అమెరికా-ఇరాన్ సంక్షోభం: పది నిమిషాలు ఉందనగా దాడులను ఆపించా - ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images
ఇరాన్‌పై తమ సైన్యం మరో పది నిమిషాల్లో ప్రతిదాడులు చేస్తుందనగా మనసు మార్చుకుని వాటిని ఆపించానని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ అన్నారు.
తమ మానవరహిత డ్రోన్‌ను ఇరాన్ కూల్చివేసినందుకు ప్రతీకారంగా మూడు చోట్ల ఈ దాడులకు పాల్పడేందుకు తొలుత సిద్ధమైనట్లు ఆయన తెలిపారు.
దాడుల్లో 150 మంది ప్రాణాలు కోల్పోతారని అధికారులు అంచనాలు వేయడంతో, ఇది తగిన ప్రతిచర్య కాదని భావిస్తూ నిర్ణయాన్ని వెనక్కితీసుకున్నట్లు ట్విటర్ వేదికగా ఆయన వివరించారు.
''దాడులకు పది నిమిషాలు ఉందనగా ఆపించా. ఒక మానవ రహిత డ్రోన్ కూల్చివేతకు ఇది సరైన ప్రతిచర్య కాదు'' అని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
న్యూయార్క్ టైమ్స్ దినపత్రిక గురువారం రాత్రి దాడులపై ట్రంప్ నిర్ణయం మార్చుకోవడం గురించి కథనం ప్రచురించింది.
ఆపరేషన్ 'ప్రాథమిక దశల్లో' ఉండగానే ట్రంప్ సైన్యాన్ని ఆపించినట్లు పేర్కొంది.
తనకేమీ తొందర లేదని ట్రంప్ ట్విటర్‌లో వ్యాఖ్యానించారు.
''మా సైన్యం పునర్నిర్మాణమై కొత్తగా ఉంది. రంగంలోకి దిగేందుకు సిద్ధంగా ఉంది. ప్రపంచంలోనే ఇప్పటివరకూ అత్యుత్తమ సైన్యం ఇదే'' అని ట్రంప్ అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఇరాన్ సోమవారం తమ డ్రోన్‌ను కూల్చిందని ఆయన పేర్కొన్నారు.
దాడుల విషయంలో నిర్ణయం మార్పు గురించి ఎన్‌బీసీ న్యూస్‌తోనూ ట్రంప్ మాట్లాడారు.
ఇదివరకు అమెరికా సైన్యం చేసిన ప్రకటనలో డ్రోన్ ఇరాన్ కాలమానం ప్రకారం గురువారం వేకువజామున నాలుగు గంటల ప్రాంతంలో కూలినట్లు ఉంది.
గురువారం ఉదయం తమ గగనతలంలోకి అక్రమంగా ప్రవేశించిన అమెరికా డ్రోన్‌ను కూల్చివేశామని ఇరాన్ చెబుతోంది.
అమెరికా మాత్రం తమ డ్రోన్ అంతర్జాతీయ గగనతలంలో ఉండగానే ఘటన జరిగిందని పేర్కొంది.

ఫొటో సోర్స్, IRIBNEWS
చమురు నౌకలపై తాజాగా జరిగిన దాడులతోపాటు, మే లో జరిగిన దాడుల్లోనూ ఇరాన్ పాత్ర ఉందని అమెరికా ఆరోపించింది.
అయితే, ఈ ఆరోపణలను ఇరాన్ తోసిపుచ్చుతోంది.
అణ్వాయుధ అభివృద్ధి కార్యక్రమాలను నిలిపివేస్తామంటూ 2015లో అమెరికా సహా వివిధ దేశాలతో ఇరాన్ అణు ఒప్పందం కుదుర్చుకుంది.
అణ్వాయుధాలతోపాటు అణు విద్యుత్ ఉత్పత్తిలో వినియోగించే శుద్ధి చేసిన యురేనియం నిల్వలపై పరిమితులు పాటిస్తామని అంగీకరించింది. దీనికి బదులుగా ఇరాన్‌పై విధించిన ఆంక్షలను ఆయా దేశాలు ఎత్తివేశాయి.

ఫొటో సోర్స్, EPA
అయితే, ఇరాన్ నిబంధనలను పాటించడం లేదని ఆరోపిస్తూ గతేడాది అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఈ ఒప్పందం నుంచి వైదొలిగారు. ఇరాన్‌పై మళ్లీ ఆంక్షలు విధించారు.
చమురు ఆధారంగా నడుస్తున్న ఇరాన్ ఆర్థిక వ్యవస్థ ఈ చర్యతో దెబ్బతింది.
ప్రతిస్పందన చర్యగా, తిరిగి అణ్వాయుధ కార్యక్రమాలను పెంచాలని ఇరాన్ నిర్ణయం తీసుకుంది.
అయితే, ఇప్పటికీ సమయం మించిపోలేదని, అమెరికా ఆంక్షల నుంచి యురోపియన్ దేశాలు తమకు రక్షణ కల్పించవచ్చని ఇరాన్ పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









