పాకిస్తాన్‌లో పెరుగుతున్న ధరలు... 'తక్కువ తినమని' ప్రజలకు మంత్రి సలహా

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఉమర్ దరాజ్ నంగియానా
- హోదా, బీబీసీ ఉర్దూ
"టీలో తక్కువ పంచదార వేసుకోండి, రొట్టెలు తక్కువగా తినండి."
పాకిస్తాన్‌లో ద్రవ్యోల్బణం పెరిగిపోతున్న కారణంగా పాకిస్తాన్ అధీనంలో ఉన్న కశ్మీర్, గిల్గిట్-బాల్టిస్తాన్ వ్యవహారాల కేంద్ర మంత్రి అలీ అమీన్ గండాపూర్ ఆ దేశ ప్రజలకు ఇచ్చిన సలహా ఇది.
పాకిస్తాన్ అధీనంలో ఉన్న కశ్మీర్‌లో జరిగిన ఓ సభలో ఆయన ప్రసంగించారు.
పెరుగుతున్న ధరలు, ద్రవ్యోల్బణంపై మాట్లాడుతూ.. "చాయ్‌లో పంచదార ఓ వంద పలుకులు వేసుకుంటాం అనుకోండి, అందులోంచి ఓ తొమ్మిది పలుకులు తగ్గిస్తే తీపి తగ్గిపోతుందా? మన దేశం కోసం, స్వావలంబన కోసం ఆ మాత్రం త్యాగం చేయలేమా? నేను రొట్టెలు వంద ముక్కలు తింటాననుకోండి. అందులో తొమ్మిది ముక్కలు తగ్గించి తినలేనా?" అంటూ వ్యాఖ్యానించారు.
ఆయన ప్రసంగం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. నెటిజన్లు మంత్రి వ్యాఖ్యానాలపై విమర్శలు గుప్పిస్తున్నారు.

ఫొటో సోర్స్, Twitter/@Govtofpak
ప్రజా ప్రతినిధుల పొదుపు మంత్రం
అయితే, మంత్రులు, ప్రజా ప్రతినిధులు, దేశ ప్రజలకు ఇలాంటి సలహాలు ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు.
ఆ దేశ అధికార పార్టీ 'పాకిస్తాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్' (పీటీఐ) నేషనల్ అసెంబ్లీ సభ్యుడు రియాజ్ ఫత్యానా కూడా ఈమధ్య ఇలాంటి సలాహాలే ఇచ్చారు.
గతంలో కూడా పాకిస్తాన్ ముస్లిం లీగ్ (నవాజ్)తో సహా అనేక పార్టీల నాయకులు ఇలా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి.
స్వయంగా దేశ ప్రధానే "తక్కువ ఆహారం తీసుకోండి" అంటూ పాకిస్తాన్ ప్రజలకు సలహా ఇచ్చిన దాఖలాలూ ఉన్నాయి.
1998లో పాకిస్తాన్ అణు పరీక్షలు నిర్వహించినప్పుడు, అమెరికాతో సహా ఇతర ప్రపంచ దేశాల నుంచి కఠిన ఆర్థిక ఆంక్షలు ఎదుర్కోవాల్సి రావొచ్చని అప్పటి ప్రధాని నవాజ్ షరీఫ్ అంచనా వేశారు. ఈ నేపథ్యంలో, టీవీ, రేడియోలలో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
"మీ పొట్ట బిగించండి. రోజుకు ఒకసారే ఆహారాన్ని తీసుకునేందుకు సిద్ధం కండి. ఈ కష్టంలో నేనూ మీకు తోడుగా ఉంటాను" అన్నారు.
నవాజ్ షరీఫ్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడల్లా పొదుపు ప్రచారం చేసింది.
ప్రస్తుత పీటీఐ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి నాటి నుంచే పొదుపు ప్రచారాన్ని చేపట్టింది.
అయితే, ఓ ప్రభుత్వం, తమ ప్రజలకు 'పొదుపు చేయండి, తక్కువ ఆహారం భుజించండి' అంటూ సలహాలు ఇవ్వడం సముచితమేనా?
