విజయ్ దివస్: ‘భారత సైన్యానికి లొంగిపోకపోతే మరో పాకిస్తాన్‌ను కూడా కోల్పోవాల్సి ఉండేది’

భారత్- పాక్ సైన్యం

ఫొటో సోర్స్, ROLI BOOKS

    • రచయిత, రేహాన్ ఫజల్
    • హోదా, బీబీసీ కరెస్పాండెంట్

బంగ్లాదేశ్ యుద్ధం 1971 డిసెంబర్ 15 నాటికి తుది అంకానికి చేరింది. ఆ రోజు అర్ధరాత్రి కూడా 2వ పారా జవాన్ల బృందం ఢాకాలో తమ పోరాటం సాగించింది.

16వ తేదీ ఉదయం వరకు కూడా రెండు వైపుల నుంచి కాల్పలు జరిగాయి. అదే సమయంలో జీవోసీ 101‌ స్థావరానికి చెందిన మేజర్ జనరల్ గంధర్వ్ నాగరా అక్కడికి చేరుకున్నారు.

''నేను ఢాకా వెలుపల ఉన్న మీర్పూర్ వంతెనపై మా స్టాఫ్ ఆఫీసర్ నోట్‌ప్యాడ్‌లో తూర్పు పాకిస్తాన్ చీఫ్ జనరల్ నియాజీకి లేఖ రాశాను.

‘'డియర్ అబ్దుల్లా, నేను ఇక్కడే ఉన్నాను. ఈ ఆట పూర్తయింది. మీ అంతట మీరే లొంగిపోవాలని నేను మీకు సూచిస్తున్నా. మిమ్మల్ని నేను జాగ్రత్తగా చూసుకుంటాను' అని లేఖలో రాశాను. నేను రాసిన ఈ సందేశాన్ని తీసుకొని మా ఏడీసీ కెప్టెన్ హర్‌తోష్ మెహతా జీపులో నియాజీ వద్దకు వెళ్లారు'' అని గంధర్వ్ నాగరా తనమరణానికి ముందు నాతో చెప్పారు.

జనరల్ గంధర్వ్ నాగరా

ఫొటో సోర్స్, BHARATRAKSHAK.COM

ఫొటో క్యాప్షన్, జనరల్ గంధర్వ్ నాగరా (మధ్యలో)

భారత సైనికుల జీపుపై కాల్పులు జరిపిన పాకిస్తాన్

ఆ సమయంలో నిర్భయ్ శర్మ కూడా 2వ పారా దళంలో కెప్టెన్‌గా పనిచేశారు. అనంతరం లెఫ్టినెంట్ జనరల్‌గా రిటైరైన నిర్భయ్ శర్మ, ఆ తర్వాత మిజోరం, అరుణాచల్ ప్రదేశ్‌లకు గవర్నర్‌గా పనిచేశారు.

''కెప్టెన్ హర్‌తోష్ మెహతాతో పాటు నేను కూడా అదే జీపులో కూర్చున్నా. మేం ముందుకు కదులుతున్నప్పుడు, మాకు ముందున్న ప్రాంతానికి కమాండర్ అయిన మేజర్ జేఎస్ సేథీ, లెఫ్టినెంట్ తేజిందర్ సింగ్‌లు కూడా జీపులో ఎక్కారు. వంతెన మీదుగా ఉన్న పాకిస్తానీ సైనికులకు అప్పటికి ఇంకా ‘కాల్పులు జరపొద్దు’ అనే ఆదేశాలు అందలేదు. కానీ, ఆ సంగతి మాకు తెలియదు.''

''మేం వంతెన మీదుగా చేరుకోగానే వారు మాపై కాల్పులు జరపడం మొదలుపెట్టారు. మేం వెంటనే జీపును ఆపాం. ఫైరింగ్ ఆపాలంటూ నేను గట్టిగా అరిచాను. కాల్పులు ఆగిపోయాయి. కానీ పాకిస్తాన్ సైనికులు మా జీపును చుట్టుముట్టారు. మీ సీనియర్ అధికారిని పిలవమని నేను పాకిస్తాన్ జూనియర్ ఆఫీసర్‌కు చెప్పాను.''

