సిలికాన్ వాలీ తల్లిదండ్రులు తమ పిల్లలను టెక్నాలజీకి దూరంగా ఉంచుతున్నారు.. ఎందుకు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, కొలీన్ హాగెర్టి
- హోదా, బీబీసీ న్యూస్, శాన్ ఫ్రాన్సిస్కో బే
ప్రపంచంలో అతి పెద్ద టెక్ కంపెనీలను స్థాపించిన సిలికాన్ వ్యాలీ పారిశ్రామికవేత్తల తరంలో చాలా మంది ఇప్పుడు తల్లిదండ్రులు అవుతున్నారు. వారిలో కొందరు తమ పిల్లలను.. మనం నిరంతరం ఉపయోగించే టెక్నాలజీకి దూరంగా ఉంచుతున్నారు.
ఆపిల్ సంస్థ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్.. తమ పిల్లలు ఇంటి దగ్గర ఉపయోగించటానికి అనుమతించే టెక్నాలజీని తాను, తన భార్య లారీన్ పావెల్ కలిసి చాలా పరిమితం చేశామని 2011లోనే అంగీకరించారు.
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కూడా.. తమ పిల్లలు వివిధ డివైజ్‌ల తెరలను వీక్షించే సమయాన్ని పరిమితం చేయటం, భోజన సమయంలో మొబైల్ ఫోన్ల వాడకాన్ని నిషేధించారన్నది చాలా మందికి తెలుసు.
ఫేస్‌బుక్ యజమాని మార్క్ జుకర్‌బర్గ్ 2017లో అప్పుడే పుట్టిన తన కుమార్తెకు.. ''బయటకు వెళ్లి ఆడుకో'' అని కోరుతూ ఒక లేఖ రాశారు.
ఈ సిలికాన్ వ్యాలీ తల్లిదండ్రులు తమ పిల్లలను తెరలకు దూరంగా ఎందుకు ఉంచుతున్నారు?

ఫొటో సోర్స్, Getty Images
టెక్నాలజీ రహిత బాల్యం
శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాలో ఒక టెక్ ఎగ్జిక్యూటివ్ పియరీ లారెంట్. పెన్సిల్వేనియాలోని వాల్డార్ఫ్ స్కూల్ బోర్డ్ డైరెక్టర్ కూడా. ఈ ప్రఖ్యాత సిలికాన్ వ్యాలీ ప్రైవేట్ స్కూల్.. తన విద్యార్థులు టీనేజీ వయసుకు వచ్చే వరకూ టెక్నాలజీ వాడరాదని నిషేధించింది.
లారెంట్ తన ముగ్గురు పిల్లలనూ ఇదే స్కూల్‌లో చదివిస్తున్నారు. ఈ స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రుల్లో మూడొంతుల మంది టెక్ రంగంలోనే పనిచేస్తున్నారని ఆయన బీబీసీతో పేర్కొన్నారు.
పిల్లలు నేర్చుకునే ప్రక్రియ మీద టెక్నాలజీ చూపే ప్రమాదకర ప్రభావాల గురించి జాగ్రత్తగా ఉండాలని ఈ స్కూల్ యాజమాన్యం పిల్లల తల్లిదండ్రులకు చెప్తుంది.
''బాల్యంలో ఒక చిన్న గాజు తెర మీద నేర్చుకునేది ఏమీ లేదు. పిల్లలు అన్ని ఇంద్రియాలతో పనిచేయాలి. అన్ని రకాలుగా మెదడుకు మేత ఇవ్వాల్సిన అవసరముంది'' అంటారాయన.

ఫొటో సోర్స్, Getty Images
వైరుధ్యం
సిలికాన్ వ్యాలీలో ఈ వైరుధ్యాలను చూపుతూ మీడియా కథనాలు వెలువడటంతో వాల్డార్ఫ్ స్కూల్ చర్చనీయాంశంగా మారింది.
ప్రపంచ టెక్నాలజీ రంగానికి గుండె వంటి ప్రాంతంలోనే.. 'మనసుకు, ఆలోచనకు సంపూర్ణ విద్య' అంటున్న ఈ స్కూల్ ఉంది.
ఈ స్కూల్ పాఠ్యప్రణాళికలో.. ఆత్మవిశ్వాసం, స్వీయ క్రమశిక్షణ, స్వతంత్ర ఆలోచన, టీమ్ వర్క్, కళాత్మక అభివ్యక్తి వంటి ''21వ శతాబ్దపు నైపుణ్యాలు''పై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు.
''ఈ మానవ సామర్థ్యాలు తెర ముందు అభివృద్ధి చెందవు. వాస్తవంగా పనులు చేస్తూ, స్వయంగా పనులు చేస్తూ అందులో నిమగ్నమవ్వాల్సి ఉంటుంది'' అని లారెంట్ పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇద్దరు తండ్రులు.. రెండు అభిప్రాయాలు
ఈ సందేశంతో సిలికాన్ వ్యాలీ కొత్త తరం తల్లిదండ్రులు చాలా మంది ఏకీభవిస్తున్నప్పటికీ.. చాలా మంది ఇతరులు.. 21వ శతాబ్దంలో తరగతిలో నేర్చుకోవటానికి, బయట విజయం సాధించటానికి టెక్నాలజీ అనేది అవసరమైన పరికరమనే నమ్ముతున్నారు.
డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్, టెక్నాలజీ అంశాలపై కుటుంబాలకు సలహాలు అందించే కామన్ సెన్స్ మీడియా సీనియర్ డైరెక్టర్ మెర్వ్ లాపస్.
