జడేజా వీరోచిత పోరాటం నుంచి క్రిస్ వోక్స్ ఒంటిచేత్తో బ్యాటింగ్‌కు రావడం వరకు...ఈ సిరీస్‌లో 5 మరచిపోలేని క్షణాలు

క్రిస్ వోక్స్, ఓవల్ టెస్టు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఓవల్ టెస్టులో క్రిస్ వోక్స్ చేతికి కట్టుతో క్రీజులోకి వచ్చాడు.
    • రచయిత, వద్ది ప్రభాకర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఇంగ్లండ్-ఇండియా మధ్య జరిగిన అండర్సన్- తెందూల్కర్ సిరీస్‌ క్రికెట్ అభిమానులకు చాలారోజులు గుర్తుండిపోతుంది.

ఐదు టెస్టుల సిరీస్ 2-2తో డ్రాగా ముగిసినప్పటికీ ప్రతి మ్యాచ్ నువ్వానేనా అన్నట్లుగా సాగాయి.

ఈ క్రమంలో కొన్ని ఆసక్తికర సన్నివేశాలూ చోటుచేసుకున్నాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
స్టోక్స్, జడేజా, ఇంగ్లండ్ వర్సెస్ భారత్

ఫొటో సోర్స్, Getty Images

క్రికెట్ గ్రాఫిక్స్

మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో డ్రాగా ముగిసిన నాలుగో టెస్టులో షేక్ హ్యాండ్ వ్యవహారం చర్చనీయంగా మారింది.

మ్యాచ్ ముగియడానికి దాదాపు గంట ముందు, ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ క్రీజులో ఉన్న రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్‌లతో షేక్‌ హ్యాండిచ్చి, మ్యాచ్‌ను డ్రా చేయాలని ప్రతిపాదించాడు.

కానీ, ఆ సమయంలో సెంచరీలకు దగ్గరగా ఉన్న భారత బ్యాటర్లు స్టోక్స్ ప్రతిపాదనను తిరస్కరించారు.

అప్పుడు రవీంద్ర జడేజా 89 పరుగులు, వాషింగ్టన్ సుందర్ 80 పరుగుల దగ్గర ఆడుతున్నారు.

అప్పటికి మ్యాచ్‌లో 15 ఓవర్లు మిగిలి ఉన్నాయి. అంటే గంటకు పైగా ఆట మిగిలి ఉంది.

మ్యాచ్ ముగించాలన్న ప్రతిపాదనను జడేజా, సుందర్ తిరస్కరించడంతో అసంతృప్తి వ్యక్తం చేసిన స్టోక్స్, అంపైర్‌ను సంప్రదించాడు.

ఇంతలో మరో ఇంగ్లండ్ ఆటగాడి గొంతు స్టంప్స్ మైక్ నుంచి వినిపించింది.

''ఎంత టైమ్ కావాలి, ఒక గంటా?'' అన్న మాట వినిపించింది.

అప్పుడు రెండు జట్ల ఆటగాళ్ల మధ్య కొంత వాడీవేడీ వాదన జరిగింది. ఇంగ్లండ్ ఆటగాళ్లు హ్యారీ బ్రూక్, జాక్ క్రాలీ కూడా ఏదో అన్నారు గానీ వారు చెప్పేది స్పష్టంగా వినపడలేదు.

స్టోక్స్ ఆ తర్వాత హ్యారీ బ్రూక్, జో రూట్‌తో బౌలింగ్ చేయించాడు. చివరి కొన్ని నిమిషాలపాటు రెండు జట్ల మధ్య కొంత ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ టెస్టు డ్రాగా ముగిసింది.

