పాకిస్తాన్: ఐఎస్ఐ కొత్త చీఫ్ నియామకంపై ఇమ్రాన్ ఖాన్, సైన్యం మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయా?

ఇమ్రాన్ ఖాన్

ఫొటో సోర్స్, Imran Khan/Facebook

'పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) చీఫ్‌గా జనరల్ ఫయాజ్ హమీద్ మరికొన్ని నెలలు పదవిలో కొనసాగాలని' పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కోరినట్లు రాజకీయ వ్యవహారాల్లో ప్రధానమంత్రి ప్రత్యేక సహాయకుడు అమీర్ డోగర్ చెప్పారు.

అఫ్గానిస్తాన్‌లో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అదే సముచితమని ఇమ్రాన్ ఖాన్ భావించినట్లు ఓ ప్రైవేటు టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డోగర్ ప్రస్తావించారు.

అయితే దీనికి ముందు, ఐఎస్ఐ కొత్త చీఫ్‌ నియామకంపై రాజకీయ వర్గాలకు, పాకిస్తాన్ సైన్యానికి మధ్య అభిప్రాయభేదాలు ఉన్నట్లు వచ్చిన వార్తలను ఆ దేశ సమాచార, ప్రసార శాఖ మంత్రి ఫవాద్ చౌదరి తోసిపుచ్చారు.

ఐఎస్ఐకు కొత్త అధిపతిగా లెఫ్టినెంట్ జనరల్ నదీమ్ అహ్మద్ అంజుమ్ నియమితులయ్యారని గత వారం పాకిస్తాన్ సైన్యం ప్రజా సంబంధాల విభాగం (ఐఎస్‌పీఆర్) తెలియజేసింది.

అయితే, పాకిస్తాన్ ప్రభుత్వం ఇంతవరకు దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు.

దాంతో, పాకిస్తాన్ ఆర్మీకి, ప్రధానమంత్రికి ఐఎస్ఐ చీఫ్ విషయంలో భేదాభిప్రాయాలు ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.

ఫయాజ్ హమీద్‌

ఫొటో సోర్స్, ISPR

ఫొటో క్యాప్షన్, ఫయాజ్ హమీద్‌

ఇమ్రాన్ ఖాన్ మనసులో ఏముంది?

లెఫ్టినెంట్ జనరల్ ఫయాజ్ హమీద్‌తో కలిసి పనిచేయడం సౌకర్యంగా ఉంటుందని, హమీద్ ఆ పదివిలో మరి కొంత కాలం కొనసాగితే బావుంటుందని ఇమ్రాన్ ఖాన్ భావిస్తున్నట్లు వచ్చిన వార్తలు ఇస్లామాబాద్‌లోని రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

ప్రస్తుతం ఫయాజ్ హమీద్ పెషావర్ కోర్ కమాండర్‌గా నియమితులయ్యారని ఐఎస్‌పీఆర్ తెలిపింది.

ఐఎస్ఐ కొత్త చీఫ్ నియామకంపై ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావేద్ బజ్వాతో ఇమ్రాన్ ఖాన్ చర్చించారని అమీర్ డోగర్ తెలిపారు.

ఈ ప్రక్రియ లాంఛనంగా జరుగుతుందని ఆర్మీ చీఫ్‌కు తెలిపినట్లు మంగళవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఇమ్రాన్ ఖాన్ వెల్లడించారు.

"ఈ ప్రక్రియ చట్టబద్ధంగా, రాజ్యాంగం ప్రకారం జరుగుతుంది. రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి మూడు లేదా అయిదు పేర్లు వస్తాయి. అందులో ప్రధానమంత్రి ఒక పేరును ఎంపిక చేస్తారు.

ఇది, ఆర్మీ చీఫ్ ద్వారా జరిగే ఒక అధికారిక ప్రక్రియ. ఎవరిని ఎలాంటి పదవుల్లో నియామించాలన్నది ఆర్మీ చీఫ్‌కు తెలుస్తుంది. కానీ, దానికొక ప్రక్రియ ఉంటుంది" అని ఆయన అన్నారు.

"జనరల్ నదీమ్ అహ్మద్ అంజుమ్‌కు మంచి ప్రతిష్ఠ ఉంది. ఆయన చాలా ప్రొఫెషనల్‌గా ఉంటారు. ఆయన వ్యక్తిత్వంపై ఎలాంటి అనుమానాలు లేవు. సైన్యం ఎప్పుడూ ఉత్తమమైన వ్యక్తులనే ఎంచుకొంటుంది" అని ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు.

అయితే, ఇమ్రాన్ ఖాన్ చట్టబద్ధమైన ప్రక్రియలపై విశ్వాసం ఉంచుతారని, అన్ని ప్రభుత్వ సంస్థలూ రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలని కోరుకుంటారని డోగర్ తెలిపారు.

"మీరు చట్టబద్ధమైన ప్రక్రియను అనుసరించండి. లేదంటే ఇక్కడ రబ్బరు స్టాంపులకు కొదవ లేదని ఇమ్రాన్ ఖాన్, ఆర్మీ చీఫ్‌కు సూచించారు."

నదీమ్ అంజుమ్‌

ఫొటో సోర్స్, ISPR

ఫొటో క్యాప్షన్, నదీమ్ అంజుమ్‌

ప్రధాని, ఆర్మీ చీఫ్‌ల మధ్య అభిప్రాయ భేదాలు లేవు

ఐఎస్ఐ చీఫ్ నియామకం చట్టబద్ధంగా జరుగుతుందని మంగళవారం క్యాబినెట్ సమావేశం అనంతరం ఫవాద్ చౌదరి స్పష్టం చేశారు.