''అలాగే, మాకు ఏమాత్రం నష్టం జరిగినా పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయని నేను వారిని హెచ్చరించాను. ఎందుకంటే భారత సైన్యం ఢాకాను నాలుగు వైపుల నుంచి చుట్టుముట్టింది. జనరల్ నియాజీ కూడా ఆయుధాలు వదిలివేయడానికి అంగీకరించారని చెప్పాను. అదృష్టవశాత్తూ, అప్పుడే ఒక పాకిస్తానీ కెప్టెన్ అక్కడికి వచ్చారు. ఆయన మమ్మల్ని మీర్పూర్ గ్యారీసన్ కమాండర్ దగ్గరికి తీసుకెళ్లారు'' అని నిర్భయ్ శర్మ గుర్తు చేసుకున్నారు.

లెఫ్టినెంట్ జనరల్ నిర్భయ్ శర్మ

ఫొటో సోర్స్, BHARATRAKSHAK.COM

ఫొటో క్యాప్షన్, లెఫ్టినెంట్ జనరల్ నిర్భయ్ శర్మ

పిస్టల్‌ను నాగరాకు అప్పగించిన జనరల్ జంషెద్

దీని గురించి లెఫ్టినెంట్ జనరల్ నిర్భయ్ శర్మ మరింత వివరించారు. ''జనరల్ నాగరా రాసిన లేఖను ఆయన మా నుంచి తీసుకొని, మమ్మల్ని కాసేపు వేచి ఉండమని కోరారు. సరిగ్గా గంట తర్వాత, ఢాకా గ్యారీసన్ కమాండర్ మేజర్ జనరల్ మొహమ్మద్ జంషెద్ అక్కడికి చేరుకున్నారు. ఆయన మా జీపులో మేజర్ సేథీకి, నాకు మధ్య కూర్చున్నారు.

మా వెనకాలే జనరల్ జంషెద్‌కు చెందిన జీపు కూడా వచ్చింది. మేం, మా స్థావరానికి చేరుకునే సమయంలో పాకిస్తాన్ సైన్యం మరోసారి మాపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో మేజర్ సేథీ ఎడమ కాలులోకి మెషీన్ గన్ బుల్లెట్ దూసుకెళ్లింది.

మరో బుల్లెట్, లెఫ్టినెంట్ తేజిందర్ సింగ్ హెల్మెట్ నుంచి దూసుకెళ్లింది. అయితే, మేం ఎలాగోలా జనరల్ నాగరా వద్దకు చేరుకున్నాం. అక్కడ జనరల్ జంషెద్ తన పిస్టల్‌ను జనరల్ నాగరాకు అప్పగించారు'' అని ఆయన గుర్తు చేసుకున్నారు.

నిర్భయ్ శర్మ

ఫొటో సోర్స్, MIZORAM GOVERNMENT

ఫొటో క్యాప్షన్, లెఫ్టినెంట్ జనరల్‌గా రిటైరైన నిర్భయ్ శర్మ, ఆ తర్వాత మిజోరామ్, అరుణాచల్ ప్రదేశ్‌లకు గవర్నర్‌గా పనిచేశారు.

తన భార్యను ఢాకా తీసుకెళ్లాలని నిర్ణయించుకున్న అరోరా

''నేను జంషెద్ కారులో కూర్చొన్నా. అందులో వారి జెండాను తొలగించి భారత ఆర్మీకి '2 మౌంటెన్ డివిజన్' జెండాను ఉంచాను. నేను నియాజీ వద్దకు వెళ్లగానే ఆయన నాకు ఆప్యాయంగా స్వాగతం పలికారు'' అని జనరల్ నాగరా ఆ క్షణాలను గుర్తుచేసుకుంటూ చెప్పారు.

మరోవైపు, డిసెంబర్ 16న ఉదయం 9:15 గంటలకు జనరల్ మానెక్ షా నుంచి జనరల్ జాకబ్ ఒక సందేశాన్ని అందుకున్నారు. అందులో, సరెండర్‌కు సంబంధించిన ఏర్పాట్ల కోసం తక్షణమే ఢాకా చేరుకోవాలని జాకబ్‌కు సూచించారు.

దీని గురించి జనరల్ జాకబ్ తన ఆత్మకథ 'ఆన్ ఒడిస్సీ ఇన్ వార్ అండ్ పీస్' లో పేర్కొన్నారు.

