ఆంధ్రప్రదేశ్: ఈ గవర్నమెంటు స్కూల్లో సీట్లు లేవు

- రచయిత, వి.శంకర్
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త విద్యా సంవత్సరం మొదలైంది. వేసవి సెలవులు పూర్తి చేసుకొని, పాఠశాలలు తిరిగి తెరుచుకుంటున్నాయి. కొత్తగా తమ సంస్థల్లో చేరేందుకు పోటెత్తుతున్న విద్యార్థులను వడపోసేందుకు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు అడ్మిషన్ టెస్టులు నిర్వహించడం ఈ సమయంలో సాధారణం.
మరోవైపు ప్రభుత్వ పాఠశాలలు మాత్రం విద్యార్థులను ఆకర్షించేందుకు బడి బాట లాంటి కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుంది.
అయితే, కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. కార్పొరేట్ పాఠశాలలను కాదని, జనాలు ఈ బడుల వైపు వస్తున్నారు. దీంతో ఆ స్కూళ్లలోనూ అడ్మిషన్ టెస్ట్‌ల హంగామా కనిపిస్తోంది.
నెల్లూరు, విజయవాడ, కాకినాడ లాంటి పట్టణాల్లో ఈ పరిస్థితులు కనిపించాయి.

నెల్లూరు నగర పరిధిలోని కేఎన్ఆర్ మున్సిపల్ హైస్కూల్ ఎలాంటి ప్రచార కార్యక్రమాలు నిర్వహించలేదు. అయినా, అందులో చేరేందుకు విద్యార్థులు పోటీ పడుతున్నారు.
బీబీసీ ప్రతినిధి బృందం ఈ పాఠశాలను సందర్శించినప్పుడు, పాఠశాల తెరుచుకున్న తొలి రోజే ఆరో తరగతిలో చేరేందుకు వచ్చిన సుమారు 200 మంది విద్యార్థులు అక్కడ కనిపించారు. వీరంతా అంతకుముందు ప్రైవేటు స్కూళ్లలో చదివినవారు కావడం విశేషం. మొత్తంగా ఆ పాఠశాలలో ఆరో తరగతిలో 240 సీట్లున్నాయి.
సమీపంలోని మున్సిపల్ ప్రైమరీ స్కూల్ విద్యార్థులను కేఎన్ఆర్ మున్సిపల్ హైస్కూల్ చేర్చుకోవాల్సి ఉంది. సుమారు 150 మంది ఇలా ఈ స్కూల్‌లో చేరతారు. మిగతా 90 సీట్లకు మాత్రమే ఇతర విద్యార్థులకు అవకాశం ఉంటుంది.
ప్రైవేటు పాఠశాలల నుంచి వచ్చిన వారు ఇందుకోసం జూన్ 12న అడ్మిషన్ టెస్టు రాశారు.

ప్రైవేటు వాళ్లకే పరీక్ష
నవోదయ విద్యాలయాలు, వివిధ గురుకులాల్లో ప్రవేశ పరీక్షలు జరుగుతుంటాయి.
అయితే, మున్సిపల్, జిల్లా పరిషత్ స్కూళ్లలో మాత్రం ఇలా అడ్మిషన్ టెస్టులు సాధారణంగా జరగవు.
ఏడు, ఆ పై తరగతులకు అడ్మిషన్లు పూర్తయ్యాయంటూ కేఎన్ఆర్ మున్సిపల్ హైస్కూల్ బోర్డు పెట్టింది.
కేవలం ఆరో తరగతి వరకూ మాత్రమే అడ్మిషన్ టెస్టులు పెడుతోంది. ఈ అడ్మిషన్ల కోసం కొంత మంది స్థానిక ప్రజా ప్రతినిధుల సిఫార్సులను తీసుకుని వస్తున్నారు.
ఇదివరకు ప్రభుత్వ పాఠశాలలల్లో చదివిన పిల్లలకైతే కేఎన్ఆర్ మున్సిపల్ హైస్కూల్ ఎలాంటి పరీక్షలూ పెట్టడం లేదు. నేరుగా వారిని చేర్చుకుంటోంది. ప్రైవేటు పాఠశాలల్లో చదువుకొని వచ్చినవారికే అడ్మిషన్ టెస్టులు పెడుతోంది.