ఇలాంటి సలహాలు ఇవ్వడం, పేదలను అవహేళన చేయడంతో సమానమని ఇస్లామాబాద్‌లోని సస్టయినబుల్ డెవలప్మెంట్ పాలసీ ఇనిస్టిట్యూట్ (ఎస్‌డీపీఐ)కు చెందిన ఆర్థికవేత్త డాక్టర్ సాజిద్ అమీన్ అభిప్రాయపడ్డారు.
పొదుపు చేయమని సలహాలు లేదా ప్రచారం ద్రవ్యోల్బణానికి పరిష్కారం కాదని ఆయన అన్నారు.
"సామన్యుల కొనుగోలు శక్తిని పెంచడం లేదా వారి పరిస్థితిని మెరుగుపరచడమే ప్రభుత్వం పని."
అయితే, ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల దృష్ట్యా, జాతీయ స్థాయిలో ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడం ప్రభుత్వానికి సాధ్యమేనా?
దీనికి జవాబు చెప్పాలంటే, ఇటీవలి కాలంలో పాకిస్తాన్‌లో ద్రవ్యోల్బణం రికార్డు స్థాయికి చేరుకోవడానికి మూల కారణాలు ఏమిటో తెలుసుకోవాలని డాక్టర్ సాజిద్ అమీన్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
పాకిస్తాన్‌లో ధరలు ఎందుకు పెరిగిపోతున్నాయి?
"పాకిస్తాన్‌లో ద్రవ్యోల్బణానికి మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి.. ప్రపంచ మార్కెట్లో వస్తువుల ధరలు పెరగడం, పాకిస్తాన్ రూపాయి విలువ తగ్గడం, ప్రభుత్వం అమలు చేస్తున్న పన్ను విధానాలు.
మూడవ కారణానికొస్తే, పాకిస్తాన్ ప్రభుత్వం తన ఆదాయాన్ని పెంచుకోవడం కోసం ఇంధనాల లాంటి వస్తువులపై పన్నులు పెంచుతోంది. అందువల్ల వాటి ధరలు పెరుగుతున్నాయి. తద్వారా, ఉత్పత్తి లేదా సరఫరాలో ఇంధనాన్ని ఉపయోగించే రోజువారీ వస్తువుల ధరలు పెరుగుతున్నాయి" అని డాక్టర్ అమీన్ వివరించారు.
ప్రభుత్వం వీటిని అదుపు చేయలేదా?
"ప్రపంచ మార్కెట్లో ధరలు అంచనాలకు మించి పెరిగిపోతున్నాయి. వాటి పెరుగుదల, పతనాలపై పాకిస్తాన్‌కు ఎలాంటి నియంత్రణా ఉండదు.
జాతీయ స్థాయిలో పాకిస్తాన్ దిగుమతులు చాలా ఎక్కువ. ఎగుమతుల కన్నా, దిగుమతులు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల వాణిజ్య లోటు ఏర్పడుతుంది. గోధుమ, చక్కెర లాంటి ఆహార పదార్థాలను కూడా దిగుమతి చేసుకుంటోంది. దిగుమతులు తగ్గి, వాణుజ్య లోటు భర్తీ కాకపోతే రూపాయి విలువ పెరగదు.
మరో పక్క ప్రభుత్వ ఆదాయం పెరగాలంటే, ఇంధనం, విద్యుత్, గ్యాస్‌లపై పన్నులు పెంచాలి.
రుణాల కోసం పాకిస్తాన్ మరోసారి అంతర్జాతీయ ద్యవ్య నిధి(ఐఎంఎఫ్)ని ఆశ్రయించాల్సి ఉంటుంది. ఐఎంఎఫ్ కూడా ఈ వస్తువులపై పన్నులు పెంచమనే ప్రభుత్వానికి చెబుతుంది" అని డాక్టర్ అమీన్ విశదీకరించారు.
అయితే, ప్రభుత్వం ఏమీ చేయలేదా?
అలా అని కాదు, ప్రభుత్వం మరో రకమైన చర్యలు తీసుకోవచ్చని డాక్టర్ అమీన్ అన్నారు.
ప్రజలపై ద్రవ్యోల్బణం ప్రభావాన్ని తగ్గించడానికి ప్రాథమికంగా రెండు చర్యలు చేపట్టవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
"స్థానికంగా ధర నియంత్రణ కమిటీలు, ప్రభుత్వ కమిటీలు సక్రమంగా పని చేసేలా చూసుకోవాలి. కృత్రిమ ధరల పెరుగుదలను ఈ కమిటీలు కొంతవరకు అదుపుచేయగలవు.
