భారత్: సామాన్యులే ‘దానగుణ సంపన్నులు’.. వీరు చేసే దానధర్మాలు ఎన్ని వేల కోట్లంటే..

భారతీయులు, విరాళాలు, సంపన్నులు, సాధారణ ప్రజలు, దాన ధర్మాలు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సౌతిక్ బిశ్వాస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • చదివే సమయం: 6 నిమిషాలు

దేశంలో దాతృత్వ కథలు సంపన్నులతో మొదలవుతాయి. ఆ తరువాతే సామాన్యుల వంతు.

సంపన్నుల్లో కార్పోరేట్ సంస్థల సామాజిక బాధ్యత బడ్జెట్లు, బిలియనీర్లు ఇచ్చే కోట్ల రూపాయల వంటి ఆకర్షణీయ అంశాలు చాలా ఉన్నాయి.

కానీ భారత్‌లో సామాన్యులు చేసే దానధర్మాలే ఎక్కువని ఓ నివేదిక చెబుతోంది.

సంస్థాగత పెట్టుబడిదారులు, కార్పోరేట్ సంస్థలు దాతృత్వంలో పెద్ద పాత్ర పోషిస్తున్నాయనే సంప్రదాయ వాదనను 'హౌ ఇండియా గివ్స్ 2025 నివేదిక' సవాలు చేస్తోంది.

దీన్ని అశోకా యూనివర్సిటీలోని సెంటర్ ఫర్ సోషల్ ఇంపాక్ట్ అండ్ ఫిలాంత్రఫీ రూపొందించింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
భారతీయులు, విరాళాలు, సంపన్నులు, సాధారణ ప్రజలు, దాన ధర్మాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కోల్‌కతాలో ఉచిత భోజన కేంద్రం

సాధారణ ప్రజల్లోనే ఎక్కువ

దాతృత్వంలో పెట్టుబడిదారులు, కార్పోరేట్ సంస్థల కంటే ఎక్కువగా సాధారణ, మధ్య తరగతి వర్గం పెద్ద పాత్ర పోషిస్తున్నట్లు ఈ నివేదిక చెబుతోంది.

భారత్‌లో గృహస్తులు ఏటా నగదుతో పాటు దుస్తులు, ఇతరత్రా వస్తువుల రూపంలో దాదాపు '54వేల కోట్ల రూపాయలు' స్వచ్చందంగా ఇస్తున్నారని ఈ నివేదిక అంచనా వేసింది.

వారిలో 68 శాతం మంది ఏదో ఒక రూపంలో దానం చేస్తున్నట్లు నివేదిక తెలిపింది. ఇందులో 48 శాతం మంది ఆహారం, దుస్తులు లేదా ఇంట్లో వాడి పడేసిన వస్తువులు, 44 శాతం మంది నగదుగానూ, 30 శాతంమంది లాభాపేక్షలేని, మతపరమైన సంస్థలతో కలిసి అందించే స్వచ్ఛంద సేవ రూపంలో ఉంది.

అన్నదానం కోసం ఇచ్చే విరాళాల్లో ఎక్కువ శాతం మతపరమైన ఉచిత అన్నదాన పథకాలకు వెళుతోంది. అలాగే ఈ సంస్థలు ప్రకృతివిపత్తులవేళ అందించే సాయంతోపాటు ఇతర పనులలోనూ స్వచ్ఛందంగా పాల్గొంటున్నాయి.

"భారత్‌ ప్రజల్లో దాతృత్వగుణం ఎక్కువ. సంపన్నుల కంటే సాధారణ ప్రజలు విరాళాలు ఇవ్వడంలో, దాన ధర్మాలు చేయడంలో పెద్ద పాత్ర పోషిస్తున్నారని మా పరిశోధనలో తేలింది. దాతృత్వం దేశ ప్రజల్లో సాంస్కృతికంగా, విస్తృతంగా ఇమిడి పోయింది" అని అశోకా యూనివర్సిటీలో సెంటర్ ఫర్ సోషల్ ఇంపాక్ట్ అండ్ ఫిలాంత్రఫీ హెడ్ జిన్నీ ఉప్పల్ బీబీసీతో చెప్పారు.

భారతీయులు, విరాళాలు, సంపన్నులు, సాధారణ ప్రజలు, దాన ధర్మాలు

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, దానం చేసేవారిలో 40 శాతం మంది బిచ్చగాళ్లకు, దిక్కు లేని వారికి వివిధ మార్గాల్లో సాయం అందిస్తున్నారు

నివేదిక చెబుతున్నదేంటి?

