తెలంగాణ ‘అమరుల’ స్మారకం: 3 ఎకరాల ప్రాంగణంలో ‘త్యాగాల దివ్వె’.. 150 అడుగుల స్మారకం, 26 అడుగుల దీపం

- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
హైదరాబాద్‌లో మరో భారీ ఐకాన్ సిద్దమయింది. తెలంగాణ ఉద్యమం సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారి కోసం హుస్సేన్ సాగర్ పక్కన ఒక కొత్త స్మారకాన్ని నిర్మించింది రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఈ నెల 22 న ఈ స్మారకాన్ని ప్రారంభించనున్నారు.
ఎక్కడా అతుకులు లేకుండా కనిపించే ఈ భారీ స్టీల్ బిల్డింగ్, ప్రపంచంలోనే అతి పెద్దది అని చెబుతున్నారు డిజైనర్లు.
ఇది కేవలం స్మారక చిహ్నం మాత్రమేకాదు. ఇందులోని రెండో అంతస్తులో దీప జ్వాల ఆకారం పక్కన అద్దాల రెస్టారెంట్, మొదటి అంతస్తులో భారీ కన్వెన్షన్ హాల్ ఉంటుంది.
ఇక గ్రౌండ్ ఫ్లోర్లో తెలంగాణ ఉద్యమాన్ని వివరించే మ్యూజియం, ఒక 100 మంది కూర్చోగలిగే మినీ థియేటర్ కూడా ఉంటుంది. ఇందులో తెలంగాణ ఉద్యమంపై రూపొందించిన డాక్యుమెంటరీని నిత్యం ప్రసారం చేస్తారు.
‘‘తెలంగాణ ఎందుకు అవసరం అయింది? తెలంగాణ భావన ఎందుకు మొదలైంది? ఉద్యమం ఎలా సాగింది. పాత ఉద్యమాలు, తాజా ఉద్యమం, అమరుల త్యాగాలు, ఆ పరిస్థితి ఎందుకు ఏర్పడింది....ఇలాంటి విషయాలన్నీ స్మారకం లోపలికి వచ్చి, బయటకు వెళ్లేలోపు అందరికీ అర్థమయ్యేలా మ్యూజియం ఏర్పాటు చేస్తున్నాం’’ అని బీబీసీతో చెప్పారు ఈ స్మారక భవనం డిజైనర్ రమణా రెడ్డి.
ఎదురుగా ఉన్న వారి ప్రతిబింబం కూడా కనిపించేలా ఈ భవనం గోడలను తయారు చేశారు నిపుణులు.
ఇప్పటివరకూ తెలంగాణలో రాష్ట్ర సాధన కోసం మరణించిన వారికి ప్రముఖంగా రెండు స్మారక కేంద్రాలున్నాయి. ఒకటి సికిందరాబాద్ క్లాక్ టవర్ దగ్గర ఉండగా, రెండోది అసెంబ్లీ ఎదురుగా ఉంది.
మొదటి రెండు స్థూపాలూ ఆయా కాలాల్లో జరిగిన ఉద్యమాలకు చిహ్నాలుగా ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఆ రెండు స్థూపాల కంటే అత్యంత భారీ స్థూపం రూపుదిద్దుకుంది.

శిల్పమా? భవనమా?
‘‘ప్రపంచంలో ఎక్కడైనా అమరులు అనగానే దీపం, జ్యోతి, వెలుగులతో నివాళులు ఇస్తారు. మతాలకు అతీతంగా ఈ సంప్రదాయం ఉంది. నేను కూడా తెలంగాణ అమరులకు నివాళిగా దీపాన్ని ఎంచుకున్నాను. మట్టి దీపం నుంచి స్ఫూర్తి పొంది, దానికి కాస్త మోడర్న్ కాంటెంపరరీ ఫామ్ ఇచ్చి ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా అద్భుతమైన కట్టడం నిర్మించాలనే ఉద్దేశంతో 'స్టెయిన్ లెస్ స్టీల్' లో 316 ఎల్ అనే గ్రేడ్ తో చేశాం. అది వందేళ్లు అయినా తుప్పు పట్టదు. అలాంటి స్టీల్ ఎంచుకున్నాం’’ అని బీబీసీతో చెప్పారు శిల్పి రమణారెడ్డి..
‘‘ఈ భవనానికి ప్రత్యేకత ఏంటంటే.. ఈ భవనమే ఒక శిల్పం. కానీ, వట్టి శిల్పం కాదు. ఈ శిల్పంతో ఉపయోగం ఉంది. ఒక ప్రయోజనం ఉంది’’ అంటూ వివరించారు రమణారెడ్డి.

