గనేరియా: ప్రపంచంలోనే తొలిసారి ఈ సుఖవ్యాధికి టీకా

గనేరియాకు టీకా

ఫొటో సోర్స్, Getty Images

యూకేలో లైంగిక ఆరోగ్య కేంద్రాలలో గనేరియా వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నాయి. రికార్డు స్థాయికి చేరిన ఇన్ఫెక్షన్లు తగ్గించడమే ఈ టీకాల లక్ష్యం.

అత్యధిక ముప్పు కలిగిన వారికి ముందుగా ఈ టీకాలు ఇస్తారు. ముఖ్యంగా స్వలింగసంపర్కులు, ఎక్కువమంది లైంగిక భాగస్వాములను కలిగి ఉన్నవారు, లేదా లైంగిక వ్యాధులకు గురైనవారికి ఇస్తారు.

ఇటువంటి టీకాలు అందుబాటులోకి తీసుకురాడం ప్రపంచంలో ఇదే తొలిసారని ఇంగ్లండ్ నేషనల్ హెల్త్ సర్వీసెస్ (ఎన్‌హెచ్‌ఎస్) తెలిపింది. దీనివల్ల లక్ష కేసులు నివారింవచ్చు. వచ్చే దశాబ్దంలో ఎన్‌హెచ్‌ఎస్ సేవల ఖర్చు భారీగా ఆదా అవుతుందని అంచనా వేసింది.

యూకేలో టీకాల కోసం ప్రచారం చేసిన ‘ది టెరెన్స్ హిగిన్స్ ట్రస్ట్’ బీబీసీతో మాట్లాడుతూ లైంగిక ఆరోగ్యానికి ఇదో ''అతిపెద్ద విజయం'' అని తెలిపింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గనేరియా ఎందుకు వస్తుంది?

అసురక్షిత శృంగారం వల్ల వ్యాపించే గనేరియా ఓ బ్యాక్టిరియల్ ఇన్ఫెక్షన్.

నొప్పి, అసాధారణమైన డిశ్చార్జ్, జననేయంద్రియాలలో వాపు, వంధ్యత్వం దీని లక్షణాలు.

అయితే కొన్ని కేసులలో ఎటువంటి లక్షణాలు కనిపించవు.

కండోమ్స్‌ను సక్రమంగా వినియోగించడం, టీకాలు వేసుకోవడం ద్వారా దీనిని నివారించవచ్చని ఎన్‌హెచ్ఎస్ తెలిపింది.

వ్యాక్సిన్

ఫొటో సోర్స్, Getty Images

ఇన్ఫెక్షన్ల సంఖ్య పెరగడంపై డాక్టర్లు ఆందోళన చెందుతున్నారు.

ఈ టీకా ప్రభావం 30, 40 శాతం ఉన్నప్పటికీ, యాంటిబయాటిక్స్‌ను ప్రతిఘటించే కేసులను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుందని ఆశిస్తున్నారు.

ఈ టీకాను 4సీ‌మెన్‌బీగా పిలుస్తారు. పిల్లల్లో మెనింజైటిస్ నివారణ కోసం దీనిని రూపొందించారు. కానీ మెనింజైటిస్ బీ, గనేరియాకు కారణమయ్యే బ్యాక్టీరియా దాదాపు సమానంగా ఉండటంతో ఈ టీకా గనేరియాపై ప్రభావవంతంగా పనిచేస్తుంది.

గత వందేళ్లలో ఎన్నడూ లేనంతగా 2023లో యూకేలో 85 వేలకు పైగా గనేరియా కేసులు నమోదయ్యాయి.

గనేరియాకు గురైన జోయ్ నాన్ అనే వ్యక్తి తన అనుభవాలను బీబీసీతో పంచుకున్నారు.

‘‘నాకు ఈ ఇన్‌ఫెక్షన్ వల్ల డయేరియా వచ్చింది. చాలా నీరసంగా అనిపించింది. పనిచేయలేక చాలారోజులు సెలవులు తీసుకోవాల్సి వచ్చింది. నా స్నేహితులతో పోలిస్తే నాకు చాలా తీవ్రమైన లక్షణాలు వచ్చాయి. తిండి తినలేక పూర్తిగా నీరసించిపోయినట్టనిపించింది’’

‘‘ఇప్పుడున్న లైంగిక ఆరోగ్య సాధనాలకు ఈ టీకా అదనం’’ అని లైంగిక ఆరోగ్య సేవా సంస్థ టెరెన్స్ హిగిన్స్ ట్రస్ట్ సీఈఓ రిచర్డ్ బీబీసీకి చెప్పారు.

‘‘లైంగిక ఆరోగ్యం విషయంలో ఇదో పెద్ద ముందడుగు’’ అని ఎన్‌హెచ్‌ఎస్ డైరక్టర్ డాక్టర్ అమండా డోలే అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)