నోటి నుంచి దుర్వాసన ఎందుకు వస్తుంది, దాన్ని ఆపడం ఎలా?

నోటి దుర్వాసన, పళ్లు తోముకోవడం, జీర్ణాశయ సమస్యలు, చిగుళ్ల వాపు, డెంటిస్ట్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నోటిలోని బ్యాక్టీరియా వల్ల నోటి నుంచి దుర్వాసన వస్తుంది.

నోటి దుర్వాసన కారణంగా ఎదుటి వారితో మాట్లాడేందుకు ఇబ్బంది పడుతున్నారా? మాట్లాడేటప్పుడు నోటికి చెయ్యి అడ్డుగా పెట్టుకుంటున్నారా?

ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

ఎందుకంటే ఇది సర్వ సాధారణం. దీనికి పరిష్కారాలు ఉన్నాయి.

బ్యాక్టీరియా నుంచి పళ్లను శుభ్రంగా ఉంచుకోవడం అనేది నిరంతరం సాగే పోరాటం.

నోటిలోని చిగుళ్లు, పళ్ల సందుల్లో, నాలుక పై భాగంలో బ్యాక్టీరియా తిష్ట వేసి ఉంటుంది.

మీరు ఈ బ్యాక్టీరియాను తొలగించకపోతే అది అనేక రెట్లు పెరిగి చిగుళ్ల వ్యాధికి దారి తీస్తుంది.

దీన్ని నివారించడానికి మార్గాలు ఉన్నాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
నోటి దుర్వాసన

ఫొటో సోర్స్, Getty Images

దుర్వాసనకు కారణమేంటి?

దుర్వాసనకు ప్రధాన కారణాల్లో ఒకటి పీరియోడోంటిటిస్ దీన్నే చిగుళ్ల వ్యాధి అని కూడా అంటారు.

"పెద్దవాళ్లలో సగం మందికి ఏదో ఒక రకమైన చిగుళ్ల వ్యాధి ఉంది" అని బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్‌హామ్‌లో రిస్టోరేటివ్ డెంటిస్ట్రీలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న డాక్టర్ ప్రవీణ్ శర్మ బీబీసీతో చెప్పారు.

"నోటి దుర్వాసన నోటిలోనుంచే వస్తుంది" అని ఆయన చెప్పారు.

"90శాతం దుర్వాసన నోటి నుంచే వస్తుంది. మిగిలిన 10శాతం చెడు వాసనకు వేరే కారణాలు ఉండవచ్చు" అని డాక్టర్ ప్రవీణ్ శర్మ అన్నారు.

"డయాబెటిస్‌ను నియంత్రించలేకపోతే, అదొక నిర్ధిష్టమైన వాసనను పంపిస్తుంది" అని చెప్పారు.

"జీర్ణాశయ సమస్యలు, పొట్టలో ఆమ్లాలు వంటి వ్యాధులు ఉన్న వారిలో ఒక రకమైన పుల్లటి వాసన వస్తుంది. కాబట్టి నోటిలో పేరుకుపోయిన బ్యాక్టీరియా వల్ల వివిధ రకాల వ్యాధులు వస్తుంటాయి" అని ఆయన వివరించారు.

అయితే, దీని గురించి ఏం చేయవచ్చు?

నోటి దుర్వాసన, పళ్లు తోముకోవడం, జీర్ణాశయ సమస్యలు, చిగుళ్ల వాపు, డెంటిస్ట్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పళ్ల సందుల్లో ఇరుక్కున్న పదార్ధాలను తొలగించడం చాలా ముఖ్యం.

సమస్యకు మూలాలెక్కడ?

పళ్లు, చిగుళ్ల మధ్య పేరుకుపోయిన బ్యాక్టీరియాను శుభ్రం చేయకపోతే, అది చిన్న చిన్న గాయాలకు దారి తీస్తుంది.

తర్వాత చిగుళ్ల నుంచి రక్తం కారుతుంది. దీన్ని గింగివైటిస్ అంటారు.