భారతీయుల్లో ఉదారత్వం కేవలం సంపన్నుల్లోనే కాదు, మత విశ్వాసాలను పాటించే సమూహాలు, ప్రత్యక్షంగా అడిగే సాయాలు, ఆదాయంతో సంబంధం లేకుండా సాధారణ ప్రజలు చేసే దానాలతో ఇది ముడి పడి ఉంది.

భారత్‌లోని 20 రాష్ట్రాల్లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 7 వేల మంది అభిప్రాయాలు సేకరించి ఈ నివేదిక రూపొందించారు.

ఈ విశ్లేషణ నేషనల్ శాంపిల్ సర్వే మీద ఆధారపడి ఉంది. రోజువారీ దాతల వివరాలను పొందుపరిచేందుకు ప్రభుత్వం భారీ స్థాయిలో గృహ వినియోగానికి సంబంధించి సర్వే నిర్వహిస్తుంది. దీన్ని నేషనల్ శాంపిల్ సర్వే చేపడుతుంది.

ఈ సర్వేలో పాల్గొన్నవారు మూడు నెలల కాలంలో తాము ఎంత తరచుగా, ఎంత మొత్తం విరాళంగా ఇచ్చామో చెప్పారు.

వార్షిక అంచనాలను రూపొందించేందుకు సర్వేలో సేకరించిన అంశాల ఆధారంగా నివేదికలో అంశాలను నిర్ధరించారు.

ఈ సర్వే 'రోజువారీ దానాల'ను పరిశీలించింది. బిచ్చగాళ్లకు సాయం చేయడం, కుటుంబం లేదా స్నేహితులకు వ్యక్తిగతంగా సాయపడటం, సంస్థాగత, మతేతర సంస్థలకు విరాళాలు ఇవ్వడం లాంటివి ఇందులో ఉన్నాయి.

అంతే కాకుండా ఇది "విడిగా ఇవ్వడాన్ని" (రిటైల్ గివింగ్) కూడా పరీక్షించింది. రిటైల్ గివర్స్ అంటే సంపన్నులు కాకుండా, సాధారణ వ్యక్తులు లాభాపేక్ష లేని సంస్థలకు ఇచ్చే విరాళాలు. ఈ సర్వే దానానికి సంబంధించి విస్తృత పరిధిలో డేటాను సేకరించింది. అందులో వ్యక్తులకు నేరుగా సాయమందించడం, మత సంస్థలకు విరాళాలు ఇవ్వడం లాంటివి ఉన్నాయి.

సామీప్యత, విశ్వాసం అధారంగానే చాలా మంది దానాలు చేస్తున్నట్లు సర్వే గుర్తించింది.

విరాళాలు ఇచ్చే వారిలో దాదాపు 40 నుంచి 45 శాతం మంది ప్రజలు మతపరమైన సంస్థలకు ఇస్తున్నారు.

ఇందులో ఎక్కువ వాటా పట్టణ ప్రాంతాల్లోని బిచ్చగాళ్లు, నిరాశ్రయులకు వెళుతోంది.

గ్రామీణ ప్రాంతాల్లో మతపరమైన సంస్థలకు ఎక్కువ విరాళాలు అందుతున్నాయి.

భారతీయులు, విరాళాలు, సంపన్నులు, సాధారణ ప్రజలు, దాన ధర్మాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రజల విరాళాల్లో ఎక్కవ భాగం అన్న దానానికి అందిస్తున్నారు

చదువుకు, దానగుణానికి సంబంధం ఉందా?

"దానం చేయడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తున్నది ఏంటని మేము అడిగినప్పుడు మతపరమైన విశ్వాసమే తమకు ప్రేరణ అని 90శాతం మందికి పైగా చెప్పారు" అని అశోకా యూనివర్సిటీలో సెంటర్ ఫర్ సోషల్ ఇంపాక్ట్ అండ్ ఫిలాంత్రపీ పరిశోధన అధిపతి క్రిషాను చక్రవర్తి చెప్పారు.

వ్యక్తిగతంగా వచ్చి నేరుగా అడగడం, ప్రచారం, ఇళ్ల వద్దకు విరాళాలు సేకరించేవారు, ప్రార్థనా స్థలాలు లేదా బహిరంగ ప్రదేశాలు ఏదైనా కావచ్చు ప్రజలు ఇలాంటి చోటనే విరాళాలు ఇస్తున్నారు. అంతే కానీ డిజిటల్ ప్రచారాలు లేదా విరాళాలు సేకరించే కార్యక్రమాలను పెద్దగా పట్టించుకోవడం లేదు.

చదువుకు దాన గుణానికి పరస్పర సంబంధం ఉందని సర్వేలో తేలింది. రోజువారీ దాన ధర్మాలు చేసే వారిలో గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఎక్కువ మంది ఉన్నారు.

