మహిళల ఫుట్‌బాల్ ప్రపంచ కప్: ఫైనల్స్‌ గెలిచాక స్పెయిన్ కెప్టెన్ ఓల్గా కర్మోనాకు ఆమె తండ్రి మరణించిన సంగతి చెప్పారు...

ఓల్గా కర్మోనా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రపంచ కప్ ఫైనల్‌లో ఉన్నత క్రీడాకారిణిగా సత్కారం పొందిన 23 ఏళ్ల ఓల్గా కర్మోనా

ఓల్గా కర్మోనా తన గోల్‌తో స్పెయిన్‌కు ఫిఫా మహిళల ప్రపంచ కప్ టైటిల్‌ను అందించింది. అయితే ఈ సంతోషం స్పెయిన్ కెప్టెన్ ఓల్గా కర్మోనాకు ఎంతో సేపు నిలవలేదు.

ఫైనల్ మ్యాచ్ గెలుచుకున్న తర్వాత ఆమె తన తండ్రి మరణవార్తను వినాల్సి వచ్చిందని స్పెయిన్ సాకర్ ఫెడరేషన్ తెలిపింది.

అయితే, ఓల్గా కర్మోనా తండ్రి ఎప్పుడు మరణించారు, ఏ కారణంతో ఆయన మృతి చెందారన్న వివరాలను స్పెయిన్ సాకర్ ఫెడరేషన్ వెల్లడించలేదు.

‘‘ప్రపంచకప్ ఫైనల్ అయిపోయిన తర్వాత సాకర్ క్రీడాకారిణి ఈ మరణవార్తను విన్నారు’’ అని సోషల్ నెట్‌వర్క్ సైట్లలో ఈ ఫెడరేషన్ ప్రకటించింది.

‘‘తీవ్ర బాధాకరమైన ఈ క్షణాల్లో ఓల్గాకు, ఆమె కుటుంబానికి మా తరఫున హృదయపూర్వమైన ఓదార్పును అందిస్తున్నాం. ఓల్గా మేం నిన్నెంతో ప్రేమిస్తున్నాం. స్పెయిన్ ఫుట్‌బాల్‌లో మీరు చరిత్ర సృష్టించారు’’ అని ఓల్గా తండ్రి మరణం పట్ల ఈ ఫెడరేషన్ సంతాపం వ్యక్తం చేసింది.

ఆటకి ముందు ఓల్గాకు ఈ విషయం చెప్పకూడదని ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు నిర్ణయించినట్లు స్పెయిన్ అవుట్‌లెట్ రెలెవో తెలిపింది.

ఆమె కేవలం ఫైనల్ మ్యాచ్‌పైనే దృష్టిసారించాలని వారు భావించారు.

మ్యాచ్ ముగిసేంత వరకు కూడా వారు ఈ విషయాన్ని ఓల్గాకు తెలియకుండా ఉంచారు.

ఆమె తల్లి, తోబుట్టువులు మ్యాచ్ చూసేందుకు, ఆమెకు ప్రోత్సాహాన్ని అందించేందుకు ఆస్ట్రేలియాకు వచ్చారు.

ఓల్గా కర్మోనా

ఫొటో సోర్స్, Getty Images

స్నేహితురాలి తల్లి మరణానికి నివాళి

అయితే, మ్యాచ్ గెలుచుకున్న తర్వాత తన స్నేహితురాలి తల్లి మరణానికి నివాళిని అర్పిస్తూ తన గోల్‌ను సెలబ్రేట్ చేసుకుంటున్నట్లు ఈ క్రీడాకారిణి తెలిపారు.

అండర్‌షర్ట్‌పై రాసుకున్న ‘మెర్చి’ అనే తన స్నేహితురాలి పేరును మ్యాచ్ గెలుచుకున్న తర్వాత అందరికీ చూపించారు.

ఈ గెలుపు తన స్నేహితురాలికి అంకితం చేస్తున్నట్లు చెబుతూ ఆమె మ్యాచ్ చివరిలో భావోద్వేగానికి గురయ్యారు.

కానీ, ఆ సమయంలో ఈ స్పెయిన్ క్రీడాకారిణికి తన తండ్రి మరణ వార్త గురించి తెలియదు. ఆయన కూడా అప్పటికే అనారోగ్యంతో ఉన్నారు.

ఓల్గాకు, ఆమె కుటుంబానికి సంతాపం తెలియజేసిన రియల్ మాడ్రిడ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఓల్గాకు, ఆమె కుటుంబానికి సంతాపం తెలియజేసిన రియల్ మాడ్రిడ్

మ్యాచ్‌లో ఉత్తమ ప్రదర్శన ఓల్గాదే...

29వ నిమిషంలో ఎడమ కాలితో తన్నిన షాట్‌తో ఓల్గా కర్మోనా గోల్ చేశారు. దీంతో సిడ్నీలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై 1-0తో స్పెయిన్ విజయం సాధించింది .

సెమీ ఫైనల్లో కూడా 2-1 తేడాతో స్వీడన్‌ను ఓడించి స్పెయిన్ ప్రపంచ కప్ ఫైనల్‌కి చేరుకుంది.

89వ నిమిషంలో ఓల్గా కర్మోనా రెండో గోల్ చేసి, తమ జట్టును ఫైనల్‌కి చేర్చింది. 2015లో కర్లీ లాయిడ్(అమెరికా) తర్వాత ఒకే ప్రపంచ కప్‌లో సెమీఫైనల్లో, ఫైనల్లో గోల్ చేసిన క్రీడాకారిణిగా ఓల్గా కర్మోనా గుర్తింపు పొందింది.

ఫైనల్ మ్యాచ్‌లో 23 ఏళ్ల ఓల్గా కర్మోనాను ఉన్నత క్రీడాకారిణిగా సత్కరించారు.

‘‘ప్రపంచ కప్‌కి ముందు, ఈ టీమ్ ఏదో ప్రత్యేకతను చాటుకుంటుందని అందరూ గుర్తించినట్లు నేను భావించాను’’ అని ఫైనల్ మ్యాచ్ గెలుపు తర్వాత కర్మోనా తెలిపారు.

స్పెయిన్ ప్రొఫెషనల్ ఫుట్‌బాట్ క్లబ్ రియల్ మాడ్రిడ్ ఆదివారం రాత్రి ఓల్గా తండ్రి మరణ వార్తపై ఓ ప్రకటనను విడుదల చేసింది.

ఆమెకు, తన కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నట్లు పేర్కొంది.

వీడియో క్యాప్షన్, బలవంతపు ‘ముద్దు’పై భగ్గుమన్న స్పెయిన్...

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)