''నేను జనరల్ అరోరా దగ్గరికి వెళ్లినప్పుడు, ఆయన కార్యాలయం ముందు నాకు అరోరా భార్య భంతీ అరోరా కనిపించారు. తన భర్త ఉన్న చోటే తాను ఉంటానని, అందుకే తాను కూడా ఢాకా వెళ్తున్నట్లు ఆమె నాతో చెప్పారు. అరోరాను కలిసినప్పుడు నేను దీని గురించి అడిగారు. మీరు మీ భార్యను కూడా ఢాకా తీసుకెళ్తున్నారా అని ప్రశ్నించగా, ఆయన అవును అని సమాధానమిచ్చారు. కానీ ఇది ఆమెకు చాలా ప్రమాదకరం అని నేను అన్నాను. కానీ ఆయన ఆమెను భద్రంగా చూసుకునే బాధ్యత తనదేనని బదులిచ్చారు'' అని జాకబ్ తన పుస్తకంలో రాసుకొచ్చారు.

జాకబ్ బుక్

ఫొటో సోర్స్, ROLI BOOKS

నియాజీకి ఆలోచించడానికి అరగంట సమయం ఇచ్చిన జనరల్ జాకబ్

జనరల్ నియాజీ గదిలోకి ప్రవేశించిన జనరల్ జాకబ్, అక్కడ పాకిస్తాన్ సీనియర్ మిలిటరీ అధికారులు ఉండటం చూశారు. మరోవైపు సోఫాలో కూర్చొన్న జనరల్ గంధర్వ్.. నియాజీకి పంజాబీ జోకులను చెబుతున్నారు.

లొంగుబాటు తంతును పూర్తి చేయడానికి ఒక టేబుల్‌తో పాటు రెండు కుర్చీలను రేస్‌కోర్స్‌లో ఏర్పాటు చేయాలని జనరల్ నాగరాకు ఆయన చెప్పారు. మరికొంత సేపట్లో అక్కడకు రాబోతున్న జనరల్ జగ్జీత్ సింగ్ అరోరాకు భారత్, పాక్ సైన్యాలు సంయుక్తంగా గౌరవ వందనం సమర్పించేందుకు ఏర్పాట్లు చేశారు.

''నేను లొంగిపోయే తంతుకు సంబంధించిన పత్రాలు నియాజీకి చదివి వినిపించాను. అప్పుడు ఆయన మేం లొంగిపోతున్నామని మీకు ఎవరు చెప్పారు? అన్నారు. భారత్, ముక్తి వాహిని సంయుక్త దళం ముందు లొంగిపోయేందుకు మేజర్ జనరల్ రావ్ ఫర్మాన్ అలీ అభ్యంతరాలు వ్యక్తం చేశారని చెప్పారు.''

''సమయం గడిచిపోతోంది. అందుకే నియాజీని పక్కకు తీసుకెళ్లి... ఒకవేళ మీరు ఆయుధాలు వదిలివేయకపోతే మీ కుటుంబసభ్యుల భద్రతకు నేను హామీ ఇవ్వలేను. మీరు లొంగిపోతే, వారికి ఏం జరగకుండా క్షేమంగా ఉండేలా నేను చూసుకుంటాను అని చెప్పాను.''

''మీకు ఆలోచించుకోవడానికి 30 నిమిషాల సమయం ఇస్తాను. ఈలోగా మీరు ఒక నిర్ణయానికి రాకపోతే, ఢాకాపై మళ్లీ బాంబు దాడులు చేయాలని నేను ఆదేశాలు జారీ చేస్తాను అని చెప్పినట్లు'' జనరల్ జాకబ్ వివరించారు.

లెఫ్టినెంట్ జనరల్ జాకబ్

ఫొటో సోర్స్, ROLI BOOKS

ఫొటో క్యాప్షన్, లెఫ్టినెంట్ జనరల్ జాకబ్

నియాజీ మౌనం

దీని గురించి జాకబ్ మరింత చెప్పారు. ''బయటకి రాగానే, అసలు నేను చేసిందేంటి? అని ఆలోచించాను. ఆ సమయంలో ఢాకాలో నియాజీ సైనికులు 26,400 మంది ఉండగా, భారత సైనికులు కేవలం 3000 మందే ఉన్నారు. అది కూడా ఢాకాకు 30 మైళ్ల దూరంలో ఉన్నారు'' అని ఆయన వెల్లడించారు.

