చెన్నై నీటి కొరత: పేద, ధనిక తేడాలేవీ లేవు.. అందరికీ కటకటే

నీటి సమస్య

ఫొటో సోర్స్, Getty Images

చెన్నై నగరవాసులను నీటి కష్టాలు వేధిస్తున్నాయి. చాలా కాలంగా వర్షాభావ పరిస్థితులు ఉండటంతో అక్కడి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. నీటిని తెచ్చుకునేందుకు జనాలు కిలోమీటర్ల కొద్దీ దూరం వెళ్లాల్సివస్తోంది.

ఉత్తర చెన్నైలోని తొండియార్‌పేట్‌లో ఉంటున్న సరిత అనే మహిళ తమ ప్రాంతవాసులు పడుతున్న కష్టాల గురించి బీబీసీతో మాట్లాడారు.

''మేం నిస్సహాయ పరిస్థితిలో ఉన్నాం. ఇంతకుముందు నీళ్లు అసలే వచ్చేవి కాదు. ఇప్పుడు కాస్త వస్తున్నాయి. ఇదే మాకు గొప్ప విషయం'' అని అన్నారు.

చెన్నై నీటి కొరత
ఫొటో క్యాప్షన్, నీరు తక్కువగా వచ్చినప్పుడు స్థానికుల మధ్య గొడవలు కూడా జరుగుతుంటాయని తొండియార్‌పేట్‌లో ఉంటున్న సరిత అంటున్నారు

సరిత, ఆమె ఇరుగుపొరుగువారు వీలైనంత తక్కువ నీటితోనే సర్దుకుపోవడానికి అలవాటుపడుతున్నారు. వాళ్లు తాగేది కూడా సురక్షిత మంచినీరు కాదు.

ఇక్కడి మత్స్యకారుల హౌసింగ్ కాలనీలో ఓ బోరు బావి ఉంది. కానీ, అందులో నుంచి వచ్చేది ఉప్పునీరు. దీంతో ఓ అండర్‌గ్రౌండ్ స్టోరేజ్ యునిట్ నుంచి ప్రజలు నీళ్లు తెచ్చుకుంటున్నారు.

అయితే, ఇందులో నుంచి వచ్చే నీరు కలుషితంగా ఉంటుంది. పైప్ పగిలి బురద నీళ్లు వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు.

చెన్నై నీటి కొరత

ఈ ప్రాంతంలోని చాలా మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. కలుషితమైన నీరే ఇందుకు కారణం కావొచ్చని జనాలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

నగర పాలక సంస్థ ఈ అండర్ గ్రౌండ్ స్టోరేజ్‌కు నీటిని తెస్తుంది.. ప్రభుత్వ ట్యాంకర్లు కూడా కాలనీల్లో తిరుగుతున్నాయి. అయితే, ఇది క్రమం తప్పకుండా జరగట్లేదు.

నీరు తక్కువగా వచ్చినప్పుడు స్థానికుల మధ్య గొడవలు కూడా జరుగుతుంటాయని సరిత అన్నారు.

చెన్నై నీటి కొరత

ఫొటో సోర్స్, R Parthabhan

తొండియార్‌పేట్‌లోనే ఉంటున్న విజయ శ్రీ అనే మహిళ కూడా ఇదే మాట చెప్పారు.

కానీ, ఇప్పుడు పరిస్థితి కాస్త మెరుగుపడిందని ఆమె వివరించారు.

చెన్నై నీటి కొరత

ఫొటో సోర్స్, AFP

''ప్రతి ఇంటికీ నాలుగు చిన్న డ్రమ్ముల్లో నీళ్లు ఇస్తారు. వాటిని ఒకరితో మరొకరం పంచుకుంటున్నాం. ఇదివరకు గొడవలు జరిగేవి'' అని విజయ శ్రీ అన్నారు.

నాలుగేళ్ల క్రితం చెన్నైని వరదలు ముంచెత్తడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

అయితే, ఆ తర్వాత నగరంలో వర్షాలు పెద్దగా లేవు.

