పొటాషియం లోపం ఈ సీరియస్ వ్యాధికి కారణమవుతుందా, అరటిపండే దీనికి మందా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఆనంద్ మణి త్రిపాఠి
- హోదా, బీబీసీ ప్రతినిధి
పొటాషియం ప్రస్తావనకు వస్తే చాలామంది అరటిపండ్లు గురించి ఆలోచిస్తుంటారు.
మీ శరీరానికి కావాల్సిన పొటాషియం కావాలంటే ఒక అరటిపండు తింటే సరిపోదా?
అసలేంటి పొటాషియం?
మన శరీరం పనిచేసేందుకు అత్యంత అవసరమైన ఖనిజం పొటాషియం. ఇది రక్తపోటును నియంత్రణకు సాయపడుతుంది. అదనపు సోడియాన్ని బయటకు పంపేందుకు కిడ్నీలకు సహకరిస్తుంది.

పొటాషియం ఎముకలను బలపరుస్తుంది. కణాలు సరిగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.
'' పొటాషియం అనేది శరీరానికి అవసరమైన పోషకాలను అందించేందుకు, శరీర వ్యర్థాలను తొలగించేందుకు సాయపడే మైక్రోన్యూట్రియెంట్ మినరల్'' అని ఎస్ఏపీ డైట్ క్లినిక్ ఫౌండర్, సీనియర్ కన్సల్టెంట్ డైటిషియన్ డాక్టర్ అదితి శర్మ చెప్పారు.
పొటాషియం శరీరంలో ఎలక్ట్రోలైట్‌లాగా పనిచేస్తుంది.
- కండరాలకు సాయపడుతుంది.
- హార్ట్‌బీట్‌ను నియంత్రిస్తుంది.
- సంకేతాలు సరిగ్గా పంపేలా నరాలకు సాయపడుతుంది.
''ఇది ఎలక్ట్రోలైట్. శరీరంలోని ప్రతి కణంలో ఇది ఉంటుంది. శరీరంలోని ప్రతి కండరాన్ని, మెదడును, గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది'' అని వన్ డైట్ ఫౌండర్, ఎయిమ్స్ మాజీ డైటిషియన్ డాక్టర్ అను అగర్వాల్ తెలిపారు.
కండరాలు బాగా పనిచేసేందుకు పొటాషియం చాలా కీలకమని ఆమె వివరించారు.
శరీరంలో పీహెచ్ స్థాయులను సమతుల్యపరిచేందుకు, అదనపు సోడియం తొలగించేందుకు ఉపయోగపడుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
పొటాషియం అవసరమెంత?
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. పెద్దవారు రోజుకు సగటున 3,500 మిల్లీగ్రాముల పొటాషియం తీసుకోవాలి.
దీనివల్ల రక్తపోటు నియంత్రణలో ఉండటమే కాకుండా.. గుండె జబ్బులు రావడం తగ్గుతుంది.
- ఆహారం నుంచి పొటాషియం అందుతుందా?
అవును. మీరు తీసుకునే ఆహారం నుంచి పొటాషియం లభిస్తుంది. అయితే, ఆ ఆహారంలో అవసరమైనంత పండ్లు, కూరగాయాలు ఉండాలి.
అయితే, అసలు సమస్యేంటంటే.. వారంలో ఐదు రోజులు కూడా సరిపడినంత మోతాదులో పండ్లు, కూరగాయలను చాలామంది తినలేకపోవడమే.
చాలామంది తీసుకునే ఆహారంలో సగానికి పైగా కేలరీలు ప్రాసెస్డ్ ఫుడ్స్ నుంచే వస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
పొటాషియం తగ్గితే ఏమవుతుంది?
కేవలం ఆహార లోపం వల్లనే పొటాషియం లోపం రాదు.
కొన్నిసార్లు వాంతులు, విరోచనాల వల్ల కూడా ఇది తగ్గిపోతుంది.
కొన్ని మెడిసిన్లు, ఎక్కువగా మద్యం సేవించడం వల్ల కూడా పొటాషియం తగ్గుతుంది.
పొటాషియం లోపం వల్ల రక్తపోటు పెరుగుతుంది. గుండె సంబంధిత వ్యాధులు లేదా స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువ అవుతాయి.
''పొటాషియం లోపం వల్ల కండరాలు ఒత్తిడికి గురై, టెన్షన్ పెరుగుతుంది. శరీరం కూడా అలసిపోతుంది. దీనివల్ల మలబద్ధక సమస్య వస్తుంది. అత్యంత ముఖ్యంగా, హార్ట్‌బీట్ సరిగ్గా ఉండదు. ఇది నేరుగా రక్తపోటుపై ప్రభావం చూపుతుంది'' అని డాక్టర్ అను అగర్వాల్ చెప్పారు.
శరీరంలో అదనపు పొటాషియం
సాధారణంగా అదనపు పొటాషియాన్ని కిడ్నీలు మూత్రం ద్వారా బయటికి పంపేస్తాయి. కానీ, కిడ్నీ వ్యాధులు ఉన్నవారికి ఈ ప్రక్రియ సరిగ్గా జరగదు.
ఇలాంటి పరిస్థితుల్లో పొటాషియం శరీరంలోనే ఉండిపోతుంది. దీనివల్ల హార్ట్‌బీట్ సరిగ్గా ఉండదు. హార్ట్ ఫెయిల్ అయ్యే ప్రమాదం పెరుగుతుంది.
అందుకే, కిడ్నీ రోగులను పొటాషియం తక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు.
''పొటాషియం లోపం వల్ల గుండె, నరాలు, కండరాలపై ప్రభావం చూపుతుంది. కానీ, పొటాషియం ఎక్కువ అవ్వడం మరింత ప్రమాదకరం. ఇది హార్ట్ ఫెయిల్యూర్‌కు కారణమవుతుంది. అందువల్ల, దీనిని ఎక్కువగా తినకపోవడమే మంచిది'' అని డాక్టర్ అదితి శర్మ వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
అరటిపండ్లు పొటాషియానికి ఉత్తమమైన ఆహారమా?
అరటిపండ్ల నుంచి పొటాషియం వస్తుంది. కానీ, అంత మంచి లేదా పుష్కలమైన ఆహార పదార్థమైతే కాదు.
ఒక అరటిపండు రోజుకు అవసరమైన పొటాషియంలో 10 శాతమే ఇస్తుంది. అదే వేయించిన బంగాళదుంప అయితే 30 శాతం వరకు అందిస్తుంది.
పొటాషియం అందించే ఆహార పదార్థాల్లో డ్రై ఫ్రూట్స్, ఆకుకూరలు, నట్స్, సీడ్స్, మిస్క్, పప్పులు, చేప ఉన్నాయి.
పొటాషియం సమతుల్యంగా తీసుకునేందుకు అవసరమైన పండ్లు,కూరగాయలు తీసుకోవడం ముఖ్యమని డాక్టర్ అను అగర్వాల్ చెప్పారు.
కొబ్బరినీళ్లు, ఆరెంజ్, అరటిపండ్లు, ఆకుకూరలు వంటి వాటిల్లో కూడా పొటాషియం మంచిగా దొరుకుతుంది. అన్ని పండ్లు, కూరగాయల్లో పొటాషియం ఉంటుంది.
చాలామందికి 3700 మిల్లీగ్రాములు లేదా అంతకంటే తక్కువ పొటాషియం సప్లిమెంట్లు తీసుకోవడం సురక్షితమైందిగా చెబుతుంటారు వైద్యులు.
కానీ, పెద్దవారు, కిడ్నీ సమస్యలున్న వారు మాత్రం వైద్యుల సూచన లేకుండా ఎక్కువగా తీసుకోకూడదు.
అదనపు పొటాషియాన్ని కిడ్నీలు తేలిగ్గా తొలగించలేవు.

