భారత్ - పాకిస్తాన్ యుద్ధాల్లో ఇరాన్ ఎవరికి మద్దతిచ్చింది? కశ్మీర్ అంశంలో ఏం జరిగింది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఆర్జవ్ పారేఖ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- చదివే సమయం: 10 నిమిషాలు
"భారత్ - ఇరాన్ ఏమీ కొత్త స్నేహితులు కాదు. మన స్నేహం చరిత్ర అంతటి పురాతనమైనది. ఎన్నో శతాబ్దాలుగా మన సమాజాలు కళ, వాస్తు శైలి, ఆలోచనలు, సంప్రదాయాలు, సంస్కృతి, వాణిజ్యపరంగా ముడిపడి ఉన్నాయి."
2016 ఇరాన్ పర్యటనలో భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటన ఇది.
భారత్ స్వాతంత్య్రం పొందిన తర్వాత రెండు దేశాల సంబంధాల్లో మైలురాళ్లుగా నిలిచే సంఘటనలు అనేకం జరిగాయి.
మిడిల్ ఈస్ట్‌లో మారుతున్న పరిస్థితులు, పాకిస్తాన్‌తో సంబంధాలు, అంతర్జాతీయ వాణిజ్యం, అంతర్జాతీయ రాజకీయాలు, అమెరికా - రష్యా - చైనా ప్రభావం, ఇరాన్‌లో అంతర్గత పరిస్థితులు.. ఇవన్నీ ఏడెనిమిది దశాబ్దాలుగా భారత్ - ఇరాన్ సంబంధాలను ప్రభావితం చేశాయి.
ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు.. ఖమేనీ మరణం తర్వాత ఇరాన్‌పై దాడులను భారత్ బహిరంగంగా ఖండించలేదు.

ఇలాంటి పరిస్థితుల నడుమ ఇరాన్‌తో సంబంధాల విషయంలో భారత ప్రభుత్వ వైఖరిపై కొంతమంది నిపుణులు ప్రశ్నలు సంధిస్తున్నారు.
చరిత్ర పుటల్లో నమోదైన కొన్ని సంఘటనల్లో, భారత్‌కు ఇరాన్ బహిరంగంగా మద్దతునివ్వగా.. మరికొన్ని దేశాలు తమ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇచ్చాయి.
భారత్‌కు ఇరాన్ ఎలాంటి సందర్భాల్లో మద్దతుగా నిలిచింది? ఎప్పుడు దూరంగా ఉంది? కొన్ని దశాబ్దాలుగా భారత్ - ఇరాన్ సంబంధాలు ఎలా మారుతూ వచ్చాయి? తెలుసుకుందాం.

ఫొటో సోర్స్, ANI
ఇండియా - ఇరాన్: బంధాన్ని కోల్పోయిన సోదరులు
ఇండో - ఆర్యన్ సంస్కృతి ప్రారంభం నుంచి ఇండియా - ఇరాన్ మధ్య సంబంధాలు ఉన్నట్లు ఆధారాలున్నాయి. శతాబ్దాలుగా ఈ రెండు దేశాలు మతం, సంస్కృతి, భాష ద్వారా ముడిపడి ఉన్నాయి.
భారత మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ 'డిస్కవరీ ఆఫ్ ఇండియా'లో భారత్ - ఇరాన్ సంబంధాలపై ఇలా రాశారు.
"భారతీయుల జీవితం, సంస్కృతి.. ప్రపంచంలోని అనేక మానవ జాతుల సంస్కృతులతో ప్రభావితమయ్యాయి. వాటిలో పురాతనమైనది ఇరానియన్లతో ముడిపడి ఉంది."
"ఇరానీయులు, భారతీయులు సోదరుల వంటి వారు. ఓ పర్షియన్ పండితుడు చెప్పినట్లు వాళ్లు ఒకరి నుంచి మరొకరు విడిపోయారు. ఒక సోదరుడు తూర్పుకు, మరో సోదరుడు పశ్చిమానికి వెళ్లారు" అని 1946లో అలహాబాద్‌ను సందర్శించిన ఇరానియన్ కల్చరల్ మిషన్ అధిపతి అన్నారు.
