పశ్చిమాసియాలో అమెరికా అదనపు బలగాల మోహరింపు.. ఇవి ఇరాన్‌తో యుద్ధానికి సన్నాహాలేనా..

ఫొటో సోర్స్, US DEPARTMENT OF DEFENSE
పశ్చిమాసియాలో అమెరికా సైనిక మోహరింపులు మరింత పెరుగుతున్నాయి. ఇరాన్‌తో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఆ ప్రాంతానికి అదనంగా మరో వెయ్యి మంది సైనిక సిబ్బందిని పంపాలని ఆ దేశ సైన్యం నిర్ణయం తీసుకుంది.
గత నెలలో పంపించిన 1,500 మంది సిబ్బందికి వీరు అదనం.
ఇరాన్ బలగాల 'ప్రతికూల వైఖరి'కి ప్రతిగా ఈ మోహరింపు చేపడుతున్నట్లు అమెరికా తాత్కాలిక రక్షణ మంత్రి పాట్రిక్ షెనహాన్ తెలిపారు.
''ఇరాన్‌తో మేం సంక్షోభాన్ని కోరుకోవడం లేదు. మా జాతీయ ప్రయోజనాల కోసం మిడిల్ ఈస్ట్‌లో పనిచేస్తున్న మా సైనిక సిబ్బంది సంక్షేమం, భద్రత కోసమే ఈ చర్య తీసుకున్నాం'' అని అన్నారు.
ఒమన్ గల్ఫ్‌లో ఇటీవల చమురు ఓడలపై జరిగిన దాడుల వెనుక ఇరాన్ ఉందని అమెరికా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ దాడులకు సంబంధించి కొత్త చిత్రాలను ఆ దేశ నావికాదళం విడుదల చేసింది.
''ఇరాన్ బలగాలు, వారి తరఫున పనిచేసే సంస్థలు మా సైన్యానికి ప్రతికూలంగా పనిచేస్తున్నట్లు అందుతున్న సమాచారాన్ని తాజా దాడులు మరింత బలపరుస్తున్నాయి'' అని పాట్రిక్ వ్యాఖ్యానించారు.
పరిస్థితికి తగ్గట్లు సైనిక మోహరింపుల్లో మార్పులు ఉంటాయని చెప్పారు.

ఫొటో సోర్స్, EPA
పరిమితులు దాటుతాం..
2015లో కుదిరిన అణు ఒప్పందం నిబంధనలకు ఇకపై తాము కట్టుబడి ఉండమని ఇరాన్ సోమవారం ప్రకటించింది.
ఈ ఒప్పందం నుంచి అమెరికా ఇదివరకే వైదొలిగింది.
ఆ ఒప్పందం వల్ల తాము ఎదుర్కొంటున్న పరిమితులను దాటుతూ, జూన్ 27కల్లా శుద్ధి చేసిన యురేనియం నిల్వలను పెంచుకుంటామని ఇరాన్ స్పష్టం చేసింది.
చైనా సహా ఒప్పందంలో భాగమైన ఇతర పక్షాలు సంయమనం పాటించాలని ఇరాన్‌ను కోరాయి. ఒప్పందాన్ని వీడవద్దని అభ్యర్థించాయి.
అమెరికా విడుదల చేసిన తాజా చిత్రాలు.. జపనీస్ చమురు ఓడ నుంచి పేలని మైన్ భాగాలను ఇరానియన్ రెవెల్యూషనరీ గార్డ్స్ సిబ్బంది తొలగిస్తున్నట్లుగా చూపుతున్నాయి.
చమురు నౌకలపై తాజాగా జరిగిన దాడులతోపాటు, మే లో జరిగిన దాడుల్లోనూ ఇరాన్ పాత్ర ఉందని అమెరికా ఆరోపించింది.
అయితే, ఈ ఆరోపణలను ఇరాన్ తోసిపుచ్చుతోంది.

ఫొటో సోర్స్, EPA
కొత్త ఉద్రిక్తతలకు కారణాలేంటి
అణ్వాయుధ అభివృద్ధి కార్యక్రమాలను నిలిపివేస్తామంటూ 2015లో అమెరికా సహా వివిధ దేశాలతో ఇరాన్ అణు ఒప్పందం కుదుర్చుకుంది.
అణ్వాయుధాలతోపాటు అణు విద్యుత్ ఉత్పత్తిలో వినియోగించే శుద్ధి చేసిన యురేనియం నిల్వలపై పరిమితులు పాటిస్తామని అంగీకరించింది. దీనికి బదులుగా ఇరాన్‌పై విధించిన ఆంక్షలను ఆయా దేశాలు ఎత్తివేశాయి.
అయితే, ఇరాన్ నిబంధనలను పాటించడం లేదని ఆరోపిస్తూ గతేడాది అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఈ ఒప్పందం నుంచి వైదొలిగారు. ఇరాన్‌పై మళ్లీ ఆంక్షలు విధించారు.
చమురు ఆధారంగా నడుస్తున్న ఇరాన్ ఆర్థిక వ్యవస్థ ఈ చర్యతో దెబ్బతింది.
ప్రతిస్పందన చర్యగా, తిరిగి అణ్వాయుధ కార్యక్రమాలను పెంచాలని ఇరాన్ నిర్ణయం తీసుకుంది.
అయితే, ఇప్పటికీ సమయం మించిపోలేదని, అమెరికా ఆంక్షల నుంచి యురోపియన్ దేశాలు తమకు రక్షణ కల్పించవచ్చని ఇరాన్ పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
- అమెరికా - ఇరాన్ ఘర్షణ: హోర్ముజ్ జలసంధిలో సంక్షోభం మీ మీద, ప్రపంచం మీద చూపే ప్రభావం ఏమిటి?
- ట్రావెల్ ఫొటో పోటీలు 2019: చూపుతిప్పుకోనివ్వని ఫొటోలు... విజేతలు వీరే
- వందల ఏళ్ల క్రితమే గంజాయి వాడకం... సమాధుల్లో బయటపడిన సాక్ష్యాలు
- ఈఫిల్ టవర్ వద్ద మానవాళి ఐక్యతను చాటుతూ భారీ పెయింటింగ్
- విక్టోరియా మోడెస్టా: కృత్రిమ కాలుతో.. పారిస్ కేబరేను షేక్ చేస్తున్న బయోనిక్ షోగర్ల్
- తొలిరాత్రి కన్యత్వ పరీక్ష: నెత్తురు కనిపించకపోతే ఆమెకు నరకమే!
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








