ఫిట్స్ వచ్చినప్పుడు చేతిలో తాళం చెవి పెడితే తగ్గుతుందా? అసలు మూర్ఛ ఎందుకు వస్తుంది

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, డాక్టర్ దేశం పీఆర్
- హోదా, బీబీసీ కోసం
చాలా సినిమాల్లో, సీరియళ్లలో చూస్తుంటాం. ఫిట్స్ వచ్చిన వ్యక్తి చేతిలో తాళం చెవి పెట్టడం. అసలు ఇది శాస్త్రీయమేనా? అసలు ఫిట్స్ వచ్చినపుడు ఏం చేయాలి?
భారత్‌లో ఒక శాతం మందికి వారి జీవిత కాలంలో ఫిట్స్ వచ్చే అవకాశం ఉంది.
కొన్ని రకాల ఫిట్స్ వంశపారంపర్యంగా వస్తాయి. అయితే, అన్ని రకాల ఫిట్స్‌కి మందుల అవసరం ఉండదు. కొన్ని వాటంతట అవే తగ్గిపోతాయి.
ఉదాహరణకు, ఐదేళ్ల లోపు పిల్లల్లో అధిక జ్వరం వచ్చినపుడు కొందరికి ఫిట్స్ వస్తాయి. ఇవి జీవితాంతం ఉండవు.
ఎక్కువ జ్వరం రాకుండా చూసుకోవడం, జ్వరం వచ్చిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా మందులు వాడటం వల్ల వీళ్లల్లో ఫిట్స్ నివారించవచ్చు.

ఫిట్స్‌కి కారణాలేంటి?
ఫిట్స్ వచ్చిన వారి కండరాలు బిగుసుకుపోవడం, చేతులు, కాళ్లు అటూ ఇటూ ఊపుతూ కొట్టుకోవడం, నోట్లో నుంచి నురగ రావడం, ఫిట్స్ తగ్గాక గందరగోళంలో ఏదేదో మాట్లాడటం – ఇవన్నీ సాధారణంగా కనిపించే లక్షణాలు.
ఇలా ఎందుకు జరుగుతుందో శతాబ్దాల పాటు వైద్యులకు అర్థం కాకపోవడంతో ఆ వ్యాధి చుట్టూ రకరకాల మూఢ నమ్మకాలు అల్లుకున్నాయి.
రకరకాల కారణాల వల్ల కొందరి మెదడులో ఉన్న నాడీ కణాలు ఉత్తేజితమవుతాయి.
ఈ నరాలు మెదడులో ఏ చోట ఉత్తేజితమవుతాయనే దాన్ని బట్టి శరీరంలో ఆయా భాగాలకు ఫిట్స్ వస్తాయి.
ఉదాహరణకు ఎవరికైనా కేవలం కుడి చేతికి ఫిట్స్ వస్తోంది అంటే, దానికి కారణం మెదడులోని ఎడమ పక్కన ఉండే ఫ్రంటల్ లోబ్‌లోని ఒక చిన్న భాగం (మోటార్ కార్టెక్స్)లో నాడీ కణాలు ఉత్తేజితం అవుతున్నాయని అర్థం.
మొత్తం కాళ్లు, చేతులు కొట్టుకుంటూ, శరీరమంతా ఫిట్ వస్తోందంటే, మెదడులో ఉన్న దాదాపు అన్ని నాడీ కణాలు ఉత్తేజితం అవుతున్నాయని అర్థం.
ఫిట్స్ ఏ వయసు వారికైనా రావచ్చు. వయసును బట్టి కారణాలు మారొచ్చు.
తలకు బలమైన దెబ్బ తగలడం, మద్యపానం, మెదడులో ఏదైనా కణితి పెరగడం, మెదడులో రక్త ప్రసరణ సరిగా లేకపోవడం, రక్తంలో చక్కెర శాతం తక్కువైనా, ఎక్కువైనా, కిడ్నీలు లేదా లివర్ జబ్బులు, రక్తంలో ఎలెక్ట్రోలైట్స్ శాతంలో హెచ్చుతగ్గులు.. ఇలాంటి కారణాలతో పెద్ద వయసు వారికి ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది.
వీటికి చికిత్స చేస్తే ఫిట్స్ వచ్చే అవకాశం తగ్గుతుంది.
మెదడుకు వచ్చే ఇన్ఫెక్షన్లు, జ్వరం వల్ల చిన్న వయసులో వచ్చే ఫిట్స్ వస్తుంటాయి.
వంశపారంపర్యంగా వచ్చే ఫిట్స్‌కు జన్యు లోపాలు ప్రధాన కారణం అవుతాయి.
కాళ్లూ చేతులు కొట్టుకోకుండా వచ్చే ఫిట్స్ కూడా ఉంటాయి. జాగ్రత్తగా గమనిస్తే తప్ప అవి ఫిట్స్ అని అర్థం కావు.
శూన్యంలోకి చూస్తూ ఉండటం, చుట్టూ ఏం జరుగుతోందో మర్చిపోవడం కూడా ఒక రకమైన ఫిట్సే. ఇలాంటి లక్షణాలున్నా కూడా వైద్యులను సంప్రదించాలి.

