తల్లి కడుపులోనే తోబుట్టువులను మింగే మెగలొడాన్ షార్క్, ఏమిటి దీని కథ?

మెగలొడాన్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, మిచెల్ మార్షల్
    • హోదా, బీబీసీ న్యూస్

పూర్వం సముద్రాన్ని ఏలిన భారీ సొర చేప ‘మెగలొడాన్‌’తో పోరాడే కథతో మెగ్ అనే హాలీవుడ్ చిత్రం విడుదలైన ఐదేళ్ల తర్వాత దానికి సీక్వెల్ వచ్చింది.

మెగ్, మెగ్2 సినిమాల్లో ఉన్న ఈ సముద్ర జీవి ఒకప్పుడు నిజంగానే ఉంది.

రెండు కోట్ల సంవత్సరాలపాటు మహాసముద్రాలలో భయోత్పాతాన్ని సృష్టించిన ఈ భారీ ప్రాణి 35 లక్షల ఏళ్ల క్రితం అంతరించింది.

ఈ భారీ సొర చేపలు ఎలా జీవించాయి, వేటాడాయనే దానిపై కొత్తగా నిర్వహించిన పరిశోధన మరిన్ని ఆసక్తికర వివరాలు అందించింది.

మెగలొడాన్ దంతలు

ఫొటో సోర్స్, Getty Images

మెగలొడాన్ గురించి ఎప్పుడు తెలిసింది?

మెగలొడాన్స్ గురించి మొదటిసారిగా 1840లో తెలిసింది. ముక్కోణపు ఆకారంలో ఉండే వాటి దంతాల శిలాజ అవశేషాలను శాస్త్రవేత్తలు గుర్తించారు.

మెగలొడాన్ అంటే ప్రాచీన గ్రీకు భాషలో పెద్ద దంతాలని అర్థం.

వీటిలో కొన్నింటి పొడవు 16.8 సెంటీమీటర్లు ఉండేది.

ద గ్రేట్ వైట్ షార్క్ దంతాలు 7.5 సెంటీమీటర్లు ఉంటాయి. దీన్ని బట్టి భారీసొర దంతాలు ఎంత పెద్దవో అర్థం చేసుకోవచ్చు.

మొత్తంగా మెగలొడాన్ సొరచేప సైజు ఎంత ఉంటుందో అర్థం చేసుకోవాలంటే దాని పూర్తి అస్థిపంజరం దొరకాలి. అదింకా దొరకలేదు.

సొర చేపలు కార్టిలాజినస్ చేపల జాతికి చెందినవి. మరోలా చెప్పాలంటే మృదులాస్థి చేప అంటారు. దీనర్థం చేప శరీరాకృతి గట్టి ఎముకలతో కాకుండా మృదువైన నరాలతో నిర్మాణమవుతుంది. అంటే ఇవి పూర్తిస్థాయి శిలాజ అవశేషాలుగా మారలేవు.

ఫలితంగా భారీసొర చేపల శిలాజ అవశేషాల రికార్డుల్లో ప్రధానంగా వాటి దంతాలు, కొంతమేర వాటి వెన్నెపూస వివరాలే అందుబాటులో ఉన్నాయి.

అవి అచ్చంగా ఎలా ఉండేవో ఊహించడం కష్టమని యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ఎకోజియోకెమిస్ట్‌గా పనిచేస్తున్న సోరా కిమ్ అంటున్నారు. ఈమె మెగలొడాన్ దంతాల గురించి అధ్యయనం చేశారు.

ప్రాచీన జంతు శాస్త్రవేత్తలు మెగలొడాన్ దంతాలని మిగిలిన సొరచేపల దంతాల సైజుతో పోల్చి చూస్తున్నారు. దీని ద్వారా పెద్దసొర ఎంత ఉంటుందో అంచనా వేసే ప్రయత్నం చేస్తున్నారు.

దీనివల్ల కచ్చితమైన ఫలితం వస్తుందని చెప్పడానికి లేదు. ఎందుకంటే చిన్న జంతువులను బట్టి, అదే జాతికి చెందిన పెద్ద జంతువుల పరిమాణాన్ని అంచనా వేయలేం. జంతువుల శరీర క్రమం అందుకు అనుకూలించేలా ఒక లెక్క ప్రకారం లేదా ఒక క్రమ పద్ధతిలో ఉండదు.

అందుకే మెగలొడాన్ పరిమాణం విషయంలో వేర్వేరు వాదనలున్నాయి.