దీని తర్వాత, జనరల్ జాకబ్ తన సిగార్ తాగుతూ గది బయట వేగంగా నడుస్తున్నట్లు హుమూదుర్ రెహమాన్ కమిషన్ తన నివేదికలో రాసింది. కానీ వాస్తవంగా జరిగిందేంటంటే అప్పుడు నేను చాలా ఆందోళనలో, ఒత్తిడిలో ఉన్నా. 30 నిమిషాల తర్వాత లోపలికి వచ్చి చూస్తే, అక్కడ గాఢమైన నిశ్శబ్ధం ఆవరించి ఉంది. లొంగుబాటుకు సంబంధించిన కాగితాలు టేబుల్ మీద పడి ఉన్నాయి.

''మీరు ఈ ఒప్పందానికి అంగీకరిస్తున్నారా లేదా అని నేను నియాజీని అడిగాను. కానీ ఆయన ఏ సమాధానం ఇవ్వలేదు. ఆయన్ను మూడు సార్లు నేను ఇదే ప్రశ్న అడిగాను. కానీ ఆయన సమాధానం చెప్పలేదు.

అప్పుడు నేను ఆ కాగితాలు తీసుకుంటూ, మీరు ఈ ఒప్పందానికి అంగీకరించారని భావిస్తూ ఇక్కడ నుంచి వెళ్తున్నా అని అన్నారు. నియాజీ కళ్లలో నుంచి నీళ్లు తిరగడం మొదలుపెట్టాయి'' అని జాకబ్ వివరించారు.

జనరల్ జేఎఫ్‌ఆర్ జాకబ్‌తో బీబీసీ ప్రతినిధి రెహాన్ ఫజల్ (ఫైల్ ఫోటో)
ఫొటో క్యాప్షన్, జనరల్ జేఎఫ్‌ఆర్ జాకబ్‌తో బీబీసీ ప్రతినిధి రెహాన్ ఫజల్ (ఫైల్ ఫోటో)

ఆయుధాలు తమ వద్దే ఉంచుకోవడానికి పాకిస్తాన్ సైనికులకు అనుమతి

నియాజీని ఒంటరిగా పక్కకు తీసుకెళ్లిన జాకబ్... సాధారణ ప్రజల సమక్షంలో రేస్‌కోర్స్ వేదికగా లొంగుబాటు కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పారు. దీన్ని నియాజీ తీవ్రంగా వ్యతిరేకించారు.

ఆత్మరక్షణ కోసం పాకిస్తానీ సైనికులు తమ ఆయుధాలను ఉంచుకోవడానికి తానే అనుమతించానని జాకబ్ చెప్పారు. కానీ జనరల్ నియాజీ తన ఆత్మకథ 'ద బిట్రేయల్ ఆఫ్ పాకిస్తాన్'లో మరో విధంగా పేర్కొన్నారు.

''నేను జాకబ్‌కు ఒక షరతు విధించాను. పాకిస్తానీ సైనికులను సురక్షితంగా కాపాడే స్థితిలో భారత సైనికులు లేనందున, తమ ఆత్మరక్షణ కోసం పాకిస్తానీ సైనికులకు ఆయుధాలు ఉంచుకునేందుకు అనుమతించాలి అని డిమాండ్ చేశాను. ఈ షరతుకు జాకబ్ అంగీకరించారు'' అని నియాజీ రాసుకున్నారు.

నియాజీ బుక్

ఫొటో సోర్స్, OXFORD BOOKS

పిస్టల్‌ను అప్పగించాలని నిర్ణయం

నియాజీ ఎలా లొంగిపోతారనే అంశంలో కూడా అయోమయం నెలకొంది. కానీ జనరల్ గంధర్వ్ నాగరా ఇలా చెప్పారు. ''ఏదైనా వస్తువుతో సరెండర్ అయ్యేలా నియాజీని సిద్ధం చేయమని జాకబ్ నాతో చెప్పారు. మీరు మీ కత్తిని మాకు అప్పగించండి అని నేను నియాజీకి చెప్పాను. పాకిస్తాన్ సైన్యంలో కత్తిని పట్టుకునే ఆచారం లేదని ఆయన అన్నారు. మరి మీరు ఏ వస్తువు ఇచ్చి లొంగిపోతారు? మీ దగ్గర ఏమీ లేవు? మీ బెల్ట్ లేదా టోపీ తీసివేసి మీరు లొంగిపోవాల్సి ఉంటుంది. కానీ అది సరైనదిగా అనిపించడం లేదు అని అన్నాను. మళ్లీ నేనే, మీ పిస్టల్‌ను అందజేసి మీరు లొంగిపోండి అని ఆయనకు సలహా ఇచ్చాను'' అని నాగరా చెప్పుకొచ్చారు.