కొన్ని అపోహలు – నిజాలు
- ఫిట్స్ వ్యాధి ఉన్న వారు జీవితాంతం మందులు వేసుకోవాలి.
ఇది అన్ని రకాల ఫిట్స్‌కు వర్తించదు. కొన్ని రకాల ఫిట్స్ కు మాత్రమే జీవితాంతం మందులు వేసుకోవాల్సి వస్తుంది.
- ఫిట్స్ వచ్చే వ్యక్తులు పెళ్లికి అర్హులు కాదు. వారు లైంగిక జీవితం గడపలేరు.
ఫిట్స్ వచ్చే వ్యక్తులు కూడా అందరిలాగే పెళ్లి చేసుకోవచ్చు. వారిలో లైంగిక సామర్థ్యం అందరిలాగే ఉంటుంది. పిల్లలను కూడా కనవచ్చు.
- ఫిట్స్ ఉన్న వ్యక్తుల పిల్లలకు కూడా ఫిట్స్ వస్తాయి.
కొద్ది రకాల ఫిట్స్ మాత్రమే పిల్లలకు కూడా సంక్రమించే అవకాశం ఉంటుంది. చాలా రకాల ఫిట్స్ ఇలా పిల్లలకు సోకవు.
- చిన్నప్పుడు ఫిట్స్ లేకపోతే పెద్దయ్యాక రావు.
ఫిట్స్ ఏ వయసులోనైనా మొదలయ్యే అవకాశం ఉంటుంది.
- ఫిట్స్ ఉన్న వ్యక్తులకు మేధాశక్తి తక్కువగా లేదా ఎక్కువగా ఉంటుంది.
ఫిట్స్ ఉన్న వారి మేధాశక్తి అందరిలాగే ఉంటుంది.
- ఫిట్స్ వచ్చే వ్యక్తులు తమ నాలుకను తాము మింగేసే అవకాశం ఉంది.
ఇలా జరగదు. వారు తమ నాలుకను మింగలేరు. మన నోరు, గొంతులో ఉండే భాగాలు నాలుకను మింగడానికి అనుకూలించవు.
- ఫిట్స్ వచ్చే వ్యక్తి చేతిలో తాళం చెవి పెడితే ఫిట్స్ తగ్గిపోతాయి.
ఇది నిజం కాదు. ఫిట్స్‌కి, ఇనుప తాళం చెవికి ఎలాంటి సంబంధం లేదు. అసలు ఫిట్స్ వచ్చేటప్పుడు వ్యక్తుల చేతిని తెరవడం, అందులో ఏదైనా పెట్టి మూయడం వంటివి చెయ్యకూడదు. అలా బలవంతంగా వారి చేతిని మూయడం వల్ల ఆ చేతిలో ఉండే నరాలు గాయపడతాయి. ఇనుము నుండి మన శరీరంలో ఉండే నరాలకు ఎలాంటి తరంగాలూ ప్రసరించవు.
- ఫిట్స్ వచ్చిన వ్యక్తికి ఉల్లిపాయ లేదా వెల్లుల్లి వాసన / వాడేసిన సాక్స్ (మేజోళ్లు) వాసన చూపిస్తే తగ్గిపోతాయి.
ఇలా చేయడం వెనక ఎలాంటి శాస్త్రీయమైన కారణం లేదు. ఎలాంటి వాసన చూపించినా… దానికీ, ఫిట్స్ ఆగడానికి సంబంధం ఉండదు.
- ఫిట్స్ వచ్చే మహిళలు గర్భం దాల్చకూడదు.
ఫిట్స్ వచ్చే మహిళలు వైద్యుల పర్యవేక్షణలో బిడ్డకు ఎలాంటి హానీ కలగకుండా ప్రసవించవచ్చు. వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడాలి.
- ఫిట్స్ వచ్చే వారితో ఉండేవాళ్లకు కూడా ఫిట్స్ వస్తాయి.
ఫిట్స్ అనేది అంటువ్యాధి కాదు. అవి వ్యక్తి మెదడులోని నరాలు ఎక్కువగా ప్రేరేపితం కావడం వల్ల వస్తాయి. అవి ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందవు.
- ఫిట్స్ వచ్చే వారిలో దేవుడు ఆవహిస్తాడు.
వారికి ఎటువంటి దైవ శక్తీ ఉండదు. వారు అందరిలాంటి మనుషులే.