రెండవది, హోర్డింగ్‌కు స్వస్థి పలకాలి. పాకిస్తాన్‌లో ఇంధనం, ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. రైతులు పంట పండించి, అమ్మకానికి తీసుకొచ్చే లోపు ఆ వస్తువులపై కమీషన్ అనేక రెట్లు పెరుగుతోంది. దాంతో ఆహార పదార్థాల ధరలు పెరిగిపోతున్నాయి. ఈ కమీషన్‌ను నియంత్రించే శక్తి ప్రభుత్వానికి ఉంది.
మూడవది, యుటిలిటీ స్టోర్ల సమర్థవంతమైన వినియోగం. దీని ద్వారా కొంత మేరకు ద్రవ్యోల్బణాన్ని నియంత్రించవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
ద్రవ్యోల్బణం ఎప్పటికైనా తగ్గుముఖం పడుతుందా?
ఒకసారి ధరలు పెరిగిన తరువాత అవి తగ్గవని, వాటిని తగ్గించడం చాలా కష్టమని డాక్టర్ సాజిద్ అమీన్ అన్నారు.
"ద్రవ్యోల్బణం సమస్య తీవ్రంగా మారుతోంది అని గ్రహించడానికి ప్రభుత్వం చాలా ఆలస్యం చేసింది. ధరల పెరుగుదలకు కారణాలు తెలుసుకోవడానికి మరి కొంత సమయం తీసుకొంది.
అయితే, దీని ప్రభావం ప్రజలపై పడకుండా ఉండడానికి రెండు పనులు చేయవచ్చు. సామాజిక భద్రతా పథకాల పరిధిని విస్తరించాలి. సామాన్యుడి ఆదాయం పెరిగే మార్గాలను అన్వేషించాలి.
ఇవి కాకుండా, పొదుపు చేయడం మరో మార్గం" అని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్ అణు పితామహుడు ఏక్యూ ఖాన్: 'ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి'
- భారత్-పాక్ యుద్ధం 1971: చెరువులో నీటి అడుగున దాక్కొని ప్రాణాలు కాపాడుకున్న భారత సైనికుడి కథ
- చైనా ముప్పును ఎదుర్కోడానికి భారత వాయు సేన సన్నద్ధంగా ఉందా?
- ‘భారతదేశం ముస్లిం పాలకుల బానిస’.. ఈ వాదనలో నిజమెంత?
- పాకిస్తాన్ పేరెత్తకుండా, ఆ దేశానికి నరేంద్ర మోదీ ఏమని వార్నింగ్ ఇచ్చారు?
- రష్యా భారత్‌కు దూరమై, పాకిస్తాన్‌కు దగ్గరవుతోందా?
- పాకిస్తాన్ జైల్లో 24 ఏళ్లు ఉన్న వ్యక్తి చివరికి స్వదేశానికి ఎలా చేరుకున్నారంటే...
- 1965: పాకిస్తాన్ కమాండోలు పారాచూట్లలో భారత వైమానిక స్థావరాలపై దిగినప్పుడు...
- 'పాకిస్తాన్.. అఫ్గానిస్తాన్ నుంచి వెళ్లిపో' అంటూ కాబుల్‌లో పాక్ వ్యతిరేక ర్యాలీ.. గాల్లోకి తాలిబాన్ల కాల్పులు
- ‘కశ్మీర్‌కు స్వతంత్రం వద్దు.. పాకిస్తాన్‌లో కలవాలి’ అని గిలానీ ఎందుకు కోరుకున్నారు?
- పాకిస్తాన్: గిల్గిట్ నుంచి 32 ఏళ్ల కిందట బయలుదేరిన ఆ విమానం ఏమైంది... ఆ మిస్టరీ ఏంటి?
- స్వాతంత్ర్య దినోత్సవం: నెహ్రూ, జిన్నాల మధ్య దూరం ఎలా పెరిగింది?
- కశ్మీర్: వారం రోజుల్లో ఏడుగురు మైనారిటీలను కాల్చి చంపారు... జమ్మూలో నిరసన ప్రదర్శనలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








