తెలంగాణ: బీఆర్ఎస్ మేనిఫెస్టోలో కేసీఆర్ ఇచ్చిన హామీకి, గృహలక్ష్మి పథకానికి తేడా ఏమిటి

- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
గృహలక్ష్మి పేరిట తెలంగాణ ప్రభుత్వం కొత్త గృహ నిర్మాణ పథకాన్ని ప్రకటించింది.
సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోవాలనుకునే పేదలకు దశల వారీగా రూ.3 లక్షల ఆర్థిక సాయం అందించడం ఈ పథకం ఉద్దేశం.
గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఈ పథకానికి సంబంధించి ఇచ్చిన హామీకి, ప్రస్తుతం తీసుకువచ్చిన గృహలక్ష్మి పథకానికి వ్యత్యాసం కనిపిస్తోంది.
ముఖ్యంగా లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందించే విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సగానికి కోత విధించింది.

2018 ఎన్నికల మేనిఫెస్టోలో ఏం ఉంది?
అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ పార్టీ డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోంది.
గత ఎన్నికల కంటే ముందుగానే ఈ పథకాన్ని చేపట్టింది.
డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకానికి అదనంగా మరో హౌసింగ్ పథకాన్ని ఎన్నికల హామీగా కేసీఆర్ ప్రకటించారు.
2018 ఎన్నికల సందర్భంగా ప్రకటించిన మ్యానిఫెస్టోలో ఈ అంశాన్ని నాలుగో ముఖ్యమైన హామీగా ప్రస్తావించారు.
‘‘ప్రస్తుత పద్ధతిలో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం కొనసాగిస్తూనే, సొంత స్థలం ఉన్న అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూం ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు అందిస్తాం’’ అని మేనిఫెస్టోలో పేర్కొన్నారు.
ఈ లెక్కన నాటి ఎన్నికల హామీ ప్రకారం పేదలకు ఆర్థిక సాయం కింద రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షలు ఇవ్వాలి.
కానీ, బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం కాకుండా తగ్గించి సాయం అందిస్తోంది.
ఎన్నికల్లో ఇచ్చిన హామీల విషయంలో అడిగే చైతన్యం ప్రజల్లోనే రావాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నన్స్ అధ్యక్షులు పద్మనాభరెడ్డి బీబీసీతో అన్నారు.
దీనిపై ఆయన మాట్లాడుతూ ‘ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే బాధ్యత పార్టీలది.
బీఆర్ఎస్ హామీ ఇచ్చినట్లు ఆరు లక్షల రూపాయాలు ఇవ్వాలని లేదు. అందుకే ప్రజలు తాము గెలిపించిన పార్టీ అధికారంలోకి వచ్చాక హామీలను నిలబెట్టుకుందా? లేదా? అనేది పరిశీలించుకోవాలి. ఆ బాధ్యత ప్రజలపైనే ఉందని గుర్తించాలి’’ అని పద్మనాభరెడ్డి బీబీసీతో అన్నారు.
ఇక ఇదే విషయంపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ బీబీసీతో మాట్లాడారు.
‘‘బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినదానికి అమలు చేస్తున్న ఎక్కడా పొంతన లేదు.
కాంగ్రెస్ పార్టీ ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షలని ప్రకటించింది. అందుకే బీఆర్ఎస్ పార్టీ హడావుడిగా గృహలక్ష్మి పథకాన్ని తీసుకువచ్చింది.
గృహలక్ష్మి అనేది ఓట్ల కోసమే బీఆర్ఎస్ తీసుకువచ్చింది.
రూ.3 లక్షలతో పేదలు తమ ఇళ్లను ఏ విధంగా నిర్మించుకోగలుగుతారో ప్రభుత్వమే సమాధానం చెప్పాలి’’ అని అద్దంకి దయాకర్ అన్నారు.

గృహలక్ష్మి ఎలా అమలు చేస్తారంటే..
గృహలక్ష్మి పథకానికి సంబంధించి గత వారం తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.
ప్రస్తుత ఏడాదికి 4 లక్షల ఇళ్లకు ఈ పథకాన్ని వర్తింపజేయనున్నట్లు ప్రకటించింది.
ఇందులో అన్ని నియోజకవర్గాలకు కలిపి 3.57లక్షల ఇళ్లు కేటాయించారు.
మరో 43 వేల ఇళ్లు స్టేట్ రిజర్వ్ కోటా కింద ఇస్తారు.
ఇందుకు బడ్జెట్‌లో రూ.12 వేల కోట్లను ప్రతిపాదించింది.
దీని ప్రకారం ప్రతి నియోజకవర్గానికి 3 వేల ఇళ్లకు ఆర్థిక సాయం అందించాలనేది ప్రభుత్వ ప్రణాళికగా కనిపిస్తోంది.
ఇంటి నిర్మాణం విషయంలో రెండు గదులు, టాయిలెట్ కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి.
ఇంటి డిజైన్ లబ్ధిదారుడు తనకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు.
ఇంటిని మహిళ పేరుతో మంజూరు చేస్తారు.
జిల్లాల పరిధిలో కలెక్టర్, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జీహెచ్ఎంసీ కమిషనర్ నోడల్ అధికారిగా ఉంటారు.
ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను జిల్లా కలెక్టర్ లేదా జీహెచ్ఎంసీ కమిషనర్ పరిశీలించి అర్హుల జాబితాను తయారు చేస్తారు.
దాని ఆధారంగా జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆధ్వర్యంలో దశల వారీగా ఇళ్లను మంజూరు ఇస్తారు.