జనరల్ అన్సార్‌తో కరచాలనం చేస్తున్న జనరల్ నియాజీ

ఫొటో సోర్స్, OXFORD BOOKS

ఫొటో క్యాప్షన్, జనరల్ అన్సార్‌తో కరచాలనం చేస్తున్న జనరల్ నియాజీ

దీని తర్వాత అందరూ తినడం కోసం మెస్ వైపు వెళ్లారు. అప్పుడు అబ్జర్వర్ వార్తా పత్రిక ప్రతినిధి గావిన్ యంగ్ బయట నిల్చొని ఉన్నారు. తాను కూడా అక్కడ భోజనం చేయొచ్చా అని ఆయన జాకబ్‌ను అడిగారు. ఆయనను జాకబ్ లోపలికి ఆహ్వానించారు. అక్కడ ఫోర్కులు, కత్తులు, ప్లేట్లతో టేబుల్‌ను చక్కగా అమర్చారు. జాకబ్‌కు ఏమీ తినాలనిపించలేదు. ఆయన తన ఏడీసీతో కలిసి గదిలో ఒక మూలన నిల్చున్నారు. ఆ తర్వాత గావిన్ తన పత్రిక కోసం 'సరెండర్ లంచ్' పేరుతో రెండు పేజీల కథనాన్ని రాశారు.

జనరల్ జాకబ్

ఫొటో సోర్స్, ROLI BOOKS

ఫొటో క్యాప్షన్, జనరల్ జాకబ్

అరోరాకు గౌరవ వందనం సమర్పించిన భారత్, పాక్ సైనికులు

నియాజీ, జాకబ్ సాయంత్రం 4 గంటలకు జనరల్ ఆరోరాను తీసుకురావడానికి ఢాకా విమానాశ్రయానికి చేరుకున్నారు. అరోరా తన సిబ్బందితో కలిసి ఐదు ఎంఐ-4, నాలుగు అలూట్ హెలికాప్టర్లలో ఢాకా విమానాశ్రయంలో దిగారు.

ఆ తరువాత ఎయిర్ చీఫ్ మార్షల్ ఎస్‌కే కౌల్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... ''మేం ఢాకా విమానాశ్రయంలో దిగగానే, మమ్మల్ని రేస్‌కోర్స్ మైదానానికి తీసుకెళ్లడానికి చాలా కార్లు పార్కింగ్‌లో వేచి ఉన్నాయి. దారి మొత్తం బంగ్లాదేశ్ ప్రజలు మాకు జై కొడుతూ ఉత్సాహపరిచారు. అంతకు 26 ఏళ్ల క్రితం అమెరికా బలగాలు పారిస్‌లో ప్రవేశించినప్పుడు నెలకొన్న సందడి వాతావరణంలా మళ్లీ అనిపించింది'' అని చెప్పారు.

జనరల్ జగ్జీత్ సింగ్ అరోరా

ఫొటో సోర్స్, ROLI BOOKS

ఫొటో క్యాప్షన్, జనరల్ జగ్జీత్ సింగ్ అరోరా

అరోరా, తొలుత రేస్‌కోర్స్ మైదానంలో గార్డ్ ఆఫ్ ఆనర్ తీరుతెన్నుల్ని పరిశీలించారు. తర్వాత లెఫ్టినెంట్ జనరల్ హిమ్మత్ సింగ్ (ఆ సమయంలో లెఫ్టినెంట్ కల్నల్) ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇలా అన్నారు.

''పాకిస్తాన్ బృందాన్ని జనరల్ నియాజీకి చెందిన ఏడీసీ నడిపించారు. పాకిస్తాన్ సైన్యం మంచి యూనిఫామ్‌లో కనిపించింది. అదే సమయంలో భారత సైన్యానికి చెందిన 2 పారా, 4 గార్డ్స్ సైనికులు మాసిపోయిన యూనిఫామ్‌లో అలసిపోయినట్లుగా కనిపించారు.