"మన రెండు కుటుంబాలు మనకు సంబంధించినవన్నీ మర్చిపోయాయి. వాళ్ల మధ్య ఉమ్మడిగా ఏదైనా మిగిలి ఉంది అంటే.. అది అప్పుడప్పుడు వినిపించే పాతకాలపు వేణుగానం. మేం వాటిని వినడానికే మళ్లీ మళ్లీ భారత్ వస్తుంటాం. అప్పుడే మా బంధువులు మమ్మల్ని గుర్తించగలరు. మేం వాళ్లతో కలిసిపోగలం" అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Keystone-France/Gamma-Keystone via Getty Images
నెహ్రూ హయాంలో ఇండియా - ఇరాన్ సంబంధాలు
"ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పుల వల్ల ఆసియా దేశాలు మళ్లీ తమ సంబంధాల్ని పునరుద్దరించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. రానున్న రోజుల్లో ఇరాన్‌తో ఇండియాకు సాన్నిహిత్యం పెరుగుతుంది. అందులో సందేహం లేదు" అని మాజీ ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ 'డిస్కవరీ ఆఫ్ ఇండియా' పుస్తకంలో రాశారు.
1950 మార్చి 15న ఇండియా - ఇరాన్ 'ఫ్రెండ్‌షిప్ ఒప్పందం' మీద సంతకాలు చేశాయి. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు అధికారికంగా మొదలయ్యాయి. రెండు దేశాలు శాంతి, స్నేహ మార్గంలో పయనిస్తాయని ఆ ఒప్పందం పేర్కొంది.
ప్రపంచ దేశాలు అమెరికా – సోవియట్ యూనియన్‌లో ఏదో ఒక దేశం వైపు చేరుతున్న తరుణంలో భారత్ అలీన విధానాన్ని ఎంచుకున్న కాలమది.
"ఇరాన్, సౌదీ అరేబియా, ఇతర రాచరికాలకు అమెరికా మిత్రదేశంగా మారింది. అది గల్ఫ్ దేశాలు - పాకిస్తాన్ మధ్య సైనిక సహకారానికి తోడ్పడింది. ఇరాన్, సౌదీ అరేబియా, ఈజిప్ట్, సిరియా, ఇరాక్‌తో భారత్ దౌత్య సంబంధాలను ఏర్పరుచుకుంది. అయితే, ఈ ప్రాంతంలో లౌకిక విలువలకు విలువిచ్చే మిత్రదేశం కోసం ఎచూసింది" అని ప్రొఫెసర్ ముంతాజ్ అహ్మద్ షా రాసిన "ఇండియా'స్ వెస్ట్ ఏషియా పాలసీ: లిమిటెడ్ బైలేటరలిజం" అనే డాక్యుమెంట్ తెలిపింది.
"బాగ్దాద్ ఒప్పందం జరిగిన నాలుగు నెలల తర్వాత,1956లో ఇరాన్ అధ్యక్షుడు షా (మొహమ్మద్ రెజా పహ్లవి) భారత్‌ను సందర్శించారు. పాకిస్తాన్‌తో ఇరాన్ సన్నిహిత సంబంధాలు భారత దేశానికి ఏమాత్రం వ్యతిరేకం కాదని, ఇండియా - ఇరాన్ మధ్య స్నేహపూర్వక సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపవని భారత్‌కు హామీ ఇచ్చారు" అని ప్రొఫెసర్ అహ్మద్ షా వివరించారు.
ఆ తరువాత1959 సెప్టెంబర్‌లో నెహ్రూ ఇరాన్‌ను సందర్శించారు. భారత దేశపు అలీనోద్యమ విధానాన్ని తెహ్రాన్ నుంచి వివరించే ప్రయత్నం చేశారు.
కువైట్, ఇరాక్‌లో భారత దౌత్యవేత్తగా పనిచేసిన తల్మీజ్ అహ్మద్ భారత్ - ఇరాన్ సంబంధాలపై బీబీతో మాట్లాడారు.
