వెస్టిండీస్: ప్రపంచ క్రికెట్‌ను శాసించిన ఈ జట్టు వరల్డ్ కప్ 2023కి ఎందుకు అర్హత సాధించలేకపోయింది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, శివకుమార్ ఉలగనాథన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో శనివారం స్కాట్లాండ్ జట్టు చేతిలో వెస్టిండీస్ ఏడు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఈ ఓటమితో వెస్టిండీస్ ప్రపంచకప్ 2023 రేసు నుంచి నిష్క్రమించింది.
ఒకప్పుడు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన విండీస్ జట్టు పరిస్థితిపై విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
48 ఏళ్ల ప్రపంచకప్ టోర్నీ చరిత్రలో వెస్టిండీస్ తొలిసారి అర్హత సాధించలేకపోయింది.
2023 వన్డే ప్రపంచ కప్ షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) జూన్ 27న విడుదల చేసింది.
ఈ టోర్నమెంట్ 2023 అక్టోబర్ 5 నుంచి ఇండియాలో జరుగుతుంది.
ఐసీసీ ప్రపంచకప్ క్వాలిఫయర్స్ మ్యాచ్‌లపై కూడా ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు.
క్వాలిఫయర్స్‌లో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు మాత్రమే ప్రపంచకప్‌లో ఆడగలవు.
శ్రీలంక జట్టు ఆదివారం ప్రపంచ కప్‌కు అర్హత సాధించింది. శనివారం వరకు వెస్టిండీస్ జట్టుకు కూడా అవకాశం దక్కుతుందని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు.
స్కాంట్లాండ్ చేతిలో ఓడిపోవడంతో విండీస్ ఆశలు ఆవిరయ్యాయి.
వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌లో నెదర్లాండ్స్‌తో జరిగిన అతి ముఖ్యమైన మ్యాచ్‌లో వెస్టిండీస్ 374 పరుగులు చేసినప్పటికీ మ్యాచ్‌ను కాపాడుకోలేకపోయింది.
వన్డే ప్రపంచకప్‌లో వెస్టిండీస్ జట్టు లేకపోవడం ఇదే తొలిసారి. ఈ జట్టు నిరుడు ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 ప్రపంచకప్‌కు కూడా అర్హత సాధించలేకపోయింది.

ఫొటో సోర్స్, Getty Images
ఒకప్పుడు అజేయమైన జట్టు
వెస్టిండీస్ జట్టు 1975, 1979లలో వరుసగా రెండుసార్లు ప్రపంచకప్ గెలిచింది.
1983లో వరుసగా మూడోసారి ఫైనల్ చేరగా భారత జట్టు విండీస్‌ను ఓడించింది.
దీని తర్వాత ఈ జట్టు ప్రపంచకప్ ఫైనల్‌కు చేరుకోలేకపోయింది.
1996లో సెమీ-ఫైనల్ దశకు చేరుకుంది. చాలా టోర్నీలలో విండీస్ జట్టు మొదటి రౌండ్‌లోనే ఓడిపోవడమో, లేదా క్వార్టర్‌లో టోర్నీ ముగించడమో జరుగుతోంది.
1970, 1980లలో విండీస్‌ను ప్రతి ఫార్మాట్‌లో బలమైన జట్టుగా పరిగణించేవారు. ముఖ్యంగా ఆ రోజుల్లో వన్డే మ్యాచ్‌లలో విండీస్ దూకుడైన ఆట తీరు భిన్నమైన గుర్తింపు తీసుకువచ్చింది.
ఎలాంటి పరిస్థితిలోనైనా విండీస్ బ్యాటింగ్ ఆర్డర్ బాగా రాణించేది. వివియన్ రిచర్డ్స్, డెస్మండ్ హేన్స్, గోర్డాన్ గ్రీనిడ్జ్, లోగీ, రిచర్డ్‌సన్, బ్రియాన్ లారా ప్రపంచవ్యాప్తంగా చాలా మంది బౌలర్లపై ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. 1980, 1990లలో ఈ జట్టుకు ఏ లక్ష్యాన్ని చేధించడమైనా కష్టం కాదని క్రికెట్ ప్రేక్షకులు నమ్మేవారు.