నిజానికి 4 గార్డ్స్‌కు చెందిన సైనికులు భారత సరిహద్దు నుంచి ఢాకా వరకు ప్రయాణించాల్సిన 100 కి.మీ దూరాన్ని నిర్విరామంగా, స్నానం లేకుండా బట్టలు ఉతక్కుండా పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ పాకిస్తాన్ సైనికులు తమ దుస్తుల్ని అలా చూసుకోదల్చుకోలేదు. అయితే, పోరాట సమయంలో తమ దుస్తుల గురించి, తమ ఆహార్యం గురించి భారత సైనికులు ఏమాత్రం పట్టించుకోలేదు'' అని చెప్పారు.

ఎడమవైపు జనరల్ నియాజీ, కుడివైపు జనరల్ జాకబ్

ఫొటో సోర్స్, ROLI BOOKS

ఫొటో క్యాప్షన్, ఎడమవైపు జనరల్ నియాజీ, కుడివైపు జనరల్ జాకబ్

15 నిమిషాల్లోనే సరెండర్ కార్యక్రమం పూర్తి

అరోరా, నియాజీ ఇద్దరూ ఒక టేబుల్ ముందు కూర్చొని, లొంగుబాటుకు సంబంధించిన 5 పత్రాలపై సంతకాలు చేశారు.

తన దగ్గర పెన్ను లేకపోవడంతో నియాజీ కాస్త కంగారు పడ్డారు.

జనరల్ అరోరా పక్కన నిల్చున్న భారతీయ సైనికుడు ఆయనకు తన పెన్నును ఇచ్చారు.

ఒప్పందంపై సంతకాలు చేస్తున్న జనరల్స్

ఫొటో సోర్స్, BHARATRAKSHAK.COM

''నియాజీ మొదట సంతకం చేశారు. ఆ తర్వాత ఆరోరా సంతకం పెట్టారు. కానీ నియాజీ తన పూర్తి పేరును రాయలేదు. ఆయన ఏం ఆలోచించి అలా చేశారో తెలియదు, కానీ ఆయన పత్రాలపై 'ఏఏ నియా' అని మాత్రమే రాశారు. దీని గురించి నేను జనరల్ అరోరాకు చెప్పాను'' అని వైస్ అడ్మిరల్ ఎన్ కృష్ణన్ తన ఆత్మకథ 'ఎ సెల్లర్స్ స్టోరీ'లో రాశారు.

ఆయన దీని గురించి నియాజీతో మాట్లాడారు. దాని తర్వాత నియాజీ తన పేరును పూర్తిగా రాశారు. యూనిఫామ్ మీదున్న బ్యాడ్జిలను తీసివేయడంతో పాటు 38 రివాల్వర్లను అరోరాకు అప్పగించారు.

అతను లొంగిపోతున్నట్లు సంకేతంగా తన నుదుటిని జనరల్ అరోరా నుదుటికి తగిలించారు. ఆ సమయంలో ఆయన కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. ఈ తతంగం అంతా కేవలం 15 నిమిషాల్లోనే ముగిసింది.

ఎన్.కృష్ణన్

ఫొటో సోర్స్, PUNYA PUBLISHING

నియాజీ 'డిప్రెస్డ్'

ఆ తర్వాత జనరల్ నియాజీ తన ఆత్మకథ 'ద బిట్రేయల్ ఆఫ్ ఈస్ట్ పాకిస్తాన్'లో దీని గురించి రాశారు.

''నేను వణుకుతోన్న చేతులతో లొంగుబాటు పత్రాలపై సంతకం చేయగానే, నా గుండెల్లో ఉన్న దు:ఖమంతా ఒకేసారి నా కళ్లలోకి వచ్చింది.

ఆ కార్యక్రమానికి ముందు ఒక ఫ్రెంచ్ విలేఖరి... 'టైగర్, ఇప్పుడు మీకెలా అనిపిస్తోంది' అని నన్ను అడిగారు. చాలా విచారంగా ఉందని చెప్పాను. అప్పుడు నా పక్కనే నిల్చొన్న జనరల్ అరోరా... ''ఈయన చాలా కఠినమైన పరిస్థితుల్లో, దాదాపు అసాధ్యమైన పనిని చేయాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో మరే ఇతర జనరల్ కూడా ఈయన కన్నా మెరుగ్గా స్పందించలేడు'' అని చెప్పినట్లు'' నియాజీ రాశారు.