"తన పదవీ కాలంలో భారత్‌తో సన్నిహిత సంబంధాల కోసం మొహమ్మద్ రెజా పహ్లావి ప్రయత్నించారని మనం చెప్పవచ్చు. అప్పుడే 'ఇరాన్ - హింద్ షిప్పింగ్ లైన్, మంగళూరు ఆయిల్ రిఫైనరీ'ని స్థాపించారు. భారత్‌కు పెట్రోల్ సరఫరాలో ఇరాన్ కీలక పాత్ర పోషించింది" అని తల్మీజ్ అహ్మద్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
భారత్ - పాక్ యుద్ధాల్లో ఇరాన్ ఎవరికి సాయం చేసింది?
షా ఆఫ్ ఇరాన్, నెహ్రూ మధ్య సమావేశాలు, భారత్ - ఇరాన్ మధ్య స్నేహ ఒప్పందం ఉన్నప్పటికీ, పాకిస్తాన్ - భారత్ మధ్య వివాదంతో ఇరుదేశాల సంబంధాల్లో మార్పు వచ్చింది.
భారత్ - పాక్ యుద్ధాలలో ఇరాన్ ఎవరికి మద్దతిచ్చిందనే వివరాలు అమెరికన్ స్టేట్ డిపార్ట్‌మెంట్‌లో 'ఆఫీస్ ఆఫ్‌ది హిస్టారియన్' విభాగంలో ఉన్న పత్రాల్లో ఉన్నాయి.
"1965 ఇండో - పాకిస్తాన్ యుద్ధం తర్వాత, పాకిస్తాన్‌కు ఇరాన్ కొనుగోలు ఏజెంట్‌గా వ్యవహరించింది. ఆ సమయంలో పశ్చిమ నుంచి ఆయుధాల పొందడంలో పాకిస్తాన్ ఇబ్బంది పడుతోంది. దీంతో ఇరాన్ రంగంలోకి దిగి పశ్చిమ జర్మనీ ఆయుధాల డీలర్ నుంచి 90 F-86 ఫైటర్ జెట్‌లు, ఎయిర్-టు-ఎయిర్ క్షిపణులు, ట్యాంకులు, కొన్ని విడి భాగాలను కొనుగోలు చేసింది. ఈ విమానాలను మొదట ఇరాన్‌కు తరలించి, అక్కడి నుంచి పాకిస్తాన్ చేర్చారు. మిగిలిన ఆయుధాలను నేరుగా కరాచీకి పంపారు" 1972 మేలో ప్రచురించిన నిఘావర్గాల పత్రాలు చెబుతున్నాయి.
"1971లో ఇరాన్, పాకిస్తాన్‌కు 12 హెలికాప్టర్లు, ఇతర సైనిక పరికరాలను అప్పుగా అందించింది. వీటిని పశ్చిమ పాకిస్తాన్‌లో ఉపయోగించాలని భావించారు. తూర్పు పాకిస్తాన్‌లో ఆయుధాల లోటును భర్తీ చేసేందుకు వీటిని అక్కడకు తరలించారు. తూర్పు పాకిస్తాన్ మీద భారత్ దాడి చేసినప్పుడు ట్యాంకులు, సైనిక పరికరాలను కూడా అక్కడకు తరలించారు" అని ఆ పత్రాలు వెల్లడించాయి.
అయితే, పాకిస్తాన్‌కు ఇరాన్ బహిరంగంగా మద్దతు ఇవ్వలేదని నిపుణులు భావిస్తున్నారు.
జామియా మిలియా ఇస్లామియాలోని సెంటర్ ఫర్ వెస్ట్ ఏషియన్ స్టడీస్‌లో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న సుజాత ఐశ్వర్య, భారత్ - ఇరాన్ సంబంధాలపై విస్తృత పరిశోధన చేశారు.
బీబీసీతో ఆమె మాట్లాడుతూ, "చరిత్రలో కొన్ని సందర్భాల్లో ఇరాన్ భారత్‌తో కలిసి నిలబడింది. 1965, 1971 యుద్ధాల్లో పాకిస్తాన్‌కు ఇరాన్ బహిరంగంగా మద్దతు ఇవ్వలేదు, ఆ రెండు దేశాల మధ్య మతపరమైన ఐక్యత ఉన్నప్పటికీ. ఇది భారత్‌కు ముఖ్యమైన దౌత్య సంకేతం" అని ఆమె చెప్పారు.

