాలో అభ్యుదయవాద ఆలోచనలేవీ లేవు. హీరో తన ప్రియురాలిని వశం చేసుకోవాలనుకుంటాడు. ఇష్టపడింది దొరకనప్పుడు అతడి జంతు ప్రవృత్తి బయటకు వస్తుంది.
తండ్రితోనూ మర్యాద లేకుండా ప్రవర్తిస్తాడు. ఫ్రెండ్స్, పనివాళ్లను తన కన్నా కిందివారిలా చూస్తాడు. కాలేజీలో డీన్‌ను అవమానిస్తాడు. తన నానమ్మపై అరుస్తాడు. ఇంట్లో పనిమనిషి ఓ గాజు గ్లాసు పగలగొడితే, వెంటపడి పరుగెత్తిస్తాడు.
ఏ మొహమాటం లేకుండా చెప్పాలంటే కబీర్ ఒక గూండా.
ప్రేమను పొందాలన్నతపన, దూరమైతే ఏర్పడిన గాయం.. ఇవన్నీ వట్టి సాకులు.
హీరో పాత్ర కదా, అతడి చేష్టలన్నీ జస్టిఫై అయిపోతాయి.

ఫొటో సోర్స్, FACEBOOK/KABIRSINGHMOVIE
హిందీ సినిమాల్లో హీరోలు ఏం చేసినా చెల్లిపోతుంది. వారి పాత్రల్లోని లోపాలను కూడా ప్రేక్షకులకు బలాల్లా చూపిస్తుంటారు.
కబీర్ లెక్కలేని కోపాన్నీ, దురుసు మాటలు, చేష్టలను అతడి కుటుంబం, ప్రియురాలు, ఫ్రెండ్స్, పనిమనిషి, కాలేజీ డీన్ సహా అందరూ క్షమించేస్తారు. ఇక, ప్రేక్షకులు ఎందుకు క్షమించరు?
స్త్రీలను నియంత్రణలో పెట్టడమే మగతనమని చూపించే సినిమాలను జనాలు ఇష్టపడతుంటారు. అలాంటివి రూ.కోట్ల కొద్దీ వసూళ్లు కూడా సాధిస్తుంటాయి.
మద్యానికి బానిసగా మారినా, కబీర్ ఫ్రెండ్స్ మాత్రం అతడి వెంటే ఉంటారు. ఒక ఫ్రెండ్ అయితే, కబీర్ సమస్యకు పరిష్కారమన్నట్లుగా తన చెల్లెలిని ఇచ్చి పెళ్లి చేసేందుకు ముందుకు వస్తాడు.
కబీర్ గురించి అన్నీ తెలిసీ, ఆమె ఇష్టపడుతోందని చెబుతాడు.
ఒక అమ్మాయి దూరం కారణంగా ఏర్పడిన దు:ఖాన్ని వదిలించేందుకు ఇంకో అమ్మాయి త్యాగం. ప్రేమలో విఫలమయ్యానని సాకు పెట్టుకుని ఏ అమ్మాయితోనైనా పడుకునే వ్యక్తిని ఇష్టపడే చెల్లెలు.
ప్రేమ పేరుతో హింసను సెలెబ్రేట్ చేసుకునే మరో సినిమా ఇది.
థియేటర్‌లో మాత్రం తెగ చప్పట్లు, ఈలలు వినిపించాయి.

ఫొటో సోర్స్, FACEBOOK/KABIRSINGHMOVIE
కానీ, అమ్మాయిలు ఎలాంటి అబ్బాయిలను ఇష్టపడతారు? ఇలాంటి వారినైతే కాదు. కాల్పనిక సినిమా ప్రపంచంలోనైనా ఇలాంటి వ్యక్తి నాకు ఎప్పటికీ హీరో కాదు.
ప్రేమిస్తాడు కానీ, విలువ ఇవ్వడు. ప్రతి నిమిషమూ తన అదుపులో పెట్టుకోవాలనుకుంటాడు. ప్రేయసి ఆలోచనలు, అవసరాలను అర్థం చేసుకోడు. దక్కకపోతే రోత పుట్టించే ప్రతి పనీ చేసేస్తాడు.
అయితే, ఇలాంటి పనులన్నింటికీ బాధ్యత అతడి ప్రేయసిదే అన్నట్లు సినిమాలో చూపించారు. నిందలన్నీ ఆమె పైకి నెట్టారు.
కబీర్ ప్రేయసి జీవితం, ఆమె అనుభవించిన ఒంటరితనం గురించి సినిమాలో చర్చే లేదు. కానీ, క్లైమాక్స్‌లో ఒక్కసారిగా కబీర్ చేసిన అన్ని తప్పులనూ ఆమె క్షమించేసి, అతడిని హీరో చేసేస్తుంది.
ప్రేమ లాంటి అందమైన బంధంలో హింసకు ఎంతమాత్రమూ తావులేదు. అందులో సమానత్వం, ఆత్మ గౌరవం సాధించాలని దశాబ్దాలుగా మహిళలు పోరాడుతున్నారు.
మరి, ఈ విషయంపై జనాలు ఆలోచనలు ఎలా మారతాయి?
మీ నుంచే అది మొదలు అవుతుంది.
బాక్సాఫీస్ విజయాల గోల మధ్యే నేను రాస్తుంటాను. మీరు చదువుతుంటారు. కబీర్ సింగ్ లాంటి సంబరాలను సూక్ష్మంగా అర్థం చేసుకుని, తిరస్కరించేందుకు ప్రయత్నాలు కొనసాగుతుంటాయి.
ఇవి కూడా చదవండి:
- క్రికెట్ వరల్డ్ కప్ 2019 : వన్డేల్లో అత్యుత్తమ భారత జట్టు ఇదేనా...
- ప్రపంచ కప్‌లో పాకిస్తాన్‌పై భారత్ వరుసగా ఏడుసార్లు ఎలా గెలిచిందంటే..
- రగ్బీలో భారత మహిళల కొత్త అధ్యాయం
- 'ఈ గ్రామానికి కరువు తెలీదు, 15 ఏళ్ల వరకు కరువు రాదు'
- 'ఇరాన్ ఆయుధ వ్యవస్థలపై అమెరికా సైబర్ దాడి'
- చేతిలో డబ్బున్నా చుక్క నీరు సంపాదించుకోలేకపోతున్నాం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