పాకిస్థాన్ సైనికులతో మాట్లాడుతున్న జనరల్ నియాజీ

ఫొటో సోర్స్, OXFORD BOOKS

ఫొటో క్యాప్షన్, పాకిస్థాన్ సైనికులతో మాట్లాడుతున్న జనరల్ నియాజీ

చీకటి పడుతోంది. అక్కడ ఉన్న జనాలు నినాదాలు చేయడం ప్రారంభించారు. వెంటనే భారత అధికారులు పరుగున వెళ్లి నియాజీని చుట్టుముట్టారు. తర్వాత భారత ఆర్మీ జీపులో ఆయనను సురక్షిత ప్రదేశానికి తరలించారు.

ఆయన జీపులో కూర్చొనే సమయంలో జనంలో నుంచి ఎవరో విసిరిన రాయి ఆయనకు తగిలింది. అదేసమయంలో జాకబ్, లొంగుబాటు పత్రాలను గమనించారు. అందులో భారత కాలమానం ప్రకారం 4:31 గంటలకు వాటిపై సంతకాలు చేయాలని రాసి ఉంది.

అప్పుడు ఆయన వాచీలో సమయం సాయంత్రం 4:55 గంటలను సూచించింది. రెండు వారాల తర్వాత, కలకత్తాలో ఆ సరెండర్ పత్రాలపై మళ్లీ జనరల్ నియాజీ, జనరల్ అరోరా సంతకాలు చేశారు.

జనరల్ నియాజ్, జనరల్ జాకబ్

ఫొటో సోర్స్, HARPER COLLINS

భారత్ విజయం గురించి పార్లమెంట్‌లో ఇందిరా గాంధీ ప్రకటన

సరిగ్గా అదే సమయంలో, పార్లమెంట్‌లోని తన కార్యాలయంలో స్వదేశీ టెలివిజన్‌కు ఇంటర్వ్యూ ఇస్తోన్న ఇందిరా గాంధీ టేబుల్‌పై ఉన్న ఎరుపు రంగు ఫోన్ మోగింది. ఆమె కేవలం నాలుగే మాటల్లో ఆ ఫోన్ కాల్‌ను ముగించారు. ఫోన్ ఎత్తి మాట్లాడిన ఆమె 'ఎస్... ఎస్ అండ్ థ్యాంక్యూ'' అంటూ పెట్టేశారు.

మరోవైపు బంగ్లాదేశ్‌లో పాకిస్తాన్ సైన్యం లొంగిపోయిందంటూ జనరల్ మానెక్ షా చెబుతున్నారు.

ఇందిరా గాంధీ టెలివిజన్ నిర్మాతకు క్షమాపణలు చెప్పి వేగంగా లోక్‌సభ వైపు వెళ్లారు.

ఇందిరా గాంధీ

ఫొటో సోర్స్, Getty Images

ఆనందోత్సాహాలతో ఆమె, ''ఢాకా ఇప్పుడు ఒక స్వతంత్ర దేశానికి స్వతంత్ర రాజధానిగా ఉంటుంది'' అని ప్రకటించారు. ఆ తర్వాత ఆమె మాట్లాడుతుండగా, సభ మొత్తం నినాదాలు, చప్పట్లతో మారుమోగింది.

ఇందిరా గాంధీకి సన్నిహితులైన పుపుల్ జయకర్ ఆమె బయోగ్రఫీని రాశారు. ''ఆరోజు నేను పార్లమెంట్‌లోనే ఉన్నాను. ఎంపీలంతా ఇందిరాగాంధీని చుట్టు ముట్టారు. ఆమె నన్ను చూడగానే, వారందరిని వదిలి నా దగ్గరకు వచ్చారు. కేవలం 30 సెకన్లు మాత్రమే ఆమె నాతో మాట్లాడారు. ఆమె నన్ను ఆత్మీయంగా కౌగిలించుకున్నారు. ఆమె కళ్లలో నీళ్లు రావడం నేను చూశాను. ఆమె నడస్తూ, నడుస్తూనే 'మనకు ప్రశాంతత అనేది ఎప్పుడైనా దొరుకుతుందా?' అంటూ గుసగుసగా చెబుతూ వెళ్లిపోయారు'' అని అందులో రాసుకొచ్చారు.

