40 ఏళ్ల నాటి సైనికుడి అవశేషాలకోసం ఇజ్రాయెల్ దాడి, పలువురి మృతి

ఫొటో సోర్స్, Reuters
ఇరాన్ మద్దతున్న హిజ్బుల్లా గ్రూపుతో యుద్ధం తీవ్రమవుతున్న వేళ లెబనాన్‌లో ఇజ్రాయెల్ భారీ ఎత్తున నిర్వహించిన భూతల వైమానిక దాడుల్లో పదుల సంఖ్యలో ప్రజలు చనిపోయారు
ఉధృతమవుతున్న ఘర్షణలకు కేంద్రంగా మారిన తూర్పు బెక్కావ్యాలీలోని ఓ పట్టణంపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో కనీసం 41మంది చనిపోయారని, 40మంది గాయపడ్డారని లెబనాన్ ఆరోగ్యమంత్రిత్వశాఖ చెప్పింది.
మృతుల్లో లెబనాన్ సైనికులు, చిన్న పిల్లలు సహా పలువురు సాధారణ పౌరులున్నారని స్థానికులు చెప్పారు.
లెబనాన్‌లో 40ఏళ్ల క్రితం కనిపించకుండాపోయిన ఓ ఇజ్రాయెల్ వాయుసేన సైనికుడి అవశేషాలను వెతకడమే నబీచిట్‌లోని ఈ ఆపరేషన్ ప్రధాన ఉద్దేశం.

అర్ధరాత్రివేళ భీకర దాడులు
పట్టణంలోని శ్మశానవాటికలో ఓ మూల సమాధిని తవ్విన చోట పెద్ద గుంత కనిపిస్తోంది.
''ఆయన అవశేషాలు అక్కడుంటాయనుకున్నారు. కానీ అక్కడేం లేవు'' అని స్థానికుడొకరు ఖాళీ సమాధిని చూపిస్తూ చెప్పారు.
పట్టణంలోని మరో చోట ఓ ధ్వంసమైన కారు నిండా బుల్లెట్ రంధ్రాలు, రక్తంతో తడిసిపోయిన సీట్లు కనిపించాయి.
చుట్టుపక్కల భవనాలు కూలిపోయాయి. శిథిలాల కుప్పలు కనిపిస్తున్నాయి. నేలలో పెద్ద గుంత ఏర్పడింది. చుట్టుపక్కల ఇళ్లు ధ్వంసమయ్యాయి. శిథిలాల్లో పిల్లల పుస్తకాలు, వంటసామాన్లు కనిపిస్తున్నాయి.
ఈ ప్రాంతంలో కీలకంగా ఉన్న హిజ్బోల్లా పట్టణంలో జరిగిన విధ్వంసం స్థాయిని పరిశీలించడానికి జర్నలిస్టులను అనుమతించింది.
షియామిలీషియా, రాజకీయ సంస్థగా ఉన్న హిజ్బుల్లాను యూకే, అమెరికా సహా కొన్ని దేశాలు ఉగ్రవాద సంస్థగా ప్రకటించాయి.
మార్చి 6వ తేదీ (శుక్రవారం) పొద్దుపోయిన తరువాత నాలుగు ఇజ్రాయెల్ విమానాలు లెబనాన్, సిరియా సరిహద్దుల్లో కనిపించాయని లెబనాన్ మిలటరీ తెలిపింది. వాటిలో రెండు విమానాల నుంచి సైనికులు దిగారని చెప్పింది.
అదే సమయంలో ‘‘భారీ ఎత్తున వైమానిక బాంబుదాడులు’’ మొదలయ్యాయని తెలిపింది.
ఇజ్రాయెల్,హిజ్బుల్లా యుద్ధానికి దూరంగా ఉండాలని ప్రయత్నిస్తున్న లెబనాన్ సైన్యం వెంటనే అప్రమత్తమై రక్షణ చర్యలు చేపట్టింది. వారు ఫ్లేర్ బాంబులు ఉపయోగించి సైన్యం దిగిన ప్రాంతాన్ని గుర్తించడానికి ప్రయత్నించారు.