ఎవరికైనా ఫిట్స్ వస్తే మనం ఎలా స్పందించాలి?
- కంగారు పడకుండా వెంటనే ఏం చేయగలమో ఆలోచించాలి.
- ముందు ఆ వ్యక్తి చుట్టూ ఏమైనా వస్తువులు ఉంటే వాటన్నింటినీ దూరంగా తోసేయాలి.
- కుర్చీలో కూర్చున్నపుడు ఫిట్స్ వస్తే, వెంటనే స్పందించి, ఇతరుల సహాయం అవసరమైతే తీసుకొని జాగ్రత్తగా నేలపైన, తలను పక్కకి తిప్పి పడుకోబెట్టాలి. ఇలా చేయడం వల్ల నోట్లోని నురగ శ్వాస నాళంలోకి వెళ్లకుండా జాగ్రత్త పడొచ్చు.
- ఫిట్స్ ఎంత సమయం పాటు వచ్చాయో నోట్ చేసుకోవాలి. ఎన్ని నిమిషాల వరకు ఫిట్స్ ఉంటున్నాయో చూడాలి. ఐదు నిమిషాలు దాటినా ఫిట్స్ ఆగకపోతే వెంటనే అంబులెన్సును పిలిచి, హాస్పిటల్‌కు తీసుకెళ్లాలి. ఫిట్స్ చాలాసార్లు వస్తూ ఆగుతూ ఉన్నా కూడా హాస్పిటల్‌కు వెళ్లడం మంచిది. దీనిని స్టేటస్ ఎపిలెఫ్టిక్స్ అని పిలుస్తారు. ఈ ఫిట్స్‌ని అదుపు చేయకపోతే, గుండెకు, కండరాలకు, మెదడుకు రక్త సరఫరా నిలిచిపోయి దీర్ఘ కాలిక సమస్యలు వస్తాయి.
- ఫిట్స్ వచ్చే వారి నోటిలో ఏమీ పెట్టకూడదు.
- వారి మెడ చుట్టూ టై గానీ, చున్నీ గానీ ఉంటే జాగ్రత్తగా వదులు చేయాలి లేదా తీసేయాలి.
- తలకి దెబ్బ తగలకుండా దిండు లేదా మెత్తని గుడ్డ తల కింద పెట్టవచ్చు.
- ఫిట్స్ వచ్చే వారిని గట్టిగా పట్టుకోవడం, కదలకుండా పట్టుకోవడం వంటివి చేయకూడదు. వారి పక్కనే ఉండి వారి కండరాల కదలిక ఆగిపోయేంత వరకు వేచి చూడాలి.

ఫొటో సోర్స్, Getty Images
- వారు కదలడం ఆగిపోగానే - వారిని రికవరీ పొజిషన్‌లో (పైన బొమ్మలో చూపినట్టుగా) ఉంచాలి - అంటే ఒక పక్కకు తిప్పి పడుకోబెట్టాలి. నోటి నుంచి నురగ వస్తే తుడిచి, వారికి గాలి ఆడేలాగా తల పక్కకు తిప్పి కొద్దిగా పైకి ఎత్తి పెట్టి, నురగ శ్వాస నాళంలోకి వెళ్లకుండా చూడాలి.
- ఫిట్స్ ఆగిపోగానే వారికి మత్తుగా అనిపించి, నిద్ర వస్తుంది. కొందరికి అయోమయంగా, ఎక్కడ ఉన్నారో అర్థం కాకుండా, గందరగోళంగా ఉంటుంది. వారిని కాసేపు విశ్రాంతి తీసుకోనివ్వాలి. వారు స్పృహలోకి వచ్చాక, ఏం జరిగిందో, ఎక్కడ ఉన్నారో వివరించి చెప్పాలి. వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి, వారిని సురక్షితమైన చోటుకు చేర్చాలి.

