క్రికెట్ ప్రపంచకప్ 2019: బిజినెస్ ఎంతో ఊహించగలరా..

ఫొటో సోర్స్, Rex Features
క్రికెట్ ప్రపంచకప్ అంటే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి ఆసక్తి. అదే అదనుగా తమ బ్రాండును కోట్లాది మందికి పరిచయం చేయడం కోసం వందల కోట్లు ఖర్చుపెట్టేందుకూ కార్పొరేట్ సంస్థలు వెనకాడవు. దాంతో ఈ టోర్నమెంట్ భారీ వ్యాపారానికి కేంద్ర బిందువుగా మారింది.
ఆ వ్యాపారంలోనూ అత్యంత ధనిక క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉన్న భారత్ కీలక పాత్ర పోషిస్తుంది.
ఈ ప్రపంచకప్ వెనుక జరిగే వ్యాపారం ఎంత భారీస్థాయిలో ఉంటుందో చూద్దాం.
ప్రసార హక్కుల అమ్మకం
అత్యధిక ఆదాయం వచ్చే తొలి మార్గం ప్రసార హక్కుల అమ్మకం. భారత్‌లో టీవీ ప్రసారాలపై రేటింగ్ ఇచ్చే బార్క్ (బ్రాడ్‌కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్) గణాంకాల ప్రకారం, గతేడాది 70 కోట్ల మంది క్రికెట్ మ్యాచ్‌లను టీవీలలో వీక్షించారు. ఈ ప్రపంచకప్ మ్యాచ్‌లకు ఆ సంఖ్య అంతకంటే భారీగానే పెరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
హక్కుల కొనుగోలులో డిస్నీ సంస్థకు చెందిన స్టార్ ఇండియా ముందుంది. 2023 వరకు జరిగే ఐసీసీ టోర్నమెంట్ల ప్రసార హక్కుల కొనుగోలుకు సంబంధించి 2015లోనే ఈ సంస్థ 1.98 బిలియన్ డాలర్లకు ఒప్పందం చేసుకుంది. ప్రస్తుత భారత కరెన్సీలో చెప్పాలంటే ఆ డీల్ విలువ దాదాపు 13,850 కోట్లు.
అదే సంస్థ 2022 వరకు జరిగే ఐపీఎల్ మ్యాచ్‌ల ప్రసార హక్కులను 17,442 కోట్ల రూపాయలకు దక్కించుకుంది. అంతేకాదు, 2023 వరకూ భారత క్రికెట్ అంతర్జాతీయ ప్రసారాల హక్కులను 6,500 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. మొత్తంగా ఈ ఒక్క మీడియా సంస్థే గతంతో పోల్చితే ప్రసార హక్కుల ఆదాయంలో 59 శాతం పెరుగుదలకు కారణమైంది.
భారత్‌లో స్మార్ట్‌ఫోన్ ద్వారా ఇంటర్నెట్ వాడకం అంతకంతకూ పెరిగిపోతుండటంతో డిజిటల్ ప్రసారాలపై ఈ సంస్థ ప్రత్యేక దృష్టిపెట్టింది. జూన్ 16న భారత్- పాకిస్తాన్ మధ్య జరిగిన ప్రపంచకప్ మ్యాచ్‌ను ఈ సంస్థకు చెందిన 'హాట్ స్టార్' యాప్‌లో వీక్షించినవారి సంఖ్య ఒక దశలో కోటీ 20 లక్షలకు చేరింది.

ఫొటో సోర్స్, Getty Images
ప్రకటనలు
మీడియా ప్రకటనదారులు చెప్పిన వివరాల ప్రకారం, కీలక ప్రపంచకప్ మ్యాచ్‌లు జరిగే సమయంలో 10 సెకన్ల నిడివి ఉన్న టీవీ ప్రకటన ఖరీదు రూ.25 లక్షల దాకా ఉంటుంది. అంటే, ఒక్క మ్యాచ్‌కి రూ.100 కోట్లకు పైనే ఆదాయం వస్తుంది.
స్పాన్సర్‌షిప్ డీల్స్
స్పాన్సర్‌షిప్ ఒప్పందాల విషయానికొస్తే ఇక్కడ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తెరమీదికొస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్‌కు 20కి పైగా బ్రాండ్స్ వాణిజ్య భాగస్వాములుగా ఉన్నాయి. అందులో, దాదాపు 30 శాతం భారత్‌కు చెందిన ఎంఆర్‌ఎఫ్ టైర్స్, బిరా91, రాయల్ స్టాగ్, డ్రీమ్11 లాంటివి ఉన్నాయి.
అమెరికా కేంద్రంగా పనిచేసే ట్యాక్సీ సేవల సంస్థ ఉబర్ కూడా ప్రపంచకప్ టోర్నీకి వాణిజ్య భాగస్వామిగా ఉంది. తన మార్కెటింగ్ ప్రకటనల కోసం తొలిసారిగా భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీతో ఒప్పందం చేసుకుంది.
"ప్రపంచకప్ టోర్నమెంట్ ఎంతో కీలకమైనది. విరాట్ కోహ్లీ ఒక గ్లోబల్ సెలెబ్రిటీ, ఆయనకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. ఆయన ద్వారా ప్రకటన ఇస్తే కోట్లమందికి చేరువయ్యే అవకాశం ఉంటుంది" అని ఉబర్ ఇండియా అధ్యక్షుడు ప్రదీప్ పరమేశ్వరన్ బీబీసీతో చెప్పారు.
ఉబర్ మాదిరిగానే భారతీయ సంస్థలు అముల్, కెంట్‌ఆర్‌వోలు కూడా అంతర్జాతీయ మార్కెట్‌లో గుర్తింపు తెచ్చుకునే వ్యూహాన్ని అనుసరిస్తున్నాయి.

భారీగా టికెట్ల అమ్మకాలు
అత్యధికంగా ఆదాయం వచ్చే మరో మార్గం టికెట్ల అమ్మకాలు. కీలక మ్యాచ్‌లు జరిగేటప్పుడు టికెట్లకు భారీ డిమాండ్ ఉంటుంది. ప్రసారాల హక్కులు, స్పాన్సర్‌షిప్‌ల అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం ఐసీసీకి వెళ్తుంది. టికెట్ల అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం మాత్రం ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డుకు వెళ్తుంది. మైదానంలో ఆహార పదార్థాలు, పానీయాల అమ్మకాలు, వాహనాల పార్కింగ్ ద్వారా వచ్చే ఆదాయం మ్యాచ్ జరిగే స్టేడియం యాజమాన్యానికి వెళ్తుంది.
ఉదాహరణకు జూన్ 16న భారత్- పాకిస్తాన్ ప్రపంచ కప్ మ్యాచ్ జరిగిన ఓల్డ్ ట్రఫర్డ్ మైదానం సామర్థ్యం 26,000 సీట్లు ఉండగా, 48 గంటల్లోనే టికెట్లు పూర్తిగా అమ్ముడుపోయాయి. ఆఖరి నిమిషంలో ఓ రీసేల్ వెబ్‌సైట్ ఒక్కో టికెట్‌ను 6,000 డాలర్లకు అమ్మింది.
అయితే, క్రికెట్‌కి రోజురోజుకీ ప్రజాదరణ పెరిగిపోతోంది, కానీ వచ్చే ఆదాయంలో పురుషుల జట్లకే సింహ భాగం వెళ్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కార్పొరేట్ సంస్థలను ఆకర్షించడంలో భారత మహిళా క్రికెట్ జట్టు ఇప్పటికీ వెనుకంజలోనే ఉంది.
"భారత్‌లో పరిస్థితి మారుతోంది. 2017 ప్రపంచకప్‌లో మహిళా క్రికెట్ జట్టు ఓడిపోయింది. అయినా, ఇప్పటికీ పలు వాణిజ్య సంస్థలతో ఒప్పందాలు ఉన్నాయి, అనేక మంది స్పాన్సర్లు ఉన్నారు. వివక్ష ఉందని నేను అనను. అయితే, కొంత మార్పు రావాల్సిన అవసరం మాత్రం ఉంది. వారు అంతర్జాతీయంగా విజయాలు సాధించడం మొదలుపెడితే, దానంతట అదే ఆ జట్ల మీదకు అందరి దృష్టిపడుతుంది. దాంతో, ఆర్థికంగానూ మహిళల జట్లు బలపడే అవకాశం ఉంటుంది" అని భారత మహిళల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అర్జున్ చోప్రా అన్నారు.
ఇవి కూడా చదవండి
- ప్రపంచ కప్‌లో వరుసగా ఏడోసారి పాకిస్తాన్‌పై భారత్ విజయం
- #INDvPAK క్రికెట్లోనే ‘అతిపెద్ద పోటీ’కి వంద కోట్ల మంది ప్రేక్షకులు
- క్రికెట్ ప్రపంచకప్ 2019: మీరు తెలుసుకోవాల్సిన 12 విషయాలు
- చంద్రయాన్-2 మిషన్ సూత్రధారులు ఈ ఇద్దరు మహిళలు
- సిలికాన్ వాలీ తల్లిదండ్రులు తమ పిల్లలను టెక్నాలజీకి దూరంగా ఉంచుతున్నారు.. ఎందుకు?
- రెండో ప్రపంచ యుద్ధంలో విడిపోయి 75 ఏళ్ల తర్వాత కలుసుకున్న ప్రేమజంట
- ఆంధ్రప్రదేశ్: ఈ గవర్నమెంటు స్కూల్లో సీట్లు లేవు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