అయితే దాన ధర్మాలు చేయడం కేవలం సంపన్నులు, చదువుకున్న వాళ్లకే పరిమితం కాదు. నెలకు రూ.4వేల నుంచి రూ.5వేలు సంపాదించే వారిలోనూ సగం మంది దానం చేస్తున్నారు. వారి సంపాదన పెరిగే కొద్దీ దానాలు చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది.

ఇందులో లింగపరమైన అంశాలు చిన్నవే అయినా స్పష్టంగా ఉన్నాయి. మగాళ్ల పెత్తనం ఉన్న ఇళ్లలో కాస్త ఎక్కువగా మతపరమైన దానాలు చేస్తుంటే, మహిళల పెత్తనం ఉన్న ఇళ్లలో నిరుపేదలకు దానం చేయడం ఎక్కువగా ఉంది.

"ఈ సర్వేలో కీలకమైన అంశం ఏంటంటే భారతీయుల్లో రోజువారీ దానాలు చేయడం అనేది అప్పుడప్పుడు కాకుండా క్రమబద్దంగా ఉంది" అని ఉప్పల్ చెప్పారు.

"ఇది ఆదాయం, వయసు, లింగం, గ్రామీణ, పట్టణ ప్రాంతాలనే తేడా లేకుండా అన్ని చోట్లా, అందరిలోనూ ఉంది. దైనందిన సామాజిక జీవితంలో కనిపిస్తూనే ఉంటుంది" అన్నారు.

మరో ముఖ్య విషయం ఏంటంటే, భారత్‌లో మొత్తం దానధర్మాల్లో రోజూ దానం చేసే వారి వాటా 15శాతం వరకు ఉంటుందని అంచనాలు సూచిస్తున్నాయి.

పదిహేను శాతమే అయినప్పటికీ వ్యవస్థీకృత సామాజిక రంగానికి అందుతున్న ప్రైవేట్ డొనేషన్లలో మూడోవంతుగా ఉంది.

భారతీయులు, విరాళాలు, సంపన్నులు, సాధారణ ప్రజలు, దాన ధర్మాలు

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, చెన్నైలో 2023 డిసెంబర్‌లో వరదలు వచ్చినప్పుడు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అనేక మంది స్వచ్ఛందంగా ముందుకొచ్చారు.

భారతీయులు ధర్మ ప్రభువులంటున్న నివేదిక

"రోజూ దానం చేసే వాళ్లు ఇచ్చేది కొద్ది మొత్తమే అయినా, సామాజికంగా ప్రభావం చూపడంలో ప్రజల భాగస్వామ్యాన్ని సూచిస్తోంది" అని ఉప్పల్ చెప్పారు.

పరిశోధకుల ప్రకారం సర్వేలో చివరి అంశం మరింత ఆలోచించదగినది.

సర్వేలో ప్రజల నుంచి వచ్చిన సమాధానాలను వారి రోజువారీ ఖర్చులతో కలిపి చూసినప్పుడు, ప్రజలు ఖర్చు చేసే తీరుతెన్నులు దానధర్మాలు చేయడానికి ఎలా దోహద పడుతున్నాయో పరిశీలించారు.

ఇంటి ఖర్చులు పెరిగే కొద్దీ, విరాళాలు ఇవ్వడం, దానం చేసే మొత్తం కూడా పెరుగుతున్నట్లు సర్వే గుర్తించింది.

"ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థలలో భారత్ కూడా ఒకటి. భారత జీడీపిలో ప్రజల వినిమయశక్తి ప్రధాన భాగం. గృహ వినియోగం విస్తరిస్తున్న కొద్దీ, దాన ధర్మాలు, విరాళాలు పెరిగే అవకాశం ఉంది" అని ఉప్పల్ చెప్పారు.

అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో ప్రజల రోజువారీ దాన ధర్మాలు, విరాళాలు ఎన్జీవోలకు వెన్నెముక లాంటివి.

ఈ సర్వేను మత పరమైన వేడుకలు, పండుగలు తక్కువగా ఉండే మార్చ్- ఏప్రిల్ మధ్య నిర్వహించినట్లు ఉప్పల్ తెలిపారు.

"మతపరమైన సంస్థలకు ఇచ్చే వ్యక్తిగత విరాళాలు ఎక్కువగా ఉండటంతో మతపరమైన సందర్భాలు ఉన్న నెలల్లో ప్రజల్లో ఎక్కువ మంది విరాళాలు ఇస్తారని భావించవచ్చు" అని ఆమె అన్నారు.

మరో విధంగా చెప్పాలంటే, భారత్‌లో దాతృత్వం అనేది పై నుంచి రాలిపడే వర్షపు చుక్క కాదు. కింద నుంచి ఎగసి పడే అల.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)