ఫొటో సోర్స్, Getty Images
సహజ ప్రత్యామ్నాయాలే మేలు
చెమట వల్ల పొటాషియం తక్కువగానే బయటికి వస్తుంది. వ్యాయామం తర్వాత దాన్ని తిరిగి సాధారణ స్థితికి తెచ్చుకునేందుకు సహజ ప్రత్యామ్నాయాలు మంచివి.
టమాటా జ్యూస్‌ను తాగొచ్చు. ఒక గ్లాస్ జ్యూస్‌లో 460 మిల్లీగ్రాముల పొటాషియం ఉంటుంది.
వేయించిన బంగాళదుంపలు కూడా మంచి ఆప్షన్. ఇవి కేవలం పొటాషియాన్ని అందించడమే కాకుండా.. వాటిల్లో ఉండే కార్బోహైడ్రేట్లు ఎనర్జీని అందిస్తాయి.

ఫొటో సోర్స్, Getty Images
పొటాషియం పెంచుకునేందుకు మార్గాలు
- రోజూ ఐదుసార్లు పండ్లు, కూరగాయాలు తినాలి. (బ్రేక్‌ఫాస్ట్ సమయంలో ఒక పండు, మధ్యాహ్న భోజనంలో ఒక పండు, ఒక కూరగాయ, రాత్రిపూట ఆహారం తీసుకునే సమయంలో రెండు కూరగాయలు)
- ప్రతి రోజూ మూడు పాల ఉత్పత్తులు తీసుకోవాలి. (పాలతో కాఫీ, సలాడ్‌లో చీజ్, లేదా పెరుగు)
- వారంలో ఒకసారి పప్పులు, బీన్స్ తినాలి.
- డ్రై ఫ్రూట్స్, నట్స్, సీడ్స్ స్నాక్స్‌గా తీసుకుంటూ ఉండాలి.
- మధ్యాహ్న భోజనంలో లేదా రాత్రిపూట ఆహారంలో సలాడ్ తినాలి.
- పొటాషియానికి కూరగాయలు చాలామంచివి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