ఈ జట్టులో అత్యంత ప్రమాదకరమైన ఫాస్ట్ బౌలర్లూ ఉన్నారు.
జోయెల్ గార్నర్, మైఖేల్ హోల్డింగ్, ఆండీ రాబర్ట్స్, మాల్కం మార్షల్, కర్ట్లీ ఆంబ్రోస్, కోర్ట్నీ వాల్ష్, ఇయాన్ బిషప్ వంటి ఫాస్ట్ బౌలర్లు అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లను కూడా భయపెట్టారు.
అప్పటి జట్టులో కార్ల్ హూపర్, రోజర్ హార్పర్ రూపంలో అద్భుతమైన ఆల్‌రౌండర్లు కూడా ఉన్నారు. జెఫ్ డుజోన్ ఉత్తమ వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ కూడా, అతను అనేక మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌లు ఆడాడు.

ఫొటో సోర్స్, Getty Images
భారత్‌పై టెస్టు మ్యాచ్ గెలిచి 21 ఏళ్లు
1990ల చివరి నుంచి వెస్టిండీస్ క్రికెట్‌లో మార్పులు మొదలయ్యాయి.
గత రెండు దశాబ్దాలుగా కొన్ని విజయాలు, రికార్డులు మినహా విండీస్ ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉంది. వన్డే క్రికెట్‌లోనే కాకుండా టెస్టు క్రికెట్‌లోనూ ఆ జట్టు తన ప్రాభవాన్ని కోల్పోయింది.
2012, 2016 సంవత్సరాల్లో విండీస్ రెండుసార్లు టీ20 ప్రపంచకప్ గెలిచినా ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. ఆ తర్వాత టీ20 క్రికెట్‌లో విండీస్ ప్రదర్శన పేలవంగా ఉంది.
వెస్టిండీస్ జట్టు ప్రస్తుత ప్రదర్శనను పరిశీలిస్తే ప్రస్తుత ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో 8వ స్థానంలో ఉంది.
అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో 10వ స్థానంలో, టీ20 క్రికెట్‌లో 7వ స్థానంలో కొనసాగుతోంది.
2002లో జమైకాలో భారత జట్టుపై విండీస్ టెస్టు మ్యాచ్ గెలిచిన తర్వాత మళ్లీ టీమిండియాను ఓడించలేదు. ఈ సిరీస్ తర్వాత విండీస్‌పై భారత్ 8 టెస్టుల్లో విజయం సాధించింది.
ఆస్ట్రేలియాతో మ్యాచుల్లోనూ వెస్టిండీస్ పరిస్థితి కూడా అలాగే ఉంది. 2003 సిరీస్ తర్వాత ఆస్ట్రేలియాపై ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయింది.
గత నాలుగేళ్లలో మూడు టీ20ల సిరీస్‌లలో వెస్టిండీస్‌ను భారత్ క్లీన్‌స్వీప్ చేసింది.
ఇటీవలి సంవత్సరాలలో వెస్టిండీస్ జట్టులో ఐక్యత కొరవడిందని, వ్యక్తిగతంగా మాత్రమే బాగా ఆడే ఆటగాళ్లుగల జట్టుగా విమర్శలు వచ్చాయి.

ఫొటో సోర్స్, Getty Images
విండీస్ ప్రదర్శనపై నిపుణులు ఏమంటున్నారు?
ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ ఆనంద్ వెంకటరామన్ బీబీసీతో మాట్లాడారు.
“వెస్టిండీస్ జట్టు ప్రదర్శనలో క్షీణత ఒక సంవత్సరం లేదా ఒక పర్యటనలో వచ్చింది కాదు. విండీస్ జట్టు 1990ల నుంచి ఫామ్ కోసం పోరాడుతోంది. వివ్ రిచర్డ్స్, డెస్మండ్ హేన్స్, గ్రీనిడ్జ్, మార్షల్, డుజోన్‌లు వెళ్లిపోవడం విండీస్‌ను కష్టాల్లోకి నెట్టింది. వారు ఒక్కొక్కరుగా రిటైర్ అయ్యారు.