మెగలొడాన్

ఫొటో సోర్స్, Getty Images

పొడవు విషయంలో భిన్న వాదనలు

మెగలొడాన్ పొడవు దాదాపుగా 18 నుంచి 20 మీటర్లు ఉండొచ్చని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

అయితే షికాగోలోని డిపాల్ యూనివర్శిటీలో పేలియోబయాలజిస్టుగా పనిచేస్తున్న కెన్షు షిమాద, 2019లో నిర్వహించిన మరో అధ్యయనంలో, పైన చెప్పిన అంచనాలు తప్పని వాదించారు.

షార్క్‌ దంతాలను కొలిచేటప్పుడు పైదంతాలను కొలవడం మంచిదని, అవి 15.3 మీటర్ల కంటే పొడవుగా ఉండవని ఆయన వాదించారు.

ఆ తర్వాతి ఏడాది ఫ్లోరిడా మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ ఇన్ గెయినిస్‌విల్లీలోని విక్టర్ పెరెజ్ బృందం కొత్త వాదన తెరపైకి తెచ్చింది.

పెద్దసొర దంతాల పొడవును పక్కనపెట్టి ఈ బృందం దంతాల వెడల్పును అధ్యయనం చేసింది. దీనివల్ల మెగలొడాన్ నోరు తెరిచినపుడు ఎంత పెద్దగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేశారు.

వీళ్ల అధ్యయనంలో మెగలొడాన్ పొడవు దాదాపుగా 20 మీటర్లు ఉండొచ్చనే అంచనాకు వచ్చారు.

వీళ్ల విశ్లేషణ కొంత నమ్మశక్యంగా ఉందని మెరైన్ పేలియంటాలజిస్ట్ కాటలీన్ పైమియెంటో అన్నారు. ఈమె స్విట్జర్లాండ్‌లోని జురిచ్ యూనివర్శిటీలో పనిచేస్తున్నారు.

భారీ సొర ఈమాత్రం పొడవు ఉండే అవకాశముందని షిమద కూడా అంగీకరిస్తున్నారు.

అంటే దానర్థం ఆధునిక ప్రపంచంలో పెద్దవని భావిస్తున్న సొరచేపలు, ఈ భారీసొర ముందు చాలా చిన్నవిగా ఉంటాయి.

ప్రస్తుతం సముద్ర జీవుల్లో ఇతర జంతువులను చంపి తినే అతిపెద్ద సొరచేప ద గ్రేట్ వైట్ షార్క్. దీని పొడవు 4.9 మీటర్లుగా చెబుతున్నారు.

అంటే దీనికన్నా మెగలొడాన్ మూడు లేదా నాలుగు రెట్లు పొడవుగా ఉంటుంది.

ప్రస్తుత సముద్ర జీవుల్లో భారీ పరిమాణంలో ఉండే తిమింగలం మెగలొడాన్‌కు సమీపంగా ఉండే జంతువు. అయితే తిమింగలం వేటాడే జంతువు కాదు. ఈ రెండు కూడా బలీన్ తిమింగలాల ముందు చాలా చిన్నవే.

అత్యంత పెద్దవైన బ్లూ వేల్స్ కూడా దాదాపు 30 మీటర్ల పొడవు ఉంటాయి.

అంటే మెగలొడానే అత్యంత పెద్ద జంతువని చెప్పడానికి లేదు. బహుశా సొరచేపల్లో ఇదే పెద్దది కావొచ్చు. ఇతర పెద్ద జంతువులను తినేసే అతిపెద్ద సొరచేప ఇదొక్కటే అయుండొచ్చు.

చేపలు

ఫొటో సోర్స్, Getty Images

సూపర్ ప్రిడేటర్

మెగలొడాన్ పళ్లను బట్టి ఇతర జంతువులను తింటుందని చెప్పగలం. అయితే ఎలాంటి జంతువులను వేటాడి తింటుంది? ఈ విషయాలను తెల్సుకునేందుకు పరిశోధకులు మెగలొడాన్ దంతాలపైన రసాయనాల అధ్యయనం చేశారు.

అందులో ఒకటి నైట్రోజన్‌కు సంబంధించింది. ఒక జంతువులో ఉండే నైట్రోజన్ అది తినే ఆహారంలో ఉన్న ప్రొటీన్ నుంచి వస్తుందని తెలుసుకున్నారు.

దీన్ని బట్టి చూస్తే... ఎక్కువ ఆహారం తినే జంతువుల్లో, వాటి దంతాలలో కూడా ఎక్కువ నైట్రోజన్ ఉంటుంది.

2022లో నిర్వహించిన అధ్యయనంలో మెగలొడాన్ దంతాల్లో ఎక్కువ శాతం నైట్రోజన్ ఉందని పరిశోధకులు తేల్చారు. వారిలో కిమ్ కూడా ఉన్నారు.

అంటే దీనర్థం భారీ సైజులో ఉండే ఆధునిక కిల్లర్ వేల్స్‌ను సైతం తినగలిగే సముద్ర జీవి మెగలొడాన్ అని చెప్పవచ్చు.

