బెల్లీ ఫ్యాట్ ఎంత ప్రమాదకరమో తెలుసా? తగ్గాలంటే ఈ 5 పనులు చేయాల్సిందే

బెల్లీ ఫ్యాట్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సుమిరన్ ప్రీత్ కౌర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

పెరుగుతున్న పొట్టను తగ్గించుకోవడానికి చాలా మంది జిమ్‌కి వెళతారు. కొంతమంది దాని గురించి అసలు పట్టించుకోరు.

పొట్టకింద పెరుగుతున్న అదనపు కొవ్వును సాధారణంగా బెల్లీ ఫ్యాట్, అబ్డామినల్ ఫ్యాట్ లేదా బీర్ బెల్లీ అని కూడా పిలుస్తారు. తమ రూపం, ఫిట్‌నెస్ గురించి ఆలోచన ఉన్న యువత కొందరు దీని గురించి ఆందోళన చెందుతారు.

మరికొంతమంది పొట్ట చుట్టూ కొవ్వు పెరగడం వల్ల తమకు నచ్చిన దుస్తులు వేసుకోలేకపోతున్నారు.

అయితే, దీని ప్రభావం మీకు నచ్చిన దుస్తులు ధరించలేకపోవడానికే పరిమితం కాదు.

పొట్ట కింద పెరిగే కొవ్వు మీ ఆరోగ్యానికి చాలా రకాలుగా హాని చేసే ప్రమాదం ఉంది.

హై బ్లడ్ ప్రెజర్, హై షుగర్ వేల్యూస్, హై కొలెస్ట్రాల్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

దీని వల్ల టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బుల ప్రమాదం కూడా పెరుగుతుంది.

హార్వర్డ్ యూనివర్సిటీ ప్రచురించిన పరిశోధన ప్రకారం, బెల్లీ ఫ్యాట్.. సైటోకిన్ అనే ప్రోటీన్‌ ఉత్పత్తిని పెంచుతుంది. ఇది శరీరంలో వాపును కలిగించవచ్చు.

ఈ బెల్లీ ఫ్యాట్ ఆంజియోటెన్సిన్ అనే మరొక ప్రోటీన్‌ ఉత్పత్తిని కూడా పెంచుతుంది. ఇది రక్త నాళాలు మూసుకుపోయేలా చేసి, రక్తపోటుకు కారణమవుతుంది.

అలాగే డిమెన్షియా(జ్ఞాపక శక్తి తగ్గడం), ఉబ్బసం, కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది.

"శరీరంలోని ఇతర భాగాలలో పేరుకుపోయిన కొవ్వు కంటే పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు చాలా ప్రమాదకరం" అని దిల్లీలోని ఫోర్టిస్ ఎస్కార్ట్స్ హాస్పిటల్‌లోని సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ శివ్ కుమార్ చౌదరి చెప్పారు.

"పొట్ట కింద కొవ్వు కణాలు విచ్ఛిన్నమైనప్పుడు లేదా నాశనమైనప్పుడు, వాటి నుంచి అనేక రకాల విషపూరిత పదార్థాలు విడుదలవుతాయి. ఈ మూలకాలు గుండె ధమనులలో మార్పులకు కారణమవుతాయి. దీంతో గుండె జబ్బులొచ్చే ప్రమాదం పెరుగుతుంది.

అలాగే శరీరంలో ఇన్సులిన్ నిరోధకతను కూడా పెంచుతుంది. దీంతో మధుమేహం వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది" అని డాక్టర్ చౌదరి వివరించారు.

హై బ్లడ్ ప్రెజర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బెల్లీ ఫ్యాట్.. హై బ్లడ్ ప్రెజర్, హై షుగర్ వ్యాల్యూస్, హై కొలెస్ట్రాల్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.

బెల్లీ ఫ్యాట్ పెరగడానికి వివిధ కారణాలు ఉండొచ్చు. వాటిలో జన్యు ప్రభావం, హార్మోనల్ మార్పులు, వయసు, అధిక బరువు, మెనోపాజ్ ముఖ్యమైనవి అన్నది నిపుణుల అభిప్రాయం.

దీంతో పాటు, అనారోగ్యకర జీవనశైలి, రోజువారీ అలవాట్లు, తగిన ఆహారం లేకపోవడం కూడా బెల్లీ ఫ్యాట్ పెరగడానికి కారణమవుతాయి.

ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుని, రెగ్యులర్‌గా వ్యాయామం చేసి, మంచి అలవాట్లు పాటించడం ద్వారా పొట్ట కింద పెరిగే కొవ్వును నియంత్రించవచ్చు అని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు.

బెల్లీ ఫ్యాట్‌ను నియంత్రించడానికి కొన్ని విషయాలపై శ్రద్ధ వహించడం ముఖ్యం. అవేంటో చూద్దాం.

వ్యాయామం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బెల్లీ ఫ్యాట్‌ను నియంత్రించడానికి వ్యాయామం తప్పనిసరి.

1) రాత్రి భోజనం, నిద్రించే సమయం మధ్య గ్యాప్

నిద్రపోయే మూడు గంటల ముందు ఏమీ తినకూడదు.