వీళ్లు ఒంటరిగా మ్యాచ్‌ను జట్టు వైపు తిప్పే ఆటగాళ్లు. లారా, ఆంబ్రోస్ అలాంటి గొప్ప ప్లేయర్స్. ఆంబ్రోస్‌కు వాల్ష్ మద్దతుగా నిలిచేవాడు. లారాకు దొరకలేదు.
2000వ దశకంలో 2003, 2007 ప్రపంచ కప్‌లు సహా విండీస్ చాలా వన్డే అంతర్జాతీయ టోర్నమెంట్‌లలో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. గేల్ శక్తిమంతమైన బ్యాట్స్‌మెన్. రామ్‌నరేశ్ శర్వాన్, శివ్‌నారాయణ్ చంద్రపాల్ కూడా కొన్ని మంచి ఇన్సింగ్స్‌లు ఆడారు. కానీ జట్టుకు అది సరిపోలేదు.
అప్పటి బౌలర్లకు మంచి ప్రత్యామ్నాయం దొరక్కపోవడంతో ఆ విభాగంలో అతిపెద్ద నష్టం వాటిల్లింది'' అని ఆయన తెలిపారు.
దీనికి కారణాలను వెంకటరామన్ వివరిస్తూ “ కరేబియన్ దీవులలో చాలా మంది యువతను అథ్లెటిక్స్, బాస్కెట్‌బాల్ ఆకర్షించాయి.
ఫుట్‌బాల్ కూడా బాగా ప్రాచుర్యం పొందింది. అక్కడ ఆర్థికపరంగా చాలా సమస్యలు ఉన్నాయి.
ఆటగాళ్లు ఇతర జట్ల మాదిరిగా తమకు తగినంత పారితోషికం ఇవ్వడం లేదని బోర్డుపై తరచుగా తిరుగుబాటు చేశారు.
ఇది కాకుండా ఇతర దేశాల బోర్డుల మాదిరిగా క్రికెట్‌లో ఖర్చు చేయడానికి వారి వద్ద తగినంత డబ్బు లేదు'' అని తెలిపారు.
“వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ఇతర దేశాల మాదిరిగానే తన యువ ఆటగాళ్లను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. చాలా తక్కువ మంది యువకులు మంచి ప్రదర్శన కనబరుస్తున్నారు. కొన్ని సీజన్ల తర్వాత వారి ఆటతీరు అంతలా ఉండటం లేదు. అదే ఆటగాళ్లు ఐపీఎల్, బిగ్‌బాష్ లీగ్ వంటి క్లబ్‌లలో బాగా రాణిస్తున్నారు. ఈ పరిస్థితిని విండీస్ బోర్డు, ఆటగాళ్లు, మాజీ ఆటగాళ్లు కలిసి మార్చాలి'' అని వెంకటరామన్ సూచించారు.
చాలా ఏళ్ల పాటు వెస్టిండీస్ క్రికెట్ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ లేదా ఫీల్డింగ్ దేనిలోనైనా దూకుడు, తెలివైన ఆటతీరుకు ప్రసిద్ధిగా నిలిచింది.
ప్రపంచంలోని నలుమూలల విండీస్ జట్టుకు అభిమానులు ఉన్నారు. వెస్టిండీస్ ఎప్పుడైనా తిరిగి ఫామ్‌లోకి వస్తే అది వారికే కాదు క్రికెట్‌కు కూడా ఎంతో మేలు చేస్తుంది.
ఇవి కూడా చదవండి:
- హచికో: ఈ కుక్క చనిపోతే ఆ దేశమంతా కన్నీరు పెట్టింది....ఏంటి దీని ప్రత్యేకత?
- అమెరికాలో యోగా ఎందుకంత పాపులర్ అయింది? అమెరికా ప్రెసిడెంట్లు, పాప్స్టార్లు కూడా యోగాకు ఎలా ఆకర్షితులయ్యారు?
- బఠానీ రుచి లేని కొత్త రకం బఠానీలు, సోయాకు ప్రత్యామ్నాయం దొరికినట్టేనా?
- అరటి పండు తింటే 5 లాభాలు
- క్రానియోఫారింగియోమా: ఈ జబ్బు వస్తే 23 ఏళ్ల వ్యక్తి కూడా 13 ఏళ్ల కుర్రాడిలా కనిపిస్తాడు, ఎందుకిలా జరుగుతుంది?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














