కొమ్ము కోనాం: 'సముద్రంలోకి మనిషిని లాక్కెళ్లిన చేప'

ఫొటో సోర్స్, UGC
- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
చేప కోసం వల వేసిన మత్స్యకారుడిని.. ఆ చేపే సముద్రంలోకి లాగేసిన సంఘటన అనకాపల్లి జిల్లాలో వెలుగుచూసింది.
''వలకి చిక్కిన కొమ్ము కోనాం చేపని లాగుతుండగా.. ఆ చేపే బలంగా యర్రయ్యని సముద్రంలోకి లాగేసింది'' అని ప్రత్యక్ష సాక్షి, గల్లంతైన వ్యక్తితో కలిసి వేటకి వెళ్లిన యల్లాజీ బీబీసీతో చెప్పారు.
జులై 2న ఉదయం వేటకు వెళ్లిన చోడుపిల్లి యర్రయ్య పూడిమడక తీరానికి 25 కిలోమీటర్ల దూరంలో గల్లంతయ్యారు. ఆయన కోసం పూడిమడక తీరంలో కోస్ట్ గార్డ్ హెలికాప్టర్‌తో సెర్చ్ ఆపరేషన్ సాగుతోంది.
"బుధవారం ఉదయం 9 గంటలకు వేట పూర్తి చేసుకుని తీరం వైపు తిరిగొస్తున్న సమయంలో వలకి కొమ్ము కోనాం చిక్కింది. దానిని లాగేందుకు వల బలం సరిపోకపోతే.. వెంటనే యర్రయ్య మరో గేలం వేసి కొమ్ము కోనాం చేపని లాగే ప్రయత్నం చేశాడు. కానీ, కొమ్ము కోనామే బలంగా యర్రయ్యని లోపలికి లాగేసింది. ఇప్పటి వరకు ఆచూకీ దొరకలేదు" అని వాసుపల్లి యల్లాజీ బీబీసీతో చెప్పారు.


ఫొటో సోర్స్, KISHOR
అసలేం జరిగిందంటే..
అచ్యుతాపురం మండలం పూడిమడక గ్రామానికి చెందిన చోడుపిల్లి యర్రయ్య, చోడుపిల్లి కొర్లయ్య, వాసుపల్లి యల్లాజి, గనగళ్ల అప్పలరాజు బుధవారం తెల్లవారుజామున 2 గంటలకు వేటకు బయలుదేరారు. వీరిలో యర్రయ్య, కొర్లయ్య అన్నదమ్ములు.
తీరం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో చేపల వేట సాగించారు. ఉదయం 9 గంటలకు వేసిన వలలను తీసేందుకు ప్రయత్నిస్తుండగా.. వలలో ఏదో చిక్కుకున్నట్లు గుర్తించారు.
"తిరిగి వచ్చేసే సమయానికి దాదాపు 200 కిలోల బరువు ఉండే కొమ్ము కోనాం చేప చిక్కింది. వలకి బలం సరిపోకపోవడంతో వెంటనే యర్రయ్య మరో గేలం ఉన్న తాడుని సపోర్ట్‌గా వేసి దానితో లాగడం మొదలెట్టాడు. కానీ, ఆ చేపే యర్రయ్యను బలంగా నీటి లోపలికి లాగేసింది. మా కళ్ల ముందే యర్రయ్య నీటిలో పడిపోయాడు. అతడి కోసం అరగంటకు పైగా వెతికాం. కానీ, ఆచూకీ దొరకలేదు" అని వాసుపల్లి యల్లాజీ బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, KISHOR
యర్రయ్య సోదరుడు కొర్లయ్య మాట్లాడుతూ ''నా కళ్ల ముందే మా అన్నయ్య గంగలోకి పడిపోయాడు. ఏమయ్యాడో తెలియడం లేదు'' అన్నారు.
"కళ్లముందే తన అన్న గల్లంతు కావడంతో యర్రయ్య తమ్ముడు.. కొర్లయ్య తల్లడిల్లిపోయాడు. దాంతో మేం అక్కడ ఉండలేకపోయాం. పైగా కొమ్ము కోనాం చేపలు కొన్నిసార్లు పడవలో ఉన్నోళ్లకి కూడా ప్రమాదం తీసుకొస్తాయి. అందుకే అక్కడి నుంచి బయలుదేరిపోయాం. వస్తుండగానే గ్రామస్థులకు సమాచారం అందించాం. మిగతా వాళ్లు కూడా అక్కడికి వచ్చారు. సాయంత్రం వరకు వెతికాం. కానీ, ఎలాంటి ప్రయోజనం లేదు" అని యల్లాజీ తెలిపారు.

ఫొటో సోర్స్, KISHOR
విస్తృత గాలింపు..
పూడిమడక తీరంలోని మత్స్యకారులు యర్రయ్య ఆచూకీ కోసం గాలిస్తున్నారు. కొందరు తీరం పొడవునా పడవలపై తిరుగుతూ వెతుకుతుంటే.. మరికొందరు ఎక్కడైతే యర్రయ్య గల్లంతయ్యాడో అక్కడికి వెళ్లి వెతుకుతున్నారు.
చుట్టుపక్కల గ్రామాల మత్స్యకారులు కూడా యర్రయ్య ఇంటికి చేరుకున్నారు. వారు కూడా యర్రయ్యని వెతికేందుకు సాయం చేస్తున్నారు.
"నా బిడ్డే నా కుటుంబానికి ఆధారం. కొర్లయ్య చిన్నోడు. ఇద్దరు ఆడపిల్లలు కూడా ఉన్నారు. వీరందరినీ నేనెలా పోషించాలి" అంటూ కొర్లయ్య తల్లి కోదండమ్మ కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఫొటో సోర్స్, KISHOR
"పూడిమడక పోలీసులకు సమాచారం ఇచ్చాం. కోస్ట్ గార్డు వారికి విషయం తెలియపర్చాం. మూడేళ్ల క్రితం కూడా కొమ్ము కోనాం దాడి చేసిన ఘటనలో పూడిమడక సమీప గ్రామమైన ముత్యాలమ్మపాలెంలోని ఒక మత్స్యకారుడు మరణించాడు" అని పూడిమడక మాజీ సర్పంచ్, మత్స్యకార సంఘం నాయకుడు బాబునాయుడు బీబీసీతో చెప్పారు.
"యర్రయ్య కోసం కోస్ట్ గార్డ్ సెర్చ్ ఆపరేషన్ చేస్తోంది. ఇప్పటికైతే ఇంకా ఆచూకీ దొరకలేదు" అని పూడిమడక మెరైన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ జి.పైడిరాజు తెలిపారు.