ఫొటో సోర్స్, Reuters
‘లెబనాన్ సైనికుల దుస్తుల్లో వచ్చి దాడులు’
నబీ చిట్ పట్టణంలో ఇజ్రాయెల్ బలగాలకు, హిజ్బుల్లా ఫైటర్లకు, తమ ఇళ్లను రక్షించుకోడానికి ప్రయత్నిస్తున్న సాధారణ ప్రజలకు మధ్య ఘర్షణలు జరిగాయి.
''గ్రామంలో ఓ వైపు అర్ధరాత్రి వేళ అనుమానాస్పద కదలికలు కనిపించాయి. ఆ తరువాత అవి ఓ మిషన్ కోసం అక్కడ మోహరించిన ఇజ్రాయెలీ కమాండో యూనిట్‌కు సంబంధించిన కదలికలని తర్వాత తెలిసింది'' అని భారీ పేలుడు జరిగిన ఓ ప్రదేశం దగ్గర స్థానిక అధికారి చెప్పారు.
''ప్రతిఘటన బలగాలు తర్వాత వారిని చుట్టుముట్టాయి. భారీ ఘర్షణలు జరిగాయి. తర్వాత వారి సైనికులను అక్కడనుంచి తీసుకెళ్లడానికి వైమానిక బలగాలు దాడులు తీవ్రం చేశాయి. దీనివల్ల భారీ విధ్వంసం జరిగింది'' అని తెలిపారు.
స్పెషల్ ఫోర్సెస్ సైన్యాన్ని రక్షించడానికి ఇజ్రాయెల్ 40వైమానిక దాడులు చేసిందని హిజ్బుల్లా, స్థానికులు చెప్పారు.
ఇజ్రాయెల్ సైనికులు లెబనాన్ సైనికుల దుస్తుల్లో వచ్చారని, హిజ్బుల్లా ఇస్లామిక్ హెల్త్ ఆర్గనైజేషన్ గుర్తులున్న అంబులెన్సులు ఉపయోగించారని ప్రత్యక్షసాక్షులు బీబీసీతో చెప్పారు.
లెబనాన్ ఆర్మీ చీఫ్ తర్వాత స్థానిక మీడియాకుఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఈ ఆరోపణపై వివరణ కోసం బీబీసీ చేసిన విజ్ఞప్తులకు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) స్పందించలేదు.

ఫొటో సోర్స్, Getty Images
‘అన్నింటినీ ధ్వంసం చేశారు’
పట్టణాన్ని ఖాళీచేయాలని ఇజ్రాయెల్ ముందుగా ఆదేశాలిచ్చింది. ఆపరేషన్ ప్రారంభించే ముందు ఇళ్లను ఖాళీచేయాల్సిందిగా ప్రజలను కోరింది.
తమ ఇళ్లల్లో హిజ్బుల్లాకు సంబధించినది ఏదీ లేదు కాబట్టి తాము సురక్షితంగా ఉన్నామని అనుకున్నామని మొహమ్మద్ చోక్ర్ చెప్పారు. ఆయన అంకుల్, ఇతర బంధువులు చనిపోయారు.
''మా అంకుల్ పదవీ విరమణ చేసిన సైనికుడు. ఆయన కుమారుడు కూడా రిటైర్డ్ సైనికుడు. మరో కొడుకు ప్రభుత్వ ఉపాధ్యాయుడు. మాకు ఏ రాజకీయపార్టీతో సంబంధం లేదు. మేం షియాలం. మాకు హిజ్బుల్లా అంటే ఇష్టం. కానీ మేం హిజ్బుల్లాలో సభ్యులం కాదు. మేమందరం లెబనాన్ సైన్యంలో ఉన్నాం'' అని ఆయన చెప్పారు.
''ఇప్పుడు నేనేమనుకోవాలి? మా అంకుల్, వాళ్ల పిల్లలు, వాళ్ల పిల్లలు చనిపోయారు'' అని ఆయన ప్రశ్నించారు.
తన కుటుంబాన్ని శిథిలాలనుంచి రక్షించుకోవడానికి బుల్డోజర్‌లో అక్కడకు వచ్చిన మరో బంధువు కూడా వీధుల్లో చెలరేగిన ఘర్షణల తర్వాత జరిగిన కాల్పుల్లో చనిపోయారని ఆయన తెలిపారు.
మరో స్థానిక వ్యక్తి కూడా కమ్యూనిటీలో చనిపోయిన వారి జాబితాలో మొహమ్మద్ అంకుల్ పేరు చెప్పారు.
దీనిపై మాట్లాడాల్సిందిగా బీబీసీ చేసిన విజ్ఞప్తికి ఇజ్రాయెల్ సైన్యం స్పందించలేదు.
మిలటరీ ఆపరేషన్ జరిగేటప్పుడు పట్టణంలో ఉన్న స్థానికులు, వేరే చోట ఉన్నవాళ్లు శనివారం(మార్చి 7) పెద్దసంఖ్యలో అక్కడకు వచ్చారు. జరిగిన విధ్వంసాన్ని అంచనావేసే ప్రయత్నంచేశారు.
''వాళ్లు ప్రతిదానిపై బాంబులు వేశారు. ఇది పిచ్చితనం'' అని అలీ షాకుర్ చెప్పారు.
''ఇక్కడ అందరూ ఖాళీ చేసి వెళ్లిపోయారని వాళ్లనుకున్నారు. ఇంకా ఎవరున్నారని వాళ్లకు ఆశ్చర్యమేసిందనుకుంటా''
పిల్లలను ఇక్కడినుంచి ఖాళీచేయించామని, పెద్దవాళ్లు ఇక్కడే ఉండిపోయారని, గతంలో ఇంతకుముందు చూసిన దాడుల్లాంటివే ఉంటాయని తామనుకున్నామని మరో వ్యక్తిచెప్పారు.
''మామూలుగా వాళ్లు మూడు లేదా నాలుగు ఇళ్లపై మాత్రమే దాడిచేస్తారు. కానీ ఇది అలా జరగలేదు. ఆగకుండా దాడులు జరిగాయి. ఎంత భారీ స్థాయిలో జరిగాయో మీకు కనిపిస్తోంది. మేం ప్రతిఘటించాం'' అని ఆయన చెప్పారు.
ధ్వంసమయిన ఇళ్ల మధ్య నడుచుకుంటూ వెళ్తూ ఓ మహిళ ''ఇజ్రాయెల్ మా మీద అన్యాయంగా దాడి చేసింది. మేం హిజ్బుల్లా. మేం గెలుస్తాం'' అని అరిచారు.