ప్రపంచంలోనే పెద్దదా?
భవనం 'స్టీమ్ లెస్ స్టీల్' అంటే ఎక్కడా అతుకులు కనిపించని విధంగా ఉంటుంది. ప్రపంచంలోని ఇలాంటి భవనాలల్లో ఇదే పెద్దదని శిల్పి రమణారెడ్డి చెబుతున్నారు.
‘‘ఇది ప్రపంచంలోనే అతిపెద్ద స్టెయిన్ లెస్, స్టీమ్ లెస్ స్టీల్ భవనం. ఇది ఎన్నో ప్రపంచ రికార్డులు సొంతం చేసుకుంటుంది. అమరుల త్యాగాలను ప్రపంచానికి చాటేలా దీని ఆకృతి ఉంటుంది. షికాగోలో ప్రస్తుతం ఇలాంటి అతుకుల్లేని స్టీల్ స్ట్రక్చర్ ఉంది. ప్రస్తుతం గిన్నీస్ వరల్డ్ రికార్డ్ దానికే ఉంది. కానీ తెలంగాణ అమరుల స్థూపం దాని కంటే నాలుగు రెట్లు పెద్దది’’ అని వివరించారు రమణారెడ్డి.
ఈ భవనానికి దాదాపు 2,500 స్టీల్ షీట్లు వాడారు. కానీ ఏ ఒక్క షీటూ రెండోదానితో సమాన సైజులో ఉండదు. ప్రతీ షీటూ దానికదే భిన్న కొలతలతో ఉంటాయి.
‘‘కర్వేచర్ లో ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ అంటారు. స్టీల్ షీట్ ని కర్వేచర్ కి అనుగుణంగా బెండ్ చేస్తారు. ప్రతీ షీటూ ప్రత్యేక సైజులో డిజైన్ చేసి, తయారుచేయించి తెప్పించాం. అందుకే ఎక్కువ సమయం పట్టింది. ఇది చాలా ప్రయోగత్మక పని’’ అన్నారు రమణా రెడ్డి.

స్మారకం విశేషాలు
- ప్రమిదలో వెలుగుతున్న దీపంలా దీన్ని రూపొందించారు. ప్రమిద స్టీల్ రంగులో, దీపం అగ్ని రంగులో ఉంటుంది. అయితే నిజమైన మంట ఉండదు. వత్తి వెలుగుతోన్న ఆకారం మాత్రమే ఉంటుంది. దానిపై లైటింగ్ వేస్తారు.
- 2017లో దీనికి శంకుస్థాపన చేశారు. తెలంగాణకు చెందిన శిల్పి రమణా రెడ్డి దీన్ని రూపొందించారు. మొత్తం ఖర్చు రూ. 178 కోట్లు.
- దీన్ని మొత్తం 3 ఎకరాల ప్రాంగణంలో నిర్మించారు. ఈ నిర్మాణంలో వంద టన్నుల స్టీల్, 12 వందల టన్నుల ఇనుము వాడారు. ప్రధాన స్మారకం ఎత్తు 150 అడుగులు. దీపం ఎత్తు 26 మీటర్లు.
- హైదరాబాద్ నగరంలో వందేళ్లలో వచ్చిన బలమైన గాలుల రికార్డులు పరిశీలించి, అంత వేగంగా గాలులు వచ్చినా తట్టుకునేలా, సరస్సు ఒడ్డున కాబట్టి భూమి కింద నీటితో సమస్య రాకుండా నిర్మించినట్టు చెబుతున్నారు.
- బలమైన గాలులను తట్టుకోవడం కోసం కాటన్ స్టీల్‌తో ఈ దీపం తయారు చేశారు.
- ఈ ప్రాంగణంలో ఫౌంటెన్ల మధ్య బంగారు పూత పూసిన తెలంగాణ తల్లి విగ్రహం పెడుతున్నారు.
- ఒకేసారి 350 కార్లు, 600 బైకులు పార్కు చేసుకునేలా సెల్లార్ నిర్మించారు.
- నిర్మాణాలకు వీలుగా ఒంపులు తిరిగిన (మౌల్డ్ చేసిన) స్టీలు షీట్లను విదేశాల నుంచి తెప్పించారు.
- కన్వెన్షన్ హాలును బయటి కార్యక్రమాలకు కూడా అద్దెకు ఇస్తారు. ఇందులో ఒకేసారి 700 మంది కూర్చోవచ్చు.
- రెస్టారెంట్ మొత్తం విద్యుత్ పొయ్యిలతోనే నడుస్తుంది.

ఇవి కూడా చదవండి
- ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీలు విద్యార్థులను మోసం చేస్తున్నాయా?
- రూ. 88 వేల కోట్లకు పైగా విలువైన రూ.500 నోట్లు అదృశ్యమయ్యాయా, ఆర్బీఐ ఏం చెప్పింది?
- స్విమ్‌సూట్: ఈత కొట్టేటప్పుడు ఏ రంగు దుస్తులు వేసుకోవాలో తెలుసా?
- ఆర్బీఐ: విజయ్ మాల్యా, నీరవ్ మోదీలకు మేలు జరిగేలా నిర్ణయం తీసుకుందా?
- ఈ కాలు నాదే, ఆ కాలూ నాదే అని కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటే ఏమవుతుందో తెలుసా?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