ఇరాన్ విప్లవం తర్వాత ఏం జరిగింది?
1979 నాటి ఇరాన్ విప్లవం మొహమ్మద్ రెజా షా పహ్లావి రాచరిక పాలనను అంతం చేసింది. రుహోల్లా ఖొమేనీ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ స్థాపనకు దారితీసింది. అప్పటి నుంచి భారత్ - ఇరాన్ సంబంధాల్లో అనేక మార్పులు వచ్చాయి.
"1979లో పాలన మారిన తర్వాత పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. అయితే, అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్ల విజృంభణకు వ్యతిరేకంగా ఇరాన్, భారత్‌తో కలిసి తాలిబాన్లపై పోరాడే కూటమికి మద్దతిచ్చింది. భారత్ - ఇరాన్ మధ్య బలమైన సహకారానికి ఇది ఉదాహరణ" అని ప్రొఫెసర్ సుజాత ఐశ్వర్య అన్నారు.
1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత, ప్రాంతీయంగా ఏకాకిగా మారిన ఇరాన్‌కు భారత్ పెద్ద మార్కెట్‌గా మారింది.
"ఇస్లామిక్ విప్లవం తర్వాత, ఇరాక్‌కు భారత్ మద్దతిస్తోందని ఇరాన్ భావించింది. అయితే భారత్ - ఇరాన్ సంబంధాలు త్వరగానే గాడినపడ్డాయి. ఆ తర్వాత రఫ్‌సంజానీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రెండు దేశాల స్నేహ సంబంధాలు పెరిగాయి. రఫ్‌సంజానీ భారత్ వచ్చారు. పీవీ నరసింహారావు ఇరాన్ వెళ్లారు. దీంతో వ్యూహాత్మక భాగస్వామ్యం బలడింది" అని తల్మీజ్ అహ్మద్ చెప్పారు.

ఫొటో సోర్స్, Raheb/Newsmakers via Getty Images
కశ్మీర్ అంశంలో భారత్‌కు మద్దతు
భారత్ - ఇరాన్ మధ్య సత్సంబంధాల విషయాల ప్రస్తావనకు వస్తే, కశ్మీర్ అంశం ఉదాహరణగా నిలుస్తుంది. పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్న కాలమది.
1994లో పాకిస్తాన్, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కో ఆపరేషన్ కలిసి జెనీవాలో జరిగిన ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్ సమావేశంలో భారతదేశానికి వ్యతిరేకంగా తీర్మానాన్ని తెచ్చేందుకు ప్రయత్నించాయి.
భారత ప్రభుత్వం కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడిందని ఈ తీర్మానంలో ఆరోపించారు.
అయితే, ఇందుకు పాకిస్తాన్‌కు అవసరమైన మద్దతు లభించలేదు. దీనికి ప్రధాన కారణం ఇరాన్ 'వీటో' చేయడమే.
కాంగ్రెస్ చైర్ పర్సన్ సోనియా గాంధీ ఇటీవల ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కోసం రాసిన వ్యాసంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు.
"1994లో ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కో ఆపరేషన్, ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషన్‌లో కశ్మీర్‌కు సంబంధించి భారత్‌కు వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించినప్పుడు, దానిని ఆపడంలో ఇరాన్ కీలకపాత్ర పోషించింది" అని సోనియా ఆ వ్యాసంలో రాశారు.
"భారత్ ఆర్థికంగా బలహీన పరిస్థితుల్లో ఉన్నప్పుడు, కశ్మీర్ సమస్యను అంతర్జాతీయ సమస్యగా మార్చేందుకు చేసే ప్రయత్నాన్ని ఇరాన్ అడ్డుకుంది. ఇరాన్‌తో మన సంబంధాలు వ్యూహాత్మకమైనవి" అని సోనియా గాంధీ తన వ్యాసంలో తెలిపారు.
"కశ్మీర్ సమస్యపై పాకిస్తాన్ మాదిరిగా ఇరాన్ ఎప్పుడూ భారత్‌ను బహిరంగంగా వ్యతిరేకించలేదన్నది నిజం. దీనికి కారణం ఇస్లామిక్ ఐక్యత కంటే ఇరాన్ - పాకిస్తాన్ మధ్య శత్రుత్వం" అని ప్రొఫెసర్ సుజాత అన్నారు.