ఇందిరా గాంధీ

ఫొటో సోర్స్, PENGUIN BOOKS

లొంగుబాటు గురించి నియాజీ స్పష్టీకరణ

జనరల్ నియాజీ చనిపోయే ముందు, నేను లాహోర్‌కు ఫోన్ చేశాను. మీరు భారత సైన్యం ముందు ఆయుధాలు వదిలి పెట్టాలని ఎందుకు నిర్ణయించుకున్నారు? అని అడిగాను.

''అల్లా దయ లేకపోవడం వల్ల గెలవాల్సిన ఆటలో పాకిస్తాన్ ప్రజలు ఓడిపోయారు'' అని నియాజీ చెప్పారు.

''నేను పోరాడుతున్నప్పుడు, 13వ తేదీన 'చివరి బుల్లెట్, చివరి సైనికుడి వరకు పోరాడాలని' ఒక ఉత్తర్వు జారీ చేశాను. ఈ ఉత్తర్వు సైన్యానికి డెత్ వారెంట్ లాంటిది.''

''ఇలాంటి ఆదేశాలు ఆఫ్రికా యుద్ధంలో రొమ్మెల్ ఇచ్చారు. కానీ అతని సైన్యం ఆయన ఆదేశాలను పాటించలేదు. కానీ మా సైన్యం నా ఆదేశానుసారం యుద్ధానికి సిద్ధమైంది.

అయితే ఈ పోరాటం సుదీర్ఘంగా సాగుతుందని పాకిస్తాన్ ప్రజలు భావించారు.

కానీ 13వ తేదీన పోరాటం ఆపమని పేర్కొంటూ గవర్నర్ మలిక్ నా దగ్గరికి వచ్చారు. ఈ పిచ్చి పనులేంటి అని ఆయన నన్ను అడిగారు. మనం ఒక పాకిస్తాన్‌ను కాపాడటం కోసం మరో పాకిస్తాన్‌ను కోల్పోవాల్సి వచ్చింది'' అని ఆయన అన్నట్లు నియాజీ చెప్పారు.

ఢాకా విమానాశ్రయంలో జనరల్ అరోరాతో జనరల్ నియాజీ

ఫొటో సోర్స్, PUNYA PUBLISHING

ఫొటో క్యాప్షన్, ఢాకా విమానాశ్రయంలో జనరల్ అరోరాతో జనరల్ నియాజీ

'ఢాకాలో మీకు పరిమిత వనరులే ఉన్నప్పటికీ, మీరు మరింతకాలం యుద్ధం చేయగలమని భావించారా?' అని యుద్ధఖైదీగా మారిన అనంతరం నియాజీని, పాకిస్తాన్ ఆర్మీ పీఆర్‌వో సాధిక్ సాలిక్ అడిగారు.

విట్‌నెస్ టు సరెండర్'

ఫొటో సోర్స్, LANCER PUBLISHER

తన పుస్తకం 'విట్‌నెస్ టు సరెండర్'లో దీని గురించి సాలిక్ మరింతగా తెలిపారు. '' తన ప్రశ్నకు సమాధానంగా నియాజీ.... మరింత విధ్వంసం, చావులకు దారి తీసేది. ఢాకా వీధుల్లో మృతదేహాలు పడి ఉండేవి. ''

''అయినప్పటికీ, యుద్ధం ఫలితం అదే విధంగా ఉండేది. నా దృష్టిలో, 90 వేల మంది మహిళలను, దాదాపు 5 లక్షల మంది ప్రజలను అనాథలను చేయడం కంటే, 90 వేల మంది యుద్ధఖైదీలుగా చేయడమే ఉత్తమం'' అని చెప్పినట్లు సాలిక్ రాసుకొచ్చారు.

కానీ మీరు మరో ఆప్షన్‌ను ఎంచుకొని ఉంటే చరిత్రలో బహుశా పాకిస్తాన్ సైన్యం కీర్తి మరోలా ఉండేదేమో అని నేను ప్రశ్నించగా, దానికి జనరల్ నియాజీ సమాధానం చెప్పలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)