ఫొటో సోర్స్, KISHOR
మూడేళ్ల కిందట ఏం జరిగింది?
2022 ఫిబ్రవరిలో, కొమ్ముకోనాం చేప దాడిలో ముత్యాలమ్మపాలేనికి చెందిన జోగన్న మృతి చెందిన ఘటన నమోదైంది.
"వలకు చిక్కిన కోనాం చేప బాగా బరువుగా ఉంది. ఎంత ప్రయత్నించినా రాకపోయే సరికి కిందకెళ్లి దానిని తోయాలనుకున్నాం. జోగన్న ముందుగా కిందకు దిగాడు. అలా దిగీదిగడంతోనే చేప ఒక్కసారిగా బలంగా కొట్టింది. అంతే జోగన్న పడిపోవడం, మా చేతుల్లో ఉన్న వల తాడును వదిలేయడం జరిగిపోయాయి. వెంటనే మేం కిందకు దిగి జోగన్నను పైకి తెచ్చాం. కానీ, అప్పటికే చనిపోయాడు" అని ఆ రోజు జోగన్నతో కలిసి వేటకు వెళ్లిన మరో మత్స్యకారుడు గంగన్న చెప్పారు.
ఈ ఘటనను మూడేళ్ల కిందట బీబీసీ రిపోర్ట్ చేసింది.

ఫొటో సోర్స్, KISHOR
కొమ్ము కోనాం చేపలు ప్రమాదకరమా?
పదునైన కత్తిలాంటి కొమ్మును కలిగి ఉండే కొమ్ము కోనాం చేపలకు దాడి చేసే లక్షణం ఉంటుందని పలువురు మత్స్యకారులు చెప్పారు.
"కొమ్ము కోనాం చేపలు చిక్కితే ఎక్కువ బరువుండటంతో మేం పండగ చేసుకుంటాం, కానీ అది దాడి చేస్తే ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుంది. కొమ్ముకోనాం ప్రాణాలు తీసే చేపే" అని మత్స్యకారుడు రమణబాబు చెప్పారు.
"ఈ కొమ్ముకోనాం వలకు అంత సులభంగా దొరకవు. దొరికినా కొన్నిసార్లు వలను చీల్చుకొని తప్పించుకుంటాయి. ఇవి బరువు ఎక్కువగా ఉండటంతో వలను పైకి లాగలేం. వాటిని లాగే ప్రయత్నంలో... అవి కూడా బలంగా వెనక్కిలాగుతాయి. అప్పుడు మనబలం సరిపోక సముద్రంలోకి పడిపోతుంటాం'' అని రమణబాబు బీబీసీతో అన్నారు.

ఫొటో సోర్స్, KISHOR
కొమ్ముకోనాం కోసం 15 కిలోమీటర్లు దాటాల్సిందే..
ఈ చేపకు డిమాండ్ ఎంత ఉందో.. ప్రమాదం కూడా అంతే ఉందని ఏయూ జువాలజీ విభాగం ప్రొఫెసర్ మంజులత అంటున్నారు.
ఆమె బీబీసీతో మాట్లాడుతూ, "ఇవి ఒక్కొక్కటి 20 నుంచి 250 కేజీల వరకు కూడా ఉంటాయి. పైగా ఇవి ఒక్కొక్కటిగా కాకుండా గ్రూపులుగా తిరుగుతుండటంతో ఒకేసారి పెద్ద మొత్తంలో వలకు చిక్కుతాయి. అయితే, అపాయం అని తలచినప్పుడు కొమ్ముతో తోటి చేపలపైనా, మనుషులపైనా ఇది దాడి చేస్తుంది" అని చెప్పారు.
"మార్కెట్లో ట్యూనా చేపకు డిమాండ్ ఎక్కువ. దాని తర్వాత కొమ్ము కోనాందే మార్కెట్. ఇది ఎక్స్‌పోర్టు కూడా ఎక్కువగా అవుతుంది. ఒక్కోసారి పెద్ద సంఖ్యలో వలకు చిక్కుతుంటాయి. అప్పుడు ఎక్స్‌పోర్టు చేసే వారికి వీటిని అమ్ముతాం. వల నుంచి బయటకు తీయకుండానే దీనిని సైజు ప్రకారం అంచనా వేసి కొనేస్తారు. అంత డిమాండ్ ఉంటుంది" అని విశాఖలోని బోటు యాజమాని దానయ్య బీబీసీతో చెప్పారు.
"తీరం నుంచి సుమారు 15 కిలోమీటర్లు దాటిన తర్వాతే ఈ కొమ్ము కోనాం చేప లభిస్తుంది" అని ప్రొఫెసర్ మంజులత తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