తెహ్రాన్ డిక్లరేషన్ నుంచి చాబహార్ వరకు..
2001లో నాటి భారత ప్రధాని అటల్ బిహార్ వాజ్‌పేయి ఇరాన్‌లో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా రెండు దేశాలు 'తెహ్రాన్ డిక్లరేషన్'పై సంతకం చేశాయి.
తెహ్రాన్ డిక్లరేషన్ తర్వాత ఇరాన్ అధ్యక్షుడు మొహమ్మద్ ఖతామి భారత పర్యటనకు వచ్చారు. ఆ సమయంలో రెండు దేశాలు 'న్యూదిల్లీ డిక్లరేషన్'పై సంతకాలు చేశాయి. ఈ రెండు డిక్లరేషన్‌లతో రెండు దేశాల సంబంధాలు బలోపేతమైనట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ తెలిపింది.
రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం, ఇంధన రంగంలో సహకారం, ఆర్థిక, వాణిజ్య సంబంధాలు, ప్రాంతీయ స్థిరత్వం నుంచి అఫ్గానిస్తాన్‌లో శాంతి కోసం ప్రాతినిధ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం వంటి పలు అంశాలపై 'తెహ్రాన్ డిక్లరేషన్'లో ఒప్పందాలున్నాయి.
భారత్ ఎగుమతులు పాకిస్తాన్‌ను దాటవేసి ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్‌పోర్ట్ కారిడార్ (ఐఎన్‌ఎస్‌టీసీ - రోడ్డు, రైలు మార్గాల) ద్వారా అఫ్గానిస్తాన్, సెంట్రల్ ఏషియాకు చేరేలా చాబహార్ ఓడరేవును అభివృద్ధి చేయాలని 2003లో ఇరాన్‌కు భారత్ సూచించింది.
భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ 2016లో ఇరాన్‌ను సందర్శించారు. అదే ఏడాది చాబహార్ పోర్ట్ అభివృద్ధికి సంబంధించిన ఒప్పందానికి ఆమోదం లభించింది.
అమెరికా ఒత్తిడి ఉన్నప్పటికీ చాబహార్‌లోని షాహిది బెహెస్థి ఓడరేవును నిర్వహించే ఒప్పందంపై భారత్ 2024లో సంతకం చేసింది.
"అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లతో రెండు దేశాలకు ముప్పు ఉంది. కాబట్టి అక్కడ సహకారం సహజం. చాబహార్ ఓడరేవు ఒప్పందం వల్ల భారత్‌కు అఫ్గానిస్తాన్, ఆసియా మార్కెట్లలోకి ప్రవేశం కల్పించింది" అని ప్రొఫెసర్ సుజాత తెలిపారు.
"రెండు దేశాల మధ్య తెహ్రాన్ డిక్లరేషన్ జరిగింది. అయితే, మన్మోహన్ సింగ్ ప్రభుత్వ హయాంలో ఇరాన్‌తో మంచి సంబంధాలు ఉండొద్దని భారత్‌కు అమెరికా స్పష్టం చేసింది. చాబహార్ ఒప్పందంలో ముందడుగు పడినప్పటికీ, మన్మోహన్ ప్రభుత్వం అమెరికాకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చింది. ఆ తర్వాత కాలంలో, భారత్‌కు ముడి చమురు సరఫరా చేసే రెండో అతిపెద్ద దేశంగా ఇరాన్ ఆవిర్భవించింది" అని తల్మీజ్ అహ్మద్ అన్నారు.
"ట్రంప్ ఇరాన్‌పై తిరిగి ఆంక్షలు విధించారు. దీంతో ఇరాన్ నుంచి చమురు కొనుగోళ్లను భారత్ నిలిపివేసింది. చాబహార్‌లో భారత్ ఆధిపత్యం తగ్గింది. చివరకు భారత్ అక్కడ నుంచి వైదొలగాల్సి వచ్చింది" అని ఆయన అభిప్రాయపడ్డారు.
