China Army-Galwan Valley: గల్వాన్ లోయ ఘర్షణల్లో చనిపోయిన సైనికులకు నివాళులు అర్పించిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ

ఫైల్ ఫొటో

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, బీబీసీ మానిటరింగ్
    • హోదా, .

తూర్పు లద్ధాఖ్ లోని గల్వాన్ లోయలో భారత్ చైనా సైనికుల మధ్య ఘర్షణలు జరిగి జూన్ 15కు రెండేళ్లయ్యింది. అయితే, ఈ ఘటన వార్షికోత్సవంపై చైనా ప్రధాన స్రవంతి మీడియా మౌనం వహించగా, మైక్రో-బ్లాగింగ్ వెబ్‌సైట్ వీబో (Weibo)లోని అనేక ప్రభుత్వ మీడియా సంస్థలు చైనా సైనికుల మరణాన్ని నివేదించాయి. నివాళులర్పించాయి.

చైనా ప్రభుత్వ వార్తాపత్రిక గ్లోబల్ టైమ్స్ జూన్ 15న చైనీస్ భాషా సంచికలో ఒక వివరణాత్మక నివేదికను ప్రచురించింది.

మరణించిన సైనికుల కుటుంబాల గురించి పశ్చిమ కమాండ్ ఆఫ్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA) సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా చేసిన పోస్ట్‌లను ఈ నివేదికలో ప్రచురించారు.

'చైనా సరిహద్దు భద్రతా చరిత్రలో ఇది మరచిపోలేని రోజు' అని ఆ రిపోర్టు పేర్కొంది.

గల్వాన్ వ్యాలీ ప్రాంతంలో రోడ్లు, వంతెనలు, ఇతర నిర్మాణాలను ఏర్పాటు చేయడం ద్వారా సంబంధిత విదేశీ దళాలు ఇరుదేశాల మధ్య ఒప్పందాలను తీవ్రంగా ఉల్లంఘించాయని ఇండియా పేరును ప్రస్తావించకుండా ఆ నివేదిక పేర్కొంది.

వీడియో క్యాప్షన్, ‘గల్వాన్ లోయ భారత్‌దే.. మా తాత పేరు మీదే దానికి ఆ పేరు వచ్చింది’

సరిహద్దులో యథాతథ స్థితిని మార్చేందుకు ఏకపక్షంగా ప్రయత్నించారని, చైనా అధికారులపై దాడులు జరిగాయని ఆ నివేదికలో పేర్కొన్నారు.

పీఎల్ఏ డైలీ అనే మిలిటరీ వార్తాపత్రిక జూన్ 10న చెన్ హాంగ్‌జున్ అనే వ్యక్తి సైనిక విభాగంలో చేరడానికి మూడుసార్లు దరఖాస్తు చేసుకున్నట్లు నివేదించింది. గాల్వాన్ హింసాకాండలో మరణించిన నలుగురు సైనికులలో చెన్ హాంగ్‌జున్ ఒకరు.

గల్వాన్ ఘటన వార్షికోత్సవానికి ముందు గ్లోబల్ టైమ్స్ పత్రిక రక్షణ మంత్రి వీ ఫెంఘే చేసిన ప్రకటనకు ప్రాముఖ్యం కల్పిస్తూ ప్రచురించింది. జూన్ 12న సింగపూర్‌లో జరిగిన షాంగ్రి-లా డైలాగ్‌లో ఫెంగే ఓ ప్రకటన చేశారు. గల్వాన్ వార్షికోత్సవాన్ని ప్రస్తావించకుండా ఆయన మాట్లాడారు.

సరిహద్దులో వివాదానికి బాధ్యత చైనాది కాదని ఆయన అన్నారు.

ఇక ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే చైనా డైలీ జూన్ 13న గల్వాన్ వార్షికోత్సవాన్ని నేరుగా ప్రస్తావించకుండా సంపాదకీయం రాసింది. ఇందులో భారతదేశంలో అమెరికా కమాండర్ చార్లెస్ ఫ్లిన్ చేసిన ప్రకటనను విమర్శించింది.

లద్ధాఖ్ సరిహద్దులో చైనా కార్యకలాపాలు కళ్లు తెరిపించాయని అప్పట్లో జనరల్ ఫ్లిన్ అభివర్ణించారు. భారత్ చైనాల మధ్య అగ్గి రాజేసేందుకు అమెరికా ప్రయత్నించిందని చైనా డైలీ సంపాదకీయం విమర్శించింది.