2022లో నిర్వహించిన మరో అధ్యయనంలో షిమద, కిమ్ ఇద్దరూ – జింక్ ఐసోటోప్స్‌ని అధ్యయనం చేశారు. మెగలొడాన్‌లు కొంతమేర ద గ్రేట్ వైట్ షార్క్ చేపల్లా అనిపిస్తున్నాయని భావించారు.

చిన్న- పెద్ద మెగలొడాన్‌ మధ్య ఉన్న తేడా ఇలాంటి అనిశ్చితికి కారణం కావచ్చని పిమియెన్‌టో చెప్పారు

గ్రేట్ వైట్ షార్క్‌లలో చిన్నవి ఎక్కువగా చేపల్ని తింటాయి. పెద్దవి సముద్ర జంతువుల్ని తింటాయి. మెగలొడాన్‌ల విషయంలోనూ ఇలాగే జరిగి ఉండవచ్చు.

ఇక భారీసొర చేపల సంతానోత్పత్తి గురించి 2020లో జరిపిన అధ్యయనంలో కొన్ని విషయాలను తెల్సుకున్నారు. షిమాదా బృందం ఈ పరిశోధన చేశారు.

పుట్టిన తర్వాత రెండు మీటర్లు ఉన్న ఓ జంతువుపైనా వాళ్లు అధ్యయనం చేశారు. భారీ పరిమాణంలో ఉండే ఈ చేప అనేక ఇతర చేపల మాదిరిగా గుడ్డు రూపంలో బయటకు రాకుండా తల్లి కడుపులోనే ఉంది. అంటే మెగలొడాన్ కడుపులోనే పిల్లల్ని పొదుగుతుంది.

తల్లి కడుపులో పిండం దశలో ఉండగానే ఇతర గుడ్లను తినేసి ఈ సొర చేప భారీగా ఎదుగుతుందని శాస్త్రవేత్తల బృందం చెబుతోంది. ఈ విషయం షాకింగ్‌గా ఉన్నా, ఆటవికంగా కనిపిస్తున్నా ఆధునిక సొరచేపల్లో సాధారణమేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

వెచ్చని రక్తం

మెగలొడాన్‌లో కొన్ని ప్రత్యేక శారీరక సామర్థ్యాలున్నాయి.

పిమియంటే బృందం 2022లో పెద్దసొరచేప అరుదైన, పూర్తి స్థాయి వెన్నెముకను స్కాన్ చేశారు. దాని సాయంతోమొత్తం మెగలొడాన్ ఆకారాన్ని తిరిగి నిర్మించే ప్రయత్నం చేశారు.

ఈ నిర్మాణం ఆధారంగా మెగలోడన్‌కి ఈదడంలో నైపుణ్యం ఉందని, సుదూర దూరాలను కూడా త్వరగా చేరగలదని తేల్చారు. ఇది సెకనుకు 1.4 మీటర్ల (గంటకు 3 మైళ్లవేగం) వేగంతో ప్రయాణిస్తుందని....ప్రస్తుతం ఉన్న షార్క్‌ల ప్రయాణ వేగం కంటే ఇది ఎక్కువనే అంచనాకొచ్చారు

తాము రూపొందించిన ఆకారం ద్వారా పొట్ట సైజుని కూడా ఈ బృందం అంచనా వేసింది. మెగలోడన్ చాలా వెడల్పుగా నోరు తెరవగలదని, పెద్ద పెద్ద జంతువుల్ని కూడా తినేయగలదని పిమియెంటో చెప్పారు.

పెద్ద మెగలొడాన్ ఓర్కా పరిమాణంలో ఉండే జలచరాన్ని చాలా తేలిగ్గా నమిలేయగలదు. ఇలాంటి ఆహారంతో చాలా రోజులు ఆహరం లేకున్నాఉండగలదు. మెగలోడాన్ ఒక్కసారి వేటాడినా.. చాలా దూరం ప్రయాణించగలదని శాస్త్రవేత్తలు చెప్పారు.

వీటన్నిటినీ బట్టి – మెగలొడాన్ మహాసముద్రాల మద్య తిరుగుతూ ఇతర జంతువులను వేటాడుతూ తిరిగే భారీ జలచరం అని పిమియెంటో బృందం చెబుతున్నారు.

చురుకైన జీవన విధానం కారణంగా వీటి శరీరంలో ప్రవహించే రక్తం వెచ్చగా ఉంటుంది. దీని వల్ల అవి వేగంగా ఈదగలవు, చల్లని నీటిలోకి కూడా వెళ్లగలవు.

అయితే అవి లక్షల సంవత్సరాల క్రితమే అంతరించిపోయాయి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)