సంజీవ్ భట్: మోదీపై ఆరోపణలు చేసిన ఐపీఎస్ అధికారికి జీవితఖైదు ఎందుకు పడింది?

ఫొటో సోర్స్, kalpit Bhachech
గుజరాత్ కేడర్ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్‌కు జామ్‌నగర్ సెషన్స్ కోర్టు జీవితఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది.
గుజరాత్‌లో 1990లో జరిగిన ఓ లాకప్‌డెత్ కేసులో ఆయన్ను దోషిగా తేలుస్తూ ఈ శిక్ష విధించింది. ప్రవీణ్ సింగ్ జాలా అనే మరో వ్యక్తిని కూడా కోర్టు దోషిగా తేలుస్తూ ఇదే శిక్ష వేసింది.
2002లో చోటుచేసుకున్న గుజరాత్ అలర్లలో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీకి పాత్ర ఉందంటూ ఆరోపణలు చేస్తూ సంజీవ్ వార్తల్లో నిలిచారు.
అయితే, ఈ అల్లర్ల విషయంలో తనపై వచ్చిన ఆరోపణలను మోదీ తోసిపుచ్చుతూనే ఉన్నారు.

కేసు ఏంటి?
1990లో అయోధ్య రథయాత్రలో పాల్లొంటున్న బీజేపీ నాయకుడు ఎల్‌కే అడ్వాణీ బిహార్‌లో అరెస్టయ్యారు. దీంతో దేశవ్యాప్తంగా ఆందోళనలకు బీజేపీ పిలుపునిచ్చింది. ఈ సమయంలో చాలా చోట్ల అల్లర్లు, ఘర్షణలు చెలరేగాయి.
జామ్‌నగర్‌లోనూ హింసాత్మక ఘటనలు జరిగాయి. ఆ సమయంలో సంజీవ్ భట్ అక్కడ ఎస్ఎస్‌పీగా ఉన్నారు. హింసకు కారణమంటూ 113 మందిని టాడా చట్టం కింద పోలీసులు అరెస్టు చేశారు.
అందులో ఒకరైన ప్రభుదాస్ ఆ తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. సంజీవ్ భట్‌తో సహా ఇతర పోలీసులు చిత్రహింసలకు పాల్పడటం వల్లే ప్రభుదాస్ మరణించారని ఆయన సోదరుడు అమృత్ భాయ్ కేసు పెట్టారు.
ఈ కేసులో మరో ఐదుగురిని కూడా కోర్టు దోషులుగా తేల్చినప్పటికీ సంశయ లబ్ధి కింద వారికి శిక్ష వేయలేదు.
వారికి కూడా శిక్షలు పడేలా చేసేందుకు పైకోర్టుకు వెళ్తామని పబ్లిక్ ప్రాసిక్యూటర్ తుషార్ గోకనీ చెప్పారు.
మానవ హక్కుల పరిరక్షణకు సంబంధించి తాజా తీర్పు చాలా ముఖ్యమైందని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
సంజీవ్ భట్ ఎవరు?
ఐఐటీ బాంబే నుంచి పీజీ చేసిన సంజీవ్ భట్ 1988 బ్యాచ్ గుజరాత్ కేడర్ ఐపీఎస్ అధికారి. రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ఆయన పనిచేశారు.
డిసెంబర్ 1999 నుంచి సెప్టెంబర్ 2002 వరకు డిప్యూటీ కమిషనర్‌గా విధులు నిర్వర్తించారు.
అనుమతి లేకుండా విధులకు గైర్హాజరవడం, అధికారిక వాహనాన్ని దుర్వినియోగం చేయడం వంటి వాటిని కారణాలుగా చూపుతూ 2011లో ఆయన్ను ప్రభుత్వం సస్సెండ్ చేసింది. 2015లో సర్వీసు నుంచి తొలగించింది.
2018లో డ్రగ్స్ ప్లాంటింగ్ కేసులో సంజీవ్ అరెస్టయ్యారు. అప్పటి నుంచి ఆయన జైల్లోనే ఉన్నారు.
తనను తప్పుడు కేసుల్లో ఇరికించారని ఆయన వాదిస్తున్నారు.
తాజా తీర్పు నేపథ్యంలో తదుపరి తీసుకోవాల్సిన చర్యల గురించి తమ న్యాయవాదిని సంప్రదించిన తర్వాత స్పందిస్తానని సంజీవ్ భట్ భార్య శ్వేతా భట్ బీబీసీతో చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- చెన్నైలో తాగునీటికి కటకట: వర్షాలు పడకుంటే మురుగునీరే దిక్కా?
- బెంగళూరు సహా ఈ 11 నగరాల్లో నీటికి కటకటే!
- మనిషి పాదాల పరిమాణం రోజురోజుకు పెరిగిపోతోంది.. ఎందుకో తెలుసా
- శాంసంగ్: స్మార్ట్ టీవీలపై వైరస్ దాడులను నివారించేందుకు ఇలా చేయడి
- #INDvPAK క్రికెట్లోనే ‘అతిపెద్ద పోటీ’కి వంద కోట్ల మంది ప్రేక్షకులు
- క్రికెట్ ప్రపంచ కప్ 2019: పాకిస్తాన్‌తో ఆడిన 6 మ్యాచుల్లో భారత్ ఎలా గెలిచింది...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