చెన్నై నీటి కొరత

ఫొటో సోర్స్, Krutika Pathi

ఫొటో క్యాప్షన్, చెన్నై శివార్లలోని పుళాల్ రిజర్వాయర్

చెన్నైలోని నాలుగు ప్రధాన రిజర్వాయర్లూ దాదాపు ఎండిపోయాయి. ఇప్పటికి కొంచెం నీరున్నా, అది ఎంత కాలం జనాలు అవసరాలను తీర్చగలదో స్పష్టత లేదు.

40 లక్షల జనాభా ఉన్న చెన్నైలో ఇప్పుడు అత్యధిక మంది ప్రభుత్వ ట్యాంకర్లపైనే ఆధారపడ్డారు. కొందరు ప్రైవేటు సంస్థల నుంచి తమ ఇళ్లకు తెప్పించుకుంటున్నారు. అలాంటి ట్యాంకర్ల ధరలు నెల రోజుల్లో నాలుగు రెట్లు పెరిగాయి. పైగా వాటి కోసం నాలుగైదు రోజులు నిరీక్షించాల్సి వస్తోంది.

చిన్న హోటళ్లు నీటి కొరత వల్ల మూతపడుతున్నాయి. కొన్ని సంస్థలు ఉద్యోగులకు ఇంటి వద్ద నుంచి పనిచేయమని సూచిస్తున్నాయి. నగర మెట్రో స్టేషన్లను ఎయిర్ కండిషనింగ్ వినియోగాన్ని ఆపేశారు.

చెన్నై నీటి కొరత

ఫొటో సోర్స్, R Parthibhan

నెల క్రితం తాము ఒక్క ట్యాంకర్‌కు రూ.1000 చెల్లించేవాళ్లమని, ఇప్పుడు రూ.4 వేలు చెల్లించాల్సి వస్తోందని పశ్చిమ మంబాలంలో ఉంటున్న అనురాధ సంతానం చెప్పారు.

తమిళనాడుకు 20 లక్షల లీటర్ల నీటిని అందించేందుకు కేరళ ముందుకు వచ్చింది.

చెన్నైలో నీటి కొరతకు మానవ తప్పిదాలే కారణమని జల రంగ నిపుణుడు శేఖర్ రాఘవన్ అభిప్రాయపడ్డారు.

చెన్నై నీటి కొరత

''నగరంలోని కుంటలు, చెరువులను మురుగుతో నింపేశారు. చెరువులు, రిజర్వాయర్ల నుంచి ఏళ్లుగా పూడిక తీయలేదు. నీరు పారేందుకు సరైన మార్గమే లేదు'' అని ఆయన చెప్పారు.

ప్రతి ఇంట్లోనూ వాన నీటిని సంరక్షించించే వ్యవస్థ ఉండాలని తమిళనాడులో చట్టం ఉన్నా, దాని అమలు మాత్రం జరగడం లేదు.

చెన్నై నీటి కొరత

69 అపార్ట్‌మెంట్లు ఉండే తమ భవన సముదాయంలో అందరం కలిసి వాన నీటి సంరక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటున్నామని సౌమ్య అర్జున్ అనే మహిళ చెప్పారు.

''మొత్తంగా దీని కోసం రూ.2 లక్షలు అవసరం. ఒక్కో కుటుంబానికి రూ.3వేల ఖర్చు వస్తోంది. వాటర్ ట్యాంకర్ల కోసం మేం పెడుతున్న ఖర్చులో ఇది మూడో వంతు మాత్రమే'' అని ఆమె అన్నారు.

చెన్నై నీటి కొరత

పేద, ధనిక అన్న తేడా లేకుండా అందరినీ నీటి కొరత ఇబ్బంది పెడుతోందని డాక్టర్ రాఘవన్ చెప్పారు.

''మీ దగ్గర డబ్బు ఉండొచ్చు. దాని అర్థం నీళ్లు ఉంటాయని కాదు'' అని ఆయన వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)