చిగుళ్ల వ్యాధికి ఇది ఆరంభ దశ. మంచి విషయం ఏంటంటే దీన్ని నివారించవచ్చు.

"చిగుళ్ల వాపును గింగివైటిస్ అంటారు. మీరు పళ్లు తోముతున్నప్పుడు చిగుళ్లు ఎర్రగా మారి, వాచి, వాటి నుంచి రక్తం కారుతూ ఉంటుంది. ఇది పీరియోడోంటిటిస్ దారి తీస్తుంది" అని డాక్టర్ శర్మ చెప్పారు.

పళ్లు తోమేటప్పుడు మీ చిగుళ్లు ఎర్రగా ఉన్నాయా, రక్తం కారుతున్నాయా, వాచి ఉన్నాయా అనేది చెక్ చేసుకోండి. అలా ఉంటే ఆందోళన చెందకండి. ఎందుకంటే ఈ దశలో దాన్ని నివారించవచ్చు.

"రోగులు ఏం చేస్తారంటే, బ్రష్ చేసేటప్పుడు నొప్పిగా ఉన్న చిగుళ్లపై బ్రషింగ్ చేయడాన్ని ఆపేస్తారు. ఎందుకంటే నొప్పిగా ఉన్న చిగుళ్లపై బ్రష్‌తో రుద్దడం వల్ల రక్తం కారడం, నొప్పి పెరగడం లాంటి సమస్యలు ఏర్పడతాయని అనుకుంటారు" అని డాక్టర్ శర్మ వివరించారు.

"ఇది పూర్తిగా విరుద్ధం. రక్తం కారుతున్న చిగుళ్లను మీరొక సంకేతంలా భావించాలి. ' నేనిప్పుడు కాస్త మెరుగ్గా బ్రషింగ్ చేయాలి. ఎందుకంటే ఇంతకు ముందు వదిలేశాను కదా' అని అనుకోవాలని ఆయన చెప్పారు.

నోటి దుర్వాసన, పళ్లు తోముకోవడం, జీర్ణాశయ సమస్యలు, చిగుళ్ల వాపు, డెంటిస్ట్
ఫొటో క్యాప్షన్, చిగుళ్ల వ్యాధి వల్ల పళ్లు ఎలా దెబ్బతింటాయో ఈ చిత్రంలో చూడవచ్చు

జాగ్రత్తగా బ్రష్ చేయండి

పళ్లు తోముకోవడానికి నిర్దిష్ట సమయం అవసరం అని డాక్టర్ శర్మ చెప్పారు

"మీరు నోట్లో బ్రష్ పెట్టుకుని వేరే పనులు చేసుకోవడం వల్ల ఉపయోగం లేదు" అని ఆయన అన్నారు.

అద్దం ముందు నిల్చుని పళ్ల మీద దృష్టి పెట్టి బ్రషింగ్ చేసుకోవాలి.

కుడి చేతి వాటం ఉన్నవారు తమకు తెలియకుండానే తమ ఎడమవైపు పళ్లను ఎక్కువసేపు తోముతారు.

అలాగే ఎడమ చేతి వాటం ఉన్న వారు కుడి వైపు ఉన్న పళ్లను ఎక్కువసేపు తోముతారు. దీని వల్ల కుడి చేతి వాటం ఉన్న ఉన్న వారికి కుడి వైపున, ఎడమ చేతి వాటం ఉన్న వారికి ఎడమ వైపున చిగుళ్లు వాచే పరిస్థితి వస్తుంది.

మీరు ఏ చేతిని ఉపయోగిస్తున్నా సరే, నోట్లో రెండు వైపులా సమానంగా దృష్టి పెట్టి మొత్తం పళ్లను శుభ్రం చేయాలి.

బ్రష్‌తో పళ్లను తోమడం గురించి తెలుసుకోండి.

ముందుగా ఇంటర్‌- డెంటల్ క్లీనింగ్‌తో ప్రారంభించాలని డాక్టర్ శర్మ సూచిస్తున్నారు.

