ఇరాన్ యుద్ధనౌకను అమెరికా ముంచేయడం, మరో నౌకకు భారత్ ఆశ్రయం ఇవ్వడంపై జైశంకర్ ఏమన్నారు?

భారత్, ఇరానియన్ నౌక, ఫ్లీట్ రివ్యూ, కొచ్చి పోర్టు

ఫొటో సోర్స్, ANI

చదివే సమయం: 4 నిమిషాలు

హిందూ మహసముద్రంలో ఇరాన్ యుద్ధనౌకను అమెరికా ముంచేయడం, మరో నౌకకు భారత్ అశ్రయం కల్పించడం వంటి ప్రశ్నలకు భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్పందించారు.

ఇరాన్ నేవీకి చెందిన నౌకకు భారత్‌లో ఆశ్రయం కల్పించాలన్న నిర్ణయం 'మానవతా కోణంలో సరైనదే' అని ఆయన అన్నారు.

రైసినా డైలాగ్ 2026 కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో దీని గురించి అడిగినప్పుడు, 'హిందూ మహాసముద్రం ఎలాంటిదంటే, ఇతర దేశాలు కూడా తమ ఉనికిని కొనసాగించవచ్చు' అని జైశంకర్ అన్నారు.

మార్చి 4న, హిందూ మహాసముద్రంలో తమ జలంతర్గామి ఇరాన్ యుద్ధనౌకపై దాడి చేసి ముంచేసిందని చెబుతూ అమెరికా ఓ వీడియో విడుదల చేసింది.

అయితే, బీబీసీ సిన్హళకి అందిన అధికారిక సమాచారం ప్రకారం ఈ దాడి బుధవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో దక్షిణ శ్రీలంకలోని గాలే నగరానికి సమీపంలో జరిగింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఈ యుద్ధనౌకలో దాదాపు 130 మంది ఉన్నారు. 'డేనా' అనే ఈ నౌక విశాఖపట్నంలో జరిగిన సైనిక విన్యాసాల్లో పాల్గొనేందుకు భారత్‌కు వచ్చింది.

ఈ సంఘటన తర్వాత, భారత్‌లోని ప్రతిపక్షాలు ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించాయి.

'ఇరానియన్ నౌక భారత దేశ అతిథి, అమెరికా దానిని ముంచివేసింది' అని ప్రతిపక్ష నేతలు నాయకులు ఆరోపించారు. భారత సముద్ర భద్రతపైనా తీవ్రమైన ప్రశ్నలు తలెత్తాయి.

ఈ సంఘటనపై భారత ప్రభుత్వ మౌనాన్ని అనేక మంది నిపుణులు, మాజీ దౌత్యవేత్తలు కూడా ప్రశ్నించారు.

భారత్, ఇరానియన్ నౌక, ఫ్లీట్ రివ్యూ, కొచ్చి పోర్టు

ఫొటో సోర్స్, @DrSJaishankar

ఫొటో క్యాప్షన్, హిందూ మహాసముద్రపు భద్రతలో భారత్ కీలకంగా ఉందని జైశంకర్ అన్నారు.

జైశంకర్ ఏమన్నారు?

"ఇరాన్ నౌక ఒకటి మన పోర్టుకు రావాలనుకుంటోందని వారి నుంచి మాకొక సందేశం వచ్చింది. నౌకలో సాంకేతిక సమస్య వచ్చింది. ఆ సమయంలో, అది భారత సరిహద్దుకు సమీపంలో ఉంది" అని జైశంకర్ తెలిపారు.

"భారత్ వారికి మార్చి 1న అనుమతి ఇచ్చింది. తీరానికి చేరడానికి వారికి కొన్నిరోజులు పట్టింది, వారు కొచ్చి పోర్టుకు చేరుకున్నారు. వాళ్లిక్కడికి వచ్చేప్పటికి పరిస్థితులు మారిపోయాయి. వాళ్లు ఫ్లీట్ రివ్యూలో పాల్గొనేందుకు వస్తూ అనుకోని పరిస్థితుల మధ్య చిక్కుకుపోయారు" అని ఆయన వివరించారు.

అయితే, భారత్ ఆశ్రయం కల్పించిన ఆ ఇరానియన్ నౌక పేరేంటో జైశంకర్ చెప్పలేదు. కానీ, దాని పేరు 'ఐరిస్ లావన్‌' అని మీడియా కథనాలు చెబుతున్నాయి.

దీంతో పాటు ఇరానియన్ ఓడను ముంచివేసిన సంఘటన గురించి అడిగిన ప్రశ్నకు జైశంకర్ సమాధానమిచ్చారు.

"శ్రీలంక సమీపంలో మరో నౌక ఇలాంటి పరిస్థితుల్లో ఉంది. దురదృష్టవశాత్తూ ఆ నౌకను కాపాడలేకపోయాం" అని జైశంకర్ చెప్పారు.

