ఆసియా రగ్బీ -15 పోటీల్లో భారత మహిళా జట్టుకు తొలి అంతర్జాతీయ విజయం

ఫొటో సోర్స్, RUGBY INDIA/TWITTER
భారత మహిళల రగ్బీ జట్టు ప్రస్థానంలో కొత్త అధ్యాయం మొదలైంది.
తొలిసారి ఓ అంతర్జాతీయ రగ్బీ-15 మ్యాచ్‌లో ఆ జట్టు విజయం సాధించింది.
ఈ గెలుపుతో ఆసియా మహిళల ఛాంపియన్‌షిప్ టోర్నీలో కాంస్య పతకం అందుకుంది.
కంటెంట్ అందుబాటులో లేదు
మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.పోస్ట్ of Facebook ముగిసింది
సింగపూర్‌పై గెలవడం ద్వారా భారత మహిళలు ఈ ఘనతను సొంతం చేసుకున్నారు. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో 21-19 స్కోరుతో విజయం సాధించారు. ఆసియా రగ్బీ మహిళల ఛాంపియన్‌షిప్ డివిజన్-1లో భాగంగా ఫిలిప్పీన్స్‌లోని మనీలాలో శనివారం ఈ మ్యాచ్ జరిగింది.
చివర్లో సుమిత్రా నాయక్ పెనాల్టీ కిక్‌ను సద్వినియోగం చేసుకోవడంతో మ్యాచ్‌లో భారత్ పైచేయి సాధించింది. అయితే, అప్పటికి ఆటలో ఇంకా మూడు నిమిషాలు మిగిలున్నాయి.
సింగపూర్‌కు తిరిగి ఆధిక్యంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ, భారత్ ఆ జట్టుకు స్కోర్ చేసే ఛాన్స్ ఇవ్వలేదు. చివర్లో టచ్‌డౌన్‌తో విజయాన్ని ఖాయం చేసుకుంది.

ఫొటో సోర్స్, RUGBY INDIA/TWITTER
మ్యాచ్‌లో భారత్ మంచి ఆరంభం చేసింది. ప్రథమార్ధంలో స్వీటీ కుమారీ రెండు సార్లు 'ట్రై' స్కోరు చేసింది. ఆమె టోర్నీ మొత్తం బాగా ఆడింది. అంతకుముందు ఫిలిప్పీన్స్‌తో ఆడిన మ్యాచ్‌లోనూ మూడు సార్లు స్కోర్ చేసింది. అయితే, ఆ మ్యాచ్‌లో భారత్ గెలవలేదు.
తాజా మ్యాచ్‌లో భారత్ రెండు సార్లు ట్రై స్కోరు చేసిన తర్వాత బదులుగా సింగపూర్ కూడా రెండు ట్రైలు సాధించడంతో పోటీ హోరాహోరీగా మారింది. మూడో ట్రైతో భారత్ 15-12తో ఆధిక్యంలోకి వెళ్లింది. ద్వితీయార్ధంలో సుమిత్రా నాయక్ పెనాల్టీని సాధించిపెట్టడంతో భారత్ విజయం పక్కా చేసుకుంది.

ఫొటో సోర్స్, RUGBY INDIA/TWITTER
టోర్నీలో భారత్ మూడో స్థానంలో నిలిచింది. భారత్ కాకుండా సింగపూర్, చైనా, ఫిలిప్పీన్స్ ఇందులో పోటీపడ్డాయి.
మహారాష్ట్రకు చెందిన వాహ్బిజ్ భరూచా భారత జట్టుకు కెప్టెన్. అదే రాష్ట్రానికి చెందిన నేహా పరదేశీ వైస్‌కెప్టెన్.
మొత్తం 26 మంది క్రీడాకారిణులున్న జట్టులో 10 మంది దిల్లీకి చెందినవారున్నారు. ఒడిశాకు చెందినవారు ఏడుగురు, పశ్చిమ బెంగాల్‌కు చెందినవారు నలుగురు, బిహార్‌కు చెందినవారు ఇద్దరు ఉన్నారు.
ఈ టోర్నీలో చైనా విజేతగా నిలిచింది. ఫైనల్‌లో ఆ జట్టు 68-0 స్కోరుతో ఫిలిప్పీన్స్‌ను చిత్తుగా ఓడించింది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