తరగతి గదుల్లో టెక్నాలజీని ఉపయోగించటం వల్ల ఉండే లాభనష్టాల గురించి గత పదేళ్లుగా విశ్లేషిస్తూ, తల్లిదండ్రులకు సూచనలు చేస్తూ ఉన్నారాయన.
''అవును. టెక్నాలజీ అనేది ఏకాగ్రతకు భంగం కలిగించగలదు. మరి దానిని ఎలా ఎదుర్కోవాలి? పిల్లలు టెక్నాలజీని ఉపయోగించే వీలు చాలా ఎక్కువగా ఉంది. అలాగే వారిని వాస్తవ ప్రపంచానికి సంసిద్ధం చేయాల్సి ఉంటుంది. అందుకోసం ఈ పరికరాలను ఉపయోగించాల్సి ఉంటుంది'' అని ఆయన పేర్కొన్నారు.
''మా పిల్లల నుంచి ఈ డివైజ్‌లను దూరం పెడతాం' అని ఎవరైనా చెప్తున్నారంటే.. వారి ఇళ్లలో పిల్లలకు ఈ టెక్నాలజీ అందుబాటులో ఉందని అర్థం. తక్కువ ఆదాయం ఉన్న చాలా కుటుంబాల్లో పరిస్థితి ఇలా ఉండదు'' అని వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Getty Images
సమతుల్యం సాధించటం
చిన్నారులు స్క్రీన్ వీక్షించే సమయాన్ని తగ్గిస్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.
రెండేళ్ల లోపు వయసున్న పిల్లలు టీవీ కానీ, ఇతర స్క్రీన్లను కానీ చూస్తూ ఉండిపోయేలా వదిలివేయకూడదని డబ్ల్యూహెచ్‌ఓ చెప్తోంది.
రెండు నుంచి నాలుగేళ్ల వయసున్న పిల్లల స్క్రీన్ టైమ్ రోజుకు ఒక గంట కన్నా తక్కువే ఉండాలని సూచించింది.
కానీ.. పిల్లలందరు తెరముందు గడిపే సమయాన్ని సమానంగా పరిగణించరాదని లాపస్ అంటారు. అందుకు.. ఆరేళ్లు, ఎనిమిదేళ్ల వయసున్న తన ఇద్దరు పిల్లలను పెంచటంలో ఎదురవుతున్న సవాళ్లను ఉదాహరణగా చూపిస్తున్నారు.
''వీళ్లు స్క్రీన్లు చూస్తున్నంత త్వరగా చూడకూడదు. కానీ వాస్తవం ఏమిటంటే.. నేను వంట చేయాలి. ఆ సమయంలో వారి కాలక్షేపానికి సెసేమ్ స్ట్రీట్ చాలా బాగా ఉపయోగపడుతుంది'' అని చెప్తారు.
''నేను వంట సిద్ధం చేయగలుగుతాను. వాళ్లు కొంతసేపు సెసామ్ స్ట్రీట్ చూడగలుగుతారు. అయితే.. వాళ్లు ఏం నేర్చుకున్నారని ఆ తర్వాత నేను ఒక తండ్రిగా వారిని అడుగుతాను'' అని తెలిపారు.
పిల్లలు తెర వీక్షించే సమయం ఎంత ఉండాలి అనేది ఇంకా చర్చనీయాంశంగానే ఉంది. కానీ టెక్నాలజీని ఉపయోగించటం మీద పరిమితులు పెట్టటం.. వారిని ఆ టెక్నాలజీకి పూర్తిగా దూరంగా ఉంచటం ఒకటే కాదని లారెంట్ అంటారు.
''దీని అర్థం.. టెక్నాలజీని పూర్తిగా దూరం విసిరేయాలని కానీ, మన జీవితంలో ఎన్నడూ కంప్యూటర్‌ను ఉపయోగించకూడదని కానీ కాదు'' అని ఆయన పేర్కొన్నారు.
''దీని అర్థం.. టెక్నాలజీని ఎప్పుడు వాడటం మంచిది అనేది అర్థం చేసుకోవటం.. పిల్లలు దానిని ఉపయోగించగలగే వయసులో వారికి అందించటం'' అని వివరించారు.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రా సరిహద్దులో రీనోలు: ఈ తెగలో హత్య నేరం కాదు.. సెక్స్‌కు పట్టింపుల్లేవు
- కల్నల్ గడాఫీ: ఒకప్పటి అమెరికా పవర్ఫుల్ మహిళ వెంటపడిన నియంత
- ఏఎన్ 32: భారతీయ వాయుసేన విమానం శకలాలు లభ్యం - ఐఏఎఫ్ ప్రకటన
- అల్యూమినియం బ్యాట్: క్రికెట్ చరిత్రలో వివాదాస్పదమైన, క్రికెట్ నిబంధనలు తిరగరాసిన ఒక బ్యాట్ కథ
- సల్వాజుడుం: నిర్వాసితులైన 30 వేల మందికి అటవీ భూమిపై హక్కులు లభిస్తాయా?
- ధోనీ హెలికాప్టర్ షాట్ ఎలా పుట్టింది... ఆ టెక్నిక్ నేర్పిందెవరు...
- డ్రెస్‌కోడ్.. వారానికోసారి బట్టల్లేకుండా!
- వీకెండ్లో విశ్రాంతి కోసం ఓ పది విషయాలు
- ఆ రాజ్యానికీ రాజుకూ ఈ అందమైన, బలమైన మహిళా సైనికులే రక్ష
- ముద్దు పెట్టుకుంటే మూణ్ణెల్లు జైలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