సిరాజ్, స్టోక్స్, జడేజా, ఇంగ్లండ్ వర్సెస్ భారత్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బషీర్ బౌలింగ్‌లో డిఫెన్స్ ఆడిన బాల్ మెల్లిగా వెళ్లి వికెట్లను తాకడంతో చివరి వికెట్‌గా అవుటైన సిరాజ్.
క్రికెట్ గ్రాఫిక్స్

లార్డ్స్‌లో జరిగిన మూడో టెస్ట్ క్లైమాక్స్ వంటి ఘట్టాలు టెస్ట్ క్రికెట్‌లో చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. మూడో టెస్టు చివరి వరకు ఉత్కంఠభరితంగా జరిగింది.

గాయపడిన ఇద్దరు ప్లేయర్లు (షోయబ్ బషీర్, జోఫ్రా ఆర్చర్), అలసిపోయిన కెప్టెన్ (బెన్ స్టోక్స్), పట్టువిడవక పోరాటం చేసిన ఆల్ రౌండర్ (రవీంద్ర జడేజా) తమ ఆట తీరుతో టెస్ట్ క్రికెట్‌లోని మజాను ప్రేక్షకులను అందించారు.

193 పరుగుల ఛేదనలో 112 రన్స్‌కే 8 వికెట్లు కోల్పోయిన స్థితిలో జడేజా వీరోచితంగా పోరాడాడు. మరో ఎండ్‌లో బుమ్రా, సిరాజ్ కూడా అతడికి అండగా నిలిచారు.

అయితే, టీ తర్వాత భారత్ పోరాటం ముగిసింది. 74 ఓవర్లు ముగిసే సరికి 169/9 తో ఆడుతోంది భారత్. 75వ ఓవర్ మూడో బంతికి జడేజా సింగిల్ తీశాడు.

స్ట్రైక్‌కు వచ్చిన సిరాజ్, స్పిన్నర్‌ బషీర్‌ బంతిని బ్యాక్‌ఫుట్‌తో డిఫెన్స్ ఆడాడు. కింద పడిన బంతి సిరాజ్ ప్యాడ్స్‌ పక్కనుంచి వెళ్లి లెగ్‌ స్టంప్‌ను తాకింది. సిరాజ్‌ గమనించేలోపే బెయిల్స్‌ కూడా కిందపడిపోయాయి.

ఇంగ్లండ్ ఆటగాళ్లు, ఫ్యాన్స్‌లో సంబరాలు మిన్నంటాయి.

రిషబ్ పంత్, మాంచెస్టర్

ఫొటో సోర్స్, Getty Images

క్రికెట్ గ్రాఫిక్స్

భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ మాంచెస్టర్ మైదానంలో గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. నాల్గో టెస్ట్ మొదటి రోజున పంత్ కాలికి గాయమైంది. దాంతో రిటైర్డ్ హర్ట్ అయ్యాడు.

వైద్యపరీక్షలు అనంతరం మ్యాచ్‌లో కీపంగ్ చేయడానికి వీలుకాదని స్పష్టం చేశారు.

అయితే, జట్టు స్కోరు 314 పరుగుల వద్ద ఆరో వికెట్‌గా శార్దూల్ ఠాకూర్ అవుటవ్వడంతో రిషబ్‌పంత్‌ బ్యాటింగ్‌కు వచ్చాడు.

పంత్, భారత్

ఫొటో సోర్స్, Getty Images

పంత్ బ్యాటింగ్‌కు వస్తున్నప్పుడు ఇంగ్లండ్ అభిమానులు కూడా లేచి నిల్చొని స్వాగతం పలికారు.

గాయంతో ఇబ్బంది పడుతూనే గ్రౌండ్‌లోకి వచ్చిన ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

క్రిస్ వోక్స్, ఓవల్

ఫొటో సోర్స్, Getty Images

క్రికెట్ గ్రాఫిక్స్

ఓవల్‌లో జరిగిన ఐదో టెస్టులో మరో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది.

ఇంగ్లండ్ బౌలర్ క్రిస్ వోక్స్ చివరి రోజు ఒంటి చేత్తో బ్యాటింగ్ చేయడానికి క్రీజులోకి వచ్చాడు. భారత బ్యాటింగ్ మొదటి ఇన్నింగ్స్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా అతని భుజానికి గాయమైంది.

ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్‌లో వోక్స్ బ్యాటింగ్ చేయలేదు, ఆ తర్వాత బౌలింగ్ కూడా చేయలేదు. కానీ, మ్యాచ్ చివరి రోజున తొమ్మిది వికెట్లు పడ్డాక, విజయానికి కేవలం 17 పరుగులే అవసరం కావడంతో వోక్స్ కట్లు కట్టుకొని మరీ బ్యాటింగ్‌కు దిగాడు. అయితే, భారత బౌలర్ సిరాజ్ పదో వికెట్‌గా గస్ ఆట్కిన్‌సన్‌ను ఔట్ చేయడంతో ఇంగ్లండ్‌కు పరాజయం తప్పలేదు.

మ్యాచ్ అనంతరం భారత ప్లేయర్లు క్రిస్ వోక్స్‌ను అభినందించారు.

క్రిస్ వోక్స్ గురించి గిల్ మాట్లాడుతూ "అతను ఒంటి చేత్తో బ్యాటింగ్ చేయడానికి అలా వస్తాడని ఊహించలేదు. అతనికి నిజంగా ప్రశంసలు’’ అని అన్నాడు.

గిల్

ఫొటో సోర్స్, Getty Images

క్రికెట్ గ్రాఫిక్స్

టెస్టుల నుంచి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు రిటైర్ కావడంతో కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించిన శుభ్‌మన్ గిల్‌కు మొదటి సిరీస్ పరీక్షలా నిలిచింది. విదేశాల్లో యువ జట్టుతో ఏ మేరకు సక్సెస్ కాగలడు అన్న సందేహం చాలామందిలో కలిగింది.

అయితే, వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ 4 సెంచరీలతో రాణించాడు. ఇందులో ఓ డబుల్ సెంచరీ(269) కూడా ఉంది. గిల్ ఈ ఐదు టెస్టుల్లో 754 పరుగులు చేసి, కెప్టెన్‌గా ఒక సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచారని క్రిక్ ఇన్‌ఫో పేర్కొంది. ఈ రికార్డులో డాన్ బ్రాడ్‌మన్ (810) అతని కంటే ముందున్నాడని తెలిపింది.

మరోవైపు, జో రూట్ (537 పరుగులు), హ్యారీ బ్రూక్స్ (481 పరుగులు) కూడా ఆ సిరీస్‌లో తమదైన ముద్ర వేశారు.

ఓవల్ టెస్టులో నాలుగో రోజు 137 బంతుల్లో సెంచరీ సాధించిన జో రూట్, మొత్తంగా టెస్టు కెరీర్‌లో 39వ టెస్ట్ శతకం నమోదు చేశాడు. ఈ క్రమంలో కుమార సంగక్కర 38 సెంచరీల రికార్డ్‌ను అధిగమించాడు.

టెస్టుల్లో అత్యధిక శతకాలు సాధించిన బ్యాటర్ల జాబితాలో సచిన్ తెందూల్కర్(51), జాక్వస్ కల్లీస్ (45), రికీ పాంటింగ్(41) మాత్రమే జో రూట్ కంటే ముందున్నారు.

రూట్, స్టోక్స్, ఇంగ్లడ్

ఫొటో సోర్స్, Getty Images

టెస్టు క్రికెట్ ప్రత్యేకతను చాటేలా ఈ సిరీస్ సాగిందని ఐదో టెస్టు ముగిసిన అనంతరం ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అభిప్రాయపడ్డారు.

"ఈ సిరీస్ అద్భుతంగా సాగింది. ఈ ఫార్మాట్ ఇప్పటికీ చాలా ప్రత్యేకమనే దానికి ఈ సిరీస్ గొప్ప ఉదాహరణ. టెస్ట్ క్రికెట్ చచ్చిపోతోందని భావించే వారికి అది నిజం కాదని ఈ సిరీస్ నిరూపించింది'' అని స్టోక్స్ అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)