ఫొటో సోర్స్, Getty Images

అంబులెన్సు లేదా హాస్పిటల్‌కు వెళ్లడం ఎప్పుడు అవసరం?
అప్పటికే ఫిట్స్ ఉందని తెలిసిన వ్యక్తికి, ఎపుడైనా ఓసారి ఫిట్స్ వచ్చి తగ్గిపోతే కంగారు పడాల్సిన పనిలేదు. పైన చెప్పిన జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది.
ఫిట్స్ మొదటిసారి వచ్చినా, ఐదు నిమిషాలైనా ఆగకుండా వస్తూనే ఉన్నా, ఒకసారి వచ్చి ఆగకుండా, మళ్లీ మళ్లీ వస్తున్నా అంబులెన్స్ పిలవడం మంచిది.
ఫిట్స్ ఆగి కొన్ని నిమిషాలైనా వ్యక్తి స్పృహలోకి రాకుండా ఉన్నా, ఫిట్స్ ఆగిపోయాక వారి శ్వాసలో ఏదైనా తేడాగా అనిపించినా, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నా వైద్యులను సంప్రదించడం మంచిది.
ఫిట్స్ వచ్చినపుడు వ్యక్తికి / వ్యకి తలకు బలమైన గాయమైనా, నాలుక బాగా గాయపడి రక్తం వస్తున్నా వైద్యుల వద్దకు వెళ్లడం మంచిది.
స్విమ్మింగ్ చేస్తున్నపుడు లేదా బాత్ టబ్‌లో ఉన్నపుడు ఫిట్స్ వచ్చినా అంబులెన్సును పిలవాలి.
వ్యక్తికి షుగర్ ఉండి స్పృహ కోల్పోయినట్లయినా డాక్టర్ల వద్దకు తీసుకెళ్లాలి.
గర్భిణులకు ఫిట్స్ వస్తే వెంటనే డాక్టర్ల వద్దకు తీసుకెళ్లాలి.

ఫొటో సోర్స్, Getty Images
ఫిట్స్ రాకుండా నివారించొచ్చా?
ఫిట్స్ ఉన్న వ్యక్తులు వారికి ఏ కారణంతో ఫిట్స్ వస్తున్నాయో గుర్తించవచ్చు.
చాలామందిలో నిద్రలేమి ముఖ్య కారణంగా కనబడుతుంది. అందుకే వారికి తగినంత నిద్ర ఉండాలి.
మద్యం తీసుకోకూడదు.
కొన్ని రకాల శబ్దాల వల్ల కూడా ఫిట్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. టీవీ లేదా సినిమా థియేటర్లలోని శబ్దాల వల్ల కూడా ఒక్కోసారి ఇలా జరగొచ్చు.
విపరీతమైన ఒత్తిడి కూడా ఒక్కోసారి ఫిట్స్ కి దారి తీస్తుంది. కాబట్టి ఒత్తిడిని తగ్గించుకోవాలి.
ఫిట్స్ ఉన్న వ్యక్తులు డ్రైవింగ్ చేసే ముందు వైద్యుల సలహా తీసుకోవాలి.
కనీసం మూడు, నాలుగు నెలలు ఫిట్స్ రాకుండా ఉంటేనే డ్రైవింగ్ లేదా స్విమ్మింగ్ కు వెళ్లాలి.
నీళ్లలో ఉండగా ఫిట్స్ వస్తే, నీళ్లు ఊపిరితిత్తుల్లోకి చేరి, తీవ్ర ప్రమాదానికి దారితీయొచ్చు.
ఫిట్స్ ఉన్నవారు డాక్టర్ల సూచన మేరకు మందులు వేసుకోవాలి. డాక్టర్లకు చెప్పకుండా వాటిని ఆపకూడదు.
స్టేటస్ ఎపిలెప్టికస్ అనేది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ఇలాంటి వ్యక్తులకు ప్రాణాపాయం ఉంటుంది. అందుకే ఆ పరిస్థితి రాకుండా సరైన వైద్య నిపుణల వద్ద సలహా తీసుకుంటూ మందులు వేసుకోవాలి.
(గమనిక: రచయిత డాక్టర్. వైద్యపరమైన విషయాలను సులభంగా వివరించి అవగాహన కల్పించడానికి రాసిన కథనం మాత్రమే ఇది)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