ఫొటో సోర్స్, BRS Party/face book
రూ.3 లక్షలు ఎప్పుడు ఇస్తారు?
ఈ పథకం కింద నిర్మించిన ఇళ్లపై ప్రభుత్వం ఆమోదించిన లోగోనే వేస్తారు.
దీనికి సంబంధించిన లోగోను ఇంకా ప్రభుత్వం విడుదల చేయలేదు.
ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేసరికి ప్రకటించే అవకాశం ఉంది.
ప్రభుత్వం ఈ డబ్బును మూడు దశల్లో అందిస్తుంది.
ప్రతి దశలో అధికారులు ఇళ్ల ఫొటోలు తీసి గృహలక్ష్మి పోర్టల్‌లో అప్ లోడ్ చేస్తారు.
పునాది స్థాయి వరకు నిర్మించాక రూ.లక్ష అందిస్తారు.
రూఫ్(పైకప్పు) స్థాయికి వచ్చాక మరో రూ.లక్ష ఇస్తారు.
నిర్మాణం పూర్తయ్యాక మిగిలిన రూ.లక్షను ఇస్తారు. ఈ నిధులను నేరుగా లబ్ధిదారు పేరుతో తెరిచిన బ్యాంకు ఖాతాలో వేస్తారు.
స్థానికంగా నివాసం ఉంటున్నట్లు ధ్రువీకరణపత్రం ఉండాలి.
నియోజకవర్గాల వారీగా ఎస్సీలకు 20శాతం, ఎస్టీలకు పది శాతం, బీసీలు, మైనార్టీలకు 50శాతం తగ్గకుండా ప్రాధాన్యం ఇస్తూ లబ్ధిదారుల ఎంపిక ఉంటుంది.
అప్పటికే రూఫ్ స్థాయికి చేరుకున్న ఇళ్లకు పథకం వర్తించదని ప్రభుత్వం ప్రకటించింది.
ప్రస్తుతం పెరిగిన ఇసుక, సిమెంట్, స్టీలు ధరలను పరిశీలిస్తే, లబ్ధిదారులు అదనంగా డబ్బులు ఖర్చు చేయాల్సి ఉంటుందని భవన నిర్మాణదారులు చెబుతున్నారు.
ప్రభుత్వం ఏమంటోంది
మేనిఫెస్టోలో రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షలు ఇస్తామని ప్రకటించి.. ఇప్పుడు రూ.3 లక్షలు ప్రకటించడంపై బీబీసీ తెలంగాణ గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కార్యాలయాన్ని సంప్రదించింది.
మంత్రి నుంచి ఇంకా సమాధానం రావాల్సి ఉంది.
ఇప్పటివరకు తెలంగాణలో నిర్మించిన ఇళ్లు ఎన్ని?
తెలంగాణ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లెక్కల ప్రకారం వివిధ పథకాల కింద, అలాగే 2007 నుంచి 2018 మధ్య కాలంలో మంజూరైన ఇళ్లలో ఇప్పటివరకు 23,84,470 ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించింది.
23,38,809 ఇళ్ల నిర్మాణం ప్రారంభమయ్యాయి.
వీటిల్లో 4,06,808 ఇళ్లు వివిధ దశల్లో ఉండగా, మరో 45,661 నిర్మాణాలు ప్రారంభం కావాల్సి ఉంది.
19,32,001 ఇళ్లు పూర్తి చేసినట్లు ప్రభుత్వం లెక్కలు చెబుతున్నాయి.
అలాగే 2017 తర్వాత చేపట్టిన గృహ నిర్మాణ పథకాల కింద 2,12,152 మంది లబ్ధిదారులను ప్రభుత్వం గుర్తించింది.
వీటిల్లో 8,504 ఇళ్లను పూర్తి చేసినట్లు తెలంగాణ హౌసింగ్ బోర్డు కార్పొరేషన్ వెబ్ సైట్లో పెట్టిన లెక్కలు సూచిస్తున్నాయి.
మరో 2,03,643 ఇళ్లు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయి.
ఈ ఇళ్ల కోసం ఇప్పటివరకు 50.69 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేసింది.
ఇవి కూడా చదవండి:
- టైటానిక్ మునిగిపోయిన చోట సముద్రం ఎందుకంత ప్రమాదకరంగా ఉంటుంది?
- ‘ఆక్సిజన్ అయిపోతుంటే కార్బన్ డయాక్సైడ్ రక్తంలో చేరి హైపర్కాప్నియాతో స్పృహ కోల్పోతారు’
- టైటానిక్: 111 ఏళ్ల కిందట మునిగిపోయిన ఈ ఓడలోని 700 మంది ప్రాణాలను ఆ రేడియో ఎలా కాపాడిందంటే...
- జలాంతర్గామిలో వెళ్లి టైటానిక్ చూసొచ్చిన ఈ యూట్యూబర్ 'టైటాన్ అదృశ్యం'పై ఏమంటున్నారంటే..
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