చైనా సైనికులు (ఫైల్ ఫొటో)

ఫొటో సోర్స్, Getty Images

సోషల్ మీడియాలో విస్తృత కవరేజ్

మిలిటరీకి సంబంధించిన వార్తలను అందించే మీడియా సంస్థలు, సీసీటీవీ -7తో పాటు, వివిధ వార్తా సంస్థలు పీఎల్ఏ సైనికుల జ్ఞాపకార్థం వీబో లో పలు కథనాలను పోస్ట్ చేశాయి.

కమ్యూనిస్ట్ పార్టీ మౌత్ పీస్ పీపుల్స్ డైలీ ద్వారా గ్లోబల్ టైమ్స్ పత్రిక వీబోలో ఒక పోస్ట్‌ను ప్రచురింపజేసింది. "ఈ కన్నీళ్లను చూడండి! మరణానికి ముందు చెన్ జియాంగ్‌రాంగ్ తన సహచరులతో కలిసి ఉన్న చిత్రం మొదటిసారిగా బైటికి వచ్చింది" అనే శీర్షికతో ఒక పోస్ట్ పెట్టారు.

సీసీటీవీ-7 చెన్‌ను "దేశ రక్షణ కోసం ప్రాణాలు కోల్పోయిన అమరవీరుడు"గా అభివర్ణిస్తూ మూడు నిమిషాల వీడియోను కూడా పోస్ట్ చేసింది.

పీపుల్స్ డైలీతో సహా అనేక ప్రభుత్వ మీడియా సంస్థలు కూడా జూన్ 15 వార్షికోత్సవం సందర్భంగా అనేక హ్యాష్‌ట్యాగ్‌లను ఉపయోగిస్తూ కథనాలు ప్రచురించాయి. అయితే ఇందులో ఎక్కడా నేరుగా గల్వాన్ లోయ ప్రస్తావన లేదు.

వీడియో క్యాప్షన్, గాల్వన్ లోయ ఎక్కడుంది? ఎందుకంత కీలకం?

ఈ వార్తాపత్రిక ఎక్కువగా ఉపయోగించే హ్యాష్‌ట్యాగ్‌లలో, 'దేశ సరిహద్దును కాపాడుతూ అమరులైన సైనికుల ద్వితీయ వార్షికోత్సవం' అన్నది కూడా ఉంది. ఇది జూన్ 15 మధ్యాహ్నం 3 గంటల సమయానికి 80 లక్షల కంటే ఎక్కువ వ్యూస్ ను సాధించింది.

ఇది కాకుండా, విస్తృతంగా వ్యూస్ సాధించిన మరొక హ్యాష్‌ట్యాగ్ 'మేము నిన్ను ఎప్పటికీ మరచిపోలేము'(We will never forget you'). దీనితో పాటు, గాల్వాన్ వ్యాలీ హింసలో మరణించిన నలుగురు చైనా సైనికుల ఫొటోలను కూడా షేర్ చేసింది.

చైనా సైనికులకు నివాళులు (ఫైల్ ఫొటో)

ఫొటో సోర్స్, Getty Images

వీబోలో పీపుల్స్ డైలీ ఒక పోస్ట్‌లో ఇలా రాసింది.

"15 జూన్ 2020న గల్వాన్ వ్యాలీ హింసాకాండలో క్వి ఫా బావో తీవ్రంగా గాయపడ్డారు. చెన్ హాంగ్‌జున్, చెన్ జియాంగ్ రాంగ్, జియావో సియువాన్, వాంగ్ జువో రాన్ హీరోలుగా మరణించారు" అని రాసింది.

ఇదే పోస్ట్‌ను పార్టీ ప్రావిన్షియల్ కమిటీ అధికారిక వార్తాపత్రిక హుబే డైలీ షేర్ చేసింది.

సోషల్ మీడియా యూజర్లు కూడా ఈ విషయం పై చాలా ఆసక్తిని కనబరిచారు. 'గల్వాన్ వ్యాలీ రెండో వార్షికోత్సవం' ('Second anniversary of Galwan Valley' )అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఐదున్నర లక్షల మందికి పైగా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. అయితే ప్రభుత్వ మీడియా ఈ హ్యాష్‌ట్యాగ్‌ని ఎక్కడా ఉపయోగించలేదు.

చాలామంది యూజర్లు "మాతృభూమిని రక్షించడానికి తమ ప్రాణాలను త్యాగం చేసిన" నలుగురు సైనికులపై ప్రశంసలు కురిపించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)