ఫొటో సోర్స్, Getty Images
‘ఆయనకేమయిందో తెలుసుకోవాలనుకోం’
రాత్రిపూట జరిగిన ఈ ఆపరేషన్‌లో ఐడీఎఫ్‌కు చెందినవారెవరూ గాయపడలేదని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.
''ఇజ్రాయెల్ సైనికుల మృతదేహాలను, కనిపించకుండా పోయిన ఇజ్రాయెలీలను వెనక్కి తీసుకొచ్చేందుకు రాత్రింబవళ్లు ఆపరేషన్ కొనసాగిస్తామని'' తెలిపింది.
ఐడీఎఫ్ సైనికుల జీవితాలను ప్రమాదంలో పెట్టొద్దని కనిపించకుండా పోయిన సైనికుడు రాన్ అరాడ్ భార్య టామీ ఇజ్రాయెల్ నాయకులకు విజ్ఞప్తి చేశారు.
''నాయకులు ఇప్పటివరకు మా మాటలను సరిగ్గా అర్ధం చేసుకోలేదు. అందుకే మేం స్పష్టత ఇస్తున్నాం. ఐడీఎఫ్ సైనికులకు ప్రమాదమెదురయ్యే పరిస్థితి ఉంటే రాన్‌కు ఏమయిందో తెలుసుకోవాలని మేం అనుకోం'' అని ఆమె ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.
''మా దృష్టిలో జీవితం విలువైనది. ఓ సైనికుడి అవశేషాలు తిరిగి తీసుకొచ్చి సమాధి చేయాలనే బాధ్యత కంటే ప్రాణాల విలువ ఎక్కువ'' అని ఆమె రాశారు.
తూర్పు లెబనాన్, తూర్పు బెక్కా వ్యాలీలో రాత్రివేళ దాడులు జరిపి హిజ్బుల్లా ఆయుధాలను,వారి సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్టు ఓ ప్రత్యేక ప్రకటనలో ఐడీఎఫ్ చెప్పింది.
నబీ చిట్ చుట్టూ చేసిన దాడుల లక్ష్యాలపై బీబీసీ అడిగిన ప్రశ్నలపై అది స్పందించలేదు.
లెబనాన్‌లో సోమవారం(మార్చి 2)నుంచి ఇజ్రాయెల్ మిలటరీ చేసిన ఆపరేషన్లలో 294 మంది చనిపోయారని ఆరోగ్య శాఖ చెప్పింది.
పట్టణంలో కొందరు దు:ఖంలో ఉండగా, మరికొందరు మాత్రం ఇజ్రాయెల్ తమ లక్ష్యాన్ని సాధించలేకవడాన్ని తాము సాధించిన విజయంగా భావిస్తున్నారు.
''మేం వాళ్లను ఓడిపోయేలా చేసి వెళ్లగొట్టాం'' అని ఓ వ్యక్తిచెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