"ఈ అంశంలో చట్టపరమైన అంశాలను పక్కనపెట్టి మేం మానవతా దృక్పథంతో వ్యవహరించాం. మేం చేసింది సరైనదే అని భావిస్తున్నా" అని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు.

"సోషల్ మీడియాలో దీని గురించి చాలా చర్చ జరుగుతోంది. దయచేసి హిందూ మహాసముద్రం గురించి వాస్తవాలను అర్థం చేసుకోండి. గత 50 ఏళ్లుగా డియెగో గర్షియా హిందూ మహాసముద్రంలో ఉంది. ఈ శతాబ్దపు మొదటి దశాబ్దం ప్రారంభంలో జిబౌటిలో విదేశీ శక్తులు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. ఇదే సమయంలో, హంబన్‌టోటా సమస్య వెలుగుచూసింది" అని ఆయన వివరించారు.

"హిందూ మహాసముద్రంలో స్థూలంగా భద్రత కల్పించేది భారతదేశమే. కానీ, ఈ ప్రాంతంలోని వాస్తవికతను మార్చలేం. ఇది ఈ సముద్రప్రాంతంలోని దేశాలతో పాటు ఇతర దేశాలు కూడా ఉన్న ప్రాంతం" అని ఆయన చెప్పారు.

ఇరానియన్ నౌకలతో పాటు అమెరికా ఉప విదేశాంగ మంత్రి క్రిస్టోఫర్ లాండౌ ప్రకటనపైనా స్పందించారు జైశంకర్.

భారత్‌తో వాణిజ్య, ఆర్థిక సంబంధాల విస్తరణలో అమెరికా 20 ఏళ్ల కిందట చైనాతో చేసిన తప్పులను పునరావృత్తం చేయదని రైసినా డైలాగ్ 2026 సదస్సులో పాల్గొన్న క్రిస్టోఫర్ లాండౌ అన్నారు.

తాజాగా, రైసినా డైలాగ్ సదస్సులో జైశంకర్ ఒక ప్రకటన చేశారు. దీనిని లాండౌ వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా భావిస్తున్నారు.

"భారత్ పురోగతి 'నిరాంతరాయమైనది'. ఒక దేశపు శక్తిసామర్థ్యాలే ఆ దేశపు అభివృద్ధి పథాన్ని నిర్ణయిస్తాయి" అని అన్నారు.

"ఒక దేశపు అభివృద్ధిని ఆ దేశమే నిర్ణయించుకుంటుంది. భారత్ పురోగతి కూడా అంతే. మన దేశ అభివృద్ధి మన బలం మీద ఆధారపడి ఉంటుంది తప్ప, ఇతరుల తప్పుల మీద ఆధారపడి కాదు" అని జైశంకర్ వ్యాఖ్యానించారు.

భారత్, ఇరానియన్ నౌక, ఫ్లీట్ రివ్యూ, కొచ్చి పోర్టు

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, రైసినా హిల్స్ డైలాగ్ 2026 సదస్సులో భాగంగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్, అమెరికా ఉప విదేశాంగ మంత్రి క్రిస్టోఫర్ లాండౌ‌ భేటీ అయ్యారు.

క్రిస్టోఫర్ లాండౌ ఏమన్నారు?

న్యూదిల్లీలో జరిగిన రైసినా హిల్స్ డైలాగ్ 2026 సదస్సులో క్రిస్టోఫర్ లాండౌ మాట్లాడుతూ, "భారత్ - అమెరికా వాణిజ్య ఒప్పందం పూర్తయ్యే దశలో ఉంది. దీనిపై మేం చాలా ఉత్సాహంగా ఉన్నాం" అని అన్నారు.

"ఈ ఒప్పందం అపరిమిత అవకాశాలకు తలుపులు తెరిచేందుకు బాటలు వేస్తుందని భావిస్తున్నా. భారత్‌తో ఆర్థిక, వాణిజ్య అవకాశాలపై దృష్టి పెడతాం."

"20 ఏళ్ల కిందట చైనాతో వాణిజ్యంలో చేసిన తప్పును భారత్‌తో చేయం" అని లాండౌ అన్నారు.

'మీరు ఈ మార్కెట్లు అన్నింటిలోకి విస్తరించవచ్చు. ఆ తర్వాత, మేం గుర్తించిన విషయం ఏంటంటే, మీరు అనేక రంగాల్లో మమ్మల్ని అధిగమిస్తున్నారు' అని చెప్పారు.

అమెరికా ప్రభుత్వ నిర్ణయాలు తమ ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటాయన్నారు.

"భారత ప్రభుత్వం తమ ప్రజలకు జవాబుదారీగా ఉన్నట్లే, మేం కూడా మా ప్రజలకు జవాబుదారీగా ఉండాలి."

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)