"ప్రధానమంత్రికి, ఆర్మీ చీఫ్‌కు మధ్య చాలా సన్నిహిత సంబంధం ఉంది. ఇద్దరూ స్నేహితులు. సోమవారం రాత్రి వీరిద్దరి మధ్య సుదీర్ఘ సమావేశం జరిగింది. ఐఎస్ఐ చీఫ్ నియామకంపై ఇరువురూ ఒకే తాటిపై ఉన్నారు. ఐఎస్ఐ చీఫ్ నియామకంపై ప్రధానమంత్రికి విశేషాధికారాలు ఉంటాయి. పూర్తిగా ఆలోచించి, కూలంకషంగా చర్చించిన తరువాతే ఈ ప్రక్రియ జరుగుతుంది. సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. సైన్యం ప్రతిష్ఠను దిగజార్చే పనులు ప్రధానమంత్రి కార్యాలయం చేపట్టదు. అలాగే, సివిల్ సెటప్‌ను అవమానించే దిశలో సైన్యం ఒక్క అడుగు కూడా ముందుకు వేయదు" అని ఆయన తెలిపారు.

జనరల్ నదీమ్ అంజుమ్ ఇంతకుముందు కరాచీలోని కోర్ కమాండర్‌గా పనిచేశారు.

ఐఎస్ఐ చీఫ్‌గా అధికారికంగా నియమితులైన తరువాత ఆయన రెండున్నరేళ్లు ఆ పదవిలో కొనసాగుతారు.

జనరల్ బజ్వాతో ఇమ్రాన్ ఖాన్

ఫొటో సోర్స్, ISPTR

ఫొటో క్యాప్షన్, జనరల్ బజ్వాతో ఇమ్రాన్ ఖాన్

ఐఎస్ఐ చీఫ్‌ను ఎలా నియమిస్తారు? ఆ ప్రక్రియ ఏమిటి?

పాకిస్తాన్‌కు చెందిన అతి ముఖ్యమైన నిఘా సంస్థ ఐఎస్ఐ. దీని అధిపతి నియామకంపై ప్రధానమంత్రి చాలా ఆలోచించి, విచక్షణతో నిర్ణయం తీసుకుంటారని రక్షణ రంగ విశ్లేషకులు ఉమర్ ఫరూఖ్ తెలిపారు.

"సాధారణంగా మూడు పేర్లను ఆర్మీ చీఫ్, ప్రధానికి పంపుతారు. అందులోంచి ఒకరిని ప్రధాని ఎంపిక చేస్తారు."

చీఫ్‌గా నదీమ్ అంజుమ్ పేరు ప్రకటిస్తూ 'జనరల్ అపాయింట్‌మెంట్' అని ఐఎస్‌పీఆర్ తెలిపింది. అంటే ప్రక్రియలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయని ఉమర్ ఫరూఖ్ అన్నారు.

"ఐఎస్‌పీఆర్ ఇచ్చిన ప్రకటనలో ఐఎస్ఐ చీఫ్‌ను నియమించే అధికారం ఎవరికి ఉంటుందో స్పష్టం చేయలేదు. ఇది ఆసక్తికరమైన అంశం. దీనిపై ప్రశ్నలు లేవనెత్తాలి."

"కొన్నేళ్ల క్రితం హెరాల్డ్ అనే ఇంగ్లిష్ పత్రికకు ఒక రిపోర్ట్ తయారుచేశాను. ఐఎస్ఐ సహా ఇతర నిఘా సంస్థలకు సంబంధించి పాకిస్తాన్‌లో ఒక చట్టం లేదని ఆ సందర్భంగా నాకు తెలిసింది. ఈ సంస్థలకు అంతర్గతంగా టీ అండ్ ఆర్ ఉంటాయి. వాటి ప్రకారం అవి నడుచుకుంటాయి. ఇదంతా చాలా గోప్యంగా జరుగుతుంది" అని ఫరూఖ్ తెలిపారు.

ఫైజ్ హమీద్

ఫొటో సోర్స్, Twitter

ఫొటో క్యాప్షన్, ఫైజ్ హమీద్

ఈ పదవి ఎందుకంత శక్తిమంతమైనది?

సైనిక, రాజకీయ వ్యవహారాల నిఘాలో ఐఎస్ఐ కీలకపాత్ర పోషిస్తుంది. ఈ రెండు వర్గాలకు ఇన్‌పుట్ ఇచ్చే బాధ్యత ఈ సంస్థదే. ఐఎస్ఐలో దాని అధిపతే అత్యంత శక్తిమంతమైన వారని, నిర్ణయాలన్నీ సొంతంగానే తీసుకోవచ్చని ఆ సంస్థ మాజీ అధికారులు చెబుతున్నారు.

"ఐఎస్ఐ డైరెక్టర్ జనరల్ తన సంస్థలో ఎవరినైనా నియమించవచ్చు. తొలగించవచ్చు. వారిని తిరిగి సైన్యానికి పంపవచ్చు. పోస్టులను మార్చవచ్చు. కానీ ఏజెన్సీ వెలుపల ఆయన ప్రభావం ప్రధానమంత్రి, ఆర్మీ చీఫ్‌లతో ఉన్న సంబంధాలపై ఆధారపడి ఉంటుంది" అని ఆ సంస్థ మాజీ డైరెక్టర్ లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) జావేద్ అష్రఫ్ ఖాజీ అన్నారు.

"ప్రధానమంత్రి కోరుకుంటే ఆయన్ను తొలగించగలరు. అలాగే సైన్యానికి సంబంధించినంత వరకు చీఫ్ ఆఫ్‌ ది స్టాఫ్ అత్యంత శక్తిమంతుడు" అన్నారాయన.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)