పగటిపూట తినేటప్పుడు మీ శరీరం రోజువారీ కార్యకలాపాలకు కేలరీలను ఉపయోగిస్తుంది. వాటిని శక్తిగా మార్చుతుంది.

కానీ రాత్రి భోజనం తిన్న తర్వాత, ఈ కేలరీలు ఖర్చవవు.

అప్పుడు అవి కొవ్వుగా నిల్వ అవుతాయి, దాంతో బరువు పెరుగుతుంది.

కాబట్టి రాత్రి భోజనానికి, నిద్రకు ఉపక్రమించే సమయానికి మధ్య కనీసం 3 గంటల విరామం ఉండాలి.

2) సమతుల ఆహారం తీసుకోవడం

ఆహారంలో ఎక్కువ ఫైబర్ తీసుకుంటే చాలాసేపటి వరకు ఆకలిగా అనిపించదని నిపుణులు సూచిస్తున్నారు.

మీరు తీసుకునే ఆహారంలో ఎక్కువ ఫైబర్ ఉంటే, అది ఆహారంతో పాటు కడుపులోనే ఉంటుంది. కడుపు నుంచి పేగులకు ఆహారం వెళ్లే వేగాన్ని తగ్గిస్తుంది.

దీంతో చాలాసేపటివరకూ పొట్ట నిండుగా ఉండి ఆకలి అనిపంచదు.

అలాగే ఆహారంలో ప్రోటీన్‌ను చేర్చుకోండి. ప్రోటీన్ కూడా చాలాసేపు కడుపు నిండుగానే ఉన్న అనుభూతిని కలిగిస్తుంది. మాటిమాటికీ ఏదైనా తినాలనే కోరికను తగ్గిస్తుంది.

అదనంగా, ఇది ఆకలిని పెంచే హార్మోన్ అయిన గ్రెలిన్ స్థాయిని తగ్గించి, తినాలనే కోరికను నియంత్రిస్తుంది.

ప్రోటీన్ శరీర కండరాలను దృఢం చేస్తుంది. జీవక్రియను వేగవంతం చేస్తుంది, తద్వారా కేలరీలను బర్న్ చేసే సామర్థ్యం పెరుగుతుంది.

గుడ్లు, పప్పులు, పాలు, జున్ను, పెరుగు, చేపలు, చికెన్, సోయా వంటి ప్రోటీన్ అధికంగా ఉండే పదార్ధాలను మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోండి.

ఫైబర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఫైబర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎక్కువ సేపు ఆకలిగా అనిపించదు. కాబట్టి తక్కువ ఆహారం తింటారు. దీంతో ఊబకాయం వచ్చే ప్రమాదం తగ్గుతుంది.

3) అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లకు దూరంగా ఉండడం

వైట్ బ్రెడ్, చిప్స్ వంటి వాటిలో దాదాపు ఫైబర్ ఉండదు. అందుకే అవి త్వరగా జీర్ణమవుతాయి. అంతేకాకుండా ఒక్కసారిగా రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతాయి.

రక్తంలో చక్కెర స్థాయి వేగంగా మారితే ఆకలి పెరగడమే కాకుండా బరువు పెరగడం, టైప్-2 డయాబెటిస్ వంటి ప్రమాదం కూడా పెరుగుతుంది.

అందువల్ల, వీటిని బదులు హోల్ గ్రెయిన్ బ్రెడ్, రోస్టెడ్ స్నాక్స్, పండ్లు, గింజలు వంటి ఆరోగ్యకరమైన ఆహారం తినడం మంచిది.

చక్కెర, కేలరీలు అధికంగా ఉన్న ఆహారం తినొద్దు. మద్యం తాగడం తగ్గించండి. ధూమపానం మానేయండి.

జంక్ ఫుడ్

ఫొటో సోర్స్, Getty Images

4) తగినంత నిద్ర

తగినంత నిద్రపోవడం శరీరానికి అవసరం. నిద్ర చాలనప్పుడు అది ఆకలి హార్మోన్లపై ప్రభావం చూపుతుంది, దీనివల్ల ఎక్కువ ఆహారం తీసుకోవాలనే కోరిక పెరుగుతుంది.

కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ పరిశోధకుల అభిప్రాయం ప్రకారం.. కడుపులో ఉత్పత్తి అయ్యే ఆకలిని పెంచే గ్రెలిన్ అనే హార్మోన్ నిద్ర లేకపోవడం వల్ల పెరుగుతుంది.

అలాగే ఒత్తిడి వల్ల రక్తంలో కార్టిసాల్‌ హార్మోన్ విడుదలవుతుంది.

5) శారీరకంగా చురుగ్గా ఉండడం

శారీరక వ్యాయామం, యాక్టివ్‌గా ఉండడం వల్ల కేలరీలు ఖర్చవుతాయి. ఇది బెల్లీ ఫ్యాట్ తగ్గించడంలో సాయపడుతుంది.

క్రమం తప్పకుండా చురుకైన నడక, పరుగు, సైక్లింగ్, ఈత లేదా యోగా చేయడం వల్ల కొవ్వు తగ్గడమే కాకుండా జీవక్రియ కూడా వేగవంతం అవుతుంది.

వ్యాయామం కండరాలను బలపరుస్తుంది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును తగ్గించడం వల్ల మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బుల ప్రమాదం కూడా తగ్గుతుంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)