"పళ్ల మీద పాచి, పళ్ల మధ్య చిక్కుకున్న పదార్ధాలను తొలగించడం వల్ల చిగుళ్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇందుకోసం ఇంటర్‌డెంటల్ బ్రష్‌లను ఉపయోగించాలి" అని ఆయన చెప్పారు.

నోటి దుర్వాసన, పళ్లు తోముకోవడం, జీర్ణాశయ సమస్యలు, చిగుళ్ల వాపు, డెంటిస్ట్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పళ్ల మధ్య పేరుకుపోయిన పాచి, బ్యాక్టీరియాను శుభ్రం చేయడంలో ఇంటర్‌డెంటల్ బ్రష్‌లు సాయపడతాయి.

ఇంటర్‌డెంటల్ బ్రష్‌లను ఉపయోగించిన తర్వాత బ్రష్‌తో ఒక పద్దతి ప్రకారం పళ్లను తోముకోవాలి.

అయితే అందుకు తొందర పడకండి.

ప్రతీ పంటికి మూడు ఉపరితలాలు ఉంటాయని గుర్తుంచుకోండి. బయటకు కనిపించేవి, నమిలేవి, లోపలి వైపు. ఒక పంటి మూడు వైపుల్ని జాగ్రత్తగా శుభ్రం చేయాలి. ఇది చాలా మందికి ఆశ్చర్యంగా అనిపించవచ్చు. మీరు మీ పళ్లను తోమడానికి తక్కువలో తక్కువ రెండు నిముషాల సమయం కేటాయించాలి.

అనేకమంది చేతిలో టూత్ బ్రష్ పట్టుకుని దాన్ని 90 డిగ్రీల్లో నోట్లో పళ్లపై పెట్టి ముందుకు వెనక్కు రుద్దుతుంటారు. దీని వల్ల చిగుళ్లు వాచే ప్రమాదం ఉంది. టూత్‌ బ్రష్‌ను 45 డిగ్రీల కోణంలో పట్టుకుని పళ్లపై నిదానంగా రుద్దండి.

కింది దంతాల కింద ఉన్న చిగుళ్ల వరుస మీదకు, ఎగువ దంతాలపై ఉన్న చిగుళ్ల మీదకు బ్రష్‌ బ్రసెల్స్‌ వెళ్లేలా రుద్దండి.

దీని వల్ల చిగుళ్ల వరుసలో దాగి ఉన్న బ్యాక్టీరియా కూడా తొలగిపోతుంది.

నోటి దుర్వాసన, పళ్లు తోముకోవడం, జీర్ణాశయ సమస్యలు, చిగుళ్ల వాపు, డెంటిస్ట్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పళ్లను ఎలా తోముకోవాలో పిల్లలకు అర్థం అయ్యేలా వివరించాలి.

సరైన సమయంలో బ్రష్ చేసుకోండి

భోజనం చేసిన తర్వాత పళ్లు తోముకోవడం మంచిదని మనలో అనేక మందికి చెప్పారు. అయితే ఒకసారి ఆలోచించండి.

"సాధారణంగా, మీరు ఉదయం అల్పాహారం తీసుకోవడానికి ముందు బ్రష్ చేసుకోవాలి. మీరు కొంత ఆహారం తీసుకున్న తర్వాత బ్రష్ చేయకూడదు. ఎందుకంటే మీరు తిన్న ఆహారం దంతాల మీద ఖనిజ పదార్ధాలు, ఎనామిల్, డెంటీన్‌ను మృదువుగా చేస్తుంది"

ఆహారంలో ఆమ్లం పంటి ఉపరితలం మీద సురక్షిత ఎనామెల్‌ను ఏర్పరుస్తుంది. డెంటిన్‌ను మృదువుగా మారుస్తుంది. ఆహారం తీసుకున్న వెంటనే బ్రష్ చేయడం వల్ల పంటి మీద ఎనామిల్ దెబ్బ తింటుంది.

"బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత బ్రష్ చేయాలనుకుంటే, బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడానికి, బ్రష్ చేయడానికి మధ్య కొంత సమయం వదిలి పెట్టాలి" అని డాక్టర్ శర్మ వివరించారు.

బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత నోటిలో నీళ్లు పోసి పుక్కిలించి కాసేపు ఆగాలి.

అలాగే ప్రతి రోజూ రెండు నిమిషాల పాటు పళ్లు తోముకోవడం మంచిది. కొంతమంది సరిగ్గా రోజుకు ఒకసారి మాత్రమే బ్రష్ చేసుకుంటే సరిపోతుందని భావిస్తారు. మీరు నిద్రపోయేటప్పుడు, మీ నోట్లో లాలాజలం ఊట తగ్గిపోతుంది. దీంతో రాత్రి పూట బ్యాక్టీరియా విస్తరించడం పెరుగుతుంది. మీరు రోజుకు ఒక్కసారి మాత్రమే పళ్లు తోముకోవాలని భావిస్తే రాత్రి పూట తోముకోవడం ఉత్తమం.

మంచి వాటిని ఎంచుకోండి

బ్రష్‌కుండే బ్రసిల్స్ గట్టిదనం మధ్యస్థంగా ఉంటే చాలు. టూత్ ‌పేస్టులు ఖరీదైనదై ఉండాల్సిన అవసరం లేదు. "అందులో ఫ్లోరైడ్ ఉంటే చాలు" అని డాక్టర్ శర్మ చెప్పారు.

ఫ్లోరైడ్ పళ్ల మీద ఉండే ఎనామిల్ పొరను గట్టి పరుస్తుంది. పాచి పట్టకుండా అడ్డుకుంటుంది. చిగుళ్ల వ్యాధి ఉన్నట్లు సంకేతాలు కనిపిస్తుంటే తరచుగా నీటితో నోటిని శుభ్రం చేసుకోవడం మంచిది. దీని వల్ల పాచి, బ్యాక్టీరియా పెరగడం తగ్గుతుంది. అయితే బ్రషింగ్ తర్వాత అలా చేయడం వల్ల టూత్‌పేస్ట్‌లోని ఫ్లోరైడ్ కూడా వెళ్లిపోతుంది.

పళ్లు పాడవడానికి కారణాలు తీపి పదార్థాలు, డ్రింక్స్ ఎక్కువ తీసుకోవడం

ఫొటో సోర్స్, Getty Images

చిగుళ్ల వ్యాధి తీవ్రతను గుర్తించండి

చిగుళ్ల వాపు పెరిగే కొద్దీ, పళ్ల మధ్య గ్యాప్ పెరగడాన్ని మీరు గుర్తించవచ్చు. దీంతో పంటిని పట్టి ఉంచే ఎముక క్షీణిస్తుంది. ఫలితంగా దంతం వదులవుతుంది. ఈ పరిస్థితిని నియంత్రించలేకపోతే, ఎముక క్షీణించడం ఏ స్థాయికి చేరుతుందంటే పన్ను ఊడిపడిపోతుంది.

నోటి నుంచి నిరంతరం దుర్వాసన వస్తుండటాన్ని మీరు గమనించవచ్చు.

ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే పళ్ల డాక్టర్‌ను సంప్రదించండి.

చివరిగా, మీ నోటి నుంచి వాసనను మెరుగుపరచుకోవడానికి కొన్ని టిప్స్.

అవేంటంటే

ఎక్కువగా నీరు తాగండి. ఎందుకంటే నోరు ఎండిపోతే బ్యాక్టీరియా పెరుగుతుంది.

నాలుకను నాలుక బద్దతో శుభ్రం చేసుకోండి.

ఇలా చేయడం వల్ల నోట్లో దుర్వాసనకు దారి తీసే అంశాలైన నాలుక మీద ఆహార పదార్ధాలు, మృత కణాలు తొలగిపోతాయి.

మీ నోటి నుంచి చక్కటి వాసన వస్తోందో లేదో మీకు తెలియకపోతే మీ స్నేహితుడు లేదా కుటుంబ సభ్యుడి ముందు గాలి ఊది వారిని అడిగి తెలుసుకోండి.

అయితే ఎవరిని అడగాలో జాగ్రత్తగా ఎంచుకుని నిర్ణయం తీసుకోండి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)