అర్థం చేసుకునేందుకే..
దీనిపై బీబీసీ ఆ స్కూల్ అధికారులను ప్రశ్నించింది.
అయితే, తాము అడ్మిషన్లకు ఆ టెస్టు మార్కులను కొలమానంగా తీసుకోవడం లేదని కేఎన్ఆర్ హైస్కూల్ హెడ్మాస్టర్ ఎం. విజయప్రకాశ్ రావు చెప్పారు.
''విద్యార్థుల అవగాహన స్థాయిలను అర్థం చేసుకునేందుకే ఈ పరీక్షలు నిర్వహిస్తున్నాం. చేర్చుకున్న తర్వాత, వారి పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నదాని కోసం ఇది ఉపయోగపడుతుంది'' అని అన్నారు.
ఐదో తరగతి వరకూ ఓ కార్పొరేట్ స్కూల్‌లో తన కుమారుడిని చదివించి, ఇప్పుడు కేఎన్ఆర్ హైస్కూల్ చేర్చేందుకు తీసుకువచ్చిన రోజా రమణి అనే మహిళను బీబీసీ పలకరించింది.
ఆమె స్వయంగా ఓ ప్రైవేటు పాఠశాలలోనే పనిచేస్తున్నారు.
కేఎన్ఆర్ హైస్కూల్‌లో మంచి నైపుణ్యమున్న ఉపాధ్యాయులు ఉన్నారని, ఏటా ఆ పాఠశాల మంచి ఫలితాలు సాధిస్తోందని ఆమె అన్నారు.
''ఇక్కడ పరిస్థితి మిగతా ప్రభుత్వ పాఠశాలల్లా లేదు. కార్పొరేట్ స్కూళ్లకు మించి ఉపాధ్యాయులు విద్యార్థులపై శ్రద్ధ తీసుకుంటున్నారు. క్రమశిక్షణ, నాణ్యమైన విద్య అందుతున్నప్పుడు, ఫీజులు చెల్లిస్తూ ప్రైవేటు స్కూళ్లకు మా చిన్నారులను పంపడం ఎందుకు?'' అని రోజా రమణి వ్యాఖ్యానించారు.

వారి పిల్లలూ ఇక్కడే..
కేఎన్ఆర్ స్కూల్‌కి గత దశాబ్ద కాలంగా మంచి రికార్డ్ ఉంది. 2010లో ఈ స్కూల్‌కు చెందిన విద్యార్థి పదో తరగతిలో రాష్ట్రంలోనే మొదటి ర్యాంక్ సాధించాడు.
అదే విద్యార్థి ఆ తర్వాత నూజివీడు ట్రిపుల్ ఐటీలో చదవి, గేట్ పరీక్షలో ఆలిండియా టాపర్ గా నిలిచాడు.
అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచేలా ఆ విద్యార్థి పేరుతో పాఠశాలలో ఓ శిలాఫలకం ఏర్పాటు చేశారు.
గతేడాది కూడా స్కూళ్లో పదో తరగతిలో ఏడుగురు విద్యార్థులకు 10కి 10 జీపీఏ పాయింట్లు సాధించారు. మరో 13 మందికి 9.8 పాయింట్లు వచ్చాయి.
ఈ పాఠశాలలో పనిచేస్తున్న చాలా మంది ఉపాధ్యాయులు తమ పిల్లలను ఇక్కడే చదవిస్తున్నారు.
ఉపాధ్యాయ బృందం చిత్తశుద్ధికి నిదర్శనంగా స్థానికులు దీన్ని చూస్తున్నారు.

బోధనలో డిజిటల్ పద్ధతులను పాటిస్తున్నామని, విద్యార్థుల క్రమశిక్షణకు ప్రాధాన్యమిస్తున్నామని హెడ్మాస్టర్ ఎం. విజయప్రకాశ్ తెలిపారు. క్రీడలపైనా ప్రత్యేక దృష్టి పెట్టామని అన్నారు.
కేఎన్ఆర్ స్కూల్‌లో చదవిన సౌజన్య అనే విద్యార్థిని మహిళల క్రికెట్‌లో అంతర్జాతీయ స్థాయిలో ఆడుతున్నట్లు ఆయన వివరించారు.
నెల్లూరులోని వివిధ మున్సిపల్ హైస్కూళ్లలోనూ అడ్మిషన్లకు ఇలాంటి పోటీనే కనిపిస్తోంది.
బాలాజీపేటలో ఉన్న మున్సిపల్ స్కూల్‌లో అడ్మిషన్స్ పూర్తయినట్టు ఉపాధ్యాయులు తెలిపారు.
విజయవాడలోని ఏకేటీపీ మునిసిపల్ కార్పోరేషన్ హైస్కూల్, కాకినాడలోని శ్రీనగర్ మునిసిపల్ హైస్కూల్‌ల్లోనూ అడ్మిషన్స్ కోసం తీవ్ర పోటీ కనిపించింది.

మూతపడుతున్న పాఠశాలలు
కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనే ఇలా అడ్మిషన్ల కోసం పోటీ వాతావరణం కనిపిస్తోంది. చాలా చోట్ల సీట్లు పూర్తిగా భర్తీ అవ్వట్లేదు.
గడిచిన కొన్నేళ్లలో సరిపడా విద్యార్థులు లేక రాష్ట్రవ్యాప్తంగా 4,300 పాఠశాలలు మూతపడినట్లు ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి.
చాలా ప్రభుత్వ పాఠశాలల్లో తగిన సదుపాయాలు ఉండట్లేదు. ఉపాధ్యాయ పోస్టులు కూడా భర్తీ అవడం లేదు.
దీంతో చాలా మంది స్తోమత లేకపోయినా తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపిస్తున్నారు.
అయితే, ఉపాధ్యాయులు తమ వృత్తి పట్ల చిత్తశుద్ధి చూపి, బాధ్యతగా వ్యవహరిస్తే ప్రభుత్వ పాఠశాలలు మెరుగుపడతాయని కేఎన్ఆర్ స్కూల్ ఉపాధ్యాయులు చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి కూడా ఇందుకు తోడ్పాటు అవసరమని అంటున్నారు.

ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