"చాబహార్ మాదిరిగానే మనం అనేక అవకాశాలను కోల్పోయాం. భారత్ చేసిన అతిపెద్ద తప్పు ఏంటంటే, ట్రంప్ ఒత్తిడికి తలొగ్గి ఇరాన్ నుంచి చమురు కొనుగోళ్లను ఆపేయడం. అమెరికాతో మనం స్నేహం చేయాలనుకుంటే మన ప్రయోజనాల విషయంలో రాజీ పడమని అమెరికాకు స్పష్టంగా చెప్పి ఉండాల్సింది" అని తల్మీజ్ అహ్మద్ తెలిపారు.

ఫొటో సోర్స్, Pool / Iranian Supreme Leader Press Office/Anadolu Agency/Getty Images
నిజంగా స్నేహమేనా? లేక అవసరమా?
ఇరాన్ అనేక సందర్భాల్లో భారత్‌కు మద్దతునిచ్చింది, కానీ దానిని 'పరస్పర ప్రయోజనం' అని సంబోధించడం సరిగ్గా సరిపోతుందని ప్రొఫెసర్ సుజాత అంటున్నారు. ఎందుకంటే, స్వీయ ప్రయోజనాల విషయంలో సంఘర్షణ తలెత్తినప్పుడు భారత్‌కు ఇరాన్ ప్రాధాన్యం ఇవ్వలేదని ఆమె అన్నారు.
భారత్ - ఇరాన్ సంబంధాలను మూడు లేయర్లుగా అభివర్ణించారు సుజాత ఐశ్వర్య.
"మొదటి లేయర్ నాగరికత, సంస్కృతికి సంబంధించినది. పర్షియన్ సాహిత్యం, భాష, సూఫీ సంప్రతాయాలు, చరిత్ర విషయంలో రెండు దేశాల మధ్య సహజమైన బంధం ఉంది" అని ఆమె వివరించారు.
"రెండో లేయర్ ఆచరణాత్మకమైన. లావాదేవీలకు సంబంధించినది. ఇందులో చమురు, వాణిజ్యం, కనెక్టివిటీ, భౌగోళిక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి. మూడోది, నిజంగా చెప్పాలంటే.. అవసరార్థం. కొన్ని అంశాల విషయంలో ప్రత్యామ్నాయం లేకపోవడం వల్ల రెండు దేశాలు కలవడం లేదా అంతర్జాతీయ పరిస్థితుల వల్ల దగ్గరై ఉండవచ్చు" అని ప్రొఫెసర్ సుజాత ఐశ్వర్వ అభిప్రాయపడ్డారు.
"ఇరాన్‌తో భారత్ సంబంధాల్లో ఇరాన్ ఎప్పుడూ సెకండ్ ప్లేస్‌లో ఉంది. భారత్ ఎప్పుడూ అమెరికాకు ప్రాధాన్యత ఇచ్చింది. భారత్ - ఇరాన్ భాగస్వామ్యంలో ఉన్న లాభాన్ని భారత్ ఉపయోగించుకోలేక పోయింది" అనేది మాజీ దౌత్యవేత్త తల్మీజ్ అహ్మద్ అభిప్రాయం.
"ప్రస్తుత పరిస్థితులను చూస్తే, భారత్ ఇరాన్‌తో కాకుండా అమెరికా, ఇజ్రాయెల్‌తో ఉందని స్పష్టమైంది. ఇరాన్ మీద దాడి గురించి భారత్ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఖమేనీ మరణించిన 5 రోజుల తర్వాత సంతాపం తెలిపింది. విదేశాంగ విధానంలో ఇరాన్‌తో భారత్ సంబంధాలు గణనీయంగా క్షీణించినట్లు భారత్ స్వయంగా స్పష్టం చేసింది" అని ఆయన అన్నారు.
"ప్రస్తుతానికి, మనకేమీ తెలియదు. యుద్ధం కొనసాగుతోంది. అది ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. ముగిసిన తర్వాత మిడిల్ ఈస్ట్‌లో పరిస్థితి ఎలా ఉంటుందో కూడా మనకు తెలియదు. ఇది భారత్‌కు ఎలాంటి సవాళ్లు తెచ్చి పెడుతుందో